బత్తాయి మార్కెట్‌లో బాహాబాహీ
- నల్లగొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన రసాభస
- రాళ్లురువ్వుకున్న టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యక్తలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అరెస్ట్
నల్లగొండ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ నేతలు కూడా ర్యాలీగా వెళ్లి మంత్రి హరీష్ రావుకు స్వాగతం పలికేందుకు బయలుదేరారు. కోమటిరెడ్డి అనుచరులు ర్యాలీగా వెళ్లిన సమయంలో టీఆర్‌ఎస్ నేతల ప్లెక్సీలు విరిగి కిందపడిపోయాయి.
దీంతో కోపోద్రిక్తులైన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, కోమటిరెడ్డి అనుచరులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో సంఘటనాస్థలానికి వచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. రెచ్చిపోయిన టీఆర్‌ఎస్ కార్యక్తలు ‘కోమటిరెడ్డి గో బ్యాగ్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అతికష్టం మీద కోమటిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.