2019లో బీజేపీదే అధికారం
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్
కరీంనగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇదే లక్ష్యంతో శ్రేణులు ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ అన్నారు. గురువారం శివనరేష్ ఫంక్షన్ హాల్‌లో కరీంనగర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ రాజకీయాలతో విసిగివేసారిన ప్రజలు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుందనే నమ్మకంతో బీజేపీకి పట్టం కట్టారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిస్వార్థంగా దేశాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని చెప్పారు. హిందూ త్వ, జాతీయ భావన ప్రజల్లో నిండి ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో చేసిన సభ్యత్వం కన్నా ఈసారి ఎక్కువ నమోదు చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో యువత కీలకంగా వ్యవహరిస్తూ సభ్వత్వంలో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలన్నారు. ఈనెల 30నుంచి గ్రామాల్లో పర్యటించి మూడు రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి సభ్యత్వం చేయించాలన్నారు.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటం : బండి సంజయ్‌కుమార్
జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు వ్యక్తులు ఉగ్రవాద వ్యవస్థకు సహకరిస్తున్నారని.. వారికి అడ్డుకట్టు వేసేందుకు డిసెంబర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, బ్యాంకు దోపిడీలు జరిగాయని, వీటికి కొంతమంది స్థానికులు సహకరిస్తున్నారని అరోపించారు. పదివేల మందితో యువ చైతన్య యాత్ర చేపట్టి ఉగ్రవాదలకు సహకరిస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌లో పాతబస్తీ మాదిరిగా కాకుండా జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నెలరోజుల్లో 24 గంటలు మంచి నీటి సరఫరా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా నీటిని అందించడం లేదన్నారు. నగరాన్ని మలేషియా, సింగాపూర్ వలె తీర్చిదిద్దుతామన్న పాలకులు ఉన్న రోడ్లను నాశనం చేశారన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు బాస సత్యనారాయణ, పూదరి ఆరుణ, మోరెపల్లి సత్యనారాయణ, బల్మూరి జగన్మోహన్‌రావు, కొరివి వేణుగోపాల్, కరండ్ల మధుకర్, హరికుమార్‌గౌడ్, రఘనందన్‌రావు, బేతి మహేందర్‌రెడ్డి, లోకేష్, మహిళ మోర్చ నాయకురాలు సుజాతరెడ్డి, అనిత, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పగ్గాలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వచ్చిన దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్మూరి వనిత, స్వచ్చభారత్ రాష్ట కో-కన్వీనర్ బాస సత్యనారాయణరావు, సీనియర్ నాయకురాలు పూదరి ఆరుణను జిల్లా నాయకులు, కార్యకర్తలు శాలవాతో సత్కరించారు. బండి సంజయ్‌కుమార్ మెమెంటో అందించారు.