సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రూ.లక్షల ఖరీదైన కార్లు సైతం చిన్న చిన్న తప్పిదాల వల్ల నిలువునా కాలిపోతున్నాయి. అత్యాధునిక సదుపాయాలు, డిజిటలైజేషన్‌తో ఆకట్టుకుంటున్న కార్లకు ఆ సాంకేతిక పరిజ్ఞానంలోనే ప్రమాదం కూడా పొంచి ఉంటోంది. ఇటీవలి కాలంలో వరుసగా కాలిబూడిదవుతున్న వాహనాలు పలువురి ప్రాణాలను సైతం హరించాయి. ఔటర్ రింగురోడ్డుపై వాయు వేగంతో దూసుకుపోయే వాహనాలు చూస్తుండగానే మంటల్లో తగలబడిపోతున్నాయి. విశాలమైన రహదారుల్లో ఆహ్లాదకరంగా సాగిపోయే కారు ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు కొద్దిపాటి నిర్లక్ష్యం, సాంకేతిక పరిజ్ఞానంలోని మార్పులను అవగాహన చేసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారు వయస్సుకు అనుగుణంగా వచ్చే మార్పులను గుర్తించి సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడంవల్ల పెద్ద ముప్పును నివారించవచ్చునని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ఒక్క క్షణం ఆగండి..
ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ ఏ చిన్న నిప్పు రవ్వ ఎగిసినా ప్రమాదం పొంచి ఉన్నట్లే. వాహనాన్ని బయటకు తీసేటప్పుడు కచ్చితంగా అన్ని ముఖ్యమైన భాగాలను ఒకసారి చూసుకోవడం మంచిది. చాలామంది డ్రైవర్లు, వాహన యజమానులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండానే వాహనాన్ని ముందుకు దూకిస్తారు. అయితే మెకానిజం కండీషన్స్ తప్పనిసరిగా చూసుకోవాలి. కారులో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి. సాధారణంగా మొదటి 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ తరువాత క్రమంగా నిర్లక్ష్యం చూపుతారు. ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు దారి తీస్తోంది. లక్ష కిలోమీటర్ లుదాటిన ప్రతి వాహనం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఫ్యాన్ తిరగనివ్వండి ...
ఇంజిన్ నాణ్యతను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. టైమింగ్ బెల్టును సకాలంలో మార్చుకోవాలి. కూలెంట్ పైన నిఘా అవసరం. ఇంజన్ వేడెక్కకుండా కూలెంట్ వంద శాతం పనిచేసేలా జాగ్రత్తలు పాటించాలి. ఇంజిన్‌కు ఎక్కడైనా రంధ్రాలు, అతుకులు ఉంటే డీజిల్ బొట్లు బొట్లుగా కిందపడవచ్చు. అలాగే కంటికి కనిపించని పగుళ్ల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. ఇలా రోడ్డుపైన పడిన ఇంధనం, రోడ్డు వేడికి ఒక్క సారిగా భగ్గుమనే అవకాశం ఉంది. మరోవైపు వాహనాన్ని నిలిపిన వెంటనే ఇంజన్ ఆపేయడం మంచిది కాదు. ఇంజిన్‌లో ఉన్న ఫ్యాన్ పూర్తిగా తిరిగి ఆగిపోయిన తరువాతనే ఇంజన్ ఆపాలి. తద్వారా ఇంజిన్‌కు రక్షణ లభిస్తుంది.
ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలి...
అగ్గిపెట్టెలు, ఫోమ్, సిగరెట్లు తదితర నిప్పును రగిలించే ఎలాంటి వస్తువులు వాహనంలో లేకుండా చూసుకోవాలి. చాలాసార్లు డ్రైవర్లు వాహనంలోనే సిగరెట్టు తాగేస్తారు. నుసిని సైతం అందులోనే వదిలేస్తారు. పూర్తిగా ఎయిర్‌కండీషన్డ్ వాహనాలు కావడంతో ఈ నుసి మంటలకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే మంటలు అంటుకుంటాయి. ప్రతి వాహనంలో ‘ సేఫ్టీ ఫైర్’ ఉండాలి. వాహనంలో పొగ, మంట కనిపించిన వెంటనే దీన్ని వినియోగించడం వల్ల వెంటనే మంటలు చల్లారి ప్రమాదం తప్పుతుంది.
ఎలుకలు ఉన్నాయా తస్మాత్...
తరచూ ఎలుకలు వైర్లను కొరికేయడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు, పల్లీలు వంటివి కారు ఫ్లోర్‌పైన ఉన్నప్పుడు వాటికోసం ఎలుకలు, ఇతర కీటకాలు రావచ్చు. ఇప్పుడు వస్తున్న వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే. చాలాసార్లు ఓవర్‌లోడింగ్ వల్ల ఫ్యూజ్‌లు ఎగిరిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.చిన్నచిన్న ఫ్యూజ్‌లే పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు.
డ్యాష్‌బోర్డు హెచ్చరిస్తోంది.....
డాష్‌బోర్డు హెచ్చరికలను గ్రహిస్తే చాలా వరకు ప్రమాదాలను నియంత్రించవచ్చు. వైరింగ్ సరిగ్గా లేకపోయినా, ఇంజిన్‌లో ఎలాంటి లోపాలు ఉన్నా, సీట్‌బెల్టు ధరించకపోయినా డాష్‌బోర్డులో హెచ్చరిక సూచనలు వస్తాయి. వాటిని గమనించి అప్రమత్తం కావాలి. కారులోని ఇంజిన్ నుంచి వచ్చే పైపులను ధర్మాకోల్‌తో చుట్టి ఉంచాలి. ఎలక్ట్రిక్ వైర్లు, ఇంజన్‌పైపులు కలిసే చోటస్పార్క్‌రా వచ్చు. థర్మాకోల్ అలాంటి స్పార్క్‌లను అరికడుతుంది.
టైర్లు మార్చండి ....
ఎలాంటి వాహనానికైనా టైర్ల మన్నిక చాలా ముఖ్యం. 75 శాతం కంటే ఎక్కువగా టైర్లను వినియోగించవద్దు. చాలా మంది వంద శాతం వినియోగిస్తారు. బాగా అరిగిపోయిన టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. అలా పేలిపోయినప్పుడు మంటలు కూడా అంటుకోవచ్చు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాలి. వైరింగ్‌కెపాసిటీని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి.షోరూమ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి.
అప్రమత్తతోనే ఆనందం
డ్రైవర్లకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. చిన్న చిన్న లోపాలను వెంటనే గమనించి సరి చేసుకుంటే చాలా వరకు ప్రమాదాలు జరగవు. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వాహనాలు నడిపితే, ఆనందంగా గమ్యం చేరుకుంటారు. –షేక్ సలావుద్దీన్, మెకానిక్ నిపుణులు,తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్స్‌అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment