వరుసగా ఐదో రోజు బ్యాంకుల జోరు
Published Thu, Mar 30 2017 4:09 PM | Last Updated on Fri, Aug 17 2018 2:39 PM
ముంబై : ఏకీకృత వస్తుసేవల పన్ను విధానం(జీఎస్టీ) అమలుకు ప్రభుత్వం శరవేగంగా ముందుకు దూసుకెళ్తుండటం, బ్యాంకు షేర్ల జోరు మార్కెట్లకు లాభించింది. గురువారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 115.99 పాయింట్ల లాభంలో 29,647.42 వద్ద, నిఫ్టీ 29.95 పాయింట్ల లాభంలో 9,173.75 వద్ద ముగిశాయి. పార్లమెంట్ దిగువసభలో జీఎస్టీకి సంబంధించిన నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. ఇక ఆ బిల్లుల రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. లోక్ సభలో జీఎస్టీ బిల్లుల ఆమోదంతో లాజిస్టిక్స్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఆల్కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ లు 4.4 శాతం, 4.3 శాతం పైకి ఎగిశాయి.
నిఫ్టీ ఫైనాన్స్, నిఫ్టీ బ్యాంకు సూచీలు వరుసగా ఐదో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 1.8 శాతం పైకి ఎగిసింది. కొటక్ మహింద్రా కూడా లాభాల్లో నడిచింది. నేటి ట్రేడింగ్ లో అదానీ పోర్ట్స్ 6.5 శాతం ర్యాలీ జరిపి టాప్ గెయినర్ గా నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం 2 శాతం కంటే పైగా దూసుకెళ్లింది. మరోవైపు సుప్రీం కోర్టు బీఎస్-3 వాహనాల నిషేధం విధిస్తున్నట్టు తీర్పు వెలువరించడంతో నష్టాలు పాలైన హీరో మోటార్ కార్పొ, అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ ఆటో స్టాక్స్ గురువారం కొంచెం కోలుకున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు 1.4 శాతం, 1.2 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 3పైసలు నష్టపోయి 64.94 వద్ద ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 13 రూపాయలు పడిపోయి 28,690గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement