వారం రోజుల్లో బీజేపీకి కొత్త కార్యవర్గం
కిషన్‌రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలనుకుంటున్న అధిష్టానం
మార్చాలంటున్న సీనియర్ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించేందుకు పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే తెలంగాణకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించారు. దీంతో ఆయనను అలాగే కొనసాగిస్తూ మిగతా కార్యవర్గాన్ని నియమించాలనేది ఇప్పటివరకు ఉన్న వ్యూహం. అయితే... గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా కనిపించినా తెలంగాణలో మచ్చుకైనా లేకపోవటం, కనీసం మూడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని స్వయంగా మోదీ లక్ష్యం నిర్ధారించినా ఒక్క సికింద్రాబాద్‌లో మాత్రమే గెలవటం.. ప్రత్యేకంగా తీరిక చేసుకుని మోదీ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించినా ప్రభావం కనిపించకపోవటం.. తదితరాల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ చాలాబల హీనంగా ఉందని పార్టీ నిర్ధారణకు వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటకతోపాటు తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి రావాలనే టార్గెట్ విధించుకున్న నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేయాలంటే భారీ ప్రక్షాళన అవసరమనే వాదన తాజాగా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చింది. ఫలితంగా తెలంగాణ శాఖను పూర్తిగా మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఏమాత్రం పొసగని స్థానిక సీనియర్ నేతలు ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పలు సందర్భాల్లో విన్నవిం చారు. కొంతకాలం కిషన్‌రెడ్డినే కొనసాగిస్తే బా గుంటుందని అమిత్ షా అన్నట్టు తెలిసింది. ఇటీవలే పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పీకే కృష్ణదాస్‌ను నియమించారు. ఆయనతో కిషన్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలనే అభిప్రాయం అధిష్టానంలో ఉంది. అయితే, మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
బీజేపీ రైతు పోరు దీక్ష వాయిదా
రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కరీంనగర్‌లో సోమవారం నిర్వహించ తలపెట్టిన రైతుల పోరు దీక్షను వాయిదా వేసినట్టు భారతీయ జనతా పార్టీ ఆదివారం ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది సోమవారం ప్రకటించనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొంతకాలంగా వరుసగా విలేఖరుల సమావేశాల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి శ్రీకారం చుట్టాలనుకుంది. అయితే, వాన రూపంలో అవాంతరం ఎదురైంది. నీలోఫర్ తుపాను ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తుండడంతో రైతుపోరు దీక్షను వాయిదా వేసుకుంది.