కారెక్కేందుకు తహతహ! | TDP leaders tries to go on TRS | Sakshi
Sakshi News home page

కారెక్కేందుకు తహతహ!

Published Tue, Sep 29 2015 12:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

కారెక్కేందుకు తహతహ! - Sakshi

కారెక్కేందుకు తహతహ!

- టీఆర్‌ఎస్ వైపు తెలుగు తమ్ముళ్ల చూపు
- చేరాలని కీలక నాయకులపైనా ఒత్తిడి
- ఖేడ్ టీడీపీలో వింత పరిస్థితి
- 15 ఏళ్లుగా అధికార లేమే కారణం
- గులాబీ నేతలతో మంతనాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నది. తమ్ముళ్లు గులాబీ జెండా వైపు చూడటమే కాక  టీడీపీలోని కీలక నాయకులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీకి ‘అధికారం’ లేక కార్యకర్తలు డీలా పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘నాయకుడి’ మీది అభిమానంతో ఏళ్లకేళ్లుగా జెండా మోసిన తమ్ముళ్లు ఇక మా వల్ల కాదని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. ఇప్పట్లో రిపేర్ కానీ సైకిల్‌ను  నమ్ముకోవడం కంటే  టీఆర్‌ఎస్‌లోకి జంపయ్యేందుకు టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడిపై ఒత్తిడి తెస్తున్నట్టు వినికిడి.  
 
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో బలం ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ  అవుతోంది. తెలంగాణ జిల్లాల్లో టీడీపీకి ఇప్పట్లో  భవిష్యత్తు లేదని తెలిసినప్పటికీ నాయకుని మీద ఉన్న అభిమానంతోనే  కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ గెలవక పోవడం, మంచికి, చెడుకు దిగువ శ్రేణి నాయకత్వంపై ఆర్థిక భారం పడటం తదితర కారణాలతో తెలుగు తమ్ముళ్లు  వలస పోతున్నారు. ఏడాది కిందట ఒకరిద్దరు టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలతో మొదలైన వలసలు ఉప ఎన్నికల నేపధ్యంలో ఊపందుకున్నాయి. టీడీపీ గ్రామస్థాయి నాయకులు  మంత్రి హరీశ్‌రావు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి  గులాబీ కండువా కప్పుకొని వస్తున్నారు.  

ఇటీవల ముఖ్యంగా పట్టున్న నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో టీడీపీ రోజు రోజుకు బలహీనపడుతోంది. నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో గెలిచిన 39 గ్రామ పంచాయతీ సర్పంచులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. పెరుగుతున్న వలసల నేపథ్యంలో టీడీపీ నియోజ కవర్గ కీలక నేత వారం రోజుల క్రితం కల్హేర్ మండలానికి చెందిన పార్టీ శ్రేణులు, ముఖ్యులతో రహస్యంగా సమావేశం నిర్వహించారు. వారి నాయకుల అభిప్రాయాన్ని సేకరించారు.

టీడీపీ పరిస్థితి ఏమీలేదని, రాష్ర్టంలో టీఆర్‌ఎస్ గాలి వీస్తుండడం, భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలో బలపడే పరిస్థితి లేదని సూచించినట్లు సమాచారం.  టీఆర్‌ఎస్‌లో చేరితే మేమందరం నీతో వస్తామని కార్యకర్తలు అన్నట్లు తెలిసింది. సర్పంచులు, ఎంపీటీసీలుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోకపోతే మాకు కూడా భవిష్యత్తు ఉండదని, వచ్చే ఎన్నికలకు ప్రజలు ఓట్లు వేయరని, మీరు గులాబీ కండువా కప్పుకుంటే మీతో పాటే మేమూ వస్తాం... లేదంటే మేమే వెళ్లి టీఆర్‌ఎస్‌లో  చేరిపోతామని ఖరాఖండీగా చెప్పినట్లు పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ సర్పంచు ‘సాక్షి’కి వివరించారు.
 
టీఆర్‌ఎస్ వాళ్లు కలిశారు...
కార్యకర్తల అల్టిమేటంతో కొంత ఇబ్బందికి గురైన టీడీపీ నాయకుడు  ‘ఆ పార్టీ వారు పిలువందే ఎలా వెళ్ళాలంటూ’ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా మరో వైపు గులాబీ దండు కూడా   ఖేడ్ టీడీపీలోని కీలక నేతను తమ పార్టీలో కలుపుకోవడానికి ఎత్తులు వేస్తోంది. జిల్లాకే చెందిన  ఓ టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు, మాజీ ఎంపీ ఒకరు ఇటీవల ఆయనతో కలిసి మాట్లాడినట్లు తెలిసింది. పార్టీలోకి రావాలని, మంచి భవిష్యత్తు చూపిస్తామని కోరినట్లు తెలి సింది.

రెండు పర్యాయాలు ఆయనతో చర్చించినప్పటికీ టీడీపీ నాయకుడు మాత్రం ‘వస్తానని కానీ  రానని కానీ చెప్పనట్లు తెలిసింది. తీవ్ర ఒత్తిడితో ఉన్న  టీడీపీ నాయకుడు ఇంకా ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిసింది. మరోసారి కార్యకర్తల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ నెల 30న ఆయన టీడీపీ కార్యకర్తల సమావేశం పెట్టినట్లు తెలిసింది. సమావేశం అనంతరం తమ నాయకుడు ఒకస్థిర  అభిప్రాయానికి వస్తారని సదరు నాయకుని అనుచరులు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement