Department of Defense
-
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి -
‘ఐఎన్ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్‌గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి రాజ్‌నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్‌లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, కలెక్టర్ డా.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంధాయక్ షిప్ విశేషాలు ► నాలుగు భారీ సర్వే వెసల్స్ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళానికి షిప్‌ని అప్పగించారు. ► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్ మైళ్లు. ► 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. ► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు. ► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది. ► అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటర్ బోట్స్, డిజిటల్ సైడ్ స్కానర్ సోనార్, రిమోట్ ఆపరేటింగ్ వెహికల్స్ ఇందులో ఉంటాయి. ► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. ► అండర్ వాటర్ వెహికల్స్, వెపన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ► సముద్రజలాల సర్వే మ్యాప్ కోసం అవసరమైన మల్టీ బీమ్ ఎకో సౌండర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్ షిప్గాను సేవలందించగలదు. ► పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ పాత్రల్ని కూడా సంధాయక్ సులువుగా నిర్వర్తించగలదు. ► సంధాయక్ నౌకకు మొదటి కమాండింగ్ అధికారి కెప్టెన్ ఆర్.ఎం.థామస్. దేశీయంగానే సబ్మెరైన్ల తయారీ అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్‌లో సంధాయక్ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్‌లు, సబ్మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఇండియన్ నేవీ చీఫ్ -
రష్యా రక్షణ శాఖ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని మరో ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందారు. రక్షణ శాఖలో పని చేస్తున్న 58 ఏళ్ల మరీనా యాంకినా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అపార్ట్మెంట్లో 16వ అంతస్తులో ఉన్న తన నివాసం కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి కిండ పడిపోవడంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో ఉన్న మరీనాను ఆ మార్గం నుంచి వెళుతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై జరిపే యుద్ధంలో నిధుల సేకరణలో మరీనా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
కంటోన్మెంట్ విలీనంపై కమిటీ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రతిపాదన విధి, విధానాల రూపకల్పనకు ఎనిమిది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగనుంది. రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ, అడిషనల్ పైనాన్షియల్ అడ్వైజర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, డిఫెన్స్ ఎస్టేట్స్ అడిషనల్ డీజీ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీజీ, డిఫెన్స్ ఎస్టేట్స్ సదరన్ కమాండ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీలోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎంఓడీ ప్రతిపాదనకు అనుగుణంగా.. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాలను ఆర్మీ నుంచి విడదీసి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతూ గతేడాది మే 23న రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా, సివిల్ ఏరియాలను తమ పరిధిలోనికి తీసుకునేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ తన అంగీకారం తెలుపుతూ గత నెల 14న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 9న తొలి సమావేశం విలీనంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఈ నెల9న వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని భూములు, స్థిర, చరాస్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, రోడ్లు, ట్రాఫిక్, రికార్డులు, స్టోర్ తదితర అన్ని రకాల బదలాయింపుపై రోడ్‌మ్యాప్ రూపొందించనుంది. కమిటీ తొలి భేటీకి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలక ఆదేశాన్ని కమిటీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు? మిలటరీ శిక్షణ కేంద్రాలు, కార్యాలయాలు, స్థలాలకు 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నిర్మాణాల విషయంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో మాత్రం మినహాయింపు ఉంది. తాజాగా కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపనుండటంతో 500 మీటర్ల నిబంధనను ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఆర్మీ ముందస్తుగానే ప్రకటించింది. దీనికి తోడు ఆర్మీ స్థావరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించబోమని కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశముంది. వికాస్ మంచ్ హర్షం.. బాణసంచా కాల్చి సంబురాలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కంటోన్మెంట్ వికాస్ మంచ్ (సీవీఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీవీఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్
కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్ఎల్ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే. -
Predator drone deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్ ఆటమిక్స్ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్ ఆటమిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ వివేక్ లాల్ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్–కిల్లర్ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలవు. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్‌తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది. వాయవ్య దిక్కు నుంచి కీవ్‌ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్‌ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. మారియుపోల్‌లో వినాశనం కీలక రేవు పట్టణం మరియుపోల్‌లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్‌లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు. ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు. యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మంగళవారం చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే. -
కేంద్రం అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రక్షణ శాఖకు చెందిన భూముల్లో కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటి జోలికి వెళ్లడానికి వీల్లేదని, నిర్మాణాలు చేపట్టరాదని తేల్చిచెప్పింది. సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానంలో సచివాలయం, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావుతో పాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. అయితే ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రాంతంలోనే నూతన సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, బైసన్ పోలో, జింఖానా మైదానంలో నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించు కుందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. హైకోర్టు భవనాలకు మాత్రం నిధుల్లేవా? ‘సచివాలయం నిర్మాణానికి నిధులుంటాయి. హైకోర్టులో అదనపు భవనాల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా? నూతనంగా వస్తున్న న్యాయమూ ర్తులకు కోర్టు హాళ్లు, చాంబర్లు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏజీ, బార్ కౌన్సిల్ కార్యాలయాలను కూడా ఖాళీ చేయించాల్సి ఉంటుంది..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 100 ఎకరాల భూమి కేటాయించిందని, అయితే అక్కడ నిర్మాణాలకు హైకోర్టు సుముఖంగా లేదని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. -
నేవీ కొత్త చీఫ్‌గా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. ఈనెల 30వ తేదీన రిటైర్ కానున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి అదే రోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. కేరళకు చెందిన హరికుమార్కు కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది. -
భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే!
‘‘పిట్ట కొంచెం.. కూత ఘనం’’ ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో సోమవారం... నిప్పులు చిమ్ముకుంటూ పైకెగసిన క్షిపణి ‘‘అగ్ని–ప్రైమ్’’... ఈ సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ. చిన్న సైజులో ఉండటం మాత్రమే దీని విశేషం కాదు... అత్యాధునిక టెక్నాలజీలు నింపుకుని... తొలి అగ్ని క్షిపణికి రెట్టింపు దూరపు లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు!! భారత రక్షణ తూణీరపు సరికొత్త ఆయుధం కూడా ఇదే!! భారతదేశం తనకంటూ సొంతంగా క్షిపణులు ఉండాలని 1980లలోనే భావించి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలామ్ నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తొలి ఫలం ‘‘అగ్ని’’. సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. అయితే, ఆ కాలం నాటి టెక్నాలజీలతో పనిచేసే క్షిపణులను ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఐదేళ్ల క్రితం చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే సరికొత్త అగ్ని–ప్రైమ్ సిద్ధమైంది. ఇరుగుపొరుగు దేశాలతో ముప్పు ఏటికేడు పెరిగిపోతున్న నేపథ్యంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని–ప్రైమ్ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలి తరం అగ్ని పరిధి 1,000 కిలోమీటర్ల లోపు కాగా.. అగ్ని–ప్రైమ్ సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టగలదు. ఇంకోలా చెప్పాలంటే తొలి తరం అగ్ని క్షిపణి పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారైతే.. అగ్ని–ప్రైమ్ కొత్త శత్రువు కోసం సిద్ధం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే.. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే.. చైనా మధ్యలో ఉండే లక్ష్యాన్ని కూడా ఢీకొట్టవచ్చు. కొంగొత్త టెక్నాలజీలు... అగ్ని శ్రేణి క్షిపణుల ఆధునీకరణకు 2016లోనే బీజం పడింది. ఇందులో భాగంగా సిద్ధమైన అగ్ని–ప్రైమ్‌లో అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల్లో వాడిన టెక్నాలజీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయి క్షిపణుల్లో ఈ టెక్నాలజీల వాడకం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రెండు దశల అగ్ని–ప్రైమ్‌లో పూర్తిస్థాయిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యి కిలోల అణ్వస్త్రాలను సులువుగా మోసుకెళ్లగలదు. రెండు దశల్లోనూ మిశ్రధాతువులతో తయారైన రాకెట్ మోటార్లను ఉపయోగిస్తున్నారు. క్షిపణిని లక్ష్యం వైపునకు తీసుకెళ్లే గైడెన్స్ వ్యవస్థలో ప్రత్యేకమైన ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ వినియోగించారు. కచ్చితత్వాన్ని సాధించేందుకు అత్యాధునిక రింగ్ లేజర్ జైరోస్కోపులు ఉంటాయి దీంట్లో. ఉక్కుతో చేసిన మోటార్ల స్థానంలో మిశ్రధాతువులను వాడటం ద్వారా సైజు, బరువు తగ్గడం, మరింత ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యమైంది. ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ కారణంగా గతంలో మాదిరిగా క్షిపణుల్లో లీకేజీల్లాంటివి ఉండవు. నావిగేషన్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా లక్ష్యాన్ని ఢీకొట్టే అవకాశాలు పెరుగుతాయి. గతంలో మాదిరిగా వేర్వేరు వైమానిక వ్యవస్థల స్థానంలో పవర్ పీసీ ప్లాట్ఫార్మ్పై ఒకే ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా క్షిపణిని మరింత శక్తిమంతంగా మార్చడం సాధ్యమైంది. ఈ టెక్నాలజీలన్నింటినీ 2011లో అభివృద్ధి చేసిన అగ్ని–4లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసినవే. అగ్ని–2.... 2004లో అందుబాటు లోకి వచ్చింది. మధ్య శ్రేణి క్షిపణి. 20 మీటర్ల పొడవు, 2.3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో దీని బరువు 16 వేల కిలోలు. వెయ్యి కిలోల అణ్వస్త్రాన్ని క్షిపణిని మోసుకెళ్లగలదు. దీని పేలుడు హిరోషిమా, నాగసాకీ అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అంచనా. లక్ష్యాన్ని కేవలం 40 మీటర్ల తేడాలో ఢీకొట్టగలదు. పేలుడు పదార్థం బరువును తగ్గిస్తే ఈ క్షిపణి పరిధిని మరింతగా పెంచవచ్చు. అగ్ని –3... మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేసిన క్షిపణి ఇది. బీజింగ్, షాంఘైలనూ ఢీకొట్టగలదు. దాదాపు 16.7 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో బరువు 48,000 కిలోలు. రెండు వేల కిలోల బరువున్న అణ్వాస్త్రాన్ని మోసుకెళ్లగలదు. కొన్నింటిలో ఒకే రాకెట్ ద్వారా వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టగల మల్టిపుల్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీతో ఒకే రాకెట్‌ను ఉపయోగించి వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టవచ్చు నన్నమాట. 2011 నుంచి దేశసేవకు అందుబాటులో ఉంది. అగ్ని–4... నుంచి అందుబాటులో ఉన్న అగ్ని–4 పరిధి 3,500– 4,000 కిలోమీటర్లు. ఇరవై నుంచి 45 కిలోటన్నుల పేలుడు సామర్థ్యమున్న ఫిషన్ అణ్వాయుధాన్ని, 200– 300 కిలోటన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యూజన్ బాంబును మోసుకెళ్లగలదు. ఇరవై మీటర్ల పొడవుండే రెండు దశల ఘన ఇంధనపు క్షిపణి ప్రయోగ సమయంలో 17,000 కిలోల బరువు ఉంటుంది. అగ్ని – 5 2018 డిసెంబర్లో విజయవంతంగా ఏడో పరీక్ష ముగించుకున్న అగ్ని –5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా పది మీటర్ల తేడాతో ఢీకొట్టగలదు. దీని పరిధి అనధికారికంగా 8 వేల కిలోమీటర్లపై మాటే అని అంచనా. వేర్వేరు లక్ష్యాలను ఛేదించేందుకు ఎంఆర్ఐవీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో. అవసరాన్ని బట్టి రెండు నుంచి పది వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దాదాపు 1,500 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. – సాక్షి, హైదరాబాద్. -
చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్ జెట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది. కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది. విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్ జెట్ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్ జెట్ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్ జెట్ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న “సాక్షి’ పత్రికలో కార్గో సర్వీసుల ప్రతిపాదన నిలిచిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు. కల నిజమాయెగా.. ప్రస్తుతం కార్గో విమానాలు లేక వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ,రైల్వే రవాణా ద్వారా సరకులు నడుపుతున్నారు. కార్గో విమానాల కోసం ఫార్మాకంపెనీల దృష్టీ కేంద్రీకృతమైంది. కార్గో విమానాల రాకపోకల వల్ల ఆదాయం పెరుగుతుందని, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సరకులు విశాఖకు తరలివచ్చే వీలుందన్న వాస్తవం కనిపిస్తోంది. విదేశీ మారక ద్రవ్యం కూడ వచ్చేఅవకాశం ఉందని, కార్గో విమానాల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్గో విమానాలు రావాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.. కాని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కె.కుమార్ రాజా, డి.ఎస్.వర్మ, ఒ.నరేష్కుమార్ పట్టువదలని విక్రమార్కుడి స్పూర్తితో అంతా కృషి చేశారు. ఈ విమానం నడపడానికి సహకారం అందించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇతర విమాన సంస్థలకు నరేష్కుమార్ కృతజ్ఙతలు తెలిపారు. ఫలించిన ఎంపీ ప్రయత్నం విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు కార్గో విమానాలు నడపాలని విశాఖ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎంవివి సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలో లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రులను ఆయన కలిసి విమానాల కోసం చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లు చేయడానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఎయిర్ ట్రాఫిక్ 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో విమానాలు రాకపోకలకు రక్షణ శాఖ అభ్యంతరం చెబుతుందని, దీనివల్ల అనేక విమాన సంస్ధలు సర్వీసులు నడపడానికి ఆసక్తి చూపడం లేదని ఎంపి లేఖలో పేర్కొన్నారు. సమాంతర టాక్సీ ట్రాక్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తగా నిర్మించిన ఎన్5 టాక్సీ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలనికోరారు. ఇవీ వేళలు కార్గో విమానాలు విశాఖ నుంచి దేశంలో ముఖ్యమైన పట్టాణాలకు నడుపుతున్నారు. చెన్నై, కోల్‌కతా, సూరత్ తదితర ప్రాంతాలకు ఈనెల 25 నుంచి నడుపుతున్నారు. రోజు తప్పించి రోజు ఈ విమానాలు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11.50 గంటలకు విశాఖ వచ్చే విమానం, విశాఖ నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరుతుంది. చెన్నై–వైజాగ్– కోల్‌కతా ఒక రూటు, చెన్నై– విశాఖ–సూరత్‌కు విమానాలు నడుపుతున్నట్టు సంఘం ప్రతినిధి నరేష్కుమార్ తెలిపారు. -
దేశ భద్రతకు భరోసా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి.. డీఆర్డీవో చైర్మన్‌గా ఎదిగిన తెలుగుతేజం డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి.. రక్షణరంగంలో సాగుతున్న పరిశోధనల గురించి ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.. సాక్షి: డీఆర్డీవో చీఫ్ అయ్యారు.... రక్షణ శాఖ (పరిశోధన, అభివృద్ధి) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. వృత్తిపరంగా మీ ప్రయాణం చూస్తుంటే... విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జర్నీ గుర్తుకొస్తోంది. శాస్త్రవేత్త నుంచి అత్యున్నత బాధ్యతలు మోస్తూ సాగుతున్న మీ ప్రయాణం ఎలా ఉంది? సతీష్‌రెడ్డి: డీఆర్డీవోకు కలాం గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నేను చేరాను. ఆయన నేతృత్వంలో ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిసూల్, నాగ్ మిస్సైల్స్ రూపకల్పనలో నేను పాలుపంచుకోవడం భగవంతుడు ఇచ్చిన వరం. యువశాస్త్రవేత్తలకు కలాం గారి ప్రోత్సాహం అద్భుతం. సాక్షి: ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్’ను కలాం ప్రారంభించారు. మీ నేతృత్వంలో ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇలాంటి ల్యాండ్‌మార్క్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సతీష్‌రెడ్డి: ‘మిషన్ శక్తి’ అలాంటిది. భూకక్ష్యలో తిరుగుతున్న మన శాటిలైట్ల భద్రతకు అవసరమైన ప్రాజెక్టు చేయమని ప్రధానమంత్రి సూచించారు. అందుకోసం యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేశాం. ఇలాంటి పరిజ్ఞానం, సామర్థ్యం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ‘గ్లోబల్ స్పేస్ పవర్’గా ఎదిగాం. రక్షణ రంగానికి సంబంధించి స్పేస్, సైబర్ రంగంలో విస్తృత పరిశోధనలు అవసరం. ‘ఫ్యూచర్ టెక్నాలజీస్’ను అభివృద్ధి చేయాలి. అండర్ వాటర్ వెహికల్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది 5వ జనరేషన్ యుద్ధ విమానం. దీన్ని తయారు చేస్తే.. భారతదేశం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సుదూరతీరంలోని చిన్న వస్తువును కూడా చూడగలిగిన రాడార్స్ తయారు చేయాలి. హైపర్ సానిక్ మిసైల్స్‌ను తయారు చేయనున్నాం. తేలికపాటి యుద్ధ విమానం మార్క్–2 పరిశోధన దశలో ఉంది. ఇవన్నీ ల్యాండ్‌మార్క్ కార్యక్రమాలే. సాక్షి: ‘మిషన్ శక్తి’తో దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? సతీష్‌రెడ్డి: ప్రపంచ దేశాల్లో మన పట్ల గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించకుండా ఆపుదామనే ప్రయత్నాలు మానుకుంటాయి. అలాగే మన ఉపగ్రహాలకు హాని తలపెట్టేందుకు ఏ దేశమూ సాహసించదు. సాక్షి: రక్షణ రంగంలో నూరు శాతం స్వావలంబన జాతి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దిశగా ప్రయత్నాలు... ప్రత్యేకించి మిస్సైల్ రంగంలో ప్రగతిని వివరించండి? సతీష్‌రెడ్డి: దిగుమతులు తగ్గించి స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం 45–50 శాతం మాత్రమే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వాటిని వాడుతున్నాం. దీన్ని 75–80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. వచ్చే 5–10 ఏళ్లలో ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాక్షి: క్రిటికల్ కాంపోనెంట్స్‌కి ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్నాం. పూర్తిగా మనదేశంలో తయారయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? సతీష్‌రెడ్డి: ఇప్పుడు మనం పెద్దగా ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. చాలా వరకు మనం ఉత్పత్తి చేస్తున్నాం. సెన్సర్స్, చిప్స్ మనం కొంత మేర తయారు చేసుకోగలుగుతున్నాం. అడ్వాన్స్డ్ సెన్సర్స్, చిప్స్ కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అవి కూడా మనమే తయారు చేసుకొనే రోజు దగ్గర్లోనే ఉంది. సాక్షి: మానవ రహిత యుద్ధ విమానం మన సైన్యానికి అందుబాటులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? సతీష్‌రెడ్డి: చాలా దేశాలు దీని మీద పరిశోధనలు చేస్తున్నాయి. మనం ఇంకా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. డీఆర్డీవో పరిశోధనలు ప్రారంభిస్తుంది. పరిశోధన మొదలు పెడితే... తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సాక్షి: భవిష్యత్తులో మన సైన్యానికి అందనున్న ఆయుధాలు ఏమిటి? సతీష్‌రెడ్డి: ప్రపంచంలోనే లాంగెస్ట్ రేంజ్ గన్ మనం తయారు చేశాం. దీన్ని ‘అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్’ అంటారు. 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. 155 ఎంఎం క్లాస్ గన్‌లో ఇదే పెద్దది. త్వరలో దీన్ని సైన్యానికి అందిస్తాం. అండర్‌వాటర్ వెహికల్స్, తేలికపాటి యుద్ధ విమానాలు, సరికొత్త టెక్నాలజీ ట్యాంకులు, లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. సాక్షి: ఇప్పటికీ చిన్న, తేలికపాటి ఆయుధాలకు దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. డీఆర్డీవో దీనిమీద పనిచేయడం లేదా? సతీష్‌రెడ్డి: కొరతను త్వరలో అధిగమించనున్నాం. కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మిగతావి ఇక్కడే తయారు చేస్తున్నాం. దిగుమతి చేసుకున్న టెక్నాలజీతో తయారు చేస్తున్నాం. సాక్షి: సియాచిన్ వంటి ప్రతికూల పరిస్థితులుండే ప్రాంతాల్లో సైనికులకు పనికొచ్చే చిన్న చిన్న పరికరాలు, ఆహార పదార్ధాలు, అత్యాధునిక దుస్తులు, బూట్లు... ఒక్కోసారి విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ దిశగా రక్షణరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయా? సతీష్‌రెడ్డి: సైనికులకు ప్రతికూల పరిస్థితుల్లో మనగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీవో అందిస్తోంది. వారికి అందించాల్సిన ఆహారం, దాన్ని వేడిగా ఉంచడం, ఎముకలు కొరికే చలిలో వేసుకొనే డ్రెస్, చేతి గ్లౌజ్, హెల్మెట్, షూస్... అన్ని అంశాల్లోనూ పరిశోధనలు చేశాం.. చేస్తున్నాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులను ముందే కనిపెట్టి హెచ్చరించే వ్యవస్థను రూపొందించాం. సైనికులకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే పానీయాలు, తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం అందించడం మీద పరిశోధనలు చేశాం. ఇప్పుడు ‘గగన్‌యాన్’లో పాల్గొననున్న వ్యోమగాములకు ఈ ఆహారాన్నే ఇవ్వనున్నాం. పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సతీష్‌రెడ్డి: రక్షణరంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఒకప్పుడు మేము ఇచ్చిన డ్రాయింగ్స్ ఆధారంగా వస్తువులు తయారు చేసి ఇచ్చేవి. ఇప్పుడు మా పేటెంట్స్‌ను వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. టెక్నాలజీ బదిలీ చేసినప్పుడు గతంలో ఫీజు వసూలు చేసే వాళ్లం. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం. ఆకాశ్ మిస్సైల్ తయారీకి రూ. 25 వేల కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో 87 శాతం ప్రైవేటు పరిశ్రమల నుంచి తీసుకున్నాం. – మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్‌గానూ కొనసాగుతారు. -
కేంద్రం తీరువల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర రక్షణ శాఖ అవలంబిస్తున్న వైఖరివల్లే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా.. బోర్డు, రక్షణ శాఖ ఆంక్షలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు, కంటోన్మెంట్ బోర్డులో టీఆర్ఎస్ సభ్యులతో తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జంటనగరాల పరిధిలో స్కైవేల నిర్మాణానికి కేం ద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదన్నారు. స్కైవేల నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలు మార్లు కేంద్రానికి వినతులు సమర్పించినా స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి సహకారం లభించడం లేదని, బోర్డు లోని టీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రామన్నకుంట చెరువులోకి మురికినీరు చేరకుండా రూ. రెండున్నర కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం కంటోన్మెంట్ బోర్డుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోర్డు పాలక మండలి ఎన్నికలను పార్టీ చిహ్నాలతో నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సాయన్న కేటీఆర్‌ను కోరారు. సమావేశంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నౌకాదళం పటిష్టతకు కలసి పనిచేద్దాం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: నౌకాదళ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలీయమైన శక్తిగా రూపుదిద్దుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. భారత నౌకాదళం, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరారు. తూర్పు నౌకాదళ అభివృద్ధికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణజ్యోతి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నౌకాదళ అధికారులకు రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. తీర ప్రాంతంలో భద్రతపై జగన్ సమీక్ష భారత నౌకాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. నావికా దళంలో తలెత్తే సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌ను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో భద్రతపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరీ డైనింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మర్యాదపూర్వక విందులో రాజ్‌నాథ్‌సింగ్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, నావికాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. అనంతరం రక్షణ మంత్రితో సీఎం జగన్ మాట్లాడారు. ఆ తర్వాత నౌకాదళ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్ తిలకించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో స్వయంగా రాజ్‌నాథ్‌సింగ్ వాహనం వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. అంతకుముందు నావికాదళం అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి గార్డ్ ఆఫ్ హానర్‌తో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట డీజీపీ గౌతమ్ సవాంగ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కోసం గురువారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రతిపాదన కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. 7.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో వైఎస్సార్సీపీ శ్రేణులను కలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరకున్నారు. అక్కడ ఈస్ట్రన్ నేవల్ కమాండ్(ఈఎన్సీ) సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్మోహన్రెడ్డి వచ్చారు. -
సముద్రాల నుంచి ఆకాశం వరకు..
సాక్షి, చెన్నై/తిరుపూరు: కాంగ్రెస్ పార్టీకి రక్షణ రంగమంటే బ్రోకర్లతో ఒప్పందాలేనని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘సముద్రాల నుంచి ఆకాశం వరకు.. రక్షణ రంగంలో జరిగిన అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది. బ్రోకర్లతో బేరసారాల్లో పడి ఆ పార్టీ అధికారంలో ఉండగా రక్షణ బలగాల ఆధునీకరణ గురించి కూడా పట్టించుకోలేదు’ అని మోదీ ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో రక్షణ శాఖతోపాటు ప్రధాని కార్యాలయం కూడా సమాంతర చర్చలు జరిపిందంటూ ఇటీవల ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ విషయంలో మోదీ ప్రభుత్వంపై ఆరోపణల వాడిని మరింత పెంచారు. రాహుల్ వ్యాఖ్యలకు తమిళనాడులోని తిరుపూరు సమీపంలోని పెరుమనళ్లూరు సభలో మోదీ స్పందిస్తూ ‘దశాబ్దాల తరబడి అధికారంలో ఉండే అవకాశం దక్కినవారు భారత రక్షణ రంగం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. వారికి ఈ రంగం అంటే కేవలం బ్రోకర్లతో చర్చలు జరిపి తమ మిత్రులకు మేలు జరిగేలా చూడటమే. దేశ భద్రత కోసం మేం అనుసరిస్తున్న విధానాలు వేరు. రక్షణకు అవసరమైన అన్ని ఆయుధాలు, పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోవాలనేది మా ప్రభుత్వ కల. అందుకోసమే రెండు రక్షణ కారిడార్లను నిర్మిస్తున్నాం. వాటిలో ఒకటి మీ రాష్ట్రంలోనే వస్తోంది. దీని ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని వివరించారు. ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తే వారు ఇప్పుడు టీవీలు, పత్రికల్లో కనిపిస్తారేమో కానీ, ఎన్నికల్లో వారి గెలుపునకు అది సరిపోదనీ, అందుకు కావాల్సింది దార్శనికత తప్ప దుర్భాషలు, దాడులు కాదని అన్నారు. తిరుపూరు నుంచే మా ప్రచార దుస్తులు పెరుమనళ్లూరులో తన ప్రసంగాన్ని మోదీ ‘వణక్కం’ అంటూ తమిళంలో ప్రారంభించారు. కాంగ్రెస్‌లో నాటి అగ్రనేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కె. కామరాజార్ గొప్ప నాయకుడని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో తమ ప్రచార దుస్తులైన ‘నమో’ టీ–షర్టులు తిరుపూరులో తయారైనవేనని మోదీ తెలిపారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ తిరుపూరులో డీఎండీకే చీఫ్ వైగో నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఒకానొక సమయంలో వైగో ప్రసంగిస్తుండగా అక్కడి జనంలోకి బీజేపీకి చెందిన మహిళ వచ్చి మోదీ అనుకూల నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. చెన్నై, తిరుచ్చిల్లో వివిధ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. సీఎం అయినందుకు కుమారస్వామి విలాపం సాక్షి, బెంగళూరు: తమిళనాడు నుంచి మోదీ కర్ణాటకలోని హుబ్లీకి చేరుకుని ఆ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హుబ్లీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలని మోదీ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాధినేత ఎవరో ప్రజలకు తెలియడం లేదని, తాను ఎందుకు ముఖ్యమంత్రిని అయ్యానో అనుకుంటూ కుమారస్వామి రాత్రులు ఏడుస్తూ కూర్చుంటుంటే మరికొందరు నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కనిపిస్తారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాలకు కుమారస్వామి ఒక పంచింగ్ బ్యాగ్ అవుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కుమారస్వామి అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి అని, సంకీర్ణ ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం నిత్యం కోట్లాట జరుగుతోందని విమర్శించారు. -
రక్షణ మంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణకు వీలుగా రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రక్షణ శాఖ భూముల బదలాయింపుపై ఇప్పటికే అనేక మార్లు ప్రధాని మోదీని కలిశాం. బైసన్‌పోలో స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందని గతంలో ప్రధాని చెప్పారు. తాజాగా హైకోర్టు బైసన్ పోలో స్థలం కేంద్రానిదే అని స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చిం చాం. బైసన్‌పోలో స్థలానికి బదులు స్థలం, కొంత శాతం పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ రాసిన లేఖను కేంద్ర మంత్రికి ఎంపీ వినోద్‌కుమార్ అందజేశారు. రక్షణ మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
‘అంతరిక్ష రంగంలోనూ అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి. ఇందుకోసం మిలటరీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఇప్పటికే ఉన్న ఐదు విభాగాలతో సమాన హోదా ఉంటూనే ఈ ‘స్పేస్ ఫోర్స్’ ప్రత్యేక విభాగంగా పనిచేస్తుంది’.. అంతరిక్ష విధానానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. రష్యా, చైనా మిలటరీ అవసరాల కోసం అంతరిక్ష రంగాన్ని వాడుకునేందుకు అనేక టెక్నాలజీలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో అంతరిక్ష దళం ఏర్పాటు చాలా ముఖ్యమని ట్రంప్ అన్నారు. రేపటి యుద్ధరంగం అంతరిక్షం... భవిష్యత్తులో యుద్ధమంటూ జరిగితే అది అంతరిక్షమే వేదికగా జరుగుతుందని మిలటరీ నిపుణుల అంచనా. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను అంతరిక్షం నుంచే నాశనం చేయడం.. ప్రతిదాడులకూ తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కీలకమవుతుంది. స్టార్‌వార్స్ పేరుతో గతంలో అమెరికా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది కూడా. ట్రంప్ ప్రతిపాదిస్తున్న అంతరిక్ష దళం స్టార్‌వార్స్ తరహాలోనే అంతరిక్షంలో రక్షణ, ప్రతిదాడుల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కానప్పటికీ వీటిల్లో ఏది జరిగినా వివాదాస్పదం అవుతుందన్నది సుస్పష్టం. ఎందుకంటే అమెరికాతోపాటు రష్యా, ఇంకో వంద దేశాలు 1967లో చేసుకున్న అంతరిక్ష పరిరక్షణ ఒప్పందానికి ఇది విరుద్ధం. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మరో ప్రచ్ఛన్నయుద్ధానికి నాంది పలకడమేనని పలువురు పేర్కొంటున్నారు. రష్యా, చైనాల ముందంజ ఆయుధ వ్యవస్థల ఏర్పాటుపై నిషేధం ఉన్నప్పటికీ రష్యా, చైనాలు ఇటీవలి కాలంలో అంతరిక్షాన్ని మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు కొన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసినట్లు వార్తలున్నాయి. ‘హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్’ పేరుతో రష్యా తయారు చేసుకున్న సరికొత్త ఆయుధ వ్యవస్థను అంతరిక్షంలోకి ప్రయోగిస్తే చాలు...రాడార్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రుదేశాలపై దాడులు చేయగలదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఇంకోవైపు చైనా కూడా ఒక ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాలను, క్షిపణులను పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలు తమ దేశ భద్రతకు చేటు తెచ్చేవని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం అంతరిక్ష యుద్ధం విషయంలో మూడు రకాల ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. భూమిపై నుంచే లేజర్ల సాయంతో ఉపగ్రహాలు పనిచేయకుండా చేయడం ఒకటైతే.. అంతరిక్షంలోనే ఉంటూ ఈ పనులు చేయడం రెండో రకం. అంతరిక్షం నుంచి భూమ్మీది లక్ష్యాలను ఛేదించే వ్యవస్థలు మూడో రకం. అమెరికాతోపాటు రష్యా, చైనాలు మూడింటికీ ఈ రకమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఓ వ్యవస్థ: అమెరికాలో ఇప్పటికే స్పేస్ ఫోర్స్ లాంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎయిర్‌ఫోర్స్ స్పేస్ కమాండ్ పేరుతో 1982 నుంచి నడుస్తున్న ఈ వ్యవస్థ అటు వైమానిక దశం, ఇటు నేవీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టడం, క్షిపణి ప్రయోగాలపై ఓ కన్నేయడం ఈ వ్యవస్థ ప్రధానమైన విధులు. – సాక్షి, హైదరాబాద్ -
సహనాన్ని పరీక్షిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణకు, స్కైవేల నిర్మాణానికి రక్షణ అడ్డుగా నిలుస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ భూములు ఇచ్చే విషయంలో రక్షణ శాఖ నగర ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల సమస్య లేని చోట కూడా రోడ్లు మూసివేస్తోందని, జీహెచ్ఎంసీని సతాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, భూపతిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణ, స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ ప్రాంతంలో 160 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరమున్నాయని తెలిపారు. కేంద్రం వాటిని కేటాయిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ముగ్గురు రక్షణ మంత్రులకు చెప్పినా.. 100 ఎకరాలు కేటాయిస్తే 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని చెప్పినా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కొత్తగా ఆ భూముల్లో భవన నిర్మాణాలు చేపడితే తమకు ప్రతి నెలా రూ.30 కోట్ల ఆదాయం వచ్చేదని, ఆ దృష్ట్యా శాశ్వత ప్రాతిపదికన ప్రతి నెల రూ.30 కోట్లు ఇవ్వాలంటూ రక్షణ శాఖ లేఖ రాసిందని మండలి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల విషయంలో రక్షణ శాఖ ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబించడం లేదని విమర్శించారు. కేంద్రం భూములు ఇవ్వనందునే రహదారుల విస్తరణలో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ, ఇటీవల రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌తో మాట్లాడానని, ఆమె సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ బదులిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ముగ్గురు రక్షణ మంత్రులతో మాట్లాడినా సమస్యకు పరిష్కారం దొరకలేదని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఎవరైనా అనుమతులు తెప్పిస్తే వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తామన్నారు. మరోవైపు నగరంలో నాలుగు రకాల బస్టాపులను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్రేడ్–1లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు ఏర్పాటు చేస్తా మని ప్రకటించారు. ఏసీ, వైఫై సౌకర్యం, టికెటింగ్ మిషన్ ఏర్పాటు, డస్ట్ బిన్, టాయిలెట్స్ ఉంటాయని పేర్కొన్నారు. టెన్త్ వరకు తప్పనిసరి: కడియం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మొదట్లో ఇంటర్ వరకు అమలు చేయాలని భావించినా.. మొదటి దశలో పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి, నారదాసు, పూల రవీందర్ రెడ్డి.. మాతృ భాష అమలుపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పదో తరగతి వరకు రాష్ట్ర సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలల్లో ‘తెలుగు తప్పనిసరి’ని ఏ విధంగా అమలు చేయాలో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంపై నిరంతరం నిఘా పెట్టామని, ఇందుకోసం విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశం మొత్తంలో మధ్యాహ్న భోజన పథకం 8వ తరగతి వరకే అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రమే 9, 10వ తరగతులకు కూడా రాష్ట్ర నిధులతో అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు 7,080 వంటశాలలు రూ.146 కోట్లతో నిర్మిస్తున్నామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అందులో రిజర్వేషన్లు కుదరవు: జగదీశ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్లాంట్ల నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు, రిజర్వేషన్లు వర్తింపజేయడం సాధ్యం కాదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభ్యులు రాజేశ్వర్‌రావు, రాములునాయక్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 1,617 సోలార్ ప్లాంట్లలో 3,046.88 మెగావాట్లు, ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్ టాప్ ద్వారా 26.92 మెగావాట్లు, యన్.పి.టి.సి ద్వారా 449.81 మెగావాట్లు, పోటీ టెండర్ల ద్వారా 121 కేంద్రాల్లో 2,375 మెగావాట్లు, ఓపెన్ ఆఫర్ ద్వారా 43 కేంద్రాల్లో 189.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. -
ఆర్మీస్థావరాలకు 1,487 కోట్లు
న్యూఢిల్లీ: కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ స్థావరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రక్షణశాఖ రూ.1,487 కోట్లను మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును 10 నెలల్లోగా పూర్తిచేయాలని రక్షణ మంత్రి సీతారామన్ ఆదేశించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కశ్మీర్లో నియంత్రణ రేఖ, కొన్ని చోట్ల ఆర్మీ స్థావరాలపై ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆడిట్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్వోపీ) త్రివిధ దళాలకు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన 600 అత్యంత సున్నితమైన, 3 వేల సున్నితమైన స్థావరాలను గుర్తించినట్లు వెల్లడించాయి. -
‘షహీద్’ పదం మా డిక్షనరీలో లేదు
న్యూఢిల్లీ: ఆర్మీ లేదా పోలీసు శాఖలో ‘అమర వీరుడు’లేదా ‘షహీద్’అనే పదాలే లేవని రక్షణ శాఖ, హోంశాఖలు తేల్చిచెప్పాయి. ఏదైనా ఘటనలో ఆర్మీ అధికారి చనిపోతే ‘యుద్ధంలో మరణించినవారు’, పోలీసులు చనిపోతే ‘పోలీస్ చర్యల్లో మరణించినవారు’ అని పేర్కొంటారని తమ నివేదికలో కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపాయి. ‘షహీద్’ లేదా ‘అమరవీరుడు’ పదాలకు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా అర్థం చెప్పాలంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పదాల వాడుకపై పరిమితులు.. అలాగే తప్పుగా వాడితే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియజేయాలని కోరాడు. ఈ దరఖాస్తుకు హోం, రక్షణ శాఖల్లో స్పందన రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. -
‘అస్త్ర’ పరీక్ష విజయవంతం
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే–బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజులుగా జరుగుతున్న ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘బంగాళాఖాతంలో అస్త్ర క్షిపణి (బీవీఆర్‌ఏఏఎమ్) చివరి దశ పరీక్ష విజయవంతమైంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, ఏఐఎఫ్‌లతో పాటుగా పలు డీపీఎస్‌యూలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్ జి. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను, భూమిపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మరిన్ని విభిన్నమైన క్షిపణులను రూపొందించవచ్చని తెలిపారు. -
స్కైవేకు సైసై!
- ‘జూబ్లీ’ నుంచి లోతుకుంట వరకు - పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి - అంచనా వ్యయం రూ.1,400 కోట్లు సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రక్రియలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కీలకపాత్ర పోషించబోతోంది. నగరవాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ వెతలపై అధ్యయనం చేసిన హెచ్ఎండీఏకు చెందిన కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ స్టడీ(సీటీఎస్) సూచనల మేరకు నగరంలో నూతన ఫ్లైఓవర్లు, స్కైవే పనులను చేపట్టడంపై దృష్టి సారించింది. బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ నుంచి లోతుకుంట వరకు ఆరు కి.మీ మేర స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే హెచ్ఎండీఏ వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. అద్భుత రీతిలో స్కైవే.. నగరానికే తలమానికమైన 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హెచ్ఎండీఏ.. అవకాశం వస్తే ఈ స్కైవేను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ఓఆర్ఆర్కు అనుసంధానం కావడంతో పాటు కరీంనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. స్కైవే నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉండటంతో వాటిని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనికి రక్షణ శాఖ అంగీకారం తెలిపినా.. అధికారికంగా ఆదేశాలు రాలేదు. అవి రాగానే స్కైవే నిర్మాణానికి అడుగు పడనుంది. అలాగే ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవేకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా హెచ్ఎండీఏ చేపట్టేందుకు రెడీగా ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. హెచ్ఎండీఏ భూముల వేలం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన పదేళ్ల తర్వాత హెచ్ఎండీఏ రూ.369.53 కోట్లతో బాలానగర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులను చేపట్టింది. ఈ నిధుల కోసం హెచ్ఎండీఏకు చెందిన భూములను వేలం వేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపింది. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌తో పాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న స్ట్రేబీట్స్ను వేలం వేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించి బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు వెచ్చించాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్లను విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు.