కండక్టరమ్మ..!
అమ్మగా లాలిస్తూ.. కండక్టర్‌గా టికెట్లు ఇస్తూ..
సాక్షి, సంగారెడ్డి: ‘‘ఎనిమిది నెలల పాపను భుజాన వేసుకుని ఓ మహిళా కండక్టర్ టికెట్లు జారీ చేస్తోంది. పసికందు ఆలనా పాలనా చూస్తూనే ఆమె విధులు నిర్వర్తిస్తున్న తీరు అమోఘం.. అదే సమయంలో ఆమె పడుతున్న ఇబ్బంది బాధాకరం. ఆర్టీసీ ఉన్నతాధికారులకు చేరేంత వరకు ఈ ఫొటోను షేర్ చేయండి’’ అంటూ ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమంలో ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై ‘సాక్షి’ లోతుగా పరిశీలిస్తే.. ఓ మహిళ పడుతున్న ఆవేదన మనసున్న ప్రతి మనిషిని కదిలించేలా ఉంది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన అలియా జహాన్ 2012లో మతాంతర వివాహం చేసుకుంది. భర్త రవీందర్ పెద్దశంకరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మతాంతర వివాహం కావడంతో ఇరువైపులా పెద్దలెవరూ వీరిని అక్కున చేర్చుకోలేదు. అలియా ఆర్టీసీలో కాంట్రాక్టు కండక్టర్‌గా సంగారెడ్డి డిపోలో పనిచేస్తోంది. 2013లో బాబు పుట్టడంతో 6 నెలలు ప్రసూతి సెలవులో వెళ్లింది. అదే సమయంలో తనతో పనిచేసే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మరోమారు బిడ్డ పుట్టడంతో ప్రసూతీ సెలవుపై వెళ్లింది.
ఆ సమయంలో 2015–16 మధ్య కాలంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారి సర్వీసును రెగ్యులరైజ్ చేశారు. ప్రసూతి సెలవులో ఉండడంతో మరోసారి క్రమబద్ధీకరణ అవకాశాన్ని కోల్పోయింది. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందనే ఆశతో అటు ఉద్యోగాన్ని వదులుకోలేక, ఇటు బిడ్డను చూసుకునే వారు లేక నానా ఇబ్బందులు పడుతోంది. నారాయణఖేడ్– హైదరాబాద్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటోంది. తనపై వార్తలు వస్తే అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తారేమోననే అలియా ఆందోళన వ్యక్తం చేసింది.