సమస్య తీవ్రతను గుర్తించండి
పెద్ద నోట్ల రద్దుపై హైకోర్టు
⇔సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్న ధర్మాసనం
⇔కౌంటర్ దాఖలుకు గడువు కోరిన కేంద్రం
⇔బుధవారం వరకు గడువు
⇔మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్ : నోట్ల రద్దు నేపథ్యంలో నెల రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. సమస్య తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రానికి మరికొంత గడువునిస్తూ.. ఇకపై గడువు పెంచడం సాధ్యం కాదని తెలుపుతూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నగదు ఉపసంహరణ పరిమితులను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
దొడ్డిదారిలో కోట్లు...
మైసూరారెడ్డి తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. అకస్మాత్తుగా నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను చాలా తేలిగ్గా తీసుకుంటోందన్నారు. నోట్లు అందక తాజాగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. సామాన్యుడు 100 రూపాయలు పొందేందుకు నానా అవస్థలు పడుతుంటే పెద్దలు మాత్రం దొడ్డిదారుల్లో కోట్ల రూపాయల కొత్త నోట్లు దక్కించుకుంటున్నారని తెలిపారు. పెళ్లిళ్లు పబ్బాలు జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఈ రోజు (గురువారం)తో నోట్లు రద్దు చేసి నెల అయిందని, మొదటి రోజు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని వివరించారు. అసలు బ్యాంకులకు పంపిన నగదు వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, దీనిని అడ్డం పెట్టుకుని అనేక మంది పెద్దలు లబ్ది పొందుతున్నారని తెలిపారు.
వారంలో రూ.24 వేలను ఉపసంహరించుకోవచ్చునని ఆర్‌బీఐ చెబుతుంటే, బ్యాంకులు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. నోట్ల రద్దు మొదలు, ఉపసంహరణ పరిమితుల వరకు కేంద్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తన కనీస బాధ్యతలను విస్మరించి ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని వివరించారు. ఇందుకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడమే నిదర్శనమన్నారు. అటు పార్లమెంట్‌లో సమాధానం చెప్పని కేంద్రం, ఇటు న్యాయస్థానాలకు సైతం సమాధానాలు చెప్పడం లేదన్నారు.
రాజకీయాల గురించి మాట్లాడొద్దు...
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయం గురించి, వ్యక్తుల గురించి కోర్టులో మాట్లాడవద్దని, వాటిని బయట చూసుకోవాలని బాలాజీకి తేల్చి చెప్పింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో ఏం చేయగలమో పరిశీలిస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేసింది చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయాన్ని తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్ స్పందిస్తూ, కౌంటర్ దాదాపుగా పూర్తయిందని, మరికొన్ని వివరాలు జోడించాల్సి ఉందని, అందువల్ల కొంత గడువు ఇవ్వాలని కోరారు.
బ్యాంకుల వద్ద డబ్బు లేదు...
‘బ్యాంకుల వద్ద డబ్బు లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజూ సమస్య ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉంది. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను గుర్తించండి. సమస్య పరిష్కా రానికి తగిన విధంగా స్పందించండి’ అని ధర్మాసనం నటరాజ్‌కు స్పష్టం చేసింది. మళ్లీ బాలాజీ జోక్యం చేసుకుంటూ.. ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త నోట్ల చెలామణి ఎక్కువగా ఉందని, దొడ్డిదారిన బడా బాబులు నల్లధనాన్ని మార్చుకుంటున్నారని తెలిపారు.
అక్కడ కూడా తగిన స్థాయిలో డబ్బు లేదన్న ధర్మాసనం.. బుధవారం నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని నటరాజ్‌కు తేల్చి చెప్పింది. మరోసారి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే తప్ప, తాము ఈ వ్యాజ్యాలపై విచారణను కొనసాగిస్తామని తెలిపింది. మీ సంగతేమిటని ఆర్‌బీఐ తరఫు న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ను ప్రశ్నించగా, తాము కూడా తదుపరి విచారణకల్లా కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.
రుణాల చెల్లింపుల్లో రైతుల ఇబ్బందులపై వివరణ ఇవ్వండి
నోట్ల రద్దు నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కు నగదు మార్పిడి, డిపాజిట్ల అవకాశం లేకుండా విధించిన నిషేధంపై ఉమ్మడి హైకోర్టు గురువారం ఆర్‌బీఐ, కేంద్ర ప్రభు త్వాల వివరణ కోరింది. పీఏసీఎస్‌లపై ఆర్‌బీఐ నిషేధంవల్ల బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బి.మంగయ్య, మరో ఏడుగురు రైతులు హైకోర్టును ఆశ్ర యించారు.
రైతులు రుణాలు చెల్లించేందుకు వెళితే డబ్బు తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. రుణం చెల్లిం చకపోతే, తిరిగి రుణం పొందే అవకాశం ఉం డదన్నారు. దీంతో ప్రైవేట్ ఫైనాన్షియర్లను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. రుణాల చెల్లింపులో రైతు ల ఇబ్బందులను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.