స్మార్ట్ సిటీ
- దేశంలోని వంద నగరాల్లో కరీంనగర్ ఒకటి!
- కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు
- మొదటి దశలో రూ.70 కోట్ల నిధులు
టవర్‌సర్కిల్ : కరీంనగర్ ఇప్పుడు స్మార్ట్ సిటీగా మారనుంది. దేశంలోని వంద నగరాలను ప్రపంచంలోని ప్రధాన నగరాలకు దీటుగా స్మార్ట్ సిటీలు.. శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన వంద స్మార్ట్‌సిటీల జాబితాలో కరీంనగర్ సిటీ చోటు సంపాదించుకుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ పట్టణాలు స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్నారుు. వీటి అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 బడ్జెట్‌లో రూ.7,060 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే నగరం ఇక స్మార్ట్‌గా దూసుకెళ్లనుంది. జపాన్‌లోని క్యోటో నగరంలా మారనుంది.
రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి...
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా పేరున్న కరీంనగర్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. నగరాన్ని అభివృద్ధి చేయూలనే దృఢ సంకల్పంతో ఉంది. ఆగస్టు 5న కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వరాల జల్లు కురిపించారు. యూజీడీ పనులు పూర్తిచేసేందుకు రూ. 50 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి రూ.46 కోట్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.5.75 కోట్లు కేటాయించారు. ఈ నిధులకు తోడు కేంద్రం ప్రకటించే స్మార్ట్ సిటీహోదా దక్కితే రూ.400 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యే అవకాశాలున్నారుు. ఈ నిధులన్నీ అభివృద్ధి పనులపై ఖర్చుచేస్తే కరీంనగర్ నగర రూపురేఖలే మారిపోనున్నారుు. స్మార్ట్‌సిటీతో పాటు శాటిలైట్ అనుసంధానంగా జనానికి మరిన్ని సేవలు అందనున్నారుు.
విస్తరించే అవకాశం...
నగరం మూడు లక్షల పైచిలుకు జనాభా కలిగి, 23.85 చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో ఉంది. 65 వేల ఇళ్లతో ప్రస్తుతం విస్తరించి ఉంది. నగరంలో స్లమ్ ఏరియాలు 42 ఉండగా, అందులో జనాభా 21,24,896 ఉంది. కాగా కరీంనగర్ నగరం మూడు వైపుల విస్తరించేందుకు అవకాశాలున్నాయి. దక్షిణాన మానేరు నది ఉండడంతో మిగిలిన మూడు వైపుల ఉన్న గ్రామాలు నగరంలో కలిసిపోయాయి. వాటిని నగరంలో కలిపితే అత్యంత విశాలమైన నగరంగా రూపాంతరం చెందనుంది. రాబోయే రోజుల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపన జరిగే అవకాశాలుండడంతో నగరం తెలంగాణలో రెండో అతిపెద్ద స్మార్ట్ సిటీగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లనుంది.