16 నుంచి పెట్రోల్, డీజిల్ బంద్
- ధరల సవరణకు వ్యతిరేకం
- తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ నెల 16 నుంచి కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా బంద్ చేస్తామని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం, ప్రధాన కార్యదర్శి వి.వినోద్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ విధానం వల్ల పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ విక్రయిం చే బంకులు చాలా ఉన్నాయని, అయితే ఆ బంకుల డీలర్లు కొనుగోలు చేసేటప్పుడు 12 వేలకు తక్కువగా తీసుకునే అవకాశంలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రోజువారీ ధరల హెచ్చుతగ్గులతో బాగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 75 శాతం పంపుల్లో ఆటోమిషిన్ సౌకర్యం లేదని, అందువల్ల రోజువారీ ధరల హెచ్చుతగ్గుల విధానాన్ని అమలు పర్చలేమని స్పష్టం చేశారు. ఆలిండియా పెట్రోలియం అసోసియేషన్ ప్రతి నిధులు మంగళ, బుధవారాల్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలతో చర్చలు జరపనున్నారని, ఒక వేళ చర్చలు సఫలం కాకుంటే పెట్రోల్, డీజిల్ కొనుగోల్లు, అమ్మకాలను నిలిపేస్తామని స్పష్టం చేశారు.