రికవరీ బాటలో భారత్ ఆర్థిక వ్యవస్థ
8% స్థిరమైన వృద్ధికి కట్టుబడిఉన్నాం...
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు...
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రికవరీ బాటలో ఉందని, ఈ సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 2014-15 ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.4 శాతం మేర నమోదైందని.. స్థూల ఆర్థిక పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనివల్ల 8 శాతం స్థిరమైన వృద్ధిరేటును సాధించేందుకు వీలవుతుందన్నారు. 2014-15 పూర్తి ఏడాదికి 7.4 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని ముందస్తు అంచనాల్లో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ సమావేశంలో జైట్లీ ఈ అంశాలను పేర్కొన్నారు. ‘మధ్యకాలికంగా వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. బొగ్గు, గనులకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పాలసీ చర్యలు.. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు, మౌలిక రంగంలో పబ్లిక్-ప్రైవేటు పెట్టుబడి(పీపీపీ) విధానానికి ప్రాధాన్యం వంటివి దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి’ అని జైట్లీ వివరించారు.
ద్రవ్యోల్బణం ఆందోళనలు తగ్గాయ్...
2010-13 సంవత్సరాల మధ్య భారత్‌కు అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారిన ద్రవ్యోల్బణం ఇప్పుడు భారీగా దిగొచ్చిందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్‌బీఐ తమ పాలసీ చర్యల కోసం ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలమానంగా తీసుకుంటోందన్నారు. ఈ రేటు 2013 నవంబర్‌లో 11.2 శాతంకాగా.. ఈ ఏడాది మార్చిలో 5.2 శాతానికి తగ్గిన విషయాన్ని గుర్తుచేశారు. మరోపక్క, తమ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ద్రవ్యలోటు కట్టడి దిశగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు జైట్లీ చెప్పారు. 2011-12లో జీడీపీతో పోలిస్తే ద్రవ్యలోటు 5.7 శాతం ఉండగా.. 2014-15లో దీన్ని 4.1 శాతానికి పరిమితం చేశామని.. 2015-16 ఏడాదిలో 3.9 శాతానికి దిగొచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగాయ్...
దేశంలో మెరుగైన ఆర్థిక పరిస్థితులకు నిదర్శనంగా పెద్దయెత్తున విదేశీ నిధులు తరలివచ్చాయని.. దీనివల్ల విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగేందుకు(ఏప్రిల్ 3 నాటికి 343 బిలియన్ డాలర్లు) దోహదం చేసిందన్నారు. 2013 ఆగస్టుతో పోలిస్తే 67 బిలియన్ డాలర్లు పెరిగాయన్నారు. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇతరత్రా పాలసీ పరమైన చర్యల వల్ల తలెత్తే ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని జైట్లీ స్పష్టం చేశారు. ఇక అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పనకు గాను తమ సర్కారు ప్రారంభించిన జన్‌ధన్ యోజనకు అపూర్వ స్పందన లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 8 నెలల కాలంలో 14.7 కోట్ల బ్యాంక్ అకౌంట్లను ఈ స్కీమ్ కింద కొత్తగా తెరిచామని జైట్లీ పేర్కొన్నారు.
అశావహంగానే కంపెనీలు...
న్యూఢిల్లీ: రానున్న 4-6 నెలల్లో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని భారతీయ కంపెనీలు ఆశావహ దృక్పథంతో ఉన్నాయి. కొత్త పెట్టుబడి ప్రతిపాదనలలో జాప్యాలు ఉన్నప్పటికీ రానున్న ఆరు నెలల కాలంలో ఆర్డర్ల సంఖ్యలో వృద్ధి కనిపిస్తుందని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నట్లు అసోచామ్ తన బిజ్‌కాన్ సర్వేలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పునరుద్ధరణకు పలు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 2015 ఏప్రిల్-జూన్ తైమాసికంలో ఆర్డర్ల సంఖ్యలో వృద్ధి నమోదు అవుతుందని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ సమయంలో తమ దేశీయ పెట్టుబడి ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని సర్వేలో పాల్గొన్న 39 శాతం మంది పేర్కొన్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ తెలిపారు. 2015 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ లాభాల మార్జిన్‌లో మార్పు లేదని సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయపడ్డారు. కాగా, పన్ను వ్యవస్థకు సంబంధించిన సవాళ్లు ఉన్నా బ్రిక్ దేశాలతో పోలిస్తే భారత్ పెట్టుబడులకు అనువైన దేశమని గ్లోబల్ కన్సల్టెన్సీ, రీసెర్చ్ సంస్థ డాల్ఫిన్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.