సీమ నీరు సీమకే ఇవ్వాలి
* చంద్రబాబు సీమకు ద్రోహం చేస్తున్నారు
* నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడుతున్నారు
* మీడియాతో రాయలసీమ అభివృద్ధి సమితి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు రావాల్సిన నీటిని సీమకే కేటాయించాలని రాయలసీమ అభివృద్ధి సమితి డిమాండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయంలోని నీటిని రాయలసీమ ప్రయోజనాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వాడేస్తున్నాయని మండిపడింది. దీని వల్ల సీమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతంవాడైనప్పటికీ సీమ ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
కనీస నీటి మట్టం 854 అడుగులు చేరక ముందే తాగునీటి కోసం మరో ఐదు టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అడగటం ఎంతమేరకు సమంజసమన్నారు. 854 అడుగుల నుంచి 875 వరకు నీటి మట్టం ఉంటే పొతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు వెళ్తుందన్నారు. నాగార్జునసాగర్‌లో నీరు 110 టీఎంసీలు ఉందని తెలిపారు. అయినా రాయలసీమకు నీరు దక్కనీయకూడదనే ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖమంత్రులు దేవినేని ఉమా, తన్నీరు హరీశ్‌లు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గతంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తరలించవద్దని మంత్రి ఉమా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు నీటిపారుదల మంత్రిగా ఉంచితే రాయలసీమకు నీరు రానిస్తాడా అని ప్రశ్నించారు. 1996లో 854 అడుగుల నుంచి 834 అడుగుల కనీస నీటి మట్టాన్ని శ్రీశైలంలో తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తు చేశారు. మళ్లీ దివంగత సీఎం వైఎస్సార్ తాను అధికారంలోకి రాగానే శ్రీశైలంలో 854 అడుగులకి నీటిమట్టం స్థాయి పెంచారన్నారు. ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం చేస్తే రాయలసీమ ప్రజలు ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీరు ఇస్తామని ఎక్కడా లేదని తెలిపారు. కేవలం పరిశ్రమలకు, డొమెస్టిక్ అవసరాలకు మాత్రమే నీరు ఇవ్వాలని జీవో ఉందని పేర్కొన్నారు. విశ్రాంత ఐజీ ఎ.హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు మేల్కోవాలని సూచించారు. ఇరిగేషన్ నిపుణులు ప్రభాకర్ రెడ్డి, గ్రాట్ జనరల్ సెక్రటరీ రాధాక్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.