కానిస్టేబుల్ నాగరాజుకు కన్నీటి వీడ్కోలు
మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంట ర్‌లో మృతి చెందిన చెవుగోని నాగరాజు (29) అంత్యక్రియలు అతని స్వగ్రామమైన కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని రసూల్‌గూడెంలో ఆదివారం అధికారలాంఛనాలతో నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. నాగరాజు పార్ధీవదేహానికి అతని తండ్రి శ్రీమన్నారాయణ తలకొరివి పెట్టారు. నాగరాజును కడసారిగా చూసేందుకు బంధువులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీప్ లక్టాకియా, ఐజీ వి. నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు నాగరాజు మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
కట్టంగూర్
మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో జరిగిన ఎన్‌కౌంట ర్‌లో మృతి చెందిన చెవుగోని నాగరాజు (29) స్వగ్రామమైన మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధి రసూల్‌గూడెంలో ఆదివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. నాగరాజును కడసారిగా చూసేందుకు బంధువులతో పాటు చుట్ట పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. కానిస్టేబుల్ నాగరాజు మృతితో రసూల్‌గూడెం గ్రామం శోకసముద్రంలో మునిగింది. ఎండతీవ్రతను లెక్కచేయకుండా గ్రామస్తులు, పలుగ్రామాల ప్రజలు సాయంత్రం 3 గంటల వరకు అంతియ యాత్రలో పాల్గొన్నారు.
కానిస్టేబుల్ తల్లిదండ్రులైన చెవుగోని శ్రీమన్నారాయణలక్ష్మమ్మ, భార్య సంజన రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు కాటికివెళ్లటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యేవరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాన్ని నాగరాజు వ్యవసాయబావి వద్ద స్పెషల్‌పార్టీ పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలు, పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి శ్రీమన్నారాయణ నాగరాజుకు తలకొరివి పెట్టారు.
పోలీసు అధికారుల తరపున శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీప్ లఖాతియా, ఐజీ వి.నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, డీ ఎస్పీ రాములునాయక్, సీఐలు బాలకృష్ణ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రమీల, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, చెరుకు సుధాకర్, నోముల నర్సింహయ్య, సర్పంచ్ పెద్ది మంగమ్మసుక్కయ్య, పీఏసీఎస్ చైర్మన్ చెవుగోని సాయిలు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్, బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ ఎస్. నర్సింహ, రెడ్డిపల్లి సాగర్, నర్సింహగౌడ్, ఎంపీటీసీలు పబ్బు వెంకటేశ్వర్లు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య, వైఎస్‌ఆర్‌సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ముశం రామానుజం తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ బూర
ముష్కరుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కానిస్టేబుల్ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి *40లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఉగ్రవాదులను హతమార్చటంలో నల్లగొండ జిల్లా పోలీసులు చూపించిన తెగువను ఆయన కొనియాడారు. ఇలాంటి సమయంలో ప్రజ లందరూ ప్రభుత్వానికి అండగా ఉండి ఉగ్రవాదంపై పోరు సాగించాలని పిలపునిచ్చారు. భవిష్యత్‌లో పోలీసులకు మరిన్ని అధునాతన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు పూల రవీందర్, నేతి విద్యాసాగర్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, జెడ్పీటీసీ మాద యాదగిరి పాల్గొన్నారు.