Cemetery
-
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్‌టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్‌పూర్ -
శ్మశానం కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం
కోరుట్ల: శ్మశానవాటికకు స్థల కేటాయింపు వివాదాస్పదం కావడంతో.. అంత్యక్రియల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసికోనిగుట్ట కాలనీకి చెందిన వంగాల ఈశ్వరయ్య (56) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. ఆ కాలనీ వాసులకోసం గతంలో మున్సిపల్ అధికారులు కేటాయించినట్లుగా భావిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తుండగా సమీపంలోని ఇళ్లకు చెందినవారు అడ్డుకున్నారు. అక్కడ శ్మశానం కోసం స్థలం కేటాయించలేదని.. తమ ఇళ్ల ముందు శవదహనం చేయడం కుదరదని పట్టుబట్టారు. దీంతో పాడె మీద ఉన్న మృతదేహాన్ని కిందకి దించలేక సుమారు 2 గంటలపాటు అలాగే ఎత్తుకుని ఉన్నారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో ఎస్సైలు సతీష్, శ్యాంరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. శ్మశానం కేటాయింపు విషయంలో స్పష్టత లేదని మున్సిపల్ అధికారులు కూడా చెప్పడంతో కాలనీకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శనగర్ పూల్వాగు శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్బీనగర్లో ఆధునిక విధానంలో సోలార్ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి. సోలార్ బర్నింగ్ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే (చదవండి: ఇదేమి ‘పని’ష్మెంట్!) -
శ్మశాన వింత! చితిపై పడుకోబెట్టబోతుంటే హఠాత్తుగా కళ్లు తెరిచి..
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం.. నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు. చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్! -
1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
World's largest cemetery where more than 5 million dead people are buried: ఈ సృష్టిలో నా అంతటి వాడులేడని విర్రవీగే మనిషి.. కట్టుబట్టలతో మాత్రమే తన చివరి మజిలీని చేరుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.! ఐనా ఎత్తుకు పైఎత్తులు వేసి మరొకరిని చిత్తుచేయాలనే కుబుద్ధి ఎన్ని జన్మలెత్తినా మారదు. అంత పోరాటం చేసి చివరికి చేరేది అంతశయ్యకే..! జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ప్రేతభూమి మహత్యమదే!! ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది. ఐతే ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. సాధారణంగా రెండు మూడు ఎకరాల్లో శ్మశానవాటికలు ఉంటాయి. ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మాశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటికది.. ఎక్కడుందో తెలుసా! వారికి చాలా ప్రత్యేక స్థలమిది! ఇరాక్ దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్ సలామ్’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్ పీస్’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో.. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంలో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్ సైన్యం పడగొట్టారు. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారిక్కడ. శ్మశానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్ సలామ్ ఓ ఉదాహరణ. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్’ చదువు
మల్యాల(చొప్పదండి): ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులగది శ్మశానంలోనిది.. అందులోనే ఆన్లైన్క్లాసులు వింటోంది ఓ వైద్య విద్యార్థి.. ఎందుకంటే.. ఇంట్లో ఉంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ కరువు. మేడ మీదికి వెళ్తే కోతుల బెడద. అందుకే సిగ్నల్స్ సరిపడా ఉన్న శ్మశానవాటికనే ఆన్లైన్ క్లాసులకు వేదికగా చేసుకుంది జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన. ఆమె ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. ‘మా ఊర్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది. గతేడాది కూడా కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్లైన్ పాఠాలు విన్నాను. నాలాంటి వారికోసం సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’అని కల్పన కోరుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ -
గ్రామాల మధ్య శ్మశానం చిచ్చు
చంద్రగిరి: శ్మశానం ఆక్రమణ యత్నం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. ఎగువరెడ్డివారిపల్లె గ్రామ లెక్క దాఖల సర్వే నంబరు 1లో మూడు ఎకరాల శ్మశాన వాటిక ఉంది. దాని పక్కనే ఉన్న నరసింగాపురం గ్రామస్తులు ఆ భూమిలో కత్తులు, గొడ్డలతో చెట్లు తొలగించి చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎగువరెడ్డివారిపల్లె వాసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వీఆర్ఓ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ రేవతి ప్రకాష్‌రెడ్డి, ఔరంగజేబు ఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం రెడ్డివారిపల్లెకు చెందినదిగా నిర్ధారించారు. నరసింగాపురం గ్రామస్తులకు సర్ధి చెప్పి, సమస్యను పరిష్కరించారు. -
బతికుండగానే ‘బలి’చేద్దామనుకున్నారు..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : అది విశాఖ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటిక.. సాయంత్రం వేళలో అక్కడకు ఏపీ31 డీఎఫ్ 0741 నంబర్ గల ఓ కారు చేరుకుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు. వారి చేతిలో ఓ శిశువు కవర్లో చుట్టి ఉంది. పాప చనిపోయిందని అక్కడి సిబ్బందితో చెప్పారు. ఏ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించాడు శ్మశాన వాటిక ఇన్చార్జి. అందుకు వాళ్లు.. రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. శిశువును పూడ్చడం కోసం సిబ్బంది కవర్‌ను తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా హతాశులైన సిబ్బంది.. తర్వాత తేరుకుని.. ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శ్మశానవాటిక సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. వెంటనే వారు శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆస్పత్రి సిబ్బంది కూడా వీరితో దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వచ్చారు. దీనిపై శ్మశాన వాటిక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అసలు శిశువును ఆ ఆస్పత్రి నుంచే తీసుకొచ్చారా? లేక నకిలీ రశీదు సృష్టించారా? ఇంతకీ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన ఆ నలుగురు ఎవరు? తదితర విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఘటనపై శనివారం శ్మశానవాటిక ఇన్చార్జి ప్రసన్నకుమార్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచినట్టుగా తనకు సమాచారం తెలిసిందని ‘సాక్షి’తో చెప్పారు. -
Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/నవాబుపేట: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాల ని నిర్ణయించారు. తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో మొదట ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు. దీంతో అందరూ కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ వైకుంఠధామంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి -
శ్మశానవాటికలో నిప్పంటించుకుని..
ఆత్మకూరు: పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ తల్లి శ్మశానవాటికకు వెళ్లి శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లీ కూతురు మరణించగా కుమారుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులోని నవాబుపేట యనమలపాళేనికి చెందిన ఆదినారాయణ తన కుమార్తె వెంకటసుబ్బులు(27)ను తన అక్క కుమారుడైన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబుకి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం. బాబు కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగిరి గ్రామంలో పండ్ల తోట కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం వెంకటసుబ్బులు పిల్లలతో కలిసి బళ్లారి నుంచి నెల్లూరుకు బయల్దేరింది. నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో బస్సు దిగింది. సెంటర్లో టీ తాగి, అనంతరం వింజమూరు మార్గంలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలోకి వెళ్లి పిల్లలతో పాటు తన ఒంటిపై శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంకటసుబ్బులు, మధురవాణి మంటల్లో కాలి మరణించారు. తప్పించుకున్న మహేష్ బాబు భయంతో నెల్లూరుపాళెం సెంటర్‌కు పరుగెత్తాడు. ఆ సమయంలో పొలాల్లోకి వెళ్తున్న వ్యవసాయ కూలీలు గమనించి కౌన్సిలర్ కామాక్షయ్యనాయుడుకు సమాచారం అందజేశారు. కౌన్సిలర్ స్థానికులతో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే తల్లి, కుమార్తె మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ద్వారా వివరాలు తెలుసుకుని బం«ధువులకు సమాచారం అందజేశారు. సొంత మేనల్లుడే తన అల్లుడని, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని మృతురాలి తండ్రి చెప్పాడు. ఇటీవల అల్లుడు మద్యానికి అలవాటు పడటంతో కుమార్తె వద్దని వారిస్తుండేదని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..
సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో ‘తాజ్‌మహల్’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి దేవతనూ చేయలేదు. కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ అభినవ షాజహాన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్ భార్య చనిపోయింది. దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి అక్కడే గడిపేవాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని మధనపడ్డాడు. ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు. -
అత్యాధునిక వసతులతో శ్మశానవాటిక
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్న బేగంపేట్ స్మశానవాటిక పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. '5 ఎకరాల విస్తీర్ణంవున్న ఈ స్మశానవాటికలో నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి 150 లారీలలో తరలించారు. అలాగే 50 లారీల తుమ్మ, ఇతర కంప చెట్లను తొలగించారు. అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు, నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నారు. (శవాలపైనా కాసులవేట!) ఒక వైపు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కాంపౌండ్ వాల్ ఉండగా.. అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫార్మ్స్, దింపుడుకల్లం, పార్కింగ్, సీటింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. తదుపరి విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నారు. ఈ దహన వాటికకు ఎదురుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థలంలో ఇప్పటికే చెట్లు ఏపుగా, దట్టంగా పెరిగాయి. ఈ స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో మరో ఆరు నెలల్లో ఆహ్లాదకరమైన స్మశానవాటికగా మారనుంది' అని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
కడచూపునకు ‘కరోనా’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ భూతం శ్మశానవాటికలనూ తాకింది. దగ్గరి బంధువులను సైతం చివరి చూపు చూడకుండా కట్టడి చేస్తుంది. వివిధ కారణాలతో ఎవరైనా చనిపోతే వారి బంధువులు, స్నేహితులు శ్మశానవాటిక వరకు వస్తారు. అంతిమయాత్రకు కూడా పరిమితమైన సంఖ్యలోనే సందర్శకులు రావాలని, దీనికి కూడా నిబంధనలు వర్తిస్తాయంటూ శ్మశానవాటిక నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 50 మందితో మాత్రమే అంతిమయాత్రకు అనుమతి ఉంటుందని, అది కూడా సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ తంతు పూర్తి చేయాలని శ్మశానవాటిక నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. చివరిచూపు లేకుండా... బంధువుల్లో ఎవరైనా చనిపోతే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వచ్చి చివరిచూపు చూసి ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అంతిమయాత్రలో 50 మందికి మించొద్దని ఆదేశించింది. పరిమిత సంఖ్యలో హాజరు కావాలని ప్రభుత్వం సూచించడంతో ఎవరెవరిని అంతిమ యాత్రకు అనుమతించాలి అనేది ఆయా కుటుంబాల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఎవర్నీ కాదనే పరిస్థితి లేకపోవడం సమస్యగా మారి, కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు కూడా దారితీస్తోంది. -
ఆఖరి మజిలీకీ అవస్థలే !
సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): శ్మశానవాటికకు సరైన దారిలేక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పెద్దఆత్మకూర్, చిన్నఆత్మకూర్ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా చనిపోతే పాడెను పంటపొలాల ఒడ్లపై నుంచి అవస్థలు పడుతూ శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పెద్దఆత్మకూర్ గ్రామానికి చెందిన నాయికోటి రాములు అలియాస్ దుబాయి రాములు అనారోగ్యంతో గురువారం మృతి అదే పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ? అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు. అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి. కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్‌సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!? -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
శ్మశానంలో శివపుత్రుడు
కర్ణాటక,కృష్ణరాజపురం : అప్పుడెప్పుడో 16 ఏళ్ల క్రితం విక్రమ్ నటించిన శివపుత్రుడు చిత్రం గుర్తుందా? అందులో చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా శ్మశానంలోనే ఉంటూ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటాడు. అచ్చం అలాగే బెంగళూరు నగరంలో కూడా ఓ శివపుత్రుడు ఉన్నాడు. అంథోణిస్వామి అనే వ్యక్తి నిత్యావసరవస్తువులు లేదా అత్యవసర పనులు మినహా సుమారు మూడు దశాబ్దాలుగా కనీసం శ్మశానం గేటు కూడా దాటకుండా కుటుంబంతో సహా శ్మశానంలోనే ఉంటూ ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. 90 ఏళ్ల క్రితం అంథోణిస్వామి తాత ప్రస్తుతం బెంగళూరు నగరంలోని అతిపెద్ద శ్మశానవాటికైన కల్పళ్లి శ్మశానవాటికలో శవాలు పాతిపెట్టడానికి గుంతలు తీసే పనిని వృత్తిగా ఎంచుకున్నాడు. అనంతరం అదేపనిని అంథోణి స్వామి తండ్రి కూడా కొనసాగించాడు. దీంతో అంథోణిస్వామి కూడా చిన్న వయసు నుంచే తండ్రికి సహాయం చేస్తూ అక్కడే పెరిగాడు. తండ్రి మరణించాక శవాలకు అంత్యక్రియలు చేసే పనిని అంథోణిస్వామి కొనసాగించసాగారు. ఈ క్రమంలో దాదాపుగా మూడు దశాబ్దాలుగా ప్రతీరోజూ కనీసం ఎనిమిది నుంచి పది శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తల్లి, భార్య, నలుగురు పిల్లలతో కలసి స్మశానంలోనే నిర్మించిన ఇంట్లో ఉంటున్నాడు. నిత్యావసరాలు ఏదైనా అత్యవసర పనులు మినహా ఈ మూడు దశాబ్దాలలో ఇప్పటివరకు కుటుంబంతో కానీ ఒక్కడే కానీ ఏదైనా ప్రాంతాలకు విహారానికి వెళ్లడం లేదా కనీసం దేవాలయాలకు, సినిమాలకు కూడా వెళ్లకుండా శ్మశానంలోనే ఉంటున్నాడు. ప్రతీరోజూ శ్మశానానికి తీసుకువచ్చే శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం బాధ్యతగా భావిస్తున్నానని అంతేకాకుండా రోజుకు కనీసం పది శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండడంతో బయటకు వెళ్లడానికి తీరిక దొరకడం లేదని అంథోణి స్వామి చెబుతున్నారు. సంవత్సరానికి సుమారు 3,500 శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తానని అందులో అనాథ శవాల సంఖ్య కూడా ఎక్కువేనని చెప్పారు. మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇలా బెంగళూరు నగరంలో ఏమూల అనాథ శవాలు లభించినా కల్పళ్లి శ్మశానవాటికలోనే అంత్యక్రియలకు తీసుకువస్తుంటారు. పేరుకు క్రైస్తవుడే అయినా శ్మశానానికి తీసుకువచ్చే హిందువుల శవాలకు హిందూ పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి ప్రశంసలు అందుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్థివదేహానికి కూడా అంత్యక్రియలు నిర్వహించానని అప్పుడు తనకు 13 ఏళ్ల వయసు ఉంటుందని అంథోణిస్వామి తెలిపారు. దీంతోపాటు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తండ్రి, సినీనటుడు దేవరాజ్ తండ్రి ఇలా ఎంతో మంది ప్రముఖుల సంబంధీకుల పార్థివదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చారు. అనాథ శవాలకు కుటుంబ సభ్యుడిలా,బంధువులా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ అంథోణిస్వామి పలువురు నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు నీలం సంజీవరెడ్డి సమాధిని ప్రతీరోజూ శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లో సంజీవరెడ్డికి చిత్రపటానికి పత్రిరోజూ పూజ కూడా చేస్తారు. ఇటీవల కొంత అనారోగ్యం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న వేతనం సరిపోవడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు
ధైర్యం అంటే అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్లి రావడం కాదు. ఉదయాన్నే ఇంటి నుండి బయల్దేరాక, లోకంలో నానా రకాలైన మనుషులతో తలపడి మనసు పాడు చేసుకోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం. పిరికితనం అంటే ‘బాబోయ్ దెయ్యం’ అని భయపడి పరుగెత్తడం కాదు. కష్టం రాగానే, ‘దేవుడా కాపాడు’ అని వలవల ఏడ్చేయడం. నలుగురు మనుషులు ఆ చీకట్లో కూర్చొని ఉన్నారు. ఆ నలుగురూ నాలుగు రకాల వయసుల వాళ్లు. ఒక యువకుడు. ఒక వృద్ధుడు. ఒక మధ్యస్థుడు. నాలుగో వ్యక్తి వయసే.. సరిగ్గా తెలియడం లేదు. పుట్టినప్పట్నుంచీ అతడు ప్రతి వయసులోనూ పదేళ్లు తక్కువగానే కనిపించేవాడు. వాళ్లు నలుగురూ కూర్చొని ఉన్న చోటు.. ఒక ప్రమాద స్థలి. అదొక మలుపు. అక్కడెప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి సమీపంలోనే రైలు పట్టాలు ఉన్నాయి. అక్కడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అవి అనుకోని ప్రమాదాలు కావు. అనుకుని చేసుకునే ఆత్మహత్యలు! యువకుడు బాధపడుతున్నాడు. అందానికి కిరీటం ఉంటుంది. తెలివికి స్కాలర్షిప్ ఉంటుంది. ధైర్యానికి పతకం ఉంటుంది. అందవిహీనులకు, తెలివిలేనివాళ్లకు, భయస్థులకు ఈ లోకంలో చోటు లేదా? వారినెవరూ గుర్తించరా? అని ఆవేదన చెందుతున్నాడు. వృద్ధుడు యువకుడి వైపు ప్రేమగా చూశాడు. ‘‘చూడబ్బాయ్. లోకంలో ఏదైతే తక్కువగా ఉంటుందో దానికే విలువ ఉంటుంది తప్ప, తక్కువైనదేదీ ఈ లోకానికి విలువైనది కాదు’’ అన్నాడు. అర్థం కానట్లు చూశాడు యువకుడు. వృద్ధుడు నవ్వాడు.‘‘అందం తక్కువ. లోకం పట్టించుకోదు. చదువు తక్కువ. పట్టించుకోదు. ధైర్యం తక్కువ. పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే.. ఇలా తక్కువగా ఉండేవాళ్లే మనుషుల్లో ఎక్కువ. అందం, ప్రతిభ, ధైర్యం.. ఇవి ఉండేవాళ్లు మనుషుల్లో తక్కువగా ఉంటారు కనుక, ఆ తక్కువగా ఉండేవాళ్లను పట్టించుకుంటుంది. లోకం నైజమిది. ఇందులో బాధపడవలసిందీ, వెళ్లి బావిలో పడవలసిందీ ఏమీ లేదు’’ అన్నాడు యువకుడి తలపై జుత్తును చేత్తో నిమురుతూ. నాలుగో వ్యక్తి మౌనంగా వింటున్నాడు. అతడికీ ఈలోకం ఏ రూపంలోనూ గుర్తింపును ఇవ్వలేదు. అతడి జీవితం ఓ రోజు అకస్మాత్తుగా ‘మలుపు’ తిరిగే వరకు ‘వయసు తక్కువతనమే’ అతడి గుర్తింపు. ‘‘అయినా లోకం తీరింతే? నన్ను పిరికివాడు అంది. నిజానికి నేను పిరికివాడిని కాదు’’ అన్నాడు మధ్యవయస్కుడు.. మాటల మధ్యలోకి వచ్చి. ‘‘ఒంటి మీద కండలున్నాయ్. కళ్లు చురుగ్గా ఉన్నాయ్. మీకు పిరికితనం ఏంటి?’’ అన్నాడు యువకుడు.. మధ్యస్థుడితో. వృద్ధుడు పెద్దగా నవ్వాడు. ‘‘పిరికితనం బాడీలో ఉండదబ్బాయ్. మైండ్‌లో ఉంటుంది’’ అని ఆ యువకుడితో అని.. ‘‘ఎందుకు నిన్ను ఈ లోకం పిరికివాడు అంది చెప్పు? నీ బాధలు లోకానికి చెప్పుకున్నావా? లేక, లోకంలోని బాధలు నువ్వు చూడలేకపోయావా?’’ అని మధ్యస్థుడిని అడిగాడు. మధ్యస్థుడు విరక్తిగా నవ్వాడు. ‘‘అర్థం చేసుకోవలసిన వాళ్లే నన్ను పిరికివాడు అన్నారు’’ అన్నాడు. ‘‘ఎవరు ఆ అర్థం చేసుకోవలసినవాళ్లు’’.. అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘మా డాక్టర్’’ చెప్పాడు మధ్యస్థుడు. ‘‘నిజమే.. డాక్టర్లకు వెటకారం ఎక్కువైంది ఈ మధ్య. ‘తల తిరుగుతోంది డాక్టర్’ అంటే.. ‘భూమి తిరుగుతోంది కదా.. అందుకే తల తిరుగుతోంది’ అంటున్నారు..’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అసలు.. డాక్టర్ దగ్గరకి మీరెందుకు వెళ్లారు అంకుల్’’ అన్నాడు యువకుడు ఆ మధ్యస్థుడిని. ‘‘ఓ రోజు ఒంట్లో గాబరాగా ఉంటే వెళ్లాను. బీపీ ఉందన్నాడు. వరుసగా నాలుగు వారాలు బీపీ చూశాక మందులు రాసిచ్చాడు. నాకిదేం ఖర్మ అనుకున్నాను. లైఫ్ లాంగ్ వాడాలన్నాడు. రోజూ ఒకే టైమ్‌కి మాత్ర పడాలన్నాడు. మాత్రకు ముందు ఏదైనా తినాలని అన్నాడు’’ అని చెప్పాడు మధ్యస్థుడు.‘‘ఎందుకాయన మిమ్మల్ని పిరికివాడు అన్నాడు అంకుల్..’’ కుతూహలంగా అడిగాడు యవకుడు. ‘‘హాహ్హాహా.. పేషెంట్‌ని పిరికివాడు అంటే.. డాక్టర్ ధైర్యస్థుడు అయిపోతాడు. అందుకని అలా అని ఉంటాడు’’ అని పెద్దగా నవ్వాడు నాలుగో వ్యక్తి.వృద్ధుడు ఏం మాట్లాడ్డం లేదు. రయ్యిన మలుపు తిరుగుతున్న వాహనాలను చూస్తూ మౌనంగా వీళ్ల మాటలు వింటున్నాడు. అతడికనిపించింది..మలుపు దగ్గర కూడా ఈ మనుషులు రయ్యిన ఎందుకు తిరుగుతారోనని!యువకుడి వైపు చూసి చెప్పాడు మధ్యస్థుడు.. ‘‘మాత్ర వేసుకోవడం మర్చిపోయి, ఓ రోజు డాక్టర్ దగ్గరికి పరుగెత్తుకెళ్లాను. ‘ఏమైంది?’ అన్నాడు. ‘బీపీ మాత్ర వేసుకోవడం మర్చిపోయాను డాక్టర్’ అన్నాను. ‘అయితే ఏమైంది?’ అన్నాడు. ‘ఏదో తేడాగా ఉన్నట్లుంది’ అన్నాను. బీపీ చెక్ చేశాడు. ‘నార్మల్’ అన్నాడు. ‘ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏం కాదు’ అని చెప్పాడు’’.‘‘అప్పుడన్నాడా.. మిమ్మల్ని పిరికివాడని’’ అడిగాడు యువకుడు. ‘‘అప్పుడు కాదు. ఇంకోసారి వెళ్లాను. ‘బీపీ టాబ్లెట్ వేసుకున్నానో, వేసుకోలేదో గుర్తుకు రావడం లేదు. ఒకవేళ వేసుకుని ఉండి, మళ్లీ వేసుకుంటే బీపీ డౌన్ అవుతుందా? వేసుకుని ఉంటాన్లెమ్మని ఊరుకుంటే.. బీపీ రైజ్ అయ్యే అవకాశం ఉందా?’’ అని డాక్టర్ని అడగడానికి వెళ్లాను. ‘‘అప్పుడన్నాడా నిన్ను పిరికి అని’’ అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘అప్పుడు కాదు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘మరి!’’‘‘మళ్లీ ఓ రోజు పరుగున వెళ్లాను డాక్టర్ దగ్గరకి. ‘మళ్లీ ఏమైంది!’ అన్నాడు. ‘వేసుకోవలసిన టైమ్ కంటే ఓ గంట ముందు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్. ఏమైనా అవుతుందా?’ అని అడిగాను.అప్పుడన్నాడు.. ‘నీ అంత పిరికి మనిషిని నేనింత వరకూ చూళ్లేదు’ అని. అప్పట్నుంచీ నన్నంతా పిరికివాడిలా చూడ్డం మొదలుపెట్టారు. ఈ పాడులోకంలో బతకడం వేస్ట్ అనిపించింది.. అందుకే ఓ రోజు..’’అని ఆగి, యువకుడి వైపు చూశాడు మధ్యస్థుడు. అతడలా చూడగానే వృద్ధుడు అకస్మాత్తుగా పైకి లేచాడు. యువకుడి భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి చీకట్లోకి నడిపించుకు వెళ్లాడు!‘‘ఈరోజు ఎలాగైనా ఆ కుర్రాణ్ణి మోటివేట్ చేసి పట్టాల మీదకు తీసుకెళ్దామనుకున్నా. ముసలాడు పడనివ్వలేదు’’ తిట్టుకున్నాడు మధ్యస్థుడు. ‘‘నేను కూడా.. మలుపులో ఎవరైనా దొరక్కపోతారా అని కూర్చున్నాను. ఆ ముసలి పీనుగ కళ్లన్నీ మలుపు మీద, నా మీదే ఉన్నాయి’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అడుగో మళ్లీ ఇటే వస్తున్నాడు చూడు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘అవునవును ఇక రాత్రంతా ఇక్కడే డ్యూటీ చేసేస్తాడు..’’ తిట్టుకున్నారు ఇద్దరూ. ‘‘ఏంటి? నా గురించేనా?’ అంటూ వాళ్లను సమీపించాడు వృద్ధుడు. అతడి పక్కన ఆ యువకుడు లేడు. భద్రంగా ఇంటికి పంపించేసినట్లున్నాడు. - మాధవ్ శింగరాజు -
కాటి ఊపిరి
ఊపిరి ఆగాక చివరగా చేరే చోటు అది. కాని ఆ చోటే ఆమెకు ఊపిరి పోస్తోంది. చీకటి, చితి భయపెట్టే స్థలం అది. కాని అక్కడే ఆమె తన బతుక్కి వెలుగు వెతుక్కుంటోంది. తల కొరివి పెట్టే హక్కు, కాటి కాపరిగా ఉండే అధికారంమగవాడికే సొంతం అని లోకరీతి.జన్మనిచ్చే సమయంలో స్త్రీ చేతులు ఉన్నప్పుడు సాగనంపే సమయంలో స్త్రీ చేతులు ఎందుకు ఉండరాదు అని ప్రశ్నిస్తోంది జయలక్ష్మి. గుండె దమ్ము అనే మాట మగవాళ్ల విషయంలోనే వింటూ ఉంటాం. స్త్రీకి గుండె ఉండదనీ అందులో దమ్ము ఉండదని లోక ప్రచారం. ధైర్యంగా చేయాల్సిన పనులు, భయం పుట్టించే క్రతువుల్లో స్త్రీని భాగస్వామ్యం చేయలేదు మన సంస్కృతి. ముఖ్యంగా చావులో, అంత్యక్రియల్లో పురుషులే విధులు నిర్వర్తించాలని స్థిరపరిచి ఉన్నారు. కాటికాపరిగా అనాదిగా మగవాళ్లే ఉంటూ వస్తున్నారు. స్మశానంలో ఉంటూ శవాలతో సహవాసం చేయడం మగవాడికే చేతనైన పని అని నిరూపిస్తూ వస్తున్నారు. కాని జయలక్ష్మి ఈ ఆనవాయితీకి సవాలుగా నిలిచింది. ఈ పని తానూ చేయగలనని నిరూపించింది. అనకాపల్లి గవరపాలెం శ్మశానంలో పదహారేళ్లుగా కాటికాపరిగా ఉన్న తట్టా జయలక్ష్మి (45) జీవిత గాథ ఆమె మాటల్లోనే.‘‘చనిపోయినవాళ్లు దేవుడి దగ్గరకు వెళతారని పెద్దలు అంటారు. దేవుడితో ముడిపడిన ఈ పని ఎంతో పుణ్యమైన పని అని నేననుకుంటాను. చనిపోయినవారు సక్రమంగా దేవుని దగ్గరకు చేరుకోవడానికి కాటికాపరులు సాయం చేస్తారు. జీవుడు ఈ కట్టె మీద మమకారం పూర్తిగా వదులుకునేందుకు శరీరాన్ని దహనం చేసే పని మాది. ఆ పని అందరూ చేయలేరు. రాసి పెట్టిన వారికే ఆ పుణ్యం దక్కుంది’’ అందామె. భయం నుంచి బయటపడి... ‘‘మాది ఈ ఊరే. మా అమ్మా నాన్న చేతనైన పని చేసి మమ్మల్ని సాకేవారు. మా ఇళ్లల్లో కాటికాపరి పని ఉంది. ఊరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని శారదా నది ఒడ్డు శ్మశానంలో మా పెద మావయ్య తట్టా కొండయ్య కాటికాపరిగా పని చేసేవాడు. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు కాటి కాపరిగా ఉన్న ఆయనకు చద్ది అన్నం పట్టుకెళ్లేదాన్ని. అంతి చిన్న వయసులో శ్మశానమంటే ఎవరికైనా భయమే. నాక్కూడా చాలా భయం వేసేది. ఒకరోజున మామయ్య నాకు చిన్న పని అప్పగించాడు. దూరంగా ఉన్న నూతి గట్టు దగ్గరి నుంచి బకెట్ తీసుకురమ్మన్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం. మంచి ఎండ ఉంది. శ్మశానంలో మా మావయ్య, నేను తప్ప ఎవరం లేము. మావయ్య చెప్పాడని గుండె చేతబట్టుకుని బిక్కుబిక్కుమంటూ నూతి దగ్గరకు వెళ్లాను. వెనుక నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది.కాళ్లు ఒణికాయి. అంతే భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పి కళ్లు తిరిగి పడిపోయాను. దాంతో మా ఇంట్లో నా చేత చద్ది పంపే పని మానుకున్నారు. కాని దేవుడి లీల చూడండి. ఎక్కడైతే నేను భయపడ్డాను అక్కడే బతికే ధైర్యం ఇచ్చాడు’’ అందామె. పెళ్లి తర్వాత బాధ్యత ‘‘నాకు పద్నాలుగేళ్లు వచ్చాక నూకేశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటికి గవరపాలెం స్మశానవాటికి కాటికాపరి పని మా బావగారు చేస్తూ ఉన్నారు. కాని ఆయన ఆ పని మానుకుని బేల్దారు మేస్త్రిగా పని వెతుక్కున్నాడు. తరాలుగా వస్తున్న పని కదా ఎందుకు వదులుకోవాలి అని నా భర్త ఆ పని తీసుకున్నాడు. అప్పటికి నాకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. జీవితం బాగానే ఉందనిపించేది. కాని సరిగ్గా 16 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా నా భర్త చనిపోయాడు. నన్ను నా పిల్లలను గతి లేని వాళ్లను చేసి వెళ్లిపోయాడు. మేము ఎలా బతకాలి. బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను’’ అందామె. శివయ్యకు మొక్కి ‘‘రోజూ ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్మశానంలోనే ఉంటాను. ఉదయం శ్మశానం తలుపులు తీయగానే శివునికి మొక్కుతాను. ఆ తరవాత పరిసరాలను శుభ్రం చేస్తాను. పిచ్చిమొక్కలను తొలగిస్తాను. ఎవరయినా చనిపోతే శవాన్ని కాల్చడానికి కర్రలు పేరుస్తాను. తల కొరివి పెట్టి అయినవాళ్లు తప్పుకున్నాక శవం చివరి వరకూ కాలేదాకా జాగ్రత్త తీసుకుంటాను. శవాన్ని కాల్చేటప్పుడు ఒక్కోసారి చమురు ఎగిరి ఒంటి మీద పడుతుంది. అయినా బెదరకుండా ధైర్యంగా పని పూర్తి చేస్తాను. ఒక్కోసారి కాలుతున్న శవం అమాంతం ఎగిరిపడుతుంది. ఏ మాత్రం జంకు లేకుండా కర్రతో అదుముతూ శవ దహనం పూర్తి చేస్తాను. అర్ధరాత్రి వేళ ఒంటరిగా అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వెళుతుంటే అందరూ ఒక రకమైన ఉద్వేగంతో చూస్తుంటారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. తొలి రోజుల్లో మా అమ్మ చాలా భయపడిపోయేది. నేను ఇంటికి రావడం ఆలస్యమైతే వణికిపోయేది. కాని నా ధైర్యం చూసి మానుకుంది. నన్ను చూసి కొందరు ఆడవాళ్లు గర్వపడుతుంటారు. కొందరు బెరుకుపడతారు. అందరి పనిలాగా నాదీ ఒక పనే అని అర్థం చేసుకుంటే ఇదంతా ఏమీ ఉండదు’’ అందరూ చేరాల్సింది అక్కడికే ‘‘మనం ఎక్కడ పుట్టినా చివరికి చావు తప్పదు. తల్లి ఒడిలో పుట్టిన మనం శివయ్య తండ్రి ఒడిలోకి చేరాల్సిందే. ఈ పదహారేళ్లుగా రోజుకి కనీసం ఒక్క శవాన్నయినా చూస్తున్నాను. అర్ధాయుష్కుతో ఎవరైనా పోయినప్పుడు మాత్రం చాలా బాధ పడుతుంటాను. ఆ రోజంతా అన్నం తినలేకపోతాను. చిన్నప్పుడు కథలు వినేటప్పుడు అందరిలాగే నాకు కూడా శ్మశానం అంటే భయమేసింది. ఇప్పుడు శ్మశానమే ఆవాసంగా మారింది. ఈ పనిలో ఒక వేదాంతం అలవడుతుంది. అత్యాశ చచ్చిపోతుంది. అందరూ పోయేవాళ్లమే అయినప్పుడు మంచి చేసి పోవడమే మేలనిపిస్తుంది. ఇప్పుడు నా పెద్దకొడుకు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. నెల జీతం నాకు సంతృప్తికరంగానే ఉంది. ఈ పనిలో నేను చేయదగ్గ సేవ చేస్తున్నాను. నా పిల్లలు ఇతర వృత్తుల్లోకి ఇంకా మంచి పనుల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని ముగించారామె. బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను. సంభాషణ: దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి -
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా
పుట్టుకకు చావుకు ఉందా ధర్మం వ్యాధికీ బాధకూ ఉందా మతం నీటికీ నిప్పుకూ ఉందా భేదం మనుషులందరికీ అంతిమంగా ఉండాల్సింది సంస్కారం... ఆ యువతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది... కట్టుకున్న భర్తతోపాటు, మామ కూడా మంచానికే పరిమితమైనా.. మొక్కవోని దీక్షతో వారిద్దరికీ సపర్యలు చేస్తూ... ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి, వారిద్దరి వైద్యానికి ఖర్చు చేసింది. ఈ కష్టానికి ముప్పులా ఆదివారం (అక్టోబర్ 21) ఆమె మామ మృతి చెందాడు. మృతదేహాన్ని తమ సొంతింటికి తీసుకురాగా, దానిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అడ్డుగా నిలిచాడు. శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఏకమై, వారి బాకీని వారంలోగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో, మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ తర్వాత ఆ యువతే కొడుకులా నిలిచి, హిందూ ధర్మం ప్రకారం తానే బద్దె వేసుకుని, కాటివరకూ వచ్చి, శ్మశానంలో తన మామకు తలకొరివి పెట్టింది. టీవీ సీరియళ్లలో దుర్మార్గమైన కోడళ్లను చూపుతున్న ఈ కాలంలో ఈ కోడలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏం జరిగింది? గూడూరు గమళ్లపాళానికి చెందిన పర్వతాల రమణయ్య, రమణమ్మల ఏకైక కుమారుడు శ్రీనివాసులు. తండ్రి రమణయ్య చెన్నై దుకాణదారులకు అవరసమైన వస్తు సామాగ్రిని తీసుకొచ్చి అందజేస్తూ సీజ వ్యాపారం చేస్తుండేవారు. శ్రీనివాసులు కూడా తండ్రికి చేదోడుగా, అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి అవసరమైన వారికి సామాగ్రిని తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం తల్లి రమణమ్మ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. దాంతో తండ్రి బాగోగులు కొడుకు శ్రీనివాసులు ఒక్కడే చూసుకుంటూ ఉన్నాడు.రెండేళ్ల క్రితం శ్రీనివాసులుకు రెహానా అనే యువతితో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టిన రెహానా ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. అయితే ఏడాది క్రితం రమణయ్యకు కూడా క్యాన్సర్ వ్యాధి సోకింది. కొత్త కోడలు మామ సేవలను చూసుకుంటూ ఉండగా, శ్రీనివాసులు సీజ¯Œ వ్యాపారం చేస్తూ ఇల్లు లాక్కొచ్చేవాడు. విధికి అంతటితో సంతృప్తి కలగలేదు. మూడు నెలల క్రితం శ్రీనివాసులు కూడా అనారోగ్యానికి గురయ్యాడు.రోజురోజుకూ శుష్కించిపోతూ మంచం పట్టాడు. దీంతో రెహానాకు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. డబ్బు అవసరమయ్యింది. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి తాముంటున్న ఇంటిని తాకట్టుపెట్టి 3 లక్షలు తీసుకుని, భర్తతోపాటు, మామకూ వైద్యం చేయిస్తూ బతుకుబండిని లాక్కురాసాగింది. ఇంతలో మరో అశనిపాతం. ‘‘ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేయాల్సిందే’’నని ఇంటిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కరాఖండీగా చెప్పాడు. చేసేదిలేక రెహానా, తన మామ రమణయ్యతోపాటు, శ్రీనివాసులును తీసుకుని నెల్లూరుకు వెళ్లి, అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని, ఉన్న కాస్త డబ్బుతో మామ, భర్తలకు వైద్యం చేయిస్తూ బతుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో, తిరుపతికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రమణయ్య ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో రెహానా బతుకులో చీకట్లు మరింత చిక్కనయ్యాయి. ఒకవైపు మంచంలో ఉన్న భర్త, మరోవైపు మృతి చెందిన మామ... చేసేది లేక నెల్లూరులోని అద్దె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్తే రానివ్వరని, అంబులెలో గూడూరుకు తీసుకొచ్చింది. తాము తాకట్టుపెట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చి ఉన్నారని తెలియడంతో, రమణయ్య పార్ధివ దేహాన్ని ఎక్కడ ఉంచి అంత్యక్రియలు చేయాలా... అని ఆందోళనకు గురైంది. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నవారికి సంగతి తెలిసింది. వారంతా రమణయ్య మృతదేహాన్ని సొంతింటికే తీసుకురావాలని సలహా ఇచ్చారు. దాంతో మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఈలోగా ఇల్లు తాకట్టుపెట్టుకున్న వ్యక్తికి సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించనంటూ తలుపునకు అడ్డుగా నిలుచున్నాడు. అది న్యాయం కాదంటూ కొందరు చెప్పిచూశారు. కొంత వాగ్వివాదం జరిగాక కూడా ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ససేమిరా అన్నాడు. ఆ ఇంటి పక్కనే రమణయ్య సోదరులూ ఉన్నారు. ‘‘మీరైనా ఇంట్లోకి రానివ్వ’’మంటూ రెహానా ఎంతో ప్రాధేయపడింది. అయినా వారికి కనికరం కలగలేదు.మా ఇంట్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా కలసి, ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వారిపై ఎలాంటి కనికరం చూపించకుండా, తానేమీ చేయలేనని పోలీసు కేసు పెట్టుకోండంటూ పంపేశారు. దీంతో చేసేది లేక, అర్ధరాత్రి వరకూ ఆ ఇంటి బయటే మృతదేహాన్ని ఉంచారు. దాంతో ఆ ఇంట్లో అద్దెకున్నవారు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తాకట్టుపెట్టుకున్న వ్యక్తి మాత్రం తాను వెళ్లిపోకుండా గడియపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ల మనసు కరిగింది. వారు అతడిని పిలిచి... ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని, ఇలా శవాన్ని బయట ఉంచడం బాగుండదని, ఈలోపు తమదీ పూచీ అని హామీ ఇవ్వడంతో శవాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా ముస్లిం యువతి అయిన రెహానా తన మామకు సోమవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆమే కుమారుడిలా బద్దె వేసుకుని, ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకూ వెళ్లింది. అక్కడ హిందూ ధర్మం ప్రకారం తానే తలకొరివి పెట్టి, అంత్యక్రియలు జరిపించింది. మధ్యలో దింపుడు కళ్లం వద్ద కూడా మామ పేరును తానే మూడుసార్లు పిలవడం, అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇదిరా ప్రేమంటే. కలసిన మనసులకు ఉదాహరణ ఆ దంపతులేరా’’ అంటూ రెహానాను చూసి కంటతడి పెట్టారు. ఆ సంఘటనకు చలించిపోయిన ఆ ప్రాంతంలోని వారంతా కూడా సాయం అందించి రెహానాకు బాసటగా నిలిచారు. యావత్ స్త్రీ జాతికే రెహానా ఆదర్శమంటూ కొనియాడారు. దాతలు ముందుకొచ్చి ఆ త్యాగమూర్తికి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, సాక్షి, గూడూరు -
ఈ శ్మశానానికి ఏమైంది
ఆ శ్మశానంలో... సినిమాల్లో చూపించినట్లుగానే ఒక పెద్ద ఊడలమర్రి ఉంది. దీనికి పాతిక అడుగుల దూరంలో ఒక పుట్ట ఉంది. ఆ పుట్టకు చాలా దగ్గర్లో ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో నుంచి లేచిన అస్థిపంజరం, సమాధిపై కూర్చొని ఏదో పెద్దగా అరుస్తున్నాడు.ఆ అరుపులు విని చుట్టుపక్కల సమాధుల వాళ్లు దగ్గరికి వచ్చారు.‘‘ఏమోయి నూకరాజూ...ఎప్పుడూ సైలెన్స్ మోడ్‌లో ఉండేవాడివి.ఇవ్వాలేమిటీ రకరకాల రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి’’ అని అడిగాడు పక్క సమాధాయన. (సమాధి+ ఆయన)‘‘అయాం వెరీ బోర్డ్ యార్. ఈ శ్మశానంలో చాలా బోర్ కొడుతుంది’’ అసంతృప్తిగా అరిచాడు నూకరాజు.‘‘నెలరోజుల క్రితం వచ్చిన నువ్వే ఇలా అంటే....ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన నేనెంత బోర్‌గా ఫీల్ కావాలి? థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.... సర్దుకుపో నూకరాజు’’ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు వెనక సమాధాయన.‘‘నూకరాజు మన మనసులో మాటను తన మాటగా చెప్పాడు. నిజానికి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం బోర్‌గా ఫీలవుతున్నాం. ఏదైనా చేయాలి! కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి’’ అని పట్టుదలగా అన్నాడు నూకరాజు ముుందు సమాధాయన.‘‘బయట సభ్య సమాజంలో ఉన్నట్లే... మనకూ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండాలి. బార్లు ఉండాలి. బ్యూటీ పార్లర్లు ఉండాలి. పేకాట క్లబ్‌లు ఉండాలి. టీవీ సీరియల్స్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అసలు మనకంటూ ఒక ప్రెసిడెంట్ ఉండాలి’’ అన్నాడు నూకరాజు.‘ప్రెసిడెంట్’ అనే మాట వినబడగానే శ్మశానంలో ఉత్సాహం పొంగి పొర్లింది. ‘‘ఇంత పెద్ద శ్మశానానికి నేను ప్రెసిడెంట్ అయితే...ఆ మజానే వేరు...ఆ రెస్పెక్టే వేరు’’ అని ఎవరికి వారు రహస్యంగా మనసులో అనుకున్నారు.ఆ మరుసటి రోజే... ఎన్నికల ప్రకటన వెలువడింది.‘ప్రపంచ శ్మశాన చరిత్రలోనే ఇదో అరుదైన అవకాశం.ఈ శ్మశానానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వండి.శ్మశానాన్ని స్వర్గంగా మార్చండి.ఈ సవాలు స్వీకరించడానికి మీలో ఎవరు రెడీ?’....పెద్ద పెద్ద అక్షరాలతో ఊడల మర్రి కాడలకు కట్టిన ఈ బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది.శ్మశానంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1872.ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నవారి సంఖ్య 1872.???!!!!అందరూ పోటీలో నిలబడితే మరి ఓటేసే వాళ్లు ఎవరు?ఎవరి ఓటు వాళ్లు వేసుకుంటే...గెలిచేవారుండరు...ఓడే వారుండరు! ఇలా అయితే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది కాబట్టి శ్మశాన పెద్దలు ఒకఐడియా ఆలోచించారు.ఎలక్షన్లో అయిదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఈ అయిదుగురిని ఎంపిక చేశారు.రెండో రోజు పొద్దున ఎనిమిదింటికే పోలింగ్ మొదలైంది.పోలింగ్ మొదలైన పదినిమిషాలకు గొడవ మొదలైంది.అస్థిపంజరాల గుంపు ఒకటి... ఒక సింగిల్ అస్థిపంజరాన్ని పట్టుకొని చావబాదుతుంది.‘‘ఎందుకు వాడ్ని అలా చావ బాదుతున్నారు? ఏమైంది?’’‘‘అసలు వీడు మన శ్మశానపోడే కాదు. దొంగ ఓటు వేస్తున్నాడు’’‘‘ఇక్కడ నీకేం పనిరా?’’‘‘మా ఫ్రెండ్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు కదా అని దొంగ ఓటు వేయడానికి వచ్చాను. బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను. నన్నుక్షమించండి’’‘‘క్షమించాలట...క్షమించాలి...వీడి పుర్రె పగలగొట్టండ్రా’’‘‘ఇప్పటి వరకు వీడిని కొట్టింది చాలు...వదిలేయండి. ఇకముందు ఎప్పుడైనా ఇక్కడ కనిపిస్తే నీ ఎముకలు సున్నం చేసి రథం ముగ్గు వేస్తాం’’ఒక గంట తరువాత... ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అయిదుగురిలో ముగ్గురు ధర్నాకు దిగారు. ‘నశించాలి...నశించాలి’‘డౌన్ డౌన్ డౌన్’.... ఇలా రకరకాల నినాదాల మధ్య ఆ ముగ్గురిలో ఒకరు ఆవేశంగా మైక్ అందుకొని...‘‘ఇంత దుర్మార్గంగా, అక్రమంగా నియంతల దేశాల్లో కూడా ఎలక్షన్లు జరగవు. ఈ ఎలక్షన్లో ఇవియం మెషిన్ల ట్యాంపరింగ్ జరిగింది. ఈ ఎలక్షన్‌ను రద్దు చేసి రీపోలింగ్ జరిపించాలి’’ అని డిమాండ్ చేశాడు.ఈవీయం ట్యాంపరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఒక సబ్ కమిటీ ఏర్పటైంది. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసింది.‘ఈవీయం ట్యాంపరింగ్’ జరిగింది నిజమేనని ఆ రిపోర్ట్ చెప్పడంతో ఎలక్షన్ రద్దయింది.మరుసటి రోజు రీపోలింగ్ మొదలు కావడానికి ముందే...క్రికెట్ బ్యాట్లు, హాకీ బ్యాట్లు, సైకిల్ చైన్లు, సోడాలు, కూల్ డ్రింక్ బాటిళ్లతో... అస్థిపంజరాల బ్యాచ్ ఒకటి శ్మశానంలోకి వచ్చింది.‘‘నిన్న ఎవడ్రా మావాడిని కొట్టింది?’’ అడిగాడు ఆ బ్యాచ్‌లోని ఒక అస్థిపంజరం.‘‘ఆ మూలన నిల్చున్నాడే....వాడే అన్నా నన్ను చావబాదమని ఆర్డర్ వేసింది’’ ఏడుస్తూ అన్నాడు నిన్న తన్నులు తిన్న అస్థిపంజరం.అంతే...‘ఎటాక్’ అంటూ...ఆయుధాలతో వచ్చిన అస్థిపంజరాల గుంపు ఒక మూలన ఉన్న అస్థిపంజరంపై పడింది.‘‘రేయ్ మనోడ్ని కొడుతున్నారు.. మనలో మనకు ఏవైనా తగాదాలు ఉంటే రేపు చూసుకుందాం. ఆ పీనుగల అడ్డ çశ్మశానపోళ్లను తరిమికొట్టండ్రా’’ అని ఒక అస్థిపంజరం అరిచాడు.బొందల గడ్డ, పీనుగుల అడ్డ శ్మశాన వర్గాల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఆరోజు మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు శ్మశానాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. ఆ శ్మశానంలో వాలిన రాబందు ఈ çశ్మశానంలో వాలడం లేదు.ఒకరోజు నూకరాజు గుక్క పట్టి ఏడుస్తున్నాడు.‘‘ఏమైంది?’’ అని అడిగాడు పక్క సమాధాయన.‘‘బుద్ది తక్కువై ఆరోజు ఏదో వాగాను. సభ్యసమాజంలో ఉన్నట్లే మన శ్మశానంలోనూ ఉండాలన్నాను. ఆనాటి నిశ్శబ్దమే చాలా గొప్పగా ఉంది’’ అని నూకరాజు అన్నాడో లేదో...‘‘రేయ్ ఆ పీనుగల అడ్డోళ్లు మళ్లీ వస్తున్నారు. లేవండ్రా’’ అన్న అరుపు పెద్దగా వినిపించింది! – యాకుబ్ పాషా -
శివుడు శ్మశానవాసి అని ఎందుకంటారు?
‘అరిష్టం శినోతి తనూకరోతి’ అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి... ఇలా దేనికీ చలించవు. ఎవరు ప్రతి కర్మను (పనిని) కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖ దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనులు సక్రమంగా, అనుకున్న కాలానికన్నా ముందే, మరింత గొప్పగా పూర్తి చేయగలుగుతాం. అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైనా, ఎంత తప్పించుకుందామన్నా ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్థం. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు. అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని, శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు... -
కాటికాపరి...యశోద...
బొమ్మనహళ్లి : స్మశానంలో అంత్య సంస్కారాలను కాటికాపరి నిర్వహిస్తారనేది జగద్వితమే. అయితే తుమకూరులోని గార్డెన్ రోడ్డులో ఉన్న స్మశానంలో ఓ మహిళ ఈ విధులను నిర్వర్తిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆర్య వైశ్య బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ రుద్ర భూమిలో యశోద రాత్రి 11 గంటల వరకు ఈ విధుల్లో ఉంటారు. నెలకు సుమారు 20 శవాలకు సంస్కారాలను నిర్వహిస్తున్న ఈ ధీశాలి గురించి.... యశోద భర్త గూళయ్య తొలుత ఇక్కడ కాటికాపరిగా ఉండేవారు. అనారోగ్యం కారణంగా ఆయన మృత్యువాత పడడంతో భర్త విధులను తాను స్వీకరించింది. భర్త చనిపోయే నాటికి ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బతుకు బండిని లాగడానికి తానే కాటికాపరిగా పని చేస్తానంటే సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ మహిళ ఈ పని చేస్తుందా...అసలు మన ఆచారం ప్రకారం మహిళలు స్మశానంలో అడుగే పెట్టకూడదు. అలాంటిది కాటికాపరిగా పని చేస్తుందా...అనే ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. అందరూ ఆచారాల గురించి మాట్లాడే వారే కానీ...ఆమె ఇద్దరు పిల్లల పోషణ గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఆ పిల్లల కోసమే తాను రెండేళ్ల కిందట కాటికాపరి విధులను చేపట్టాల్సి వచ్చిందని యశోద వివరించారు. అన్నీ తానై...... అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ యశోద పూర్తి చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు....అంతిమ సంస్కారానికి అవసరమైన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. అయితే చితి మంటలు చల్లారే దాకా శవం పూర్తిగా కాలేదాకా...యశోద దగ్గరుండి చూసుకుంటారు. మగాడి లాగా యశోద భయంగొలిపే ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నా నెలకు ఆమెకు దక్కేది కేవలం రూ.2 వేలే. అంత్య సంస్కారాలకు హాజరయ్యే మృతుని తాలూకా వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా వెళ్లిపోవచ్చు..గ్యారంటీ లేదు అని యశోద చెబుతారు. అయితే తన ఇద్దరి పిల్లల చదువు సంధ్యలకు తనకీ పని తప్పదని అంటారు. భర్త నుంచి సంక్రమించిన ఈ ఉద్యోగం తనకు పూర్తి సంతృప్తినిస్తోందని తెలిపారు. అంత్య సంస్కారాల్లో తానూ పాలు పంచుకున్నాననే తృప్తీ మిగులుతోందన్నారు. త్వరలోనే ఇక్కడ విద్యుత్ స్మశాన వాటికను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ తర్వాత ఈ ఉద్యోగం ఉంటుందో...ఊడుతుందో తెలియడం లేదని యశోద ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఏర్పాటు చేసినా తనకిక్కడ ఓ చిరుద్యోగమైనా ఇవ్వాలని ఆమె నగర పాలికె అధికారులకు విజ్ఞప్తి చేశారు.