సమైక్య శంకారావానికి వెల్లువలా మద్దతు | Outpouring of support for samaikya sankharavam meeting | Sakshi
Sakshi News home page

సమైక్య శంకారావానికి వెల్లువలా మద్దతు

Published Thu, Oct 24 2013 2:50 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

సమైక్య శంకారావానికి వెల్లువలా మద్దతు - Sakshi

సమైక్య శంకారావానికి వెల్లువలా మద్దతు

సమైక్య సభకు బాసటగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలు
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగ సంఘాలు నడుం బిగించాయి. సమైక్యవాదాన్ని చాటిచెప్పేందుకు భారీ గా తరలిరావాలని వివిధ ఉద్యోగసంఘాలు బుధవారం పిలుపునిచ్చాయి. పార్టీలకతీతంగా సమై క్య వాదులంతా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభినందించాయి. సమైక్య శంఖారావం సభ సమైక్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్ శామ్యూల్ గుంటూరులో పేర్కొన్నారు. సభకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. ఈ సభతో విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం మార్చుకోక తప్పదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు డాక్టర్ పి.జాన్సన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టీడీపీలు చేతులెత్తేసినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే విధానానికి కట్టుబడి, పోరాటం చేయడం అభినందనీయమన్నారు. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఇ. శ్రీనివాసరెడ్డి కోరారు.
 
 సమైక్య శంఖారావానికి సమైక్యాంధ్రను కాంక్షించే విద్యార్థులు లక్షలాదిగా తరలి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావానికి హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(హై-జాక్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సభకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని జేఏసీ నేతలు గణేశ్, నర్సింహులు పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం సభకు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు భారీగా హాజరుకావాలని ఏపీఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ప్రముఖ పాత్ర పోషించారని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విభజన ప్రక్రియ నిలిచిపోవాలంటే ఈ సభను జయప్రదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్య సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ కోరింది. సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు తరలిరావాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి సి.బి.ఎస్.రెడ్డి, ప్రచార కార్యదర్శి జె.హెచ్.పాల్‌లు విజ్ఞప్తి చేశారు.
 
  మైనారిటీ ఉద్యోగుల మద్దతు
 సమైక్య శంఖారావానికి  యునెటైడ్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఉమా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఉమా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.షంషుద్దీన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీ ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సభకు భారీగా తరలిరావాలని కోరుతూ సీమాంధ్ర జిల్లాలోని యునెటైడ్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు లేఖలు పంపినట్లు తెలిపారు.
 
 మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సైతం!
 సమైక్య శంఖారావం సభకు తరలివచ్చేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సిద్ధమవుతున్నారు. సభకు వేలాదిగా తరలిరావాలని మున్సిపల్, కార్పొరేషన్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్.వర్మ బుధవారం తిరుపతిలో పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడుతూ సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శంఖారావం సభను నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
 
 ఉపాధ్యాయ పోరాట సమితి..
 సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వేలాదిగా తరలిరావాలని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎస్.రాజేశ్వరి బుధవారం నెల్లూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలకతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావివర్గాలు సమైక్య శంఖారావం సభకు హాజరు కావాలని కోరారు.
 
 దేవాదాయ ఉద్యోగులూ..
 సమైక్య రాష్ట్రం కోరుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు తమ ఉద్యోగుల మద్దతు ఉంటుందని దేవాదాయ శాఖ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కృపావరం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సమైక్యవాదులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
 
 తిరుపతి ఉద్యోగ జేఏసీ..
 సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న సమైక్య శంఖారావం సభకు తిరుపతి ఉద్యోగ జేఏసీ మద్దతు ప్రకటించింది. సభకు ప్రతిఒక్కరూ హాజరై సమైక్యవాణిని ఢిల్లీకి వినిపించాలని తిరుపతిలో నిర్వహించిన ఒక సమావేశంలో పిలుపునిచ్చింది. సమావేశంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్, తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి, జేఏసీ గౌరవాధ్యక్షులు మునిసుబ్రమణ్యం, ఆర్టీసీ జేఏసీ తరఫున మునిసుబ్రమణ్యం, కన్వీనర్ పీసీబాబులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement