రక్షణ ఒప్పందంతోసహా పలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ మన దేశంలో అడుగుపెట్టారు. వారంపాటు సాగే ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆ దేశ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కూడా వచ్చారు. మనతో పూర్తి స్థాయి సంబంధాల కోసం ఇజ్రాయెల్ ఎంత తహతహలాడుతున్నదో దీన్నిబట్టి అర్ధమవుతుంది. మనవైపు నుంచి సైతం అలాంటి ఆత్రుతే ఉన్నా ఆచరణలో మాత్రం అది పెద్దగా ప్రతిఫలించడం లేదు. అందుకు పశ్చిమాసియాలో నెలకొన్న విలక్షణ పరిస్థితులే కారణం. అప్పటివరకూ అనధికార స్థాయిలో మాత్రమే ఉండే సంబంధాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 1992లో దౌత్య సంబంధాలుగా మారాయి. ఇది జరిగి పాతికేళ్లవుతున్నా...సరిగ్గా ఇరవైయ్యేళ్లక్రితం ఇజ్రాయెల్ అధ్యక్షుడు మన దేశంలో పర్యటించినా మన దేశాధినేతలు మాత్రం అక్కడికి వెళ్లలేదు.
ఇజ్రాయెల్ మంత్రులు సైతం ఒకటికి రెండుసార్లు మన దేశంలో పర్యటించారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు నెల కొల్పుకోవాలని ఆదినుంచీ బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చినా... ఆ పార్టీ అగ్రనేత వాజపేయి ప్రధానిగా పనిచేసిన కాలంలో ఇజ్రాయెల్ వెళ్లలేదు. అయితే అప్పట్లో విదేశాంగమంత్రిగా ఉన్న జశ్వంత్‌సింగ్‌ను పంపారు. నిరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారి అక్కడ అడుగుపెట్టారు. వాస్తవానికి అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారని కథనాలు వెలువడినా చివరి నిమిషంలో ఆ నిర్ణయం మారింది. ప్రణబ్ కూడా ఇజ్రాయెల్‌తో సరిపెట్టక జోర్డాన్, పాలస్తీనాలకు వెళ్లి ‘సమతౌల్యం’ పాటించారు. ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో ఎందుకిలా ఆచితూచి వ్యవహరించడం? రక్షణతోసహా వివిధ రంగాల్లో ఆ దేశంనుంచి సహకారం పొందుతున్నా, ఒప్పందాలు కుదురుతున్నా మన దేశం దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోలేదు. ఇలా గోప్యత పాటించడం అసాధారణం. ఇందుకు చాలా కారణాలు న్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో చాలా భూభాగాన్ని కోల్పోయిన పాలస్తీనాపై మన దేశం ఆదినుంచీ సానుభూతితో ఉండేది.
వివిధ అంతర్జాతీయ వేదికలపై అది చేసే పోరాటాలకు మద్దతు పలికేది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్ప డినప్పుడు వాటిని గట్టిగా ఖండించేది. ఇజ్రాయెల్‌ను అభిశంసించే తీర్మానాలకు మద్దతు ప్రకటించేది. అక్కడి అరాఫత్ ప్రభుత్వాన్ని గుర్తించి దాంతో దౌత్య సంబం ధాలను నెలకొల్పుకుంది. అలీనోద్యమంలో మన దేశం చురుకైన పాత్ర పోషిం చడం, విముక్తి ఉద్యమాలకు నైతిక మద్దతునీయడం, ఇక్కడ ముస్లింల జనాభా 12 శాతం వరకూ ఉండటం, గల్ఫ్ దేశాల్లో మన దేశానికి చెందినవారు లక్షలాదిమంది పనిచేస్తుండటంవంటివి ఇందుకు దోహదపడ్డాయి.
అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారంలో ఈజిప్టు వంటి దేశాలు వైఖరి మార్చుకోవడం, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలు సైతం అనంతరకాలంలో ఇజ్రాయెల్‌తో సన్నిహితం కావడం, ఆర్ధిక సంస్కరణల తర్వాత మన దేశం అమెరికా, పాశ్చాత్య దేశాలతో సన్నిహితమవుతూ క్రమేపీ అలీనోద్యమానికి దూరం జరగడం వంటి పరిణామాల వల్ల ఇజ్రాయెల్ పట్ల మన వైఖరి మారుతూ వచ్చింది. అయినా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలైనా, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వా లైనా దీన్ని బాహాటంగా వెల్లడించలేదు. వాస్తవానికి మన రక్షణ అవసరాలను తీరుస్తున్న దేశాల జాబితాలో రష్యా, అమెరికాల తర్వాత ఇజ్రాయెల్ తృతీయ స్థానంలో ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో మన దేశం ఇజ్రాయెల్‌నుంచి 1,200 కోట్ల డాలర్ల మేర రక్షణ కొనుగోళ్లు చేసింది. ఇజ్రాయెల్ కొనుగోలుదారుల జాబితాలో మనదే అగ్ర స్థానమని గుర్తిస్తే ఈ సంబంధాలు ఏ స్థాయికి వెళ్లాయో అర్ధమవుతుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో అనుభవం, ఆ క్రమంలో అక్కడ జరిగిన పరిశోధనల పర్యవసానంగా అభివృద్ధి అయిన అత్యుత్తమ సాంకేతికత మనకు అక్కరకొస్తాయని అనుకోవడం వల్లే రక్షణ కొనుగోళ్లలో ఇజ్రాయెల్ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు రివ్లిన్ రాకతో ఇవి మరింత విస్తృత స్థాయికి చేరుతాయి. అన్ని స్థాయిల్లోనూ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ఆయన తోపాటు ‘అసాధారణ రీతి’లో ప్రతినిధి బృందం వస్తున్నదని ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది.
మంగళవారం నరేంద్ర మోదీ, రివ్లిన్‌ల మధ్య జరిగిన చర్చల్లో వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం, జల వనరులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. వ్యవసాయం, జలవనరుల్లో ఒప్పం దాలు కూడా కుదిరాయి. ఇజ్రాయెల్‌కు జల వనరులు తక్కువగా ఉండటం వల్ల ఆ రంగంలో అనేక పరిశోధనలు చేసి సూక్ష్మ నీటి పారుదలలో నైపుణ్యాన్ని సంపాదించుకుంది. అధిక దిగుబడిని సాధించడంలో విజయం సాధించింది. ఇవన్నీ మన కరువు ప్రాంతాల సమస్యల్ని తీర్చడంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో మరింత సహకరించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది.
వచ్చే ఏడాది భారత్–ఇజ్రాయెల్ సంబంధాల రజతోత్సవ సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించాల నుకుంటున్నారు. 1965, 1971ల్లో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు, 1999నాటి కార్గిల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ సహకారం తీసుకున్నా ఆ సంగతిని మన ప్రభుత్వాలు బహిర్గతం చేయలేదు. 2014లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో గాజా సంక్షోభంపై ఇజ్రాయెల్‌ను అభిశంసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్ నుంచి మన దేశం గైర్హాజరైంది. అందుకు వేరే కారణాలు చూపినా ఇజ్రాయెల్‌కు మాత్రం ఈ చర్య సంతృప్తి కలిగించింది. పాలస్తీనాపై మన వైఖరిలో మార్పు లేదని పదే పదే చెబుతున్నా గతంతో పోలిస్తే మనం చాలా దూరం జరిగామన్నది వాస్తవం. వర్తమాన ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, వాటికి అనుగుణంగా ఏర్పడుతున్న అవసరాలు ఇందుకు దోహదపడ్డాయి. పాలస్తీనా, దానికి మద్దతు పలికే గల్ఫ్ దేశాలు మనతో ఇకపై ఎలా వ్యవహరి స్తాయో వేచిచూడాల్సి ఉంది.
ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం
Published Thu, Nov 17 2016 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement