నల్లధనంపై నాటకాలొద్దు...
నారాయణపేట: దేశానికి ఆర్థిక రంగమనేది చాలా సున్నితమైందని, నల్లధనాన్ని వెలికి తీస్తున్నామంటూ నాటకాలు, రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తే నల్లధనం బయటికి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడం చూస్తూంటే.. నష్టం ఎవరికి జరుగు తుందో ఆలోచించడం లేదన్నారు. నల్లకుబే రులకు నష్టం జరగదని, ఇప్పటికే కొంత మంది వజ్రాలు, వైఢూర్యాలు, భూములు తదితర రూపంలో ఆస్తులను కూడగట్టుకున్న వారు ఉన్నారన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు నూతన నోట్ల విధానంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీలు, వ్యాపారస్తులు వివిధ రూపాల్లో డిపాజిట్‌లు, వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. కానీ, ప్రభుత్వం నల్లధనం బయటికి తీస్తున్నమంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరి ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు వైట్ మనీ ఎంత ఖర్చు చేస్తున్నారో వారే చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మాటల మనిషి
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటల మనిషి అని.. మాట మనిషి కాదని విమర్శిం చారు. రాష్ట్రాన్ని తానే సాధించుకు వచ్చానని చెబుతున్న కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఎవరు బిల్లు పెడితే.. ఎవరు మద్దతిస్తే రాష్ట్రం ఏర్పడిందో ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ తెచ్చింది నేనే అంటూ తెలంగాణ వెంచర్ పెట్టుకున్న మహనీయుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. బిట్లు బిట్లుగా చేసి కుటుంబంతో నిరంకుశత్వ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిన తమనే మాయం చేసిన ఘనుడని ఎద్దేవా చేశారు.