చెరువులు గ్రామాల ఆస్తులు
- వాటి పరిరక్షణకు ఉద్యమిద్దాం: సీఎం
- సూక్ష్మనీటి సేద్యపు పథకానికి పరిమితులు లేవు
- గజ్వేల్ అభివృద్ధిపై సమీక్ష
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘చెరువులు గ్రామాల ఆస్తులు.. మన చెరువులను మనమే రక్షించుకుందాం. శ్రమదానం చేద్దాం. కాకతీయులు, రెడ్డిరాజుల నాటి వైభవాన్ని తిరిగి తెచ్చుకుందామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో కబ్జా కోరల్లో చిక్కిన చెరువులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఒకరిద్దరి కోసం ముఖాలు చూడొద్దని, సర్పంచ్‌లు, ప్రజలంతా కలసికట్టుగా చెరువుల్లోకి నీళ్లు తెచ్చే కట్టుకాల్వలను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ జిల్లాల్లో మొత్తం 45 వేల చెరువులు ఉన్నాయని, వీటి ద్వారా 265 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉందన్నారు. కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో చెరువులే తాగు నీళ్లందించాయని, ఇప్పుడు కాకతీయ మిషన్ ద్వారా చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణతో మళ్లీ ఆనాటి వైభోగం రావాలన్నారు.
ఒకసారి చెరువులను తోడితే వారం పాటు దేవుడు కరుణిస్తే మూడేళ్లదాకా కరువు వచ్చే పరిస్థితే ఉండదని సీఎం పేర్కొన్నారు. చెరువుల విస్తరణక అవసరమైతే పదెకరాల భూమిని కొనుగోలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణను ఒక సామాజిక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని ఆయన కోరారు. గోదావరి నదీజలాలతో గజ్వేల్ నియోజకవర్గంలోని పంట పొలాలను కలుపుతామన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ద్వారా మెదక్, కరీంనగర్ మొదలగు జిల్లాలకు సాగునీరందిస్తామని చెప్పారు. వర్గల్ మండలం పాములపర్తి, ములుగు మండలం మర్కుక్ గ్రామాల మధ్య నిర్మించనున్న రిజర్వాయర్‌ను టీఎంసీ నుంచి 20టీఎంసీలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బిందు సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీతో, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీతో అంది స్తామన్నారు.
ప్రతి గ్రామంలో ఏడాదికి 40 వేల మొక్కల చొప్పున మూడేళ్ల పాటు కోటి 20 లక్షల మొక్కలు పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్యం కోసం మండల కేంద్రానికి 50లక్షలు, గ్రామానికి 25లక్షలు, మదిర గ్రామాలకు 10లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండలానికి 104 వాహనాన్ని సమకూరుస్తామని, ఇప్పుడున్న 108 వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటీల్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావుతోపాటు ఉన్నతాధికారులు, గజ్వేల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక చేతలే!: కేసీఆర్
ఇక మాటలు కాదు.. అన్ని చేతలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతానని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు. ‘‘ వచ్చే ఐదేళ్ల వరకు ఎన్నికల్లేవ్.. ఇక రాజకీయాలకు ఆస్కారమే ఉండదు. నిధులు ఇచ్చే బాధ్యత నాది.. అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీది’’ అని ప్రజాప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సీఎం తెలిపారు. మనం చేపట్టే అభివృద్ధి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కేసీఆర్ చెప్పారు.