బీజింగ్: ప్రజల హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ఒకవేళ ప్రజా హక్కులకు ఏమైనా భంగం వాటిల్లితే వాటి పరిష్కారానికి ప్రత్యేక సంఘాలున్నాయి. కానీ స్వలింగ సంపర్కులకు ఇక్కడ భిన్నంగానే జరుగుతుంది. వారి హక్కులను కాపాడటానికి ఏ దేశంలోనూ చట్ట ప్రకారం నడిచే ప్రత్యేక సంస్థలు లేవు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిందేనంటూ చైనా జాతీయుడు ఆ దేశంపై పోరాటం చేస్తున్నాడు. జియాంగ్ జిహాన్ (ఇది అతని అసలు పేరు కాదు) అనే వ్యక్తి గే హక్కులను కాపాడాలంటూ హెచ్ డీసీఏను సంప్రదించాడు. ఇదే అంశంపై గత సంవత్సరంలో ఆ వ్యక్తి అనేకసార్లు తన అభ్యర్థనను విన్నవించాడు.
గే సెక్స్ అనేది సమాజానికి ఆమోదయోగ్యం కాని చర్య అవడం వల్ల వారికి ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హెచ్ డీసీఏ తెలిపింది. దీంతో చేసేది లేక తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. తాము కూడా సమాజంలో భాగమైనందున, తమ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఆ దేశంలో గేలపై ఎటువంటి నిషేధం లేదు కనుక కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.