degree admissions
-
ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిగ్రీ క్లాసులు ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యేవి. దీనివల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోందనే విమర్శలున్నాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కొన్ని కోర్సుల్లో చేరే అవకాశం కొంతమంది విద్యార్థులు కోల్పోతున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని సకాలంలో క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. క్లాసులు త్వరగా నిర్వహించే వెసులుబాటు కల్పించాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా కోరుతున్నాయి. జూలై నెలాఖరులో డిగ్రీ బోధన చేపడితే మే వరకు సిలబస్ పూర్తవుతుందని, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం లభిస్తుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇది గత రెండేళ్లుగా ప్రభావం చూపుతోంది.ఇప్పటికే లక్షమంది చేరికగతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు కౌన్సెలింగ్‌ల్లో ఎక్కువమంది విద్యార్థులు సీట్లు పొందారు. ఇప్పటివరకు 93,214 మంది డిగ్రీలో చేరారు. నాన్–దోస్త్ కాలేజీలు, దోస్త్ పరిధిలోకి రాని ఇతర కాలేజీల అడ్మిషన్లు కలుపుకుంటే లక్ష సీట్లు భర్తీ అయినట్టు అధికారులు చెబుతున్నారు. రెండుదశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 1,04,784 మంది విద్యార్థులు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,81,769 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మూడోదశ కౌన్సెలింగ్ సీట్లు శనివారం భర్తీ చేస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు కొత్తగా 66,976 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటి, రెండో దశలో సీట్లు రానివారు, వచ్చిన కొత్త గ్రూపుల కోసం ప్రయత్నించే వారు 80,312 మంది ఆప్షన్లు ఇచ్చారు.ఎక్కువ మంది కామర్స్ వైపే..రాష్ట్రంలో ప్రస్తుతం 3,84,748 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా ఎక్కువగా కామర్స్ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన దోస్త్ కౌన్సెలింగ్‌లో కామర్స్ కోర్సులో 28,655 మంది చేరారు. ఆర్ట్స్‌లో కేవలం 7,766 మంది మాత్రమే చేరారు. లైఫ్‌సైన్స్ కోర్సుకు మంచి స్పందన కనిపిస్తోంది. ఈ విభాగంలో 15,301 మంది చేరారు. ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్ కోసం విద్యార్థులు పోటీ పడతారు. డిగ్రీలో అదే స్థాయిలో కోర్సు ప్రవేశ పెట్టినా కేవలం 2,502 మంది మాత్రమే చేరారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారిలో బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ 47,867 మంది బాలికలు చేరితే, బాలురు 28,423 మంది మాత్రమే డిగ్రీ సీట్లు పొందారు.డిగ్రీ క్లాసుల ప్రారంభంపై దృష్టి ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించాం. వీలైనంత త్వరగా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. దీనివల్ల విద్యార్థుల విద్యా సంవత్సరం త్వరగా పూర్తవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు త్వరగా ఆప్షన్లు ఇవ్వడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంపై దృష్టి పెట్టాలి. త్వరలోనే మిగతా కౌన్సెలింగ్‌లు పూర్తి చేస్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్‌వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.ఈ మేరకు జూలై 2వ (నేడు) నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 5న కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 15 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించింది. 19న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20 నుంచి 22లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు (దివ్యాంగులు, ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) సర్టిఫికెట్లను 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనుంది.ఈ విద్యార్థులు విజయవాడలోని ఎస్ఆర్ఆర్, విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాలి. ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ (https://cets.apsche.ap.gov.in/ APSCHE/OAMDC23/OAMDCHome.html) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్మొత్తం సీట్లు దాదాపు 3.20 లక్షలు గత ఏడాది జూన్ 19నే ప్రక్రియ ప్రారంభంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేయనుంది. వాస్తవానికి ఇంటరీ్మడియట్ ఫలితాలు విడుదలై రెండు నెలలు దాటినప్పటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా.. ఇంటరీ్మడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా ప్రకటించారు. వర్సిటీల నుంచి కళాశాలలకు అనుమతుల పొడిగింపు ప్రక్రియలో జాప్యంతోపాటు కొత్తగా బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. ఫలితంగా యూజీసీ నుంచి రావాల్సిన గుర్తింపు ఏఐసీటీఈ ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 800 వరకు బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అందిస్తున్న కళాశాలలు వున్నాయి. వీటికి ఏఐసీటీఈ అనుమతులు వచ్చి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎన్ఓసీ ఇచి్చన తర్వాతే సీట్ల భర్తీ చేయాల్సి రావడంతో అడ్మిషన్లకు జాప్యం జరిగింది. వీటికి తోడు.. 43 కళాశాలలు కొత్తగా అనుమతులు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో కేవలం రెండు లేదా మూడింటికి మాత్రమే అనుమతులొచ్చే అవకాశముందని ఉన్నత విద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల్లో 2024–25లోనే అడ్మిషన్లకు అవకాశం కలి్పంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జూన్ 19 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో ఆలస్యంగా జరుగుతుండటం గమనార్హం. మొత్తం సాధారణ డిగ్రీలో సుమారు 3.20 లక్షల వరకు సీట్లున్నాయి. -
‘బీకాం’దే హవా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో తక్షణ ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బీకాంతోపాటు బీఎస్సీ లైఫ్‌సైన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసిన 2023 దోస్త్ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సంప్రదాయ డిగ్రీ కోర్సుల కన్నా.. ఆధునిక హంగులున్న విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ఒకేషనల్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగా ఉన్నాయి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఏ వంటి కోర్సుల్లో మార్పులు తెచ్చినా, ఆనర్స్ వంటివి అందుబాటులోకి తెచ్చినా విద్యార్థులు వాటికి పెద్దగా మొగ్గు చూపలేదు. 1.84 లక్షల సీట్లు ఖాళీ..: 2023–24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి పలు దఫాలుగా ‘డిగ్రీ ఆన్లైన్ సరీ్వసెస్, తెలంగాణ (దోస్త్)’అడ్మిషన్ల ప్రక్రియను ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 2,04,674 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. బీకాం వైపే చూపు: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీలోని 11 ప్రధాన కోర్సుల్లో 2,04,674 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అత్యధికంగా 85,153 మంది బీకాం కోర్సునే ఎంచుకున్నారు. ఆ తర్వాత బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 43,180 మంది చేరారు. తర్వా తి స్థానంలో బీఏ కోర్సు ఉంది. ఇందులో 29,752 మంది చేరారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిలో 25,937 మంది చేరారు. కరోనా తర్వాత ఈ–కామర్స్ జోరు పెరిగింది. అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆడిట్ విభాగాల్లోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కామర్స్ నేప థ్యం ఉన్న వారికి డిమాండ్ వచ్చింది. డిగ్రీ పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తోందన్న భరోసా కనిపిస్తోంది. మరోవైపు సాధారణ డిగ్రీలోనే బొటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులను చేర్చి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో వాటికీ డిమాండ్ వస్తోంది. డిమాండ్ ఉన్న కోర్సులు కోరుకుంటున్నారు విద్యార్థులు పదేళ్లుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుంటున్నారు. మార్కెటింగ్ పెరగడం, ఈ–కామర్స్‌లో మంచి అవకాశాలు లభించడంతో బీకాంకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు రాష్ట్రవ్యాప్తంగానూ మంచి నాణ్యతను చూపుతోంది. లైఫ్ సైన్స్ కోర్సులకు అన్నిచోట్లా ఆదరణ లభిస్తోంది. దీంతోపాటు బీఏ ఆనర్స్ కోర్సులను విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఏదేమైనా డిగ్రీలో ప్రమాణాలు పెంచే దిశగా మండలి ప్రయత్నించడం కూడా ప్రవేశాలు పెరగడానికి దోహదపడుతోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఇది ఇంజనీరింగ్‌లో సీఎస్సీ కోర్సుకు సమానమని తెలిపారు. గురువారం ‘దోస్త్’(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయని, ఒక్కో కాలేజీలో 60 సీట్లతో అనుమతులిచ్చామని తెలిపారు. ఇదే తరహాలో ప్రైవేట్ కాలేజీలు ముందుకొస్తే వాటికీ అనుమతిస్తామన్నారు. కోర్సు ప్రత్యేకతలివీ... ► ప్రస్తుతానికి డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీఎస్ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్) కోర్సును నిర్వహిస్తున్నారు. అంటే కంప్యూటర్ సిలబస్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా చదువుతుండగా, ఇకపై ఏకంగా పూర్తిస్థాయి కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి వస్తుంది. ► ఈ కోర్సు సిలబస్, కరిక్యులం అంతా బీటెక్ సీఎస్ఈ కోర్సుతో సమానంగా ఉంటుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారు, ఎంసెట్‌కు హాజరుకాని వారు దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ► విద్యార్థి కావాలనుకుంటే మూడేళ్లలోనే ఈ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పుడు ఆ విద్యార్థికి మూడేళ్ల డిగ్రీ పట్టా ఇస్తారు. ► నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసే విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ పట్టాను జారీచేస్తారు. అమెరికా, యూకే అంతటా నాలుగేళ్ల యూజీ కోర్సులు ఉండగా, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. ► ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌ను బోధిస్తున్న అధ్యాపకులే బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సుకు బోధిస్తారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తారు. సెక్టార్ స్కిల్ కోర్సులు సైతం ఈ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుతోపాటు కొత్తగా సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను సైతం ప్రవేశపెట్టనున్నారు. బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ–ఈకామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీబీఏ లాజిస్టిక్స్ వంటి పూర్తిస్థాయి మూడేళ్ల డిగ్రీ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సులను సైతం ‘దోస్త్’ద్వారానే భర్తీచేస్తారు. -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ మార్పు
మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్ మార్పు చేసినట్లు కన్వీనర్ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు ఆదివారం తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా సర్టిఫికెట్ పొందుపరచడం మరిచిపోతే, ఈ నెల 16 నుంచి 18 వరకు పెండింగ్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్సైట్లో ఉంచాలి. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్సైట్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేలా ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. -
Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న యువతకు ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేందుకు వీలుగా విద్యాశాఖ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను 2021–22 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించాలని నిర్ణయించింది. నిజానికి.. ఆంగ్లంలో నైపుణ్యాలున్న వారిని, ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించిన వారినే పలు సంస్థలు ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తున్న విషయాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ‘ఫైండింగ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ వర్క్ : గ్లోబల్ ఎనాలసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ వర్క్ ప్లేస్’.. పేరిట కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడుదల చేసిన ఓ నివేదికలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే, దేశంలోని వివిధ సంస్థల యాజమాన్యాల్లో 90 శాతానికి పైగా మేనేజ్మెంట్లు తమ సంస్థల్లో పనిచేయడానికి ఇంగ్లీషు నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు మరో సర్వేలో తేటతెల్లమైంది. వాస్తవంగా కూడా రాష్ట్రంలోని బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారు మాత్రమే ఉద్యోగావకాశాలను అందుకోగలుగుతున్నారు. తెలుగు మాధ్యమంలో డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఆంగ్ల నైపుణ్యాలు కొరవడి అవకాశాలు దక్కడంలేదు. తెలుగు మీడియంలో తగ్గుతున్న అడ్మిషన్లు ఈ నేపథ్యంలో.. డిగ్రీ కోర్సుల్లో క్రమేణా తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు కోరుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. 2020–21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో నిర్వహించిన ప్రవేశాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.62 లక్షల మందికి ఉన్నత విద్యా మండలి సీట్లు కేటాయించింది. వీరిలో 65,981 మంది తెలుగు మాధ్యమంలో చేరిన వారు. వీరిలో 24,007 మంది బీఏ, 16,925 మంది బీకాం, 24,960 మంది బీఎస్సీ, 89 మంది ఇతర కోర్సులను ఎంపిక చేసుకున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు పెద్దగా రాకపోవడంతో గత కొన్నేళ్లుగా తెలుగు మాధ్యమం కోర్సుల్లోని సీట్లు 10 శాతం కూడా భర్తీ కావడంలేదు. దీంతో పలు కాలేజీలు ఆయా కోర్సుల నిర్వహణపై విముఖత చూపుతున్నాయి. ఫలితంగా 558 కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమాలుగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే తెలుగు మాధ్యమంలో చేరిన విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని యధాతథంగా కొనసాగించుకోవచ్చు. వారి మాధ్యమంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతారు. చేరికలు లేని కాలేజీలకు సీట్ల కేటాయింపు నిల్ రాష్ట్రంలో అత్యుత్తమ విద్యా బోధనను అందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి పలు చర్యలు చేపడుతోంది. కనీస ప్రమాణాలు లేకపోవడంతో పాటు గత కొన్నేళ్లుగా చేరికల్లేకుండా కొనసాగుతున్న డిగ్రీ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో సీట్ల కేటాయింపును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇలాంటి కాలేజీలకు నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 1,551 కాలేజీలుండగా వాటిలో 0–10 శాతం మాత్రమే చేరికలున్న కాలేజీలు 502 ఉన్నాయి. 10–20 శాతంలోపు చేరికలున్నవి 490 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. చేరికల్లేని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఒక్క విద్యార్థీ చేరని 40 కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో పూర్తిగా సీట్ల కేటాయింపును నిలిపివేయనుంది. అలాగే, 257 కాలేజీల్లో విద్యార్థులు చేరని 454 కోర్సులకు కూడా ఈ ఏడాది చేరికలు నిలిపివేస్తోంది. ఇలా చేరికల్లేని 112 కోర్సులను పలు కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. 23 నుంచి వెబ్ ఆప్షన్లు ఇక రాష్ట్రంలోని అన్ని నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22తో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. 23–26 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి 29న మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. గత ఏడాది డిగ్రీ ప్రవేశాలు ఇలా.. జిల్లా మహిళలు పురుషులు మొత్తం తెలుగు మీడియం అనంతపురం 10,293 12,034 22,327 4,184 చిత్తూరు 12,685 16,228 28,913 2,737 తూర్పు గోదావరి 14,575 13,291 27,866 8,077 గుంటూరు 9,350 11,347 20,697 4,005 కడప 7,120 7,971 15,091 2,320 కృష్ణా 9,390 9,346 18,736 3,569 కర్నూలు 10,634 12,605 23,239 5,597 నెల్లూరు 6,486 7,040 13,526 1,027 ప్రకాశం 7,591 8,434 16,025 3,160 శ్రీకాకుళం 9,546 8,563 18,109 11,280 విశాఖపట్నం 11,672 11,839 23,511 6,986 విజయనగరం 7,807 8,338 16,145 8,512 పశ్చిమ గోదావరి 8,510 8,688 17,198 4,527 మొత్తం 1,25,659 1,35,724 2,61,383 65,981 ఎయిడెడ్ కాలేజీల్లోని సీట్లు.. మరోవైపు.. ప్రభుత్వ ఎయిడ్‌తో నడుస్తున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో గత కొంతకాలంగా చేరికలు భారీగా తగ్గిపోయాయి. ఈ సంస్థల్లోని అన్ ఎయిడెడ్ సెక్షన్లలో కొంతమేర చేరికలుంటున్నా ఎయిడెడ్ సెక్షన్లలో సీట్లు భర్తీ కావడంలేదు. ఈ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఈ నేపథ్యంలో.. వీటిని ప్రభుత్వంలోకి తీసుకుని ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయా యాజమాన్యాల అంగీకారాన్ని కోరింది. అయితే, కొన్ని సంస్థలు అంగీకరించగా కొన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో చేరికల్లేని ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. ఇక నుంచి ఆ కాలేజీలు అన్ ఎయిడెడ్ కాలేజీల కింద కొనసాగుతాయి. ఈ యాజమాన్యాలు అన్ ఎయిడెడ్ సెక్షన్లను ఏ మేరకు కొనసాగిస్తాయో ఆయా వర్సిటీలకు తెలియజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. -
Telangana: డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. టీ-యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు గాను విద్యార్థి ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్, ఫోన్ నంబరు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 105 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. www.dost.cgg.gov.in ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ►జులై 1 నుంచి 15 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.200 ►జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు, జులై 22న సీట్ల కేటాయింపు ►జులై 23 నుంచి 27 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400 ►జులై 24 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు ►ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400 ►ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 18న సీట్ల కేటాయింపు -
కనీస అర్హత మార్కులు లేకపోతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో ఉండాల్సిన కనీస అర్హత మార్కులైన 45 శాతం లేకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఫెయిలైన, పరీక్షలు రాయని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులను ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇంటర్ ఫస్టియర్‌లో పాస్ అయిన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఇవ్వనున్నారు. దీంతో ఫెయిలైన, పరీక్షలు రాయని వారి విషయంలో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 1,99,019 మంది ఫెయిలైన లేదా పలు సబ్జెక్టుల పరీక్షలు రాయని వారున్నారు. వారిలో కొంతమంది ఒకట్రెండు సబ్జెక్టులు ఫెయిల్ కాగా, కొంతమంది మూడు నాలుగు ఫెయిలైన వారున్నారు. మరోవైపు పరీక్షలు రాయని వారూ ఉన్నారు. ఇప్పుడు వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులనే ఇస్తే నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ స్కూల్ ఇంటర్లో.. మరోవైపు ఓపెన్ స్కూల్ సొసైటీ కూడా ఇంటర్మీడియెట్ బోర్డు ఇచ్చే మార్కుల ప్రకారమే తమ పరిధిలోని ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు మార్కులను కేటాయించాలని భావిస్తోంది. వారికీ 35 శాతం మార్కులను కేటాయించే అవకాశం ఉంది. దీంతో 50 వేల మంది విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. కరోనా కారణంగా గతేడాది 40 వేల మంది ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇవ్వడం వల్ల రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, లా వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక పోయారు. 35 శాతం కనీస మార్కులు వేయడం వల్ల పాస్ అయ్యారే తప్ప ఉన్నత కోర్సుల్లో చేరలేకపోయారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకే సమస్య.. అగ్రికల్చర్, లా, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయస్థాయి విద్యా సంస్థలు, రాష్ట్రంలో ఎంసెట్‌కు ఆ నిబంధనను తొలగించినా ప్రైవేటు విద్యాసంస్థలు దానిని కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడంలేదు. ఇంటర్ బోర్డు వర్గాలు మాత్రం 45 శాతంలోపే మార్కులు ఉండే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతున్నాయి. అలాంటి వారి విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రాక్టికల్ మార్కులను 100 శాతం ఇస్తున్నందున ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపితే 45 శాతం కంటే తక్కువ మార్కులొచ్చే విద్యార్థులు తక్కువే ఉంటారని చెబుతున్నాయి. ఓపె¯న్ ఇంటర్ ఏడాది కోర్సే కావడంతో వారికి 35 శాతం మార్కులిస్తే నష్టం తప్పేలా లేదు. ప్రతి విద్యార్థికీ న్యాయం జరిగేలా చూడాలి కనీస మార్కుల విధానం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. కరోనా కారణం గా పరీక్షలు నిర్వహించనందున ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి. 45 శాతం కనీస మార్కులను ఇస్తే ఇబ్బందేమీ లేదు. తద్వారా ప్రతి విద్యార్థికీ మేలు జరుగుతుంది. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
త్వరలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కసరత్తు చేస్తోంది. దోస్త్ పరిధిలోని 1,046 డిగ్రీ కాలేజీల్లో 4,12,805 సీట్లు ఉండగా ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఈ నెల 26లోగా విడుదల చేసేలా బోర్డు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో మార్కుల కాపీ డౌన్లోడ్ చేసుకున్నపుడే డిగ్రీలో ప్రవేశాలను ఎలా పొందాలన్న వివరాలతో ‘గ్రీటింగ్స్’పంపనుంది. ఆ వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ మొదలయ్యేలా ఆన్లైన్ సర్వీసెస్‌ను సిద్ధం చేస్తోంది. డిగ్రీ, పీజీ కాలేజీల్లో అదనపు సెక్షన్లు, ఆయా కాలేజీల్లో లేని కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లకు అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. గతేడాది కాలేజీలకు మంజూరైన సీట్లలో 60% సీట్లు నిండిన కాలేజీలకే గరిష్టంగా మూడు కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న షరతు విధించింది. ఒక్కో కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీలో కలిపి గరిష్టంగా 12 కాంబినేషన్లకు అనుమతి ఇస్తారు. ఒక్కో కాంబినేషన్లో 3 సెక్షన్ల వరకే అనుమతి రానుంది. యాజమాన్యాలు అదనపు సెక్షన్లు, మీడియం మార్పు, కోర్సుల రద్దుకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
డిగ్రీ ప్రవేశాలకు ‘45%’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వీరంతా ఇంటర్లో పాసైనా ప్రయోజనం లేకుండాపోతోంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లా వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా కనీస పాస్ మార్కులు 35 శాతం ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించినా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించలేదు. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది వేల మంది విద్యార్థులు నష్టపోగా, ఈసారి కూడా అదే ప్రమాదం పొంచి ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేస్తున్నప్పుడు కనీస మార్కులైన 45 శాతం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 45% కావాలంటున్న ప్రైవేటు సంస్థలు ఇంటర్ తరువాత చదివే న్యాయ, వ్యవసాయ, వైద్య,, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని దాదాపుగా అన్ని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆ నిబంధన తొలగించినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడం లేదు. చివరకు రాష్ట్రంలోనూ ఎంసెట్ విషయంలో సమస్య తప్పలేదు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మినహాయింపునిచ్చారు. కానీ న్యాయ, ఇతరత్రా వృత్తి విద్యా కోర్సుల్లో ఆ మినహాయింపు అమలు కాలేదు. దీంతో కనీస పాస్ మార్కులైన 35 శాతంతో ఉత్తీర్ణులైన ఓపెన్ ఇంటర్ విద్యార్థులు, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో 45 శాతం లోపు మార్కులు కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారు. ఇలా ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 30 వేల మంది, రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మరో 15 వేల మంది నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ మొదలైన ఆందోళన.. ఈసారి ఇంటరీ్మడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. సెకండియర్ పరీక్షలు వాయిదా వేసింది. ఫస్టియర్ వారిని ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినా ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కరోనా వచ్చే రెండు మూడు నెలల్లో అదుపులోకి రాకపోతే ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అలాంటపుడు వారికి కనీస పాస్మార్కులే 35 శాతం ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 1.47 లక్షల మందిని, గతేడాది వార్షిక పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నా, పరీక్షలకు హాజరు కాని 27 వేల మందిని 35 శాతం మార్కులతోనే పాస్ చేసింది. ఈసారి కూడా 4.5 లక్షల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను, మరో 30 వేల మంది వరకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇచ్చి పాస్ చేసే పరిస్థితి. అలా చేస్తే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సెకండియర్‌లో కష్టపడాల్సిందే ఈసారి ఇంటర్మీడియట్ విద్యారి్థకి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 45 శాతం మార్కులు ఉండాలంటే ఆ విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 55 శాతానికి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా విద్యార్థులకు కనీస మార్కులైన 45 శాతం మార్కులు లభిస్తాయి. ఆ మేరకు రాకపోతే వచ్చే విద్యా సంవత్సరంలోనూ (2022–23) ప్రవేశాలకు విద్యార్థులు అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వారు రాష్ట్రంలో లక్షన్నర మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంటర్ ఒక సంవత్సరమే కావడంతో ద్వితీయ సంవత్సరంలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా వీరికి లేదు. దీంతో అందరికీ 45 శాతం మార్కులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 45 శాతం ఇస్తే చివరి విద్యార్థి వరకు మేలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనందున విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కులను బోర్డు కేటాయించింది. ఓపెన్ ఇంటర్ వారికి 35 శాతం మార్కులను ఇచ్చింది. దీనితో ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకున్న విద్యార్థులకు నష్టం తప్పదు. ఇప్పుడు ప్రమోట్ చేసిన విద్యార్థులకు 45 శాతం ఇస్తే భవిష్యత్తులో వారికి నష్టం ఉండదు. 35 శాతంతో ఎలాగూ పాస్ చేస్తున్నప్పుడు 45 శాతం ఇస్తే పోయేదేమీ లేదు. పైగా విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ఇంటర్ మార్కులు, డిగ్రీ ప్రవేశాలు, తెలంగాణ, ప్రైవేటు కాలేజీలు -
దోస్త్: నేటి నుంచి వచ్చే నెల 2 వరకు స్పెషల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) కన్వీనర్ ప్రొ. ఆర్.లింబాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల 4న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 4 నుంచి 7 వరకు సంబంధిత కాలేజీల్లో సీసీఓటీపీ, తాత్కాలిక కేటాయింపు లేఖ, ఇతర అమసరమైన ప్రతాలను తీసుకెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందనివారు, రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు పొంది కాలేజీ కన్ఫర్మ్ కాని విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు. -
ఇక ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఇక ఆన్లైన్లో నిర్వహించేలా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ తదితర అన్ని డిగ్రీ కోర్సులకు ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అటానమస్, ఎయిడెడ్, ప్రైవేట్, ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో సీట్లను ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర గురువారం రాత్రి జీవో 34 విడుదల చేశారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను ప్రత్యేక కమిటీ ద్వారా చేపట్టనున్నారు. అడ్మిషన్ల విధివిధానాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ►బీఏ, బీకాం, బీకాం (ఒకేషనల్), బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులకు ఆన్లైన్ అడ్మిషన్లు చేపడతారు. ►బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్ సైన్సు సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులు సాధించాలి. ►ఇంజనీరింగ్, టెక్నాలజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో డిప్లొమో పాసైన అభ్యర్థులు డిగ్రీ సెకండ్ ఇయర్లో చేరేందుకు అర్హులు. వీరికోసం 5 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు. ►మేథమెటిక్స్, ఎకనమిక్స్, కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన వారు బీఎస్సీ మేథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సు కాంబినేషన్ కోర్సులో చేరేందుకు అర్హులు. ►సీట్లను మెరిట్ ప్రాతిపదికన, రిజర్వేషన్లను పాటిస్తూ కేటాయిస్తారు. ►బీకాంలో 60 శాతం సీట్లను ఆయా వర్సిటీల పరిధిలో కామర్స్ సబ్జెక్టుగా అర్హత పరీక్షను పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. బీఏలో 50 శాతం సీట్లను సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ సబ్జెక్టులుగా అర్హత పరీక్ష పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. ►డిగ్రీ కాలేజీల్లోని 85 శాతం సీట్లను స్థానిక కోటాగా, 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కోటాగా భర్తీ చేస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు కేటాయిస్తారు. ►ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు. ►స్పోర్ట్స్ కోటాలో 29 కేటగిరీల వారికి 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ సహా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వారికి 1 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. ►మహిళలకు మొత్తం సీట్లలో ఆయా కేటగిరీల్లో 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు. -
‘దోస్త్’తో ఈపాస్ లింక్..!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును సులభతరం చేయాలని, పాత పద్ధతిలో దరఖాస్తు పూరించడం, వివరాలు ఎంట్రీ చేయడంలాంటి పనులకు ఇకపై చెక్ పెట్టాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. అందులో భాగంగా దోస్త్ వెబ్‌సైట్‌ను ఈ పాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. సీటు వచ్చిన కాలేజీ వివరాలు, ఏ కోటాలో సీటు వచ్చింది, విద్యార్థి కులం, కోర్సు, ఫీజు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ వివరాల ఆధారంగా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేయవచ్చు. ఇందుకు దోస్త్ వెబ్‌సైట్‌ను ఈపాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి. కౌన్సెలింగ్ నాటికి పూర్తి... లాక్డౌన్ కారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడనుంది. కౌన్సెలింగ్ తేదీలు ప్రారంభమయ్యే నాటికి ఈ వెబ్సైట్ల అనుసంధానం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)తో సంక్షేమ శాఖలు పలుమార్లు చర్చలు జరిపి వెబ్సైట్ అనుసంధానంపై పలు సూచనలు చేశాయి. ఇటీవల ఈపాస్ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయడంతో లాగిన్ పేజీలో ఆప్షన్లు పెరిగాయి. తాజాగా దోస్త్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేస్తే డిగ్రీ చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొత్తగా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దోస్త్ లింక్ ద్వారా ఈపాస్ పేజీ తెరిస్తే దాదాపు అన్ని వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. అందులో పొరపాట్లు ఉంటే సరిచేయడం, అదనపు సమాచారాన్ని ఎంట్రీ చేసే వీలుంటుంది. -
త్వరలో ఏకకాలంలో రెండు డిగ్రీలు
న్యూఢిల్లీ: ఒకే సమయంలో రెండు డిగ్రీలను పూర్తి చేసే అవకాశం త్వరలో అమలయ్యేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో ఒక డిగ్రీని రెగ్యులర్ మోడ్‌లోనూ, మరోటి ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) ద్వారా చేయాల్సి ఉంటుందని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంపై గతేడాది యూజీసీ వైస్ చైర్మన్ భూషన్ పట్వర్థన్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెల్సిందే. -
స్పాట్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మూడేళ్లుగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలంటూ యాజమాన్యాలు చేస్తున్న విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 14 నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టుకోవచ్చని యాజమాన్యాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం లేకపోవడంతో మిగిలిపోయే సీట్లలో యాజమాన్యాలు సొంతంగా ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఏటా మంత్రులను కలసి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా విద్యా శాఖ మంత్రిని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను కలసి కలిసి విజ్ఞప్తులు చేసింది. దీంతో ఎట్టకేలకు స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లలో తాము కోరుకునే కాలేజీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలు ఏర్పడిందని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పరమేశ్ పేర్కొన్నారు ఆర్థిక స్థోమత కలిగిన విద్యార్థులకు దోస్త్ ద్వారా కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావట్లేదని, స్పాట్ అడ్మిషన్ల ద్వారా అలాంటి వారికి కోరుకున్న చోట సీట్లు లభిస్తాయని వివరించారు. కాగా, రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టే ప్రవేశాలు పోగా మరో 1.76 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో యాజమాన్యాల ఆధ్వర్యంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 14 నుంచి 18 వరకు చేపట్టి పూర్తి చేయాలని లింబాద్రి వెల్లడించారు. ప్రవేశాలను పూర్తి చేసి, విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా కాలేజీల్లో చేరే విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వివరించారు. నేడు స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు ఇప్పటి వరకు ఐదు దశల్లో చేపట్టిన డిగ్రీ కౌన్సెలింగ్ ద్వారా 1,74,239 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. అయితే విద్యార్థుల నుంచి వచి్చన విజ్ఞప్తుల మేరకు దోస్త్ మరో విడత కౌన్సెలింగ్‌ను స్పెషల్ రౌండ్ పేరుతో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించింది. ఇందులో 6,997 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం కొత్తగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. వారితో పాటు గతంలో తమ మార్కులకు అనుగుణంగా సరిపడా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు రాని వారు, సీట్లు వచి్చనా కాలేజీల్లో రిపోర్ట్ చేయని వారు కలిపి మొత్తం 16 వేల మంది విద్యార్థులు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని లింబాద్రి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలతో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, దోస్త్ పరిధిలో లేకుండా సొంతంగా ప్రవేశాలు చేపట్టిన కాలేజీలన్నీ విద్యార్థుల సమగ్ర వివరాలను ఈనెల 18 లోగా అందజేయాలని వివరించారు. -
ఇంటర్ ఫెయిలా? పర్లేదులే.. ‘బాబ్బాబూ.. అడ్మిషన్ తీసుకో’
సాక్షి, కర్నూలు : ‘బాబ్బాబూ.. డిగ్రీ అడ్మిషన్ తీసుకో.. కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా మేము చూసుకుంటాం.. ఆరు సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లిస్తాం. బస్సు పాస్‌కు అయ్యే ఖర్చు భరిస్తాం. ఇదే కాకా అదనంగా రూ.5000 ఇస్తాం. ఐటీఐ చదివినా.. ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేనేజ్ చేసుకుంటాం’ ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న తంతు. ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి. ఐటీఐ చదివినా డిగ్రీలో అడ్మిషన్ బనగానపల్లె, కోవెకుంట్ల, పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఐటీఐ చదివిన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నారు. పత్తికొండలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళా«శాలలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం ఆడ్మిషన్లు ఇచ్చారు. సదరు విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇలా జరగదు. అక్కడ డిగ్రీ విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాలను పక్కాగా పరిశీలిస్తారు. ఆర్‌యూలో మాత్రం ఇవేమీ చేయరు. దీంతో ఇంటర్ ఫెయిల్ అయినా, ఐటీఐ చదివినా డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 12 ప్రభుత్వ, 7 ఎయిడెడ్, 85 ప్రైవేట్ మొత్తం 104 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 65వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని చాలా కళాశాలలు ముఖ్యంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో డిగ్రీలో చేరితే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళాశాలల యాజమాన్యాలే ఒక్కో విద్యార్థికి డిమాండ్, పరిస్థితులను బట్టి రూ.3000 నుంచి రూ.6000 వరకు చెల్లిస్తున్నాయి. ఆరు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు రూ.3000, బస్‌పాస్‌కు అయ్యే ఖర్చు రూ.5000 ఇలా ఒక విద్యార్థికి సుమారు రూ.14000 వరకు ఖర్చుచేసి సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. వీరు కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా యాజమాన్యాలే చూసుకుంటాయి. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారేంటే ఒక్కొక్క విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.18000, మూడేళ్లకు రూ.54000 ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒక విద్యార్థిపై తాయిలాల రూపంలో రూ.14000 ఖర్చు చేస్తే తమకు రూ.40,000 వరకు మిగులుతుందని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకుల ప్లాన్. ఆన్లైన్లో లేకపోవడంతో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీలో చేరాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా మార్కులు, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇది విద్యార్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వారి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. వర్సిటీ కేటాయించిన సీట్లకంటే కూడా 20 శాతం అదనంగా చేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించి అఫ్లియేషన్ ఫీజు సైతం వర్సిటీకి చెల్లించకుండా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో వర్సిటీ అధికారులు కూడా కఠినంగా వ్యవహరించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమలు కాని బయోమెట్రిక్ హాజరు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌నకు అర్హులు. ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలేవీ లేకపోవడంతో ప్రవేశాలు భారీగా జరుగుతున్నాయి. -
పాస్వర్డ్ పరేషాన్!
‘కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి డిగ్రీలో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రైవేట్ కళాశాలకు మొదటి దశలో సర్టిఫికెట్లు అప్పగించారు. సదరు కళాశాలకు చెందిన వారు తమ కళాశాలకు సంబంధించిన ఫోన్ నంబర్, దానికి వచ్చే పాస్వర్డ్ ఆధారంగా మొదటి దశలో నమోదు చేసి కేవలం తమ కళాశాలలోనే ఆప్షన్ ఇవ్వగా, అందులోనే సీటు వచ్చింది. ఇప్పుడు విద్యార్థి స్నేహితులకు వేరే కళాశాలల్లో సీటు రాగా మారాలని ఆలోచన ఉంది. మారుదామంటే కళాశాల ఫోన్ నంబర్ ఇచ్చి ప్రవేశాలు నమోదు చేశారు. ఇప్పుడు రెండో దశలో మారాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. ఈ విషయమై కళాశాలల వారిని అడుగగా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు’ ఇది శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇలాగే కళాశాల నంబర్లు ఇచ్చి విద్యుర్థులు ఎటూ వెళ్లకుండా చేస్తున్నారు. – శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ మొదటి దశలో పలు ప్రైవేట్ కళాశాలలు ఒడిగట్టిన అక్రమాలకు విద్యార్థులు బలవుతున్నారు. వివిధ అఫర్ల పేరుతో నమ్మబలికి మొదటి దశలో పలు కళాశాలలకు సంబంధించిన వ్యక్తులవే ఫోన్ నంబర్లు ఇచ్చి వాటికి వచ్చిన ఓటీపీలతోనే ప్రవేశాల నమోదు చేశారు. తమ కళాశాలల్లోనే సీట్లు వచ్చేలా అప్షన్లు ఇచ్చారు. ఫలితంగా వారుకోరుకున్నట్టే వారి కళాశాలల్లోనే సీట్లు పొందారు. కానీ మొదటి దశ సీట్ల కేటాయింపు పక్రియ ముగిసి రెండో దశ కౌన్సిలింగ్‌కు నేటి(సోమవారం) వరకు అవకాశముంది. రెండో దశలో కళాశాల మార్చుకుందామనే ఆలోచన ఉన్న విద్యార్థులకు పలు ప్రైవేట్ కళాశాల వారి నంబర్లే ఇవ్వడంతో మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. డిగ్రీ ప్రవేశాల నమోదులో ఫోన్ నంబరే కీలకం కావడంతో కళాశాల మార్చేందుకు ఆప్షన్లు పెట్టుకుందామనే వారికి పలు ప్రైవేట్ కళాశాలలు ఫోన్ నంబర్ ఇవ్వడం లేదు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పలు కళాశాలలు ఇచ్చిన ఆఫర్లకు ఆకర్షితులై వారి పిల్లలకు కూడా తెలియకుండా వారి ప్రవేశాలు ప్రైవేట్ కళాశాలల్లో తీసుకున్నారు. వారికి మారుదామనే ఆలోచన ఉన్నా ప్రవేశాల సమయంలో కళాశాలల నంబర్లు ఇవ్వడం, మారడం ఎందుకనే తల్లిదండ్రుల బలవంతంతో అదే కళాశాలల్లో మగ్గుతున్నారు. బహుమానాలు.. బంఫర్ ఆఫర్లు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం రెండో దశ కొనసాగుతుంది. మొదటి దశ సీట్లు కేటాయించగా నేటితో రెండోదశ నమోదు, వెబ్ఆప్షన్లు, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా తమ కళాశాలలో సీట్లు నింపుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకరు ప్రవేశానికి మొబైల్ ఫోన్ ఉచితంగా ఇవ్వడం, మరో కళాశాల ఏకంగా ల్యాప్‌టాప్ ఇస్తామని, మరికొన్ని కళాశాలలు రవాణా ఫీజు, పరీక్ష ఫీజుతోపాటు అన్ని ఫీజులు ఉచితమేనని, ఇంకొన్ని కళాశాలలు ఒక అడుగు ముందుకు వేసి అన్ని ఫీజులు ఉచితంతోపాటు తిరిగి విద్యార్థులకు నగదు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు డిగ్రీ ప్రవేశాల పక్రియలో తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీతో దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నాయి. ఎలాగో సీట్లు నింపుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొడుదామనే ఆలోచనతో ప్రవేశాలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు తమ లెక్చరర్లలో కాన్వాసింగ్ చేపించి అడ్మిషన్‌కు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తల్లిదండ్రలు మాత్రం విద్యా నాణ్యత ప్రమాణాలు పాటించే కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. ప్రైవేట్ కళాశాలల అక్రమాల విషయంపై శాతవాహన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యూ.ఉమేశ్‌కుమార్‌ను సంప్రదించగా ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాల విషయంలో ప్రలోభాలు, ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. -
నానాటికీ ... తీసికట్టు!
మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)పరిధిలోని డిగ్రీ కాలేజీలపై విద్యార్థులు విశ్వాసం కోల్పోతున్నారా..? ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మిగిలిపోయే ముప్పు ఏర్పడిందా..? కారణాలు అన్వేషించి పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థిలోకంలో హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అన్నీ ఎంజీయూ పరిధిలోకే వస్తాయి. గత కొన్ని విద్యా సంవత్సరాల్లో జరిగిన డిగ్రీ ప్రవేశాలను గమనిస్తే.. ఏటికేడు డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ గణనీయంగా పడిపోతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన నల్లగొండ ఎన్జీ కళాశాల, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరిల్లోని కాలేజీలూ ఉసూరుమంటున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన ఫలితంగా కొన్ని కోర్సులకూ మంగళం పాడారు. ఇక, ప్రైవేటు కాలేజీల్లో చేరే విద్యార్థులే లేకుండా పోతున్నారు. అసలు డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు కన్నెత్తి చూడడం లేదా అంటే అదే కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే, రాష్ట్రవ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో జరుగుతున్న ప్రవేశాలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని అంటున్నారు. ఎటొచ్చీ ఎంజీయూ పరిధిలోనే ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏటేటా పడిపోతున్న ప్రవేశాలు అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు.. 2012–13 విద్యాసంవత్సరంలో 45వేల సీట్లు భర్తీ అయ్యాయి. 2015–16లో 38 వేలు, 2016–17లో 28వేలకు పడిపోయింది. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన సీట్లు 33,600 కాగా, ఫేజ్ –1లో ఇప్పటి వరకు కేవలం 5,416 సీట్లు మాత్రమే నిండాయి. యూనివర్సిటీల వారీగా చూసినా, దోస్త్ ద్వారా ఫేజ్–1లో ఉస్మానియా యూనివర్సిటీలో 44,726, కాకతీయ యూనివర్సిటీలో 27,010, శాతవాహన యూనివర్సిటీలో 12355, తెలంగాణ యూనివర్సిటీలో 8,855, పాలమూరు యూనివర్సిటీలో 7,221 సీట్లు భర్తీ కాగా, మహాత్మ గాంధీ యూనిర్సిటీ పరిధిలో మాత్రం కేవలం 5,416 సీట్లలో మాత్రమే ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులకు అనుకూలంగా లేని అకడమిక్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ తదితర కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలను ఎంచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు, ఆధునిక కోర్సులకూ డిమాండ్ ఉందని, కానీ, ఎంజీయూ పరిధిలో మాత్రం ప్రవేశాలు గణనీ యంగా తగ్గి పోతుండడం ఆందోళన కలిగి స్తోందన్న అభిప్రా యం వ్యక్తం అవుతోంది. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో సైతం సీట్లు మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతోందని పేర్కొంటున్నారు. యూ నివర్సిటీ అధికారులు ఇప్పటికైనా.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగిలే, విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. -
ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి బ్యూరో(కృష్ణా) : పెద్దలు చెప్పినట్లు ఆలస్యం చేస్తే అమృతమైనా విషమవుతుందన్న చందంగా ఉంది ఇంజినీరింగ్ కాలేజీల అడ్మిషన్ పరిస్థితి. ప్రతి ఏడాది జరుగుతున్న షెడ్యూల్ కాకుండా ఈ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఏడాది తీవ్ర జాప్యం జరగటంతో విద్యార్థులు ఇతర మార్గాలు అన్వేషించటంతో జిల్లాలో ఇంజనీరింగ్ సీట్లు నిండుతాయా లేదా అన్న అనుమానం రేకెత్తుతోంది. సాధారణంగానే జిల్లాలోని కాలేజీలలో సుమారు ఐదు వేల సీట్లు గతేడాది ఖాళీగా ఉన్నాయి. అసలే ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఆడ్మిషన్లు ఆలస్యమవటంతో కాలేజీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు కృష్ణా జిల్లా పరిధిలో 34 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ బ్రాంచ్‌లలో 18,090 సీట్లు ఉన్నాయి. ఇది వరకు మరో ఐదు వేల సీట్లు ఉన్నప్పటికీ ఆడ్మిషన్లు తగ్గటంతో కాలేజీలు తమకున్న సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. ఫార్మసీ కాలేజీలు 11 ఉండగా అందులో 1,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో వర్శిటీ కాలేజీలు లేవు. జిల్లాలో 26,799 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయగా అందులో 20,743 మంది ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలతో జాప్యం! ఏపీ ఎంసెట్ పరీక్షను అనుకున్న సమయానికే నిర్వహించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఫలితాలను విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వచ్చిన గందరగోళమే. తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షను నాన్ లోకల్ కేటగిరిలో రాశారు. ఎంసెట్ ర్యాంకులు ప్రకటించటానికి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరగటం, విద్యార్థులు కోర్టులకెక్కటం వంటి కారణాలతో వారి మార్కులను తెలంగాణ ఇంటర్ బోర్డు ఏపీ ఎంసెట్ అధికారులకు అందజేయలేదు. దీంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమైంది. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అడ్మిషన్లు ఏపీ ఎంసెట్ ప్రక్రియ ఆలస్యం అవ్వటంతో మన విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటకలలోని ప్రముఖ కాలేజీలకు క్యూ కట్టి మరీ అడ్మిషన్లు పూర్తి చేస్తున్నారు. ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందో రాదో...ఆలోగా పక్క రాష్ట్రాలలో సీట్లు భర్తీ అయిపోతాయేమోనన్న భయంతో అడ్మిషన్ల విషయంలో తొందరపడ్డారు. ప్రతి ఏడాది పక్క రాష్ట్రాలకు అడ్మిషన్లు పోయినప్పటికి ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని పేరుమోసిన డీమ్డ్ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందటానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. మరో వైపు సాంప్రదాయ డిగ్రీ విద్యకు ఆదరణ పెరగడం కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య తగ్గటానికి కారణమవుతోంది. ఆందోళనలో యాజమాన్యాలు... ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యమవటం, విద్యార్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారన్న సమాచారంతో ఇంజనీరింగ్ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలే కళాశాలలో అడ్మిషన్లు తగ్గి, గత ప్రభుత్వం సరిగ్గా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ఇబ్బందిపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు భవిష్యత్ గురించి బెంగపెట్టుకున్నారు. ఇతర మార్గాలు అన్వేషించకుండా ఇక్కడే ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్న విద్యార్థులు సైతం ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందా, అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఫార్మసీ కాలేజీలు, విద్యార్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీలు 34 ఇంజినీరింగ్ సీట్లు 18,090 ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య 26,799 ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 20,743 -
‘దోస్త్’ షురూ
పాపన్నపేట (మెదక్): దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) పద్ధతిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో ఆన్లైన్ ప్రవేశాలు జరగనున్నాయి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా 2016లో దోస్త్ పద్ధతిన తెలంగాణలో ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను గుర్తించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులతో పాటు కొత్త సౌకర్యాలు కల్పించారు. డిమాండ్‌లేని కోర్సుల సీట్లకు కోత విధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత అందులో పాసైన వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఇంటర్లో ఫలితాలు తగ్గిన నేపథ్యంలో డిగ్రీ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు జిల్లాలో నాలుగు ప్రభుత్వ, 15ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. 2016 వరకు ఇంటర్‌పరీక్షల్లో సాధించిన మార్కులు, కుల, స్పోర్ట్స్, దివ్యాంగుల రిజర్వేషన్లకు అనుగుణంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించేవారు. 2016లో దోస్త్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కులు, రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు కళాశాల కేటా యిస్తారు. ఈ విధానంపై మొదట్లో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. మీసేవతోపాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నుంచి విద్యార్థులు రిజస్ట్రేషన్ చేసుకునేవారు. కొంతమందికి వేలి ముద్రలు నమోదు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెం దిన విద్యార్థులు ఆన్లైన్ సౌకర్యం అందుబా టులో లేక, వాటిపై అవగాహన కరువై ఇంటర్‌తోనే విద్య మానేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రైవేట్, 20 మైనార్టీ డిగ్రీ కళాశాలలు దోస్తులో చేరకుండా సొంతంగా ప్రవేశాలు చేసుకుంటున్నాయి. -
డిగ్రీ ప్రవేశాల్లో ఆన్లైన్ రిపోర్టింగ్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు సులభంగా ఉండే ప్రవేశాల విధానానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) శ్రీకారం చుట్టింది. పలు కొత్త విధానాలను రానున్న విద్యాసంవత్సరం ప్రవేశాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో చేపడుతున్నా.. సీట్లు లభించిన విద్యార్థులు మళ్లీ ఫిజికల్‌గా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే త్వరలో చేపట్టే ప్రవేశాల్లో ఆ విధానానికి çఫుల్స్టాప్ పెట్టాలని దోస్త్ నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో చేపట్టబోయే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సులభతర విధానాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ తరహా విధానం.. దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులు చేరే డిగ్రీ ప్రవేశాల్లో ఇంజనీరింగ్ తరహా ప్రవేశాల విధానం తేవాలని దోస్త్ నిర్ణయించింది. సీట్లు లభించే విద్యార్థులకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం కల్పించనుంది. అలాగే విద్యార్థులు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే అయిన టీ వాలెట్ ద్వారా (క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్) ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొదటిదశలో సీటొచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు రెండవ, మూడో కౌన్సెలింగ్‌ల్లో స్లైడింగ్ ద్వారా మరో కాలేజీకి వెళ్లే వీలుంటుంది. ఈ క్రమంలో గతంలోలాగా కాలేజీలు విద్యార్థులను మరో కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే అవకాశముండదు. అన్ని దశల కౌన్సెలింగ్‌ల్లో పాల్గొనే చాన్స్.. గతేడాది ప్రవేశాల్లో మొదటిదశలో సీట్లు లభించిన విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఈసారి ఎన్ని దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తే అన్ని దశల్లో పాల్గొని తమకు ఇష్టమై న కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. ఇటు ఆన్లైన్ ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే ప్రతి సమస్యను పాత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే 10 స్పెషల్ హెల్ప్‌లైన్ సెంటర్లలో పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. మార్పులకు సంబంధించి దోస్త్ కన్వీనర్ స్థాయిలో చేయగలిగే మార్పులను కూడా జిల్లా స్థాయిలో చేసేలా అధికారాలను కల్పించనుంది. అక్కడా పరిష్కరించలేని సమస్యలుంటే జిల్లా స్థాయిలోని స్పెషల్ హెల్ప్‌లైన్ సెంటర్ కోఆర్డినేటరే ఆ సమస్యను రాష్ట్ర స్థాయిలో కళాశాల విద్యా కమిషనర్/దోస్త్ కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి తెలియజేసేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఇక ఈసారి విద్యార్థులు మీసేవ కేంద్రం, ఆధార్ ఆధారిత మొబైల్‌తో పాటు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే 76 హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనూ ఉచితంగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఈ నెల 15న జారీ చేసి, 16 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని.. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. స్లైడింగ్‌లో జాగ్రత్త: దోస్త్ కన్వీనర్ ఒకసారి సీటొచ్చిన విద్యార్థికి తర్వాత స్లైడింగ్‌లో మరో కాలేజీలో సీటొస్తే తాజాగా వచ్చిన సీటే ఉంటుందని, ముందుగా వచ్చిన సీటు ఆటోమేటిగ్గా పోతుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని, కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ముందుగా సీటొచ్చిన కాలేజీ కంటే మంచి కాలేజీలను ఎంచుకోవాలని, అప్పుడు అందులో సీటొస్తే వస్తుంది.. లేదంటే మొదట వచ్చిన సీటే ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదన్నారు. -
డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి హైదరాబాద్‌లో చదువుకోవాలని కోరిక. రాజధానిలోని ఓ కాలేజీకి మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఇవ్వడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీ బాగా లేదని, మరో కాలేజీకి వెళ్లేందుకు రెండో దశలో ఆప్షన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ‘‘మీకు మొదటి ప్రాధాన్యతలో సీటు లభించింది కాబట్టి రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని తొలగించాం..’’అని దోస్త్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవ్వడంతో ఆ విద్యార్థి ఆందోళనలో పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో వరంగల్‌కు చెందిన ఓ కాలేజీ యాజమాన్యం తమ లెక్చరర్లతో ఇంటర్ పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి.. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులతోనే తమ కాలేజీలో చదువుకోవచ్చని నమ్మబలికింది. ఐదారుసార్లు ఓ లెక్చరర్ వెళ్లడంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేశారు. అంతే తమ కాలేజీలో సీటు వచ్చేలా ఆ లెక్చరర్ ఆప్షన్ ఇవ్వడంతో అందులో సీటు వచ్చింది. విద్యార్థికి కాలేజీ నచ్చలేదు. పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా ఫీజు చెల్లించాలని, లేకపోతే మీకు బయట కూడా సీటు రాదని యాజమాన్యం పేర్కొంటోంది. దీంతో విద్యార్థి గందరగోళంలో పడ్డారు. రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ..వీరిద్దరే కాదు.. వేలాది మంది విద్యార్థులదీ ఇదే దుస్థితి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అవగాహనాలోపం, కొన్ని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రచారం, మోసం కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం లేకపోవడంతో గత్యంతరం లేక మొదటి దశలో సీటు వచ్చిన కాలేజీల్లోనే చేరాల్సిన అగత్యం దాపురించింది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 1.21 లక్షల మంది విద్యార్థులకు సీట్లు లభించగా, మొదటి ఆప్షన్ మేరకు సీటు లభించిన 85 వేల మంది ఉన్నారు. వీరిలో చాలా మందిది ఇదే పరిస్థితి కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొదటి దశలో, మొదటి ఆప్షన్ మేరకు సీట్లు వచ్చిన వారంతా ఆయా కాలేజీల్లో చేరాల్సిందే. లేదంటే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ సీటును వదిలేసుకోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంసెట్‌లోనే లేని విధానం ఇక్కడెందుకు? ఇంజనీరింగ్ వంటి చదువులకు వెళ్లలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పెద్దగా అవగాహన లేని విద్యార్థులే డిగ్రీలో చేరేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఇలాంటి నిబంధన సరికాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అవగాహన లేక ముందుగా ఆప్షన్ ఇచ్చినా, యాజమాన్యాల మోసం కారణంగా నష్టపోతే దానిని సరిదిద్దుకునే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇలాంటి నిబంధన లేదని, ఏ దశలో సీటు వచ్చినా విద్యార్థులు చివరి దశ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని, డిగ్రీలోనూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం ఇస్తే కొన్ని యాజమాన్యాలు తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా విద్యార్థులు అప్షన్లు ఇచ్చుకునేలా ప్రలోభ పెట్టి మోసం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ మొదటి దశలోనే అలాంటి మోసాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
ఆధార్ లింకేజీతో అగచాట్లు
సిరిసిల్లకల్చరల్ : ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్ వెబ్సైట్ ఈ సారి మరింత çకఠినతరంగా మారింది. పకడ్బందీగా రూపొందించిన వెబ్సైట్లో డిగ్రీలో ప్రవేశం కోరే విద్యార్థికి నిర్దిష్ట మొబైల్ నంబర్ ఉండాలి. అది కచ్చితంగా అదే విద్యార్థి ఆధార్‌కార్డు నంబర్‌తో లింకు అయి ఉండాలి. ఈ నిబంధనే ప్రధాన సమస్యగా పరిణమించింది. అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. అవగాహన లేమితో చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ మొబైల్ నంబర్‌తో ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయించుకోలేదు. ఈ విషయం అంత సీరియస్‌గా పట్టించుకోక పోవడంతో అడ్మిషన్ల ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియ మందగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల దరఖాస్తుల కన్నా మించలేదని సమాచారం. ఆధార్ కేంద్రంలోనూ అవస్థలే.. ప్రతి విద్యార్థి మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్‌ను సీడ్ చేయించుకునే నిమిత్తం ఆధార్ సేవా కేంద్రాలతో పాటు ఈ సేవ, మీసేవ కేంద్రాలకు అవకాశం కల్పించారు. అయితే వీటిలోనూ సేవాలోపాలున్నాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో రోజుకు 50 మంది కార్డుల సవరణకే వీలు కల్పిస్తున్నారు. మిగిలిన ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో చాలా వరకు సర్వర్ సమస్యలు, సిగ్నల్ సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకవేళ అవకాశం దొరికినా సంబంధిత ప్రక్రియ ముగిసేందుకు కనీసం 72 గంటల సమయం పడుతోంది. ఒక్కోసారి ఈ సమయం వారం దాకా కొనసాగుతోంది. ముగియనున్న గడువు డిగ్రీ అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఒకే రిజిస్ట్రేషన్‌తో రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల పరి«ధిలోని ఏ కళాశాలలోనైనా ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతో పాటు కావాలనుకున్న కళాశాలలో సీటుకోసం ఆప్షన్లు ఇచ్చుకునేలా సైట్‌ను రూపొందించింది. రిజిస్ట్రేషన్ రుసుము రూ. 200గా నిర్ణయించింది. తొలి దశ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 26తో ముగియనుంది. రూ. 400 మరో మూడురోజులపాటు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దీంతో చాలా మంది అడ్మిషన్లు గడువు లోగా ముగిసేలా కనిపించడం లేదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం.. ఈసారి డిగ్రీ ప్రవేశ దరఖాస్తుతో పాటు స్కాలర్షిప్ దరఖాస్తును కూడా ముడి పెట్టారు. ఫీజు రి యింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ను ఆశించే ప్రతి వి ద్యార్థి వి«ధిగా మీ సేవ కేంద్రాలనుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలి. కాగా అంతకుముందు ప్రతి దరఖాస్తును సంబం«ధిత వీఆ ర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సిఫారస్ చేయాల్సి ఉంటుం ది. డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై న రోజునే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు ప థకం కూడా ప్రారంభమైంది. ఈ కారణంగా రె వెన్యూ అధికారులంతా ఆ దిశగా బిజీగా ఉండిపోయారు. వీఆర్వో స్థాయి నుంచి డీఆర్వో స్థాయి అ« దికారులంతా చెక్కుల పంపిణీలో తల మునకలై ఉండడంతో విద్యార్థులను పట్టించుకునే వారు క రువయ్యారు. దీంతో సమీప గ్రామాల విద్యార్థులు దరఖాస్తులు పట్టుకుని తహసీల్దార్ కార్యాల యం పరిసరాల్లో ఎదురు చూపులు చూస్తున్నారు. గడువు పెంచడమే శరణ్యం వివిధ కారణాలతో డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మందగించిన మేరకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచడమే శరణ్యంగా పలు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన వి«ధివిధానాలపై జూనియర్ కాలేజ్ స్థాయిలో విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తకపోయేది. ఆధార్ కార్డు లింకేజ్‌తో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంచడమే అనివార్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కామన్ అకడమిక్ కేలండర్లో కూడా మార్పులు జరిగే పరిస్థితులూ ఏర్పడవచ్చు.