మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : చదువులమ్మ ఒడిలో ఉన్న జిల్లా విద్యాశాఖకు ఎట్టకేలకు పూర్తిస్థాయి డీఈవో సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. గతంలో పూర్తిస్థాయి అధికారిగా పనిచేసిన అక్రముల్లాఖాన్ జనవరి 31న ఉ ద్యోగ విరమణ చేయడంతో సీనియర్ అధికారి రామారావును తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ నేపథ్యంలో అక్రముల్లాఖాన్ శాఖను పెద్దగా పట్టించుకోక పోవడంతోపాటు, తాత్కాలికంగా పనిచేసిన రామారావు కఠిన చర్యల వైపు అడుగు వేయకపోవడంతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఊహించని రీతిలో చివరి స్థానం రాక తప్పలేదు.
కొత్త డీఈవోకు సమస్యల మాల
కొత్తగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారికి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మారుమూల ప్రాంతంలో పాఠశాలలు ఎక్కువగా ఉండటంతోసమస్యలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రెండేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ నిలిచింది. సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందకపోవడంతో సమయం వృథా అవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ ఇచ్చి ఆ తరగతి విద్యార్థులకు బోధించమంటూ అదనపు భారం ఉపాధ్యాయులపై వేస్తున్నారు. జూన్‌లోనే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చినచో సకాలంలో పాఠ్యాంశాలు పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.
ఇన్‌చార్జీలే అధికం
జిల్లాలో 48 మండలాలకు పీజీ హెచ్‌ఎంలే ఇన్‌చార్జి మండల విద్యాధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వీరిలో 15 మంది అధికారులు ఈ ఇన్‌చార్జి బాధ్యతలు తాము మోయలేమని, బాధ్యతలను తప్పించాల్సిందిగా మొరపెట్టుకుంటున్నా కనికరించడంలేదు. అదే విధంగా 38 ఉన్నత పాఠశాలలకు పీజీ హెచ్‌ఎంలు లేక పోవడంతో ఆ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంటులే ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. వారు అటు పాఠాలు చెప్పలేక, ఇటు పాఠశాల బాధ్యతలను నిర్వర్తించలేక సతమత మవుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో 350 స్కూల్ అసిస్టెంటు పోస్టులు కోర్టు జోక్యంతో పదోన్నతులు నిలిచాయి. దీంతో ఆ పాఠశాలల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.
కుంటుపడుతున్న విద్య
డీఎస్సీ ద్వారా భర్తీ కావాల్సిన సుమారు 1200 భర్తీ కాకపోవడంతో ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులతోపాటు ఉపాధ్యాయులకు అదనపు బారం పడుతోంది. గడిచిన విద్యాసంవత్సరంలో పదో తరగతి తరగతుల నిర్వహణతో పాటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల ప్రగతిపై ఏ ఒక్క సమీక్ష జరిగిన సందర్భం లేదని, ఈ నేపథ్యంలోనే పదో తరగతి ఫలితాలు ఆశించిన మేరకు రాలేదని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఆరంభంకు ముందుగానే విద్యాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు.
పెద్ద సారొచ్చారు
Published Mon, May 19 2014 1:11 AM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM
Advertisement