దండేపల్లి : ప్రధానమంత్రి సంసద్‌యోజన ఆ దర్శ గ్రామంగా ఎంపికైన మండలంలోని గూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆదివారం ఆయన గూడెం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. పాలకవర్గం లేక అభివృద్ధికి దూరంగా ఉంటున్న గూడెం గ్రామాన్ని దత్తతగా తీసుకున్నామన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి వసతులు కల్పించి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానన్నారు. పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ, ఆరోగ్య ఉపకేంద్రానికి పక్కా భవనాలు నిర్మిస్తానని చెప్పారు. పక్కనే ఉన్న గోదావరి నదీ తీరం వద్ద పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారన్నారు. రాయపట్నం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలువురు కోరారు.
దీర్ఘకాలికంగా నెలకొన్న ఏజెన్సీ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామంలో పర్యటిస్తుండగా పింఛన్ రాని కొందరు వృద్ధులు ఇప్పించాలని వేడుకున్నారు. అర్హులందరికీ పింఛన్ వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ గోళ్ల మంజుల, వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ముత్తె నారాయణ, తహశీల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణ టీఆర్‌ఎస్ నాయకులు గురువయ్య, మల్లేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, లక్ష్మణ్, తిరుపతి, రమేశ్, మల్లేశ్, స్థానికులు రాజయ్య, సాంబయ్య, మధు, బాపు, తిరుపతి, గోపాల్, రమేశ్, విద్యార్థి సంఘం నాయకులు సోహెల్‌ఖాన్, కుమార్‌యాదవ్, మహేశ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
గొప్ప పుణ్యక్షేత్రంగా...
గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని తెలంగాణలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని ఎంపీ సుమన్ చెప్పారు. ఆదివారం ఆయన సత్యదేవున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ చెప్పారు. ఈవో పురుషోత్తమాచార్యులు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు వెంకటస్వామి, అధికారులు, వేదపారయణదారు, అర్చకులు పాల్గొన్నారు.
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా..
Published Mon, Dec 22 2014 1:00 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM
Advertisement