శ్రీ పర్వతారామం.. బుద్ధవనం | Budhavanam Special Story | Sakshi
Sakshi News home page

శ్రీ పర్వతారామం.. బుద్ధవనం

Published Tue, May 14 2019 7:49 AM | Last Updated on Thu, May 16 2019 11:47 AM

Budhavanam Special Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శ్రీ పర్వతారామం అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. బుద్ధవనం అంటే కొందరికి గుర్తుకు రావచ్చు. కానీ నాగార్జున సాగర్‌ చెంతన వెలసిన బుద్ధవనం అంటే ఓ ఆధ్యాత్మిక భావన మనసును రంజింపజేయకమానదు. బుద్ధుడి జ్ఞాపకాలతో వెలసిన ఈ ప్రాంతం దక్షిణాదిలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిన వైనాన్ని ఇక్కడ వేలాదిగా ఉన్న శిల్పాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన జీవితంలో జరిగిన అనేక ఘట్టాలను జాతక కథలుగా చూసిరావచ్చు. ప్రపంచంలోని బౌద్ధారామాలను పోలిన స్తూపాన్ని సందర్శించి తరించవచ్చు. పర్యాటకులు సాధారణంగా నాగార్జుసాగర్‌ డ్యామ్‌ను, నాగార్జున కొండను చూసేందుకు వెళ్తుంటారు. డ్యామ్‌కు కూతవేటు దూరంలో 275 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం వెలసింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన కృష్ణా నదీ లోయ పరీవాహక ప్రాంతం. బౌద్ధాన్ని ప్రచారం చేసిన ఇక్ష్వాకుల సాంస్కృతిక వైభవం. శాతవాహనుల తొలి తెలుగు(బౌద్ధ) సంస్కృతి ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

గ్రాండ్‌గా ఎంట్రన్స్‌ ప్లాజా..
నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు మూడు కిలోమీటర్లకు ముందే (నల్లగొండ జిల్లా పరిధి) కుడివైపున శ్రీ పర్వతారామం బోర్డు కనిపిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద స్వాగతిస్తున్న రెండు ఏనుగు శిల్పాల మధ్య నుంచి లోపలికి వెళితే మూడు వైపులా మార్గాలుంటాయి. గేటుకు ఎదురుగా మధ్యలో ధర్మచక్రం.. దానికి ఇరుపక్కలా మార్గాలు.. ధర్మచక్రం చుట్టూ గోడలపై అనేక శిల్పాలు కనువిందు చేస్తాయి. కొత్తగా చెక్కినవే అయినా అలనాటి అమరావతి శిల్పకళకు అద్దం పడతాయి. ఈ శిల్పాల మధ్యలో అశోకుడు బౌద్ధవ్యాప్తికి చేసిన సేవకుగుర్తుగా ధర్మచక్రం ఉన్న స్తంభంవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వసతులు..
బుద్ధవనంలో ఫుడ్‌ కోర్టు, ఆరు కాటేజీలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌ టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నడిచే హరిత విజయ విహార్‌ గ్రాండ్‌ హోటల్‌ ఉంది. 

ఎలా వెళ్లాలి..  
నగరం నుంచి 152 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్, మల్లేపల్లి, పెద్దపుర నుంచి నాగార్జున సాగర్‌ చేరుకోవాలి. అక్కడ డ్యామ్‌కు 3 కి.మీ ముందే శ్రీ పర్వత ఆరామం (బుద్ధవనం) వస్తుంది. హైదరాబాద్‌ నుంచి నిరంతరం ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. బృందంగా వెళ్లాలనుకునే వారు టీఎస్‌టీడీసీ వారి నుంచి అద్దె వాహనాలు తీసుకోవచ్చు.   

వీటిని సందర్శించవచ్చు..
ప్రవేశ ద్వారం నుంచి ముందుకెళితే ఎడమ వైపు కనిపించేది బుద్ధచరిత వనం
బుద్ధ చరిత వనం నుంచి ముందుకు వెళితే జాతక (బోధిసత్వ) వనం ఉంటుంది
స్తూప వనంలో భారత్‌ పాటు దక్షిణాసియా దేశాల్లోని వివిధ స్తూపాకృతుల నమూనా కట్టడాలు కనిపిస్తాయి  
బుద్ధవనానికి వచ్చే పర్యాటకుల మానసిక ప్రశాంత కోసం ధ్యాన వనం ఉంది. బుద్ధుని జీవితంతో ముడిపడిన వివిధ రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. వీటి కింద ధ్యానం చేసుకునే సౌకర్యం ఉంది
42 మీటర్ల వ్యాసార్థం, 21 మీటర్ల ఎత్తుతో నిర్మించిన మహాస్తూపం.. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దది. దాని కింది అంతస్తులో బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే శిల్పాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement