గులాబీయింగ్
జిల్లాలో చర్చనీయాంశంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రాజకీయం
అసలు జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? ఆ పార్టీలో ఉండే
దెంతమంది..? సొంతదారి చూసుకునే వారెందరు..? కొత్త
రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీఆర్‌ఎస్ జిల్లాపై పూర్తిస్థాయి
పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌లోని ఏయే నేతలకు గాలం
వేస్తోంది..? రెండు మూడు రోజులుగా జిల్లా రాజకీయవర్గాల్లో
ఈ ప్రశ్నల చుట్టూ చర్చ జరుగుతోంది..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :సార్వత్రిక ఎన్నికలకు ముందు, జిల్లాలో టీఆర్‌ఎస్ మహా అయితే ఒకటీరెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే గొప్ప అని అంతటా ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఏకంగా ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని జిల్లాపై గులాబీ జెండాను ఎగురవేసింది. కొత్తరాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసిన ఆ పార్టీ ఇప్పుడు నల్లగొండ జిల్లాపై పట్టు సాధించేందుకు నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండ జిల్లానుంచే కాంగ్రెస్ ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకోగా, ఒకటి నల్లగొండ కావడం గమనార్హం. ఏ రకంగా చూసినా, జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉంది. టీఆర్‌ఎస్ హవాలో కూడా కాంగ్రెస్ ఇక్కడ పట్టు నిలబెట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో అత్యధికంగా స్థానాలు కూడా గెలుచుకుంది.
59 మండలాలకు గాను 43 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుని జిల్లా పరిషత్‌ను హస్తగతం చేసుకోబోతోంది. అత్యధిక మండల పరిషత్‌లూ కాంగ్రెస్ ఖాతాలోకేవెళ్లనున్నాయి. ఈ ఫలితాలు, వివరాలన్నీ చూసే, నల్లగొండలో కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు, అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు పెద్ద వ్యూహాన్నే రచించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీలో ప్రధాననేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తమవైపు లాగేసుకునే పనిలో భాగంగా ఆయనకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందునుంచీ తెలంగాణవాదానికి కట్టుబడి ఉన్న నేతగా, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రజాప్రతినిధిగా గుర్తింపు ఉంది. అదీ కాకుండా, జిల్లాలో ప్రధాన వర్గంగా కూడా ఆయన కొనసాగుతున్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తమ పార్టీవైపు లాగేసుకుంటే జిల్లాలో సగానికి సగం కాంగ్రెస్‌ను తిప్పుకున్నట్టేనన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఆయనతోపాటు, ఆయన సోదరుడు భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకుంటే జిల్లాలో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా మారుతుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకోవచ్చన్న ముందుచూపుతో గులాబీ నాయకత్వం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పటికే జిల్లాలో ఆయా పార్టీలకు చెందిన నేత లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చివరకు పీఆర్‌టీయూ నేత, ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా ఆ పార్టీలో చేరిపోయారు. శాసనమండలిలో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నారు.
దీంతో జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవికి ముప్పు వచ్చింది. దీంతో ఆయన కూడా టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ వైపు వస్తే, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామన్న ప్రతిపాదన కూడా టీఆర్‌ఎస్ నేతలు పెట్టినట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి జిల్లాలో కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరిచి, తమ పట్టు పెంచుకోవడం, ఇటు శాసనసభ, అటు శాసనమండలిలో సభ్యుల సంఖ్యను పెంచుకోవడం, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవడం వంటి బహుముఖ ప్రయోజనాలు ఆశించి గులాబీ నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.