రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆటో, టాటా ఏస్ ఢీ
తొమ్మిది మందికి తీవ్రగాయాలు ఒకరి పరిస్థితి విషమం
దైవదర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం
కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని వస్తుండగా ధర్మపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై బుచ్చిరెడ్డి, బాధితుల కథనం ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని సీసీనస్పూర్ కాలనీకి చెందిన పది మంది భక్తులు కొండగట్టుకు గురువారం ఆటోలో బయల్దేరారు. రాత్రి కొండగట్టులో బసచేశారు. శుక్రవారం ఉదయం అంజన్న దర్శనం చేసుకొని తిరుగుప్రయాణమయ్యారు. మధ్యాహ్నం.. ధర్మపురి జాతీయ రహదారి పక్కనున్న సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా రాయపట్నం వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ ఢీకొట్టింది. రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఆస్పత్రికి తరలించాలని వేడుకున్నా త్వరగా సహాయక చర్యలు లభించలేదు. 108 సేవలు అందలేదు. టాటా ఏస్‌లో ఇరుక్కున్న డ్రైవర్ నరేశ్ గంట నరకయాతన పడ్డాడు. తర్వాత జాకీ సహాయంతో ఆయనను బయట కు లాగారు. స్థానికులు, పోలీసుల సహాయంతో ట్రాక్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో నస్పూర్‌కాలనీవాసి ఆత్మకూరి సాయిరాజ్(16) మృతిచెందారు.
క్షతగాత్రుల వివరాలు..
ఆటోలో ఉన్న పోల అనిల్, కంచెర్ల రమేశ్, కూనారపు రంజిత్, దొమ్మటి వినయ్, వరిపాటి వెంకటేశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. టాటా ఏస్‌లో వెదురుగట్ల నుంచి తుమ్మెనాలలో అత్తవారింటికి వెళ్తున్న డ్రైవర్ నరేశ్, అతడి భార్య పద్మ, కుమారుడు రిషిలతో పాటు రాయపట్నంకు చెందిన బూర్లగడ్డ గాయత్రిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ నరేశ్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సాయిరాజ్ తండ్రి నర్సయ్య సింగరేణి ఉద్యోగి. క్షతగాత్రులను ధర్మపురి, జగిత్యాల ఆస్పత్రులకు తరలించారు. కాగా, క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా సత్వర సేవలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని స్థానికులు మండిపడ్డారు.