‘వాట్సాప్’ వంచన!
లాటరీ వచ్చిందంటూ ఎర
నగర వ్యాపారికి రూ.15 లక్షల టోకరా
ఆర్బీఐ పేరుతో వెబ్‌సైట్ రూపకల్పన
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రముఖ సంస్థల పేరుతో లాటరీలు వచ్చాయంటూ ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త ఎత్తు వేస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడూ ఉపయోగించే వాట్సాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. నగరానికి చెందిన ఓ వ్యాపారికి వాట్సాప్ లాటరీ వచ్చిందంటూ పలు దఫాలుగా రూ.15 లక్షలు దండుకున్నారు. ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు ఆర్బీఐ పేరుతో బోగస్ వెబ్‌సైట్‌ను సైతం రూపొందించడం కొసమెరుపు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఆదిత్యకు గత నెలలో ఓ మెయిల్ వచ్చింది. లండన్ నుంచి సదరు మెయిల్ పంపిస్తున్నామని చెప్పిన నేరగాళ్లు వాట్సాప్ సంస్థ తీసిన లాటరీలో భారీ బహుమతి తగిలిందని తెలిపారు. తనకు సంబంధించిన పూర్తి వివరాలు పంపాల్సిందిగా సైబర్ నేరగాళ్లు కోరడంతో ఆదిత్య అలానే చేశారు. లాటరీ డబ్బునువాట్సాప్ కంపెనీ ఆర్బీఐ వద్ద జమ చేస్తుందని, అక్కడ నుంచే నగదు తీసుకోవాల్సి ఉంటుందని వారు నమ్మించారు. నగదు బదిలీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆర్బీఐ వెబ్‌సైట్ నుంచి తెలుసుకునే ఆస్కారం ఉందని చెప్పారు. ఆర్బీఐ పేరుతో ఓ బోగస్ వెబ్‌సైట్ సైతం రూపొందించిన నేరగాళ్లు ఆ వివరాలు ఆదిత్యకు పంపించారు. దీంతో పూర్తిగా వారి వల్లో పడిన ఆదిత్య సైబర్ నేరగాళ్లు కోరిన విధంగా రూ.2 లక్షలు ఓ బ్యాంకు ఖాతాలో జమ చేశాడు.
‘ఆర్బీఐ వెబ్‌సైట్’లో ప్రవేశించడానికంటూ ఆదిత్యకు ఓ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను పంపగా, వీటి ఆధారంగా బోగస్ సైట్‌లోకి లాగిన్ అయిన బాధితుడు అందులో తాను డిపాజిట్ చేసిన రూ.2 లక్షలకు సంబంధించిన వివరాలు చూశాడు. దీంతో నేరగాళ్లను పూర్తిగా నమ్మడంతో వివిధ రకా పన్నుల పేరుతో ఆదిత్య నుంచి మొత్తం రూ.15 లక్షలు గుంజారు. ఆర్బీఐ పేరుతో రూపొందించిన రెండు ఏటీఎం కార్డులూ బాధితుడికి పంపారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ రిజర్వ్ బ్యాంక్ అధికారిణిగా ఫోన్ చేసి లాటరీ నగదు మొత్తం డిపాజిట్ అయ్యిందని చెప్పింది.
అనంతరం మరోసారి ఫోన్లో్ల ఆదిత్యను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు బహుమతి సొమ్మును డిపాజిట్ చేయడానికి ఇద్దరు వాట్సాప్ ఉద్యోగులు లండన్ నుంచి వస్తున్నార ని, విమాన ఖర్చులకు రూ.60 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే అప్పటికే ఒకరు డబ్బు రిజ ర్వ్ బ్యాంకులో డిపాజిట్ అయిందని చెప్పగా, ఆ తర్వాత ఇద్దరు వచ్చి డిపాజిట్ చేస్తారనడంతో అనుమానం వచ్చిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆదిత్య డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు, సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.