‘స్థానిక’ సమరం ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటినా జిల్లాపరిషత్ పీఠం ఏ పార్టీపరమవుతుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు.సంఖ్యా పరంగా ‘హస్తవాసి’ ఉన్నా..సమీకరణాలు వేరేలా కుదిరితే కుర్చీ కష్టమే అవుతుంది. ఇక కారు పక్షానికీ కుర్చీని తమవైపు లాక్కోవాలని చూస్తున్నా..లెక్కలు తేలడం లేదు. టీడీపీని ఎలాగైనా వశపరచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నా ‘రేవంత్’ చిక్కడు దొరకడు తీరున వ్యవహరిస్తున్నారు. దీనితో దీనిపై ఉత్కంఠ రగులుతోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటినా ‘చైర్మన్’ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం కొలిక్కి రావడం లేదు. ఏ రాజకీయ పక్షానికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నా సంఖ్యాబలం లేకపోవడంతో పీట ముడి వీడటం లేదు. తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన తొమ్మిది మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు కీలకం కావడంతో సంఖ్యాబలం సాధన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు క్లిష్టంగా తయారైంది. 64 మంది జెడ్పీటీసీ సభ్యులున్న జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ 28, టీఆర్‌ఎస్ 25, టీడీపీ 9, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ అంటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌తో సమాన స్థాయిలో రాజకీయ వైరాన్ని కలిగి ఉండటంతో జడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం సాధన రెండు పార్టీలకు సాధ్యం కావడం లేదు.
చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ అనూరాధ పేరును కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదించి, టీడీపీ నుంచి మద్దతు కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌లో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి పేరుపై స్పష్టత రావడం లేదు. పెబ్బేరు జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన రిటైర్డు ఇంజనీర్ ప్రకాశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే గద్వాల నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంలో టీఆర్‌ఎస్ నేత కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. గద్వాల నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ అభ్యర్థికే జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పేరు ఖరారవుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున జెడ్పీ పీఠం తమకే దక్కుతుందనే ధీమా టీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.
‘దేశం’ సభ్యుల మల్లగుల్లాలు
తెలుగుదేశం పార్టీ తరపున జిల్లాలో మొత్తం తొమ్మిది మంది జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందారు. టీడీపీ ముఖ్య నేత రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే నలుగురు టీడీపీ జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. టీడీ పీ మద్దతు కోరుతున్న నేతలు రేవంత్‌రెడ్డిని సంప్రదిస్తున్నా, ఆయన మాత్రం దాటవేత వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు తో మాట్లాడాల్సిందిగా తనను సంప్రదిస్తున్న నేతలకు చెప్తున్నారు. జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక సందర్భంగా గైర్హాజరు అయ్యేలా టీడీపీ సభ్యులను ఒప్పించాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది.
టీడీపీ సభ్యులు ఎన్నిక ప్రక్రియలో పాల్గొని తమకు మద్దతు ఇచ్చేలా టీఆర్‌ఎస్ వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు టీడీపీ శిబిరానికి గండికొట్టి కొందరు సభ్యులనైనా తమ వైపునకు తిప్పుకునేందుకు రెండు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరపున ఎన్నికైన సభ్యులను కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తలకు మించిన భారంగా తయారైంది. కొత్త రాష్ట్రంలో చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే జెడ్పీ రాజకీయం రంజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కౌన్ బనేగా ‘జెడ్పీ’
Published Sat, May 31 2014 2:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement