సాక్షి, ఖమ్మం: అభ్యర్థుల ఎంపికకు రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమతుల్యత ఉండేలా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు చేస్తుండడంతో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు మాత్రం ఎవరికి వారుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరిగి పోటీ చేసే అంశంపై టీఆర్‌ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం, మరికొంత ఉత్కంఠ నెలకొంది. ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థికి దీటుగా టీఆర్‌ఎస్ సైతం అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తుండగా..
ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ సైతం అమలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థి ఖరారైతేనే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి చివరి నిమిషంలో ఎవరు టికెట్ దక్కించుకుంటారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ఆది నుంచి ప్రచారం జరిగినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం టికెట్‌పై టీఆర్‌ఎస్ అధిష్టానం ఎటూ తేల్చకుండా సందిగ్ధంలో పెట్టింది.
దీంతో ఈ సీటు ఎవరికి లభిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో రోజుకో రీతిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ పొంగులేటికి ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశం కల్పించి.. ఆయన స్థానంలో వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌కు అవకాశం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు సైతం పార్టీ పరిశీలిస్తోందని, జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. ఈ దశలో కాంగ్రెస్ నుంచి సైతం ఇదే తరహాలో రోజుకో కొత్త పేరు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దీటుగా టీఆర్‌ఎస్ సైతం అభ్యర్థుల ఎంపికపై వివిధ కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేతల్లో అయోమయం
కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటికే సీనియర్ నేతలతో కూడిన జాబితా చాంతాడును తలపిస్తుండగా.. దానికి అనుబంధంగా మరికొన్ని పేర్లు జాబితాలో చేరుతుండడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు చివరి నిమిషంలో కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో చేరిపోవడంతో రాజకీయ వర్గాల్లో
ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
కాంగ్రెస్‌లో ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, విజయశాంతి, జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వరరావు తదితరులు ఈ సీటుపై దృష్టి సారించి.. ఏఐసీసీ స్థాయిలో తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో నామా నాగేశ్వరరావు తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫారసుతో కాంగ్రెస్‌లో చేరి.. ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
దీనికి అనుగుణంగా నామాకు రెండు రోజులుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల నుంచి ఆహ్వానం అందుతోందని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సైతం ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నామా అభ్యర్థిత్వానికి దీటుగా అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు బుధవారం పార్టీ వర్గాల్లో మరో ప్రచారం ప్రారంభమైంది.
అలాగే సత్తుపల్లి ప్రాంతానికి చెంది హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ దంత వైద్యుడు బొట్టు చంద్రకాంత్ సైతం టీఆర్‌ఎస్ తరఫున ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పార్టీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా ఎవరినీ ప్రకటించకపోవడంతో వివిధ కోణాల్లో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు ఆశావహులు తమవంతు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు నామాకు టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని అధిష్టానం పెద్దలకు పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ పొంగులేటి మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధిష్టానం తనవైపే మొగ్గు చూపుతుందనే ఆశాభావంతో ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, వ్యాపారవేత్త రాజేంద్రప్రసాద్‌లలో ఎవరికి టికెట్ లభిస్తుందనే అంశం ఆ పార్టీ వర్గాలను ఉత్కంఠకు గురి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment