మెదక్ లోక్‌సభకు కేసీఆర్ రాజీనామా
- ఆర్నెల్లలోపు ఉప ఎన్నిక
- ఇంకా ఖరారుకాని టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం
- 29 తర్వాత వెల్లడయ్యే అవకాశం
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సోమవారం రాజీనామా సమర్పించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన.. వ్యక్తిగత సహాయకుల ద్వారా లోక్‌సభ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాలలో అఖండ విజయం సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.
నిబంధనల మేరకు ఒక అభ్యర్థి రెండు వేర్వేరు స్థానాల నుంచి ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఎన్నికైన నాటి నుంచి 18 రోజుల్లో ఒక స్థానానికి రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. ఆ తర్వాత మెదక్ లోక్‌సభ స్థానంలో ఖాళీ ఏర్పడిందని పార్లమెంటు వ్యవహారాల శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది.
దీంతో ఆర్నెల్లలోపు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నుంచి బరిలో దిగే అభ్యర్థిని ఇంకా టీఆర్‌ఎస్ ఖరారు చేయలేదు. ఈ నెల 29 తర్వాత అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.