పాల ప్రోత్సాహకానికి పరిమితి!
► 25 లీటర్ల లోపు పాలు పోసే రైతులకే వర్తింప చేయాలని నిర్ణయం?
► మిగతా రైతులకు రూ.4 ప్రోత్సాహకం నిలుపుదల
► ఈ విధానం అమలైతే 79,568 మందికే లబ్ధి
► సరికాదంటున్న డెయిరీ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తోన్న ప్రోత్సాహకానికి రాష్ట్ర సర్కారు సీలింగ్ పద్ధతిని ఖరారు చేసినట్లు తెలిసింది. ఒకటి నుంచి 25 లీటర్ల వరకు పాలు పోసే రైతులకు మాత్రమే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. 25 లీటర్లకు పైబడి పాలు పోసే రైతులకు ప్రోత్సాహక సొమ్మును నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతేడాది నవంబర్ నుంచి ప్రభుత్వం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సన్న, చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు, కొందరు వ్యాపారులు కూడా ప్రోత్సాహక సొమ్ము పొందుతున్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం దీనిపై ఆరా తీసింది. చివరకు 25 లీటర్ల సీలింగ్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన జారీ కావాల్సి ఉంది.
ఇదీ పాల లెక్క..
ప్రస్తుతం రాష్ట్రంలో 81 వేల మంది రైతులు ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రోత్సాహక సొమ్ము తీసుకొని పాలు పోస్తున్నారు. వారిలో 5 లీటర్ల లోపు పాలు పోసే రైతులు 55,853 మంది, 5 నుంచి 10 లీటర్లు పోసే రైతులు 14,127 మంది, 10 నుంచి 15 లీటర్లు పోసే రైతులు 5,761 మంది, 15 నుంచి 20 లీటర్లు పోసే రైతులు 2,699 మంది, 20 నుంచి 25 లీటర్లు పోసే రైతులు 1,128 మంది, 25 నుంచి 50 లీటర్లు పోసే రైతులు 1,259 మంది, 100 లీటర్ల కన్నా ఎక్కువ పాలు పోస్తున్నవారు 100 మందిదాకా ఉన్నారు. వీరిలో 25 లీటర్ల లోపు పాలు పోసేవారు 79,568 మంది ఉన్నట్టు తెలిసింది. వారికే ప్రోత్సాహకం అందించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఆర్థికభారం తగ్గించుకునేందుకేనా?
గతేడాది నవంబర్ 1 నుంచి ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహంగా అందిస్తోంది. ఈ లెక్కన లీటరుకు రూ.28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలు కాకముందు విజయ డెయిరీ గత ఏడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. సర్కారు అంచనాలకు మించి సేకరణ పెరిగింది. అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహక సొమ్మును సక్రమంగానే అందించిన విజయ డెయిరీ నవంబర్ రెండో వారం నుంచి ఇప్పటివరకు రైతులకు బిల్లు సొమ్మును నిలిపేసింది. వీరితోపాటు 10 ప్రైవేటు డెయిరీలకూ చెల్లింపులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం పెరగడంతో సీలింగ్‌పై నిర్ణయం తీసుకుంది. దీంతో నిజమైన రైతులు కూడా అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందని డెయిరీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం డెయిరీ ఫారాలకు ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని ఆదర్శ పాల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు.
ఇంకా నిర్ణయం కాలేదు : పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా
పాల ప్రోత్సాహకానికి సంబంధించి సీలింగ్‌పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చెప్పారు. ప్రోత్సాహక సొమ్ము తీసుకుంటున్న రైతులు ఎందరన్న లెక్కలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.