కాటేసిన ఖరీఫ్‌! | No Rains In Telangana So Government Suggests Alternative Crops | Sakshi
Sakshi News home page

కాటేసిన ఖరీఫ్‌!

Published Sun, Jul 14 2019 1:05 AM | Last Updated on Sun, Jul 14 2019 8:17 AM

No Rains In Telangana So Government Suggests Alternative Crops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్‌ సాగు చతికిలపడింది. సీజన్‌ మొదలై నెలన్నర కావొస్తున్నా ఇప్పటికీ పంటల సాగు విస్తీర్ణం పెరగలేదు. వర్షాల్లేక వేసిన విత్తనాలు వేసినట్లే భూమిలో మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లో కీలక సమయంలో వేయాల్సిన వివిధ పంటల సీజన్‌ మారిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఖరీఫ్‌ విత్తనాలు వేసే సీజన్‌ ముగిసిపోతుండటంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఖరీఫ్‌ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి సాధారణ స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం పెరగకపోతే దీన్ని అమలు చేయాలని సూచించింది. ఆ ప్రణాళికలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ పరిస్థితిని వివరిస్తూ, ప్రత్యామ్నాయ పంటల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించింది. మరోవైపు కంటిజెన్సీ ప్రణాళిక ప్రకారం అవసరమైన విత్తనాలను సరఫరా చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను ఆదేశించింది. 

వర్షాభావ పరిస్థితులు.. 
రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కంటిజెన్సీ ప్రణాళికలో వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో 31 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణంగా జూన్‌ 1 నుంచి ఈ నెల 12 నాటికి కురవాల్సిన వర్షపాతం 213.1 మిల్లీమీటర్లు (మి.మీ.) కాగా 146 మి.మీ. మాత్రమే కురిసింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన దుర్భిక్షం నెలకొందని తెలిపింది. ఖమ్మం జిల్లాలో 69 శాతం, సూర్యాపేట జిల్లాలో 67 శాతం, నల్లగొండ జిల్లాలో 66 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మరో 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 40 శాతానికే పరిమితమైంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణంగా 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 43.33 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని తెలిపింది. రైతులు 9 శాతమే నారు వేశారు. పత్తి, సోయాబీన్‌ తదితర విత్తనాలు వేసినా అవి భూమిలోనే మాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లాల్సి వస్తుందని, ఆ మేరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 

మూడు దశల కంటింజెన్సీ ప్రణాళిక.. 
కంటింజెన్సీ ప్రణాళికను మూడు దశల్లో అమలు చేస్తారు. ఈ నెల 15 వరకు సాధారణంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరగకపోతే మొదటి ప్రణాళిక, అలాగే ఈ నెల 31 నాటికి కూడా పరిస్థితి మెరుగుపడకపోతే రెండో దశ ప్రణాళిక, ఆ తర్వాత ఆగస్టు 15 నాటికి కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే మూడో దశ ప్రణాళిక అమలు చేస్తారు. ఆ ప్రకారం ఆయా సమయాల్లో ఏ జిల్లాల్లో ఎటువంటి పంటలను సాగు చేయాలనే దానిపై ఒక కేలండర్‌ను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. జిల్లాల వారీగా వర్షపాతం, అక్కడి నేలల స్వభావం, వేయాల్సిన పంటలను అందులో వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఆయా పంటల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక విత్తనాలను, అలాగే వివిధ రకాల వెరైటీలను వేయాలని సూచించింది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నేలల్లో (ఈ నెల 15 నాటికి వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే) మధ్యకాలిక కంది, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వేయాలని సూచించింది. ఈ నెల 31 నాటికి పరిస్థితి మెరుగుపడకపోతే ఆయా పంటల్లోని స్వల్పకాలిక రకాలను, అలాగే జొన్న, స్వల్పకాలిక కూరగాయల విత్తనాలను వేయాలని సూచించింది. ఆగస్టు 15 నాటికి మూడో దశలో కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, కంది వంటి విత్తనాలను సాగు చేయాలని సూచించింది. ఇలా జిల్లాల వారీగా తయారు చేసిన కేలండర్‌ను జిల్లాలకు పంపింది. 

6.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. 
కంటింజెన్సీ ప్రణాళిక అమలుకు ప్రత్యేకంగా 6.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌బొజ్జా విత్తనాభివృద్ధి సంస్థకు లేఖ రాశారు. ఈ నెల 15 నాటి మొదటి దశ ప్రణాళిక అమలు కోసం 1.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, ఈ నెల 31 నాటి రెండో దశ ప్రణాళిక అమలుకు 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, వచ్చే నెల 15 నాటి మూడో దశ ప్రణాళిక అమలుకు 2.28 లక్షల కింటాళ్ల విత్తనాలు అందజేయాలని కోరింది. అందులో అత్యధికంగా వరి, వేరుశనగ, పెసర, కంది, మొక్కజొన్న విత్తనాలున్నాయి. వేరుశనగ విత్తనాలు మూడు దశల కంటింజెన్సీ అమలుకు 2.45 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ కోరింది. ఆ తర్వాత కంది విత్తనాలు 76 వేల క్వింటాళ్లు, వరి విత్తనాలు 57 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనాలు 59 వేల క్వింటాళ్లు, సోయాబీన్‌ 22 వేల క్వింటాళ్లు, జొన్న 13 వేల క్వింటాళ్లు సరఫరాకు విన్నవించింది. ఇవిగాక మినుములు, నువ్వులు, సజ్జలు, ఆముదం, కొర్రలు, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సరఫరా చేయాలని కోరింది. ఏ జిల్లాకు ఎంతెంత ఇండెంట్‌ కావాలో స్పష్టంగా పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement