కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం!
కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం!
Published Sat, Jul 1 2017 3:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో లష్కర్ కమాండర్ బషీర్ లష్కరీ ఉండటం భద్రతా దళాలకు పెద్ద విజయమని చెప్పవచ్చు. ఇటీవల ఆరుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారి బషీరే!
అనంత్‌నాగ్ జిల్లాలోని బాట్‌పూర గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దీంతో సుదీర్ఘంగా కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పౌరులు కూడా మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు స్థానికులను మానవ కవచంగా వాడుకొని తప్పించుకోవాలని చూశారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు చాకచక్యంగా ఆ ఇంటినుంచి 17మందిని సురక్షితంగా కాపాడారు. అయితే, ఈ ఆపరేషన్‌లో ఓ 44 ఏళ్ల మహిళ (తాహిర్ బేగం), ఓ 21 ఏళ్ల యువకుడు (షాదాబ్ అహ్మద్ చోపన్) ప్రాణాలు విడిచారు.
ఇక ఈ ఆపరేషన్‌లో చనిపోయిన బషీర్ లష్కరీ లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. పోలీసు అధికారి ఫీరోజ్ దార్, మరో ఐదుగురు పోలీసులపై దాడి చేసి చంపిన ఘటన వెనుక బషీర్ ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. బషీర్ ఎన్‌కౌంటర్ విజయవంతంగా పూర్తిచేయడంపై జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ పోలీసులు, భద్రతా దళాలకు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement