హుజూరాబాద్ : జిల్లాలో జీరో దందా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే వ్యాపారం నిర్వహిస్తుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. వ్యాట్, టర్నోవర్ ట్యాక్స్ రూ.కోట్లలో చేజారుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీనెలా జిల్లాలోని వివిధ సర్కిళ్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
ఏడాదికి రూ.200 కోట్ల పైచిలుకు వాణిజ్య పన్ను వసూలవుతోంది. ఉదాహరణకు హుజూరాబాద్ ఉప వాణిజ్య కార్యాలయం పరిధిలో 11 మండలాలున్నాయి. ఇక్కడ 300 మంది టర్నోవర్ ట్యాక్స్ చెల్లింపుదారులు, 1200 మంది వ్యాట్ పన్నుదారులు ఉన్నారు. తద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.20 కోట్ల ఆదాయం సమకూరుతోంది. వ్యాట్ చెల్లించాల్సిన వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపుతూ టర్నోవర్ ట్యాక్స్‌కే పరిమితమవుతున్నారు.
టర్నోవర్ ట్యాక్స్ చెల్లించే వారు మొత్తానికే పన్ను ఎగ్గొడుతున్నారు. దీంతో ఒక్క హుజూరాబాద్ సర్కిల్ పరిధిలోనే లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. సంబంధిత అధికారులు తనిఖీలు చేస్తే రెట్టింపు ఆదాయం సమకూరే అవకాశముంది. 11 మండలాలున్న హుజూరాబాద్ డీసీటీవో సర్కిల్ పరిధిలోనే భారీగా ఆదాయానికి గండిపడుతుంటే... జిల్లా వ్యాప్తంగా జీరో వ్యాపారాలను కట్టడి చేస్తే అదనంగా 50 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా.
పన్నుచెల్లించే విధానం ఇదీ..
ఏడాదికి రూ.7.5 లక్షల వరకు అమ్మకాలు జరిపే వ్యాపారులకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.7.5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు క్రయవిక్రయాలు జరిపేవారు లావాదేవీల పై ఒకశాతం టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ) చెల్లించాలి.
రూ. 50 లక్షల టర్నోవర్ పైన వ్యాపారాలు నిర్వహించేవారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) చెల్లించాలి. వ్యవసాయ సంబంధిత, నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను, మిగతా వాణిజ్యపరమైన వస్తువులు, యంత్రాలకు 14.5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టర్నోవర్ ఉన్నవారు తప్పనిసరిగా వాణిజ్య పన్ను శాఖ నుంచి లెసైన్సులు తీసుకోవాలి. చిన్నాచితక వ్యాపారులు, కూరగాయలు, పండ్ల దుకాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఆస్పత్రులు, విద్యాలయాలు, ఇతర కంపెనీలు మాత్రం వృత్తి పన్ను చెల్లించాలి.
కొరవడిన పర్యవేక్షణ
ప్రభుత్వానికి ఆదాయాన్ని భారీగా సముపార్జించి పెట్టే వాణిజ్య పన్నులశాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండడంతో జీరో దందా జోరుగా సాగుతోంది. చాలా మంది అనుమతి లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు.
మెడికల్ షాపుల నిర్వాహకులు చాలావరకు పన్ను ఎగ్గొడుతున్నారు. విద్యాసంస్థలైతే వృత్తిపన్ను చెల్లింపునకు దూరంగా ఉంటున్నాయి. వాణిజ్య పన్నుల శాఖాధికారులు కేవలం కొన్నింటికే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైపోయింది. పలువురు వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. వీరికి అధికారుల అండదండలు కూడా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పన్ను ఎగ్గొడుతున్నారు
Published Sun, Nov 30 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement