⇒ మాట్లాడితే 5 వేలు జరిమానా
⇒ ఇది ‘పెదరాయుళ్ల’ తీర్పు
మధిర: ఇరవై ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ.. కూలీ చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న దళిత మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ కుల బహిష్కరణ చేశారు. ఆమెతో ఎవరు మాట్లాడినా రూ.5 వేల జరిమానా కట్టాలంటూ తీర్పు చెప్పారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర పంచాయతీ పరిధిలోని ఇల్లెందులపాడులో జరిగింది. గ్రామానికి చెందిన నండ్రు సాయి, మరియమ్మ దంపతులు. వారికిద్దరు కుమార్తెలు, కొడుకు. సాయి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో మరియమ్మ 20 ఏళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. తనకున్న రెండున్నర సెంట్ల ఇంటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తోంది.
కాగా, సుమారు మూడేళ్ల క్రితం నండ్రు సాయి కుల సంఘంలో ఉన్న రూ. 50 వేలను వడ్డీకి తీసుకున్నాడు. సాయి తీసుకున్న డబ్బులకు స్థానికుడు తాళ్లూరి నరేశ్ (యేసు) హామీగా ఉన్నాడు. సాయి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో కుల సంఘానికి నరేశ్ చెల్లించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుల పంచాయతీ పెట్టారు. సాయి తీసుకున్న డబ్బులను భార్య మరియమ్మ చెల్లించాలని, లేదంటే ఆమె నివసిస్తున్న ఇంటిని బాకీ కింద నరేశ్‌కు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోకపోతే వేర్వేరుగా నివసిస్తున్న సాయి, మరియమ్మలను కులం నుంచి బహిష్కరించాలని తీర్మానించా రు. ఆమెతో ఎవరూ మాట్లాడవద్దని, పాలు విక్రయించినా జరిమానాగా రూ. 5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లకూ ఇదే తీర్పు వర్తిస్తుందన్నారు. దీంతో మరియమ్మ కులపెద్దలపై టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
దళిత మహిళ కుల బహిష్కరణ
Published Wed, Mar 1 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement