ఆదిలాబాద్ రిమ్స్ : రిమ్స్‌లో అస్తవ్యస్త నిర్వహణ.. భర్తీకాని వైద్య పోస్టులు.. వైద్యుల నిర్లక్ష్యం.. అరకొర వసతులు.. వెరిసి రోగులకు శాపంగా మారింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)లో సమస్యలు తిష్టవేశాయి. 500ల పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే స్థాయిలో నిర్మించినా వసతులు మాత్రం కానరావడం లేదు. ఆస్పత్రి ప్రారంభమై ఏడేళ్లు గడుస్తున్నా సౌకర్యాలు, వైద్యం రోగులకు పూర్తిస్థాయిలో అందడం లేదు.
అత్యాధునిక హంగులతో భవనాలు నిర్మిస్తున్నా ఫలితాలనివ్వడం లేదు. ఆస్పత్రిలో వైద్యుల కొరత, పారిశుధ్యం, అస్తవ్యస్థ నిర్వహణ, వైద్యులు సకాలంలో విధులకు రాకపోవడం, పరికరాలు, పడకలు, ఇతర అసౌకర్యాలు లేకపోవడం తీవ్రంగా వేధిస్తోంది. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖమంత్రి, ఉపముఖ్యమంత్రి రాజయ్య రిమ్స్‌ను సందర్శించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
అరకొర పడకలు..
చికిత్స నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. ఇందులో దాదాపు 200 మంది ఆస్పత్రిలో చేరుతుంటారు. వర్షాకాలంలో ఈ సంఖ్య మరింత రెట్టింపవుతుంది. వీరందరికీ రిమ్స్‌లో పడకలు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆస్పత్రిలో పడకల కొరతతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకే పడకపై ఇద్దరు.. ముగ్గురు రోగులను పడుకోబెడుతున్నారు. 500 పడకల రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం 350 పడకలు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
అత్యవసర విభాగంలో రోగు లు పడుకోవడానికి పడుకలు లేకపోవడంతో కింద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. బుధవారం బంగారుగూడలోని విద్యార్థుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. 50 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురికావడంతో వారందరినీ రిమ్స్ ఆస్పత్రికే తీసుకొచ్చారు. దీంతో ఇక్కడికి రాగానే వారికి, వారి తల్లిదండ్రులకు బాధలు మరిన్ని ఎక్కువయ్యాయి. ఒక్కో పడకపై ముగ్గురు, నలుగురు విద్యార్థులకు చికిత్స అందించారు.
కానరాని స్ట్రెచర్‌లు, వీల్‌చైర్, స్టాండ్..
రిమ్స్ ఆస్పత్రిలో స్ట్రెచర్‌లు, వీల్‌చైర్‌లు, సెలైన్ స్టాండ్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో రోగి రిమ్స్‌కు వచ్చినప్పుడు అందుబాటులో స్ట్రెచర్ గాని, వీల్ చైర్‌లు లేకపోవడంతో రోగి బంధువులే చేతులపై ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. బంగారుగూడ విద్యార్థులను తరలించినప్పుడు కూడా వారి తల్లిదండ్రులే విద్యార్థులకు పెట్టిన సెలైన్ బాటిళ్లను చేతుల్లో పట్టుకున్నారు.
ఇక.. ఎమర్జెన్సీ వార్డులో కనీసం సెలైన్ పెట్టేందుకు స్టాండ్ లేకపోవడంతో రోగులు పెట్టిన సెలైన్ బాటల్‌ను పట్టుకొని వారి బంధువులు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. అధికారులకు ఇవేవీ కనిపించడం లేదు. సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఒక్కో వార్డులో ఒక స్ట్రెచర్, ఒక వీల్ చైర్, పడకలకు అనుగుణంగా సెలైన్ స్టాండ్‌లు అందుబాటులో ఉంచాలి. కానీ.. కొన్ని వార్డుల్లో స్ట్రెచర్‌లు, వీల్ చైర్‌లు లేకపోవడంతో ఉన్నవాటినే అన్ని వార్డుల్లో ఉపయోగిస్తున్నారు.
విద్యార్థులకు తప్పని అవస్థలు
చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకొచ్చిన విద్యార్థుల కు సౌకర్యాలు లేక అవస్థలు తప్పలేదు. సరిప డా బెడ్లు లేక ఒక్కో బెడ్డుపై నలుగురు విద్యా ర్థులను పడుకోబెట్టి వైద్యం అందించారు. సెలై న్ స్టాండ్లు లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులే చేతిలో పట్టుకోవాల్సి వచ్చింది. స్ట్రెచర్లు లేక వా రి తల్లిదండ్రుల విద్యార్థులను భుజాన ఎత్తుకు ని పిల్లల వార్డుకు తరలించాల్సి వచ్చింది. పిల్లల పరిస్థితి చూడలేక తల్లిదండ్రులు రోదించారు.
రిమ్స్ హా..స్పత్రి
Published Thu, Dec 4 2014 3:37 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement