అమెజాన్ బంపర్ ఆఫర్..రెనాల్ట్ క్విడ్
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ డిస్కౌంట్ల పండుగకు తెరతీసింది. ప్రతీ ఏడాది ప్రకటించే డిస్కౌంట్ల ఉత్సవం ఈ రోజు అర్థరాత్రినుంచే ప్రారంభం. 2017 నూతన సంవత్సరంలో తొలి డిస్కౌంట్ సేల్ ను ప్రకటించింది. పెద్ద ఎత్తున పొదుపులు ప్రతీ ఒక్కరికి అంటూ ప్రకటించిన ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల వెల్లువ జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగనుంది. పాపులర్ బ్రాండ్స్పై గ్రేట్ డీల్స్ తోపాటు వెంటనే డెలివరీ సిస్టమ్ను కూడా అందిస్తోంది.
స్మార్ట్ ఫోన్లు మొదలు డిజిటల్ కెమెరాలు, ఇతర యాక్ససరీస్ పై వివిధ రకాల డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి అదనపు ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రూ. 4,999 కు పైన చెల్లింపులు చేస్తే అమెజాన్ వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం, అమెజాన్ యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎస్ బీఐ కార్డ్ ద్వారా కనీస లావాదేవి 5వేలు.. గరిష్టంగా రూ.1,750 ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అమెజాన్ యాప్ ద్వారా కనీస లావాదేవీ రూ.250, గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ఆఫర్ ఇస్తోంది.అంతేకాదు అమెజాన్ ప్రీమియం సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. అంతేకాదు ప్రైమ్ మెంబర్స్ ..నాన్ ప్రైమ్ మెంబర్స్ కంటే 30నిమిషాల ముందు టాప్ డీల్స్ ను సొంతం చేసుకునేలా ఏర్పాటు చేసింది.
వినియోగదారులకు పర్యటన అనుభవాన్నిఅందించేందుకు ముసాఫిర్.కాంతో జతకట్టింది అమెజాన్. ఈ భాగస్వామ్యంతో అమెజాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. 10 మంది జంటలు అన్ని ఖర్చులతో కలిపి ఉచిత యూరప్ ట్రిప్ గెల్చుకోవచ్చు. అంతేనా 10మంది లక్కీ విన్నర్స్ ప్రతి రోజు రెనాల్ట్ క్విడ్ గెలుచుకోవచ్చు.
కాగా వినియోగదారులకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం ఈ సంస్థ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. ఇందుకుగాను తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అప్కమింగ్ సేల్ నిమిత్తం శిక్షణ ఇస్తున్నట్టు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ అఖిల్ సక్సేనా ప్రకటించిన సంగతి తెలిసిందే.