మంచినీళ్ల కోసం ఇద్దరు, ముగ్గురు భార్యలు
ముంబై: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి లేదా మూడో పెళ్లి చేసుకోవడం మామూలు విషయమన్నది మనకు తెల్సిందే. కానీ సుదూర ప్రాంతాల నుంచి మంచినీళ్లు తీసుకు రావడానికే రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకునే ఆచారం నిజంగా మన దేశంలో ఉందంటే ఆశ్చర్యమే మరి. ముంబై నగరానికి సరిగ్గా 140 కిలోమీటర్ల దూరంలో డెంగన్‌మల్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో దాదాపు వంద మట్టి ఇళ్లు ఉన్నాయి. ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేదు. కొన్ని కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో ఉన్న రెండు మంచినీటి ఊటలే గ్రామ ప్రజలకు ఆధారం. గ్రామంలోని ప్రజల్లో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.
గ్రామంలోని మహిళలు మాత్రం సుదూరానున్న పర్వత ప్రాంతానికి వెళ్లి మంచి నీళ్లు తీసుకరావడమే పనిగా పెట్టుకుంటారు. ఇంటి పట్టున వంట చేయడానికి, పిల్లల బాగోగులు చూసుకోవడానికి కనీసం ఒక్కరన్నా ఉండాలి గనుక ఈ గ్రామంలోని యువకులు ఒకరికి మించి, ఇద్దరు లేక ముగ్గురిని పెళ్లి చేసుకుంటారు. ఈ ఆచారం ఆ గ్రామంలో కొన్ని తరాలుగా కొనసాగుతోందని, వారిని 'నీళ్ల భార్యలు (వాటర్ వైవ్స్)' అని పిలవడం కూడా పద్ధతేనని మూడు పెళ్లిళ్లు చేసుకున్న 66 ఏళ్ల సాఖరమ్ భగత్ ఆగ్రామాన్ని సందర్శించిన మీడియాకు తెలియజేశారు.
'నేను మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు తాగేనీరు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
నేను పక్క గ్రామంలో వ్యవసాయ కూలీగా వెళితే నా భార్య ఎంతో దూరం నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చి వంట చేసేది. ఆమె నీళ్లోసుకున్నప్పుడు మంచి నీళ్ల కోసం మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రెండో భార్య జబ్బున పడటంతో నాకు మూడో పెళ్ల్లి అనివార్యమైంది. ఇప్పుడు మొదటి భార్య వంట పని, పిల్లలను చూసుకుంటుండగా, మూడో భార్య మంచి నీళ్లు మోసుకొస్తోంది' అని భగత్ తన పెళ్లిళ్ల కథను వివరించారు. 'నీళ్లు లేనప్పుడు పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టమే. కానీ ఏం చేస్తాం. కూలికి మంచినీళ్లు పోసే పరిస్థితి ఈ గ్రామంలో లేదు. అందుకు తగినంత డబ్బు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు' అని రెండు పెళ్లిళ్లు చేసుకున్న నామ్ దేవ్ వ్యాఖ్యానించారు. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తమ గ్రామంలో మామూలు విషయమేనని గ్రామస్థులు వివరించారు. ఈ ఆచారం కారణంగా గ్రామంలో వితంతువుల వివాహాలు కూడా జరుగుతున్నందుకు తాము సంతోషంగానే ఉన్నామని వారన్నారు.
'మా మధ్య గొడవలేమీ లేవు. మేము ముగ్గురు అక్కా చెల్లెళ్లలా కలిసే ఉంటాం. ఎప్పుడైనా గొడవలొస్తే మాలో మేమే పరిష్కరించుకుంటాం' అని భగత్ మొదటి భార్య టుకి చెప్పారు. భారత్‌లోని కొన్ని గ్రామాల్లో నీటి కొరత కారణంగా రెండో పెళ్లి చేసుకుంటున్నారని 2011లో ఐక్యరాజ్య సమితి కూడా ఓ నివేదికలో పేర్కొంది. మహారాష్ట్రలో 19000 గ్రామాలకు తాగు నీటి సౌకర్యం లేదు. అంగోలా లాంటి సబ్ సహరాన్ ఆఫ్రికా దేశాల నుంచి మంగోలియా వరకు మంచినీటి వనరులకు మహిళలపైనే ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచినీళ్లు కావాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకోండంటూ మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించడమంటే ఆశ్చర్యం కలగదు గానీ అందులో బాధ్యతా రాహిత్యాన్ని మాత్రం క్షమించరాదు.