మంత్రి పీఏ ఫోన్ చేస్తేనే వెళ్లా: కోమటిరెడ్డి
- టీఆర్‌ఎస్ నిండా రౌడీషీటర్లే.. కేసీఆర్ పాపం పండింది
- నల్లగొండ బత్తాయి మార్కెట్ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- కల్లు తాగిన కోతిలా కోమటిరెడ్డి: ఎంపీ గుత్తా విమర్శ
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా నల్లగొండ పట్టణంలో చోటుచేసుకున్న ఘటనలపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీఆర్‌ఎస్ గుండాలు తమపై దాడిచేశారని, వాళ్లను అడ్డుకోవాల్సిందిపోయి పోలీసులు.. ఎమ్మెల్యేనైన తనను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
నల్లగొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలుకాగా, కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయను మిర్యాలగూడ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచే కోమటిరెడ్డి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు..
‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండ నిండా రౌడీ షీటర్లు నిండిపోయారు. అందుకే గత మూడేళ్ల నుంచి నేను అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనట్లేదు. అయితే, నిన్న రాత్రి మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు పీఏ ప్రత్యేకంగా ఫోన్ చేశారు. శంకుస్థాపనకు తప్పక రావాలని కోరితేనే వెళ్లాను. నన్ను మాట్లాడనీయొద్దన్న ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ వాళ్లు గలాటా సృష్టించారు. పోలీసులు దగ్గరుండి మాపై రాళ్లు వేయించారు’ అని కోమటిరెడ్డి వివరించారు.
కార్యక్రమంలో తాను మాట్లాడితే.. గతంలో వైఎస్సార్ హయాంలో చేసిన కార్యమాలు చెప్పాల్సివచ్చేదని, అది ఇష్టంలేకే టీఆర్‌ఎస్‌వాళ్లు దాడిచేశారని కోమటిరెడ్డి చెప్పారు. ‘మొన్న ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారు. ఇవ్వాళ నల్లగొండలో రైతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పాపం పండింది కాబట్టే ఇలాంటి పనులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం నల్లగొండ నుంచి పోటీచేస్తారట.. జిల్లాలోని ఏ ఒక్క స్థానంలోనూ టీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రావు..’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్లుతాగిన కోతిలా ప్రవర్తించారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
(ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై రాళ్లదాడి)