ఇటు భానుడు.. అటు వరుణుడు
కొత్తకోట/గోపాల్‌పేట/వనపర్తిటౌన్ : ఓ వైపు భానుడు నిప్పులు చెరుగుతూ తన ప్రతాపం చూపుతున్నాడు. సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తానేమీ తక్కువ కాదన్నట్లుగా వరుణుడు బుధవారం సాయంత్రం విరుచుకుపడ్డాడు. కొత్తకోట, గోపాల్‌పేట, వనపర్తి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో చెల్లు విరిగిపడ్డాయి.. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.. విద్యుత్‌స్తంభాలు ఒరిగిపడ్డాయి. కొత్తకోట పట్టణ కేంద్రంలో 25చెట్లు విరిగిరోడ్డుపై పడటంతో ట్రాఫిక్ తీవ్రఅంతరాయం కలిగింది. గోపాల్‌పేటలో కోళ్లషెడ్లు నేలమట్టమయ్యాయి. తాడిపర్తి సమీపంలో నిర్మాణంలో ఓ పౌల్ట్రీఫాం పూర్తిగా నేలమట్టమైంది.
గోడలు, ఇనుపపైపులు కూలిపోగా, సిమెంటు రేకులు గాలుల తాకిడికి చెల్లాచెదురుగా పడిపోయాయి. రూ.ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. మండలకేంద్రంలో సాయంత్రం కొద్దిసేపు వడగండ్ల వర్షం కురిసింది. ఉరుములతో కూడిన చిలుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఎండదెబ్బ, వడగాలులు, ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వనపర్తి పట్టణంలో గాలివాన బీభత్సవం సృష్టించింది. గాలివానతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీవర్షానికి వనపర్తిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బ్రహ్మంగారి వీధి, వెంకటేశ్వర దేవాలయం, పాత బస్టాండ్, ఏరియా ఆస్పత్రి ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపారాయి.