climate changes
-
Nature Geoscience: అంటార్కిటికాలో ‘కరిగిన నీటి’ ముప్పు
లండన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు జల సమాధి కావడం తథ్యమన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్కిటికా సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంటార్కిటికా మంచు కొండలపైనా, అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం(స్లష్) గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని తేల్చారు. అంటార్కిటికాలో వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కరిగిన నీరు 57 శాతం స్లష్ రూపంలో, మిగతా 43 శాతం చెరువులు, కుంటల పైభాగంలో ఉన్నట్లు గుర్తించారు. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్కిటికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పుటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది. -
అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !
మనకు ఆరు ఋతువులు వసంత ( spring ), గ్రీష్మ ( summer ), వర్ష ( monsoon ), శరద్ ( autumn ), హేమంత ( winter ), శిశిరాలు. ప్రకృతిపరంగా వచ్చే కాలాలు మూడు ఎండ, వాన, చలి. అమెరికా వాతావరణంలో మాత్రం కొంత తేడా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్ - ( మార్చ్ నుంచి మే వరకు) సమ్మర్ సీజన్ - ( జూన్ నుంచి ఆగష్టు వరకు) ఆటమ్/ ఫాల్ సీజన్ - ( సెప్టెంబర్ - నవంబర్ వరకు) వింటర్ సీజన్ - ( డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య) నేను ఆగష్టులో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజీల్స్ కొంతకాలం ఉన్నాను. సరదాగా క్రిస్మస్ సెలవులు పిల్లలతో గడుపుదామని మా అమ్మాయి ఉంటోన్న డల్లాస్‌కు వెళ్లాం. అందులోనూ తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ఒక కమ్యూనిటీ రిచ్ వుడ్ కు వెళ్ళాం. టెక్సాస్ రాష్ట్రంలో నున్న పెద్ద నగరాల్లో డల్లాస్ ఒకటి. గతంలో స్పెయిన్, ఫ్రెంచ్, మెక్సికో పాలన చూసిన ఈ నగరం 1845 లో మాత్రమే అమెరికాలో భాగమైంది. దీని జనాభా సుమారు 12 నుంచి 13 లక్షల్లో ఉంటుంది. దాదాపు 10 శాతం జనాభా భారత ఉపఖండం నుండి వచ్చినవారే కావడం విశేషం. తీవ్రమైన ఎండలు, భరించరాని చలి, ఉరుములతో కూడిన వర్షాలు , టోర్నడో సుడిగాలులు డల్లాస్‌లో మామూలేనంటారు. అక్కడ డిసెంబర్ రెండో వారంలో వచ్చిన మంచు తుఫాను ( Ice storm )తో జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది. డల్లాస్ ఫోర్ట్ వద్ద ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే విమానాలు చాలా వరకు రద్దయ్యాయి. నిత్యావసర, అత్యవసరాల వాహనాలే బయట రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనదేశం హిమాలయాలకు సమీప రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోనే ఇలాంటి వాటి గురించి వింటుంటాం. ఇంట్లో ఎంత సేపుంటాం? బయటకు వెళ్లలేని పరిస్థితి. డల్లాస్‌లో ఏక ధాటిగా కురుస్తున్న మంచుతో.. రోడ్లు ,ఇండ్ల కప్పులు నిండిపోయాయి. ఆకాశం నుంచి మేఘాలు నేలవాలినట్లు అనిపించింది. బయట అడుగు పెడితే జారిపడతామన్నట్లు ఉంది. కాస్త పెద్ద టైర్లున్న వాహనం అయితే గాని ఆ మంచు పలకల మీద స్లిప్ కాకుండా ఉండలేదు. ఏ పనికోసమైనా.. సాయం లేకుండా వెళ్లే అవకాశం లేకపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఇంటి పైకప్పు ,కిటికీ చూరుల నుంచి కిందికి జారుతున్న మంచు కాస్తా.. మనం పండగలకు కట్టుకున్న తోరణాల్లా, ప్రకృతి గీసిన మోడరన్ ఆర్ట్ లా అనిపించాయి. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లకు ఇదంతా కొత్త. మరి అక్కడే ఉండే వారికి దాంట్లో కూడా వినోదం వెతుక్కుంటారు. అంతటి చలిలో కూడా పిల్లలు ఇండ్ల ముందు ఐస్‌తో ఆడుకోవడం, పెద్దలు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం చూస్తుంటే.. ఎక్కడి వారికి అక్కడ హాయిగానే ఉంటుందనిపించింది. వాతావరణాన్ని బట్టి అలవాట్లు మారతాయన్నది నాకు ఇక్కడ తెలిసిన మరో విషయం. అమెరికాలో ఎక్కడికెళ్లినా.. టాయిలెట్లలో పేపర్లే వాడతారు. మన దగ్గర అందరూ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకుంటారు. కానీ అమెరికాలో పేపర్ ఎందుకని మొదట్లో అర్థం కాలేదు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కానీ.. చలికాలంలో అక్కడ నల్లా పైపుల్లో నీరు గడ్డ కట్టుకుపోవడం సాధారణం. అందుకే అంతా టాయిలెట్ పేపర్లు అలవాటు చేసుకున్నారు. ఇక తాగేనీళ్ల కోసం ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటే గానీ గొంతు తడుపుకోలేరు. అన్ని ఇళ్లు సెంట్రలైజ్డ్ ఏసి ఉంటాయి. చలికాలం వచ్చిందంటే రూం హీటర్ల వేడిలో గడిపేస్తారు. అలాగే ఎండాకాలంలో భరించలేనంత వేడి, ఉక్కపోత ఉంటుంది. ఓ రకంగా అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి. ఇక్కడ ఒక్కరోజు కరెంటు పోయినా.. పరిస్థితులు తారుమారే. ఏం చేస్తారో.. ఎలా చేస్తారో తెలియదు గానీ.. నేనున్నన్నీ రోజుల్లో ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదు. ఎంత పెద్ద ఐస్ స్టార్మ్ వచ్చిన పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉండడం గొప్ప విషయం. విమానాల రాకపోకలు మెరుగు అయ్యాయని తెలిసాక ముల్లె మూటా సర్దుకొని లాస్‌ఏంజీల్స్ బాట పట్టాం. పెనం మీది నుంచి పోయిలో పడ్డట్టు మంచు కురవకున్నా అప్పుడు లాస్ ఏంజీల్స్లో కూడా తీవ్రమైన చలి ఉంది. అందుకే అమెరికా ఎంత అభివృద్ధి చెందినా.. మేరా భారత్ మహాన్ అనుకున్నా మనసులోనే ! వేముల ప్రభాకర్ (చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!) -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
2023 పాఠాలు... 2024 ఆశలు
2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఒకపక్క కృత్రిమ మేధ, మరోపక్క రాజకీయ పరివర్తన జోరుగా సాగుతున్న ఈ ఏడాది మనకు మిగిల్చిన జ్ఞాపకాలేమిటి? ప్రపంచం పట్టు తప్పిపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జీపీటీ–4 రావడం ఈ ఏడాది అత్యంత కీలకమైన పరిణామం.ఇక నుంచి కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో 2024ను ఊహించుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న ప్రత్యేక పరిస్థితులు మరిన్ని యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అయితే, వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ‘కాప్’ సమావేశాల్లో అంగీకారం కుదరడం శుభపరిణామం. చాలా దేశాల పౌరులు హ్రస్వదృష్టితో కూడిన జాతీయవాదానికీ, తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసే నేతలకూ పగ్గాలు అప్పగించారు. కోవిడ్–19 పరిస్థితులు ప్రచండంగా ఉన్న సమయంలో టీకాల పేరుతో జాతీయ వాదం ప్రబలింది. ఇదెంత సంకుచితమైనదో ఆ తరువాత కానీ అర్థం కాలేదు. ఇది సాటి మానవుడి బాధను కూడా మరచిపోయేలా చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నా ఎవరికీ పట్టకపోవడం కూడా దీనికి మరో నిదర్శనం. అదుపులేని హింసకు కొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ ఆజ్యం పోస్తున్నాయి. వేగంగా వృద్ధి చెందు తున్న ఈ టెక్నాలజీలు మానవాళి నిశ్చేష్టతకూ దారితీస్తున్నాయనడంలో సందేహం లేదు. కల్పనకూ, వాస్తవానికీ తేడాలు చెరిగి... ఈ ఏడాది మార్చిలో ఓపెన్ ఏఐ జీపీటీ–4ను విడుదల చేసింది. ఇది కాస్తా రక్తమాంసాలతో కూడిన వాస్తవానికీ, కల్పనకూ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేస్తోంది. ఈ డిజిటల్ వాస్తవాన్ని మన అనలాగ్ బుర్రలు ఎలా అర్థం చేసుకోగలవు? 2023 మొత్తమ్మీద అత్యంత కీలకమైన పరిణామం ఇదే అనడం అతిశయోక్తి కాబోదు. 2024లోనే కాదు... ఆ తరువాతి కాలంలోనూ మన జీవితాలను మార్చేసే పరిణామం. జీపీటీ–4 లాంటివి మన జియోపాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ‘‘టెక్నాలజీ అనేది భౌగోళిక రాజకీ యాలపై ప్రభావం చూపడం కొత్త కాకపోయినా, కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో పరిస్థితి సమూలంగా మారనుంది. కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది’’ అని ఓ విశ్లేషకుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రస్తుతం కృత్రిమ మేధే అతిపెద్దది. దీని నియంత్రణ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లో అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేదు. నియంత్రించే శక్తీ లేదు. నియంత్రించాలన్నా ప్రభుత్వాలు ఈ కంపెనీలపైనే ఆధార పడాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలు చాలాకాలంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై గట్టి నియంత్రణ పాటిస్తూ వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. బహుశా చైనా ఈ కృత్రిమ మేధను ఇతరుల కంటే మెరుగ్గా నియంత్రించగలదేమో. కానీ అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధను కూడా తమ పార్టీ లక్ష్యాల సాధనకు పావుగా వాడు కున్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే అది ప్రపంచంలో అధికార అసమతౌల్యానికి దారితీయవచ్చు. ద్వైదీ భావ పరాకాష్ఠలో ప్రపంచం... మానవాళి సంక్షేమానికి అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో మన ఆలోచనా ధోరణులు మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతున్నాయి. దేశాలకు, ప్రాంతాలకు పరి మితమైపోతున్నాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో బహుముఖీన అంతర్జాతీయ సహకారం, సమష్టి బాధ్యతల పంపిణీతోనే మనం ప్రస్తుత సమస్యలను ఎదుర్కోగలం. సమ న్యాయం పాటించగలం. ప్రస్తుతం ప్రభుత్వాతీత శక్తులన్నింటికీ శక్తి మంతమైన హింసాత్మక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్దాడి దీనికో తార్కాణం. బలహీనులు, నిర్వా సితులు కూడా బలంగా దెబ్బకొట్టగలరు అనేందుకు ఇజ్రాయెల్‌పై దాడి ఒక రుజువు. ఉగ్రవాదంపై పోరు ఇప్పుడిప్పుడే అంతమయ్యేది కాదని 2023 మరోసారి నిరూపించింది. ఈ పోరు ఏకరీతిన లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజ్యాంగాలను పక్కనబెట్టిన అన్ని దేశాలూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, తిరుగుబాట్లను సమర్థంగా అణచివేసిన సంఘటనలు చరిత్ర మొత్తం వెతికినా కనిపించవూ అని! చిన్న రాపిడి మళ్లీ నిప్పు పుట్టించడం ఖాయం. ఫలితం తీవ్ర నష్టం, హింస. రాజకీయం ద్వారా హింసను చట్టబద్ధం చేయడం ఎంతమాత్రం తగని పని. అమాయ కులు, మహిళలు, పిల్లలను చంపివేయడాన్ని కూడా సమర్థించే లక్ష్యం ఎంతటి ఉదాత్తమైనదైనా సమర్థనీయం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. హింసను ఆయుధంగా వాడుకోవడం ఎప్పుడూ పులి మీద స్వారీ లాంటిదే. హింస మొదలైతే అది కేవలం తాము ఉద్దేశించిన లక్ష్యాలకే పరిమితమవుతుందని అనుకోలేము. హింస అటు ఆక్రమణదారులనూ, ఇటు బాధితులనూ రాక్షసుల్లా మార్చేస్తుంది. ఈ సత్యాన్ని చాలాకాలం క్రితమే మహాత్మగాంధీ బాగా అర్థం చేసు కున్నారు. ‘అహింస’ భావన ఈ ప్రగాఢమైన అవగాహన నుంచి పుట్టిందే. గాంధీ మాటలను మనం ఎంత విస్మరిస్తామో ప్రపంచంలో అంతేస్థాయిలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒక్క సానుకూల పవనం... ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో చూసిన ఒక సానుకూల అంశం ఏదైనా ఉందీ అంటే అది దుబాయిలో ఇటీవలే ముగిసిన కాప్ సమావేశాలని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మానవాళి జరుపుతున్న కృషిలో భాగంగా జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని ఆశాజనకమైన ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. వీటిని సక్రమంగా అమలు చేయగలి గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామాజిక సుస్థిరత దిశగా మళ్లే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని అందరూ అంగీకరించడం శుభపరిణామం. కృత్రిమ మేధతోపాటు వినూత్నమైన టెక్నా లజీలను అందిపుచ్చుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 2023లో వాతావరణ మార్పుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కల్పించిన ఆశ వచ్చే ఏడాదిలో సఫలీకృతమవుతాయని ఆశిద్దాం. దీన్ని పక్కనపెడితే... ప్రపంచం వచ్చే ఏడాది కూడా కొంత అసందిగ్ధ్దతను ఎదుర్కొంటుందనేందుకు కొన్ని నిదర్శనాలు కనిపి స్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది 2024లోనే. ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. అడ్డంకులు తొలిగి ట్రంప్ పోటీ చేసి గెలిస్తే మాత్రం అగ్రరాజ్యంలో సరికొత్త స్థానిక వాదం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతోపాటు రష్యా ఉక్రెయిన్ జగడమూ వచ్చే ఏడాది మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే విషయంలో అమెరికా కొంత అసందిగ్ధతతో వ్యవహరిస్తూండటాన్ని పుతిన్ గుర్తించక మానడు. తన దాడులను ఉధృతం చేయకుండా ఉండడు. అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలను పర్యవేక్షిస్తూండటం, ఆ దేశంతో మనకున్న సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. పైగా చైనాతో తనకున్న శత్రుత్వాన్ని కొంత తగ్గిగంచుకునే ప్రయ త్నాలు చేయవచ్చు. ఇప్పటికే దీనికి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కారాదని బైడెన్ నిర్ణయించుకోవడం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే క్వాడ్ సమావేశాల వాయిదాను కూడా ఈ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది. కెనెడా ఉగ్రవాది పన్నూ విషయంలో వచ్చిన అభిప్రాయబేధాలూ ఈ ధోరణికి కారణం కావచ్చు. సెప్టెంబరులో విజయవంతంగా నిర్వహించిన జీ20 సమావేశాల ప్రాభవం కాస్తా ఈ పరిణామాలతో తగ్గి పోయింది. మరోవైపు దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రాజకీయ సుస్థిరత 2024లో అంతర్జాతీయ స్థాయిలో మనకు మేలు చేస్తుందని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కాప్ దిశ ఎటువైపు..?
ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది. 2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట. కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్ రాజు చార్లెస్–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు. ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్–3, సునాక్‌లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కాప్ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం. ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్ ఒడంబడిక అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. -
దుబాయ్ పర్యటనలో మోదీ.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(COP28) పేరుతో ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో పాల్గొననున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షతన దుబాయ్‌లో జరగుతున్న ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలు హాజరుకానున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో పోరాడుతున్న దేశాలకు సాయం చేసేందుకు ఓ నిధిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు గురువారం రాత్రి దుబాయ్‌కు మోదీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ మంత్రి, ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అదే విధంగా ఎయిర్‌పోర్టులో ప్రధానికి ప్రవాస భారతీయుల నుంచి సాదర స్వాగతం లభించింది. ప్రధాని హోటల్‌కు చేరుకోగానే ‘మోదీ, మోదీ’, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఎన్నారైలు నినాదాలు చేయగా.. వారికి మోదీ అభివాదం చేశారు. Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ — Narendra Modi (@narendramodi) November 30, 2023 ప్రధాని తన ట్విటర్లో ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(COP28) సమ్మిట్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌లో అడుగుపెట్టాను. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే లక్ష్యంతో కూడిన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ బదిలీ చేయాలని, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వారికి శక్తినివ్వాలి. ప్రవాస భారతీయుల నుంచి గొప్ప స్వాగతం లభించింది. ఇది వారి మద్దతు, ఉత్సాహం తమ శక్తివంతమైన సంస్కృతి, బలమైన బంధాలకు నిదర్శం’ అని పేర్కొన్నారు. చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? وصلت إلى دبي للمشاركة في قمة كوب-٢٨ (COP-28). ونتطلع إلى وقائع القمة التي تهدف إلى خلق كوكب أفضل. pic.twitter.com/WSBo6yZ1ji — Narendra Modi (@narendramodi) November 30, 2023 COP28లో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది ఉన్నత-స్థాయి విభాగం. గ్రీన్హౌస్, ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి ప్రపంచ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీనితో పాటు ప్రధాని మోదీ మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కాగా COP28 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది. -
కాప్–28లో భారత్ భూమిక కీలకం!
వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్దేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకు రావాలని భారత్ కాంక్షిస్తోంది. ఆతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాప్–28 సమా వేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. దీనికి కేంద్రబిందువుగా భారత ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్ దోహదపడుతుంది. గత వారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షంతో యుఏఈలో జనజీవితం స్తంభించిపోయింది. పాఠశాలలు బంద్ అయ్యాయి. పాఠాలు ఆన్లైన్ మార్గం పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. ఒక్కసారిగా ముంచెత్తిన వాన జోరుకు వీధుల్లో కార్లు పడవలయ్యాయి. పౌరుల భద్రతకు అధికార యంత్రాంగం నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే... యుఏఈ, సౌదీ, బెహ్రాయిన్ వంటి దేశాల ప్రజలు నిన్నమొన్నటివరకూ నింగి నుంచి నేలకు జారే వాన చినుకులు చూసేందుకు రుతుపవవాల సీజన్లో ముంబైకి వచ్చేవారు. కేవలం వాన హోరు, జోరులను ఆస్వాదించేందుకు వీరు నరీమన్ పాయింట్, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రాభిముఖంగా ఉన్న ఖరీదైన బంగళాలు, హోటళ్లలో దిగేవారు. 1970లలో బయటపడ్డ ముడిచమురు వారి ఈ విలాసానికి సాయపడేది. వాన చినుకులకు వారు ముఖం వాచిపోయి ఉండేవారు. అయితే అది గతం. ఇప్పుడు వారే భారీ వర్షాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూండటం వైచిత్రి. గాలి మూటలు... నీటి రాతలు... 15 రోజులపాటు కొనసాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28వ సమావేశానికీ, వాతావరణ మార్పులపై జరిగే ఇతర సమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది! ధనిక దేశాలు అనేకం కాప్ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడతాయి. అలివికాని హామీలూ గుప్పిస్తాయి. సమావేశాల తరువాత అన్నింటినీ మరచిపోతూంటాయి. ఇప్పుడు ఆ దేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్య క్షంగా చవిచూస్తున్నాయి. అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మరికొన్ని దేశాలు అసలు సమస్యను కాకుండా, లక్షణాలపై ఎక్కువ దృష్టి పెడతాయి. డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి నాటికి మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై అతడికి నమ్మకం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాలి. గత పాలకులు సంతకం చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకొనేలా చేసిన ఘనత ఆయనదే. రెండేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కాప్–26 సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ కూడా పెద్ద హామీలిచ్చింది. వాతావరణ మార్పులకు మూల కారణాలను వెతికి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత ఏం జరిగిందన్నది వెనుదిరిగి చూసుకుంటే... స్వదేశంలో జరిగిన కాప్–26 సమావేశాలకు వైఫల్యం ముద్ర అంట కూడదనే యూకే అలా ప్రకటించి ఉండవచ్చునన్న అనుమానాలు బల పడుతున్నాయి. యూకేతోపాటు పారిశ్రామిక దిగ్గజ జీ–7 దేశాలన్నీ ఇలాంటి మాటలే మాట్లాడాయి. వాతావరణ మార్పుల సమస్యకు చేసింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి! కాప్–26లో ఇచ్చిన హామీల అమలును మాత్రమే కాదు... 2015 నాటి కాప్–21 అంటే చారిత్రాత్మక ప్యారిస్ ఒప్పందం విషయంలోనూ యూకే వెనకడుగు వేసింది. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్ ఒప్పందం మొట్టమొదటి అంతర్జాతీయంగా అమలు చేయదగ్గ చట్టంగా మారడం గమనార్హం. మొత్తం 196 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్... వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకయ్యే ఖర్చులతో బ్రిటిష్ ప్రజలపై పడే ఆర్థిక భారం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు యూఏఈ ఈ ఖర్చులను భరిస్తానని చెప్పడమే కాదు... సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుబడుల ద్వారా ఇతర దేశాలకూ సాయం చేస్తామని ప్రకటించింది. సమస్యను పరిష్కరించే గాంధేయవాదం 2015 నాటి కాప్ 21 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వాతావరణ మార్పుల విషయంలో నిర్ణయాత్మకంగా మారింది. అప్పటివరకూ సమస్యగా భావించినదే పరిష్కారంలో భాగమైపోయింది. వాస్తవానికి భారత్, కాప్–28కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ రెండూ వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం విష యంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకే ఈ కాప్– 28 సమావేశాల్లో భారత్ పాత్ర కీలకం కానుంది. ప్రపంచ దేశాలన్నీ సమస్య పరిష్కారానికి ఒక్కమాటపై కదిలేలా చేసేందుకూ భారత్ గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జనవరిలో యూఏఈ పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత శాఖ మంత్రి సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్‌ను కాప్–28 అధ్యక్ష స్థానం వరించింది. ఆ వెంటనే ఆయన మొదటగా భారత్ పర్యటనకు విచ్చేశారు. దీన్ని భారత్ మరచిపోలేదు. బెంగళూరులో మాట్లాడుతూ కాప్–28పై జబేర్ తన అంచనాలను వివరించారు. దశాబ్ద కాలంగా అల్ జబేర్ తరచూ భారత్‌కు వస్తూన్నారు. భారతీయ నేతలతో ఆయన సంబంధాలు బాగా తెలిసినవే. అల్ జబేర్ మంత్రి మాత్రమే కాకుండా, అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూపు సీఈవో కూడా. యూఏఈతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రయ త్నిస్తున్న సమయంలో ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మార్చేయ డంలో అల్ జబేర్ కీలకపాత్ర పోషించారు. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ద్వారా భారత్ ఇంధన భద్రతకు గట్టి హామీ కూడా ఇచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ అంశం ప్రస్తుత సమావేశాల్లోనూ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాప్–28 అధ్యక్షుడిగా అల్ జబేర్ మద్దతు ఉండటంతో అంత ర్జాతీయ వాతావరణ మార్పుల చర్చ దిశను నిర్ణయాత్మకంగా మార్చా లని భారత్ కూడా ఆశిస్తోంది. ఆయా దేశాలే కేంద్రంగా సాగుతున్న ప్రయత్నాలను సార్వజనీనం చేసేందుకు భారత్ ప్రయత్నించాలి. దీనికి కేంద్రబిందువుగా మోదీ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరా న్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అల వర్చుకునేందుకు లైఫ్ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి. ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి, వృథా వ్యవహారాలకు చెక్ పడుతుంది. వీటి కారణంగా భూమ్మీద వనరులు కరిగిపోతున్న విషయం తెలిసిందే. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈవో అయిన అల్ జబేర్ ఆ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికీ కృషి చేస్తున్న విషయం చెప్పుకోవాలి. యూఏఈ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్కు ఆయన తొలి సీఈవోగా, తరువాతి కాలంలో చైర్మన్ గానూ పనిచేశారు. ఈ కంపెనీకి దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. కాప్–28లో పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం వైపు ప్రపంచం మళ్లేందుకు అల్ జబేర్ కాలుష్య కారక ముడిచమురు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యూఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చి మాసియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు యూఏఈ వద్ద పుష్కలం. ఈ నేపథ్యంలోనే 2015 నాటి ప్యారిస్ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్ సమావేశాలు మరింత ఫలప్రద మవుతాయని ఆశిద్దాం. - కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Countdown on Health and Climate Change: ఎండ దెబ్బకు ఐదు రెట్ల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భానుడి ప్రతాపం ఇదే మాదిరి పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాజాగా, లాన్సెట్ ‘కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’పై 8వ వార్షిక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు పరివర్తనం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రధానంగా ఈ నివేదిక దృష్టి సారించింది. ఆయిల్, గ్యాస్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రభుత్వాలు, కంపెనీలకు సూచించింది. 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి వచి్చందని పేర్కొంది. ఇందులో 60 శాతానికిపైగా ఘటనలకు మానవ కార్యకలాపాలే బాధ్యత అని తెలిపింది. జీవ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీల తీరును కూడా లాన్సెట్ నివేదికలో ఎండగట్టింది. జల, వాయు సంబంధిత దుష్పరిణామాలను నిలువరించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని లాన్సెట్ కౌంట్ డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరీనా రొమానెలో హెచ్చరించారు. ఎండ తీవ్రత వల్ల వ్యవస్థకు కలుతున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం దెబ్బతినడం వల్ల నీరు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడి, ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేవలం ఎండ తీవ్రత కారణంగా 2041–60మధ్య కాలంలో 52.49కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. 2050 వరకు ప్రాణాంతక వ్యాధుల సంఖ్య పెరగొచ్చని కూడా లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
వాతావరణ మార్పులు.. ముసురుతున్న వ్యాధులు
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు నగరవాసులను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నగరంలో ఈ సమస్యల విజృంభణతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రోజుకు 2 వేల మార్క్‌ను దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ఫలితంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించడానికి గంటల తరబడి ఆలస్యమవుతోంది. ఇక్కడకు రోగులు గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ సమస్యలతోనే వస్తారు. వచ్చేవారిలో దాదాపు 80– 85 శాతం మందికి మందులతోనే సరిపోతుంది. అయినప్పటికీ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని ఈఎన్టీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులే కారణం.. శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వ్యా«ధులు ప్రబలడం సహజమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ భరోసా కల్పిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే రోజుల తరబడి సమస్య ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమ ఆసుపత్రి కరోనాకి ముందు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక్కడికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు తదితర సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులను పరీక్షించేందుకు ఆలస్యం అవ్వడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ విధానం కొంత వరకూ కారణమవుతోందన్నారు. ప్రతీ రోగికి ఆధార్ తనిఖీతో పాటు రోగి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేస్తుండడంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం రోగులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉందన్నారు. -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేధిస్తున్న విపరిణామాలు
వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి. ‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి. ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్‌కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’ – ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్‌నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా! ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు: ‘‘అంటరాని తనంబునంటి భారత జాతి భువన సభ్యత గోలుపోయె... నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయు’’ అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు: ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ పుట్టరాని చోట బుట్టుకతన...’’ ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు! అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భూగోళంపై అత్యంత వేడి దినం.. జూలై 4
వాషింగ్టన్: గత 1,25,000 సంవత్సరాల్లో ఈ ఏడాది జూలై 4వ తేదీ భూగోళంపై అత్యంత వేడి దినంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా ఈ నెల 3వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్దలు కావడం విశేషం. 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 4వ తేదీన ఇది 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్‌హీట్)కు ఎగబాకినట్లు తెలియజేసింది. ఈ ఉష్ణోగ్రతను గణించడానికి మోడలింగ్ సిస్టమ్‌ను 1979 నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం నాటి ఉష్ణోగ్రతను సైతం అంచనా వేయొచ్చు. -
మేఘాలను మరింత మందంగా మార్చేస్తే.. సూర్యకాంతిని అడ్డుకుంటే
వాషింగ్టన్: ఆధునిక యుగంలో మానవాళిని బెంబేలెత్తిస్తున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. వేడెక్కుతున్న భూగోళం, ఒకవైపు ముంచెత్తుతున్న వరదలు, మరోవైపు తీవ్రమైన కరువులు, పడిపోతున్న పంటల దిగుబడి.. ఇవన్నీ వాతావరణ మార్పుల సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాలే. కాలుష్యానికి తోడు నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న తీవ్రమైన వేడికి భూమి అగ్నిగుండంగా మారిపోతోంది. అలాంటప్పుడు ఈ సమస్య పరిష్కారానికి సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా ప్రభుత్వానికి వచ్చింది. దీనిపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ’ ఓ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవాలన్నదే ఈ పరిశోధన ఉద్దేశం. జియో ఇంజనీరింగ్ విధానంతో సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పరిశోధన చేస్తున్నట్లు తెలియజేసింది. సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఆకాశంలోని మేఘాలను మరింత మందంగా మార్చడం ద్వారా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పద్ధతిని సిరస్ క్లౌడ్ థిన్నింగ్ అంటారు. జియో ఇంజనీరింగ్ అమలు చేయడం సులభమేనని వారి వాదన. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికం. ఆ సమయంలో క్లౌడ్ థిన్నింగ్ చేయాలన్న యోచనలో ఉన్నారు. -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
చీతాలు.. చింతలు.. కాపాడుకోవడం ఎలా? మూడు నెలల్లో మూడు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే అంతరించిపోయిన జాబితాలో చేరిపోయిన చీతాల సంతతిని తిరిగి భారత్‌లో పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చాము. గత మూడు నెలల్లోనే మూడు చీతాలు మరణించడంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. మూడు చీతాలను మనం కోల్పోయినప్పటికీ మార్చి నెలలో సియాయా అనే చీతా నాలుగు పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందన్న ఆశలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. చీతాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది. చీతాలను కాపాడుకోవడం ఎలా? ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల సంతతి పెరగడానికి చాలా ఏళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చీతాలకు రేడియో కాలర్ ఏర్పాటు చేసి శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీ క్షణం వాటి భద్రతని పర్యవేక్షించడం సంక్లిష్టంగా మారింది. అందుకే వాటిని ఎన్క్లోజర్లకే పరిమితం చేయడంపై వన్యప్రాణుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమితమైన స్థలంలో వాటిని బంధించి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వరల్డ్‌లైఫ్ బయోలజిస్ట్ రవి చెల్లం అభిప్రాయపడ్డారు. మగ, ఆడ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి బయటకి తరచూ వదులుతూ ఉండాలని అప్పుడే వాటి సంతతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక వాతావరణపరమైన అడ్డంకుల్ని అధిగమించాలంటే మరిన్ని ఏళ్లు గడవడం తప్ప మరో మార్గం లేదన్నది వన్యప్రాణ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత చీతాలను వేరే అడవులకి కూడా తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఎదురవుతున్న సవాళ్లు ► చీతాల మనుగడుకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ వాతావరణం. మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో వాతావరణం ఆఫ్రికా వాతావరణం కంటే చాలా విభిన్నమైనది. కునోలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకు రాల్చే అడవులుంటాయి. ఆఫ్రికాలో గడ్డి మైదానాలు, దట్టమైన వృక్షాలు ఎక్కువ. ఇన్నాళ్లూ అక్కడ వాతావరణానికి అలవాటు పడిన చీతాలకు ఒకేసారి మార్పు రావడం తట్టుకోలేకుండా ఉన్నాయి. మన దేశంలో ఉద్యానవనాలు చీతాలకు నివాసయోగ్యాలుగా మారగలవో లేదోనన్న సందేహాలు కూడా నిపుణుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చీతాల ప్రాజెక్టు ప్రారంభించడానికే ముందే జంతు పరిరక్షణ నిపుణులు భారత పర్యావరణ వ్యవస్థకి చీతాలు అలవాటు పడడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ► ఇక రెండో పెద్ద సవాల్ స్థలం. కునో జాతీయ పార్క్‌లో చీతాలు ఉంచిన వాటికి ఎన్‌క్లోజర్ సరిపోదు. అవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత దట్టమైన అటవీ ప్రాంతం అవసరముంది. వచ్చే అయిదేళ్లలో మరో 30 చీతాలను తెచ్చే ప్రణాళికలు ఉండడంతో వాటిని ఎక్కడ ఉంచుతారో కూడా ముందుగానే చూడాల్సిన అవసరం ఉంది. ► కునోలో జంతువుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండడం అధికమే. చీతా కంటే దూకుడుగా వ్యవహరించే పులులు, చిరుతుపులులు పోటాపోటీగా కొట్టుకుంటాయి. ఒక్కోసారి చీతాలను ఉద్యానవనం గేటు వరకు తీసుకొస్తూ ఉంటాయి. అక్కడ మనుషులే వాటికి శత్రువులుగా మారుతుంటారు. ఇక మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలతో ఎంతో విలువైన జంతు సంపదని కోల్పోతున్నాం. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది. ► చీతాల సంరక్షణకి నియమించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికాకి పంపించి శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ సరిపోలేదు. రెండు చీతాలు అనారోగ్య కారణాలతో మరణించాయంటేనే సంరక్షకులకు వాటిపై పూర్తి స్థాయి అవగాహన లేదన్న విషయం తెలుస్తోంది. ► భారత్‌లో చీతాలు ప్రధానంగా కృష్ణజింకలు, చింకారాలను వేటాడి తింటాయి. ప్రస్తుతం కునో జాతీయ ఉద్యానవనంలో ఈ జంతువులు అంతగా లేవు. దీంతో చీతాల కడుపు నిండడం కూడా సమస్యగానే మారింది. మార్చి 27: నమీబియా నుంచి తీసుకువచ్చిన శష అనే చీతా కిడ్నీపరమైన వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 13: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్ అనే చీతా అనారోగ్య కారణాలతో మృతి చెందింది మే 9: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతాను మేటింగ్ సమయంలో మగ చీతాలు క్రూరంగా వ్యవహరించి మీద పడి చంపేశాయి.