Drone system
-
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
శంషాబాద్ రూరల్: వచ్చే 25 ఏళ్లలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండలో జెండా ఊపి సంకల్ప రథాన్ని ప్రారంభించారు. దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా.. అర్హులైన వారి చెంతకు పథకాలను ఈ రథం ద్వారా తీసుకెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభించిన యాత్రను జనవరి 25 వరకు కొనసాగిస్తామని, రథాన్ని ప్రతి ఊరుకు తీసుకువెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. మోదీ పాలనలో గత 9 ఏళ్లలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య చికిత్స, రైతులకు పెట్టుబడి సాయం, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, గ్యాస్ కనెక్షన్లవంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి డ్రోన్ మంజూరు.. రైతులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘానికి డ్రోన్ సౌకర్యం సమకూర్చుతున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 15 వేల డ్రోన్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మరో రఫేల్ అవుతుందా ?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరిన 31 ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేసింది. వేలాది కోట్ల రూపాయల ఈ ఒప్పందం పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. కేంద్రం అత్యధిక ధరకి ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం విలేకరుల సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ డ్రోన్ల ఒప్పందంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ‘‘దేశభద్రతను ప్రమాదంలో పడేయడం మోదీ ప్రభుత్వానికి సర్వసాధారణం. రఫేల్ ఒప్పందంలో కూడా ఇదే చూశాము. 126 రఫేల్ యుద్ధ విమానాలకు బదులుగా మోదీ ప్రభుత్వం 36 మాత్రమే కొనుగోలు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపుని కూడా హెచ్ఎఎల్కు నిరాకరించడమూ మనం చూశాం. డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ, త్రివిధ బలగాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పికీ ఏకపక్ష నిర్ణయాలు ఎన్నో జరిగాయి. ఇప్పటికీ రఫేల్ కుంభకోణంపై ఫ్రాన్స్ పరిశీలనలో ఉంది’’ అని పవన్ ఆరోపించారు. మరో రక్షణ స్కామ్‌లో మనం పడకూడదన్నారు. ఎందుకంత ధర? అమెరికాలో జనరల్ ఆటమిక్స్ సంస్థ రీపర్ డ్రోన్ల ఒక్కొక్కటి రూ.812 కోట్లకు విక్రయిస్తోందని, భారత్ 31 డ్రోన్లకు ఒప్పందం కుదుర్చుకుందని అంటే మొత్తంగా 25,200 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని పవన్ అన్నారు. ఇప్పుడు పెడుతున్న దాంట్లో 10–20 శాతం ఖర్చుతో డీఆర్డీఒకి డ్రోన్లను అభివృద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. మరెందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డ్రోన్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. 2017లో ఈ డ్రోన్లను తొలుత తయారు చేశారని, ఇప్పుడు సాంకేతికత బాగా పెరిగిందని లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పవన్ నిలదీశారు. -
AP: కొత్త కొలువు.. డ్రోన్ పైలెట్!
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బృహత్తర బాధ్యతలు అప్పజెబుతోంది. వ్యవసాయ, ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంలో వారిని భాగస్వాములను చేస్తోంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చి, యువతకు చదువుతోపాటే వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి లభించేలా తీర్చి దిద్దుతున్నారు. ఇప్పుడు గ్రామాల్లోని చదువుకున్న యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చి, గ్రామీణ ప్రాంత కార్యకలాపాల్లో పాలుపంచుకొనేలా చేస్తున్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. 80 వేల మంది అవసరం ఒక్క వ్యవసాయ అవసరాలకే 20 వేల మంది డ్రోన్ పైలెట్లు అవసరమవుతారని అంచనా. ఇతర అవసరాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటే 80 వేల మందికి పైగా డ్రోన్ పైలెట్లు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణనిచ్చి ప్రొఫెషనల్స్‌గా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 12 రోజుల సరి్టఫికెట్ కోర్సును రూపొందించింది. 12 రోజుల పాటు ఉచిత శిక్షణ వ్యవసాయ కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. తొలి దశలో జూలైలోగా 500 ఆర్బీకేల పరిధిలో, డిసెంబర్ కల్లా మరో 1500 ఆర్బీకేల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సీహెచ్‌సీ గ్రూపుల్లో చదువుకున్న రైతులకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 8 బ్యాచ్‌లలో 135 మంది రైతులకు శిక్షణనిచ్చారు. మిగిలిన వారికి జూలైకల్లా శిక్షణ ఇస్తారు. ఇప్పుడు యువతకూ ఈ శిక్షణ ఇస్తారు. ఇది కూడా చదవండి: ఏపీలో నాలుగో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ గ్రీన్‌సిగ్నల్ 3 ఏళ్లపాటు ఆర్బీకేల్లో పనిచేయాలి వ్యవసాయ డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువతకు ఈ శిక్షణ ఇస్తారు. కనీసం 3 ఏళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ముందుకొచ్చే వారికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఇతర రంగాల్లో డ్రోన్స్‌పై శిక్షణ పొందాలంటే ఫీజులు చెల్లించాలి. జూలై నుంచి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్తగా అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మాస్టర్ ట్రైనీలను నియమించనున్నారు. ఇప్పటికే 10 మంది శాస్త్రవేత్తలతో పాటు వర్సిటీలో వ్యవసాయ డిప్లొమా చదువుతున్న 125 మందికీ అప్సరా ప్రత్యేక శిక్షణనిచి్చంది. డ్రోన్లదే కీలక పాత్ర వ్యవసాయ రంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ రంగంలో 22 రకాల పనులు చేసేందుకు వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటి వినియోగానికి ఇప్పటికే రైతులకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కిసాన్ డ్రోన్స్ నిర్వహణ కోసం ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో చదువుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఈ శిక్షణ ఇస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా గ్రామీణ నిరుద్యోగ యువతకు కూడా డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన శిక్షణలో ఎన్నో నేర్చుకున్నాం ఎన్జీ రంగా వర్సీటీ ఇచ్చిన శిక్షణలో ఎంతో నేర్చుకున్నాం. డ్రోన్స్ ఫ్లై చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. పొలంలో సూక్ష్మ ఎరువులు, పురుగుల మందులు నేరుగా పిచికారీ చేయగలిగే సామర్థ్యం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయ అవసరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. –కొప్పుల బ్రహా్మనందరెడ్డి, నంద్యాల చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోగలం 3 రోజుల థియరీ క్లాసెస్, డ్రోన్ అసెంబ్లింగ్, డిస్ అసెంబ్లింగ్.. ఒక రోజు సెమిలరీ ప్రాక్టీస్, ఫీల్డ్ లెవల్లో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నుంచి దృఢమైన నమ్మకంతో వెళ్తున్నాం. డ్రోన్ ఫ్లై చేయగలను. చిన్న చిన్న రిపేర్లు వచ్చినా సరిచేయగలను. – యు.కామేశ్వరరావు, సీతారాంపురం, ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు శిక్షణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా వ్యవసాయ, సంప్రదాయ డోన్లపై నిరుద్యోగ యువతను డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇందుకోసం వ్యవసాయ శాఖతో కలిసి కార్యాచరణ సిద్ధం చేశాం. గుంటూరు లాంతో పాటు మరో నాలుగు చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. – ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, - వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ. ఇది కూడా చదవండి: దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్ -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
సాగులో ‘డ్రోన్స్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్‌లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్‌సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై డ్రోన్లు ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్‌సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్‌తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో ఉపయోగాలెన్నో.. ► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు ► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు ► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు ► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు ► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు. ► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు సాధ్యమైనంత త్వరగా సీహెచ్‌సీల ఏర్పాటు డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్‌సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
విత్తనాలు వెదజల్లే డ్రోన్..10 కోట్ల వృక్షాలే టార్గెట్‌గా
ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరిస్తున్నాయి. ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నా, అవేవీ ఎడాపెడా చెట్లు నరికేస్తున్నంత వేగంగా మొక్కలు నాటడంలో సఫలం కాలేకపోతున్నాయి. చెట్లు నరికేసినంత వేగంగా మొక్కలు నాటడం మానవమాత్రుల వల్ల కాదని చెప్పి, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ ఫొటోలో కనిపిస్తున్న ఈ డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ శరవేగంగా గగనతలంలో ప్రయాణిస్తూ, భూమిమీద ఖాళీగా ఉన్న బంజరు నేలలను గుర్తించి, అనువైన చోట విత్తనాలను నాటగలదు. మరో రెండేళ్లలోగా ఆస్ట్రేలియాలో 10 కోట్ల వృక్షాలను నాటే దిశగా, ఇలాంటి డ్రోన్లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించనున్నట్లు ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ చెబుతోంది. -
డ్రోన్ పైలట్ల శిక్షణకు 150 స్కూల్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం యూనివర్సిటీలు, వ్యవసాయ రంగ సంస్థలు, పోలీస్ అకాడమీలతో చేతులు కలపనున్నట్లు వివరించారు. దేశీయంగా తొలి రిమోట్ పైలట్ ట్రైనింగ్ సంస్థగా డ్రోన్ డెస్టినేషన్ .. అనుమతులు పొందింది. ప్రస్తుతం ఆరు స్కూల్స్‌ను నిర్వహిస్తోంది. త్వరలో కోయంబత్తూర్, మదురైలో మరో రెండు ప్రారంభించనున్నట్లు శర్మ పేర్కొన్నారు. గడిచిన కొన్ని నెలలుగా తాము 500 మంది పైలట్లకు శిక్షణ కల్పించినట్లు వివరించారు. రాబోయే ఏడాది కాలంలో గురుగ్రామ్ కేంద్రంలో 1,500 – 2,000 మంది పైలట్లకు, మిగతా కేంద్రాల నుంచి తలో 500 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు. -
పొలానికో డ్రోన్: మోదీ
న్యూఢిల్లీ: పరిపాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగించుకోవడంపై గతంలో చూపిన అలక్ష్యం కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలందించేందుకు డ్రోన్లు సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటోంది. సులభతర జీవనం, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. సుపరిపాలనకు కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకువచ్చింది’అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఎగ్జిబిషన్ భారత్ డ్రోన్ మహోత్సవ్–2022ను ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన, సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఆశించిన గ్రామస్వరాజ్ సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సమస్యగా, పేదల వ్యతిరేక వ్యవహారంగా చిత్రీకరించాయన్నారు. ‘దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడి చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, ప్రతి పొలంలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో ఉండాలన్నదే తన కల అని ప్రధాని తెలిపారు. ప్రజల జీవితాల్లో డ్రోన్ కూడా ఒక భాగంగా మారనుందని చెప్పారు. డ్రోన్ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయం రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. డ్రోన్ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని చెప్పా రు. ‘మారుమూల ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల సా యంతో అత్యవసరమైన ఔషధాలు వంటి వాటిని సులభంగా చేరవేయవచ్చు. పోలీసులు కూడా వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను భారత్‌తోపాటు ప్రపంచానికి అందించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా’అని ప్రధాని పిలుపునిచ్చారు. ఉత్పాదకత అనుసంధాన పథకం(పీఎల్ఐ) వంటి విధానాల ద్వారా దేశంలో పటిష్టమైన డ్రోన్ ఉత్పత్తి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఒక డ్రోన్‌ను ఆపరేట్ చేశారు. డ్రోన్‌ను పరీక్షిస్తున్న ప్రధాన మంత్రి మోదీ -
గగనతలం నుంచి గస్తీ...రహదారులపై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకుని వాటి సహాయంతో గస్తీ నిర్వహించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అనుమతితో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలన సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. దీంతో త్వరలో తొలి దఫా మూడింటిని సమీకరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో.. తిప్పలెన్నో.. సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ. ఆయా చోట్ల ఉండే అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, బాటిల్ నెక్స్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలతో పాటు తేలికపాటి వాహనాల పైనా గస్తీ నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి సరి చేస్తుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులను వినియోగించాల్సి వస్తోంది. ప్రముఖుల పర్యటనల నేపథ్యంలోనూ.. నగరంలో అనునిత్యం ప్రముఖుల పర్యటనలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న వీవీఐపీలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏటా వందల సంఖ్యలో ముఖ్యులు వస్తుంటారు. వీరి రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మళ్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి. కీలక సభలు, సమావేశాలతో పాటు గణేష్, బోనాలు వంటి పండగలు, ఉత్సవాల సమయంలోనూ రహదారులపై ట్రాఫిక్ పోలీసుల కదలికలు ఎక్కువగా ఉంటేనే సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ విధులను స్థానిక ట్రాఫిక్ ఠాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వర్తిస్తున్నారు. టీసీసీసీతో అనుసంధాని వినియోగం... ఈ డ్రోన్లను బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీసీసీసీ) అనుసంధానించనున్నారు. డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వీళ్లు గమనించిన అంశాల ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తారు. డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు సైతం ఈ సెంటర్‌తోనే అనుసంధానించి ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గరిష్టంగా రెండు నెలల్లో నగర ట్రాఫిక్ విభాగంలో మూడు డ్రోన్లు సేవలు అందించనున్నాయి. తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా.. ఇలా రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో బృందం ఒక సమయంలో కేవలం ఓ రహదారిపై మాత్రమే పని చేయగలుగుతోంది. దాన్ని క్లియర్ చేసిన పోలీసులు మరో చోటుకు వెళ్లేసరికి ఇక్కడ మళ్లీ అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా డ్రోన్ల సాయంతో గగనతల గస్తీ నిర్వహణకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లు ఖరీదు చేస్తున్నారు. రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలోనూ వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రెండుసార్లు డ్రోన్లను వాడి చూశారు. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: అంతా ఆ తాను ముక్కలే!) -
భూసర్వే వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంలో భాగంగా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో ఎక్కువ డ్రోన్లను వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆదేశించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్ష నిర్వహించింది. అటవీ భూముల సరిహద్దులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించడంతో పాటు పట్టణ ప్రాంతాల సర్వేలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,277 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల కోసం చిత్రాలు తీసే ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు సబ్‌కమిటీకి వివరించారు. 6,843.81 చదరపు కిలోమీటర్ల మేర 51 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే మొబైల్ మేజిస్ట్రేట్లకు శిక్షణ పూర్తయిందని, అర్బన్ ఏరియాల్లో అధికారులకు పది రోజుల శిక్షణ ప్రారంభించామన్నారు. త్వరలోనే వార్డు, ప్లానింగ్ సెక్రటరీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఓటీఎస్‌పై చైతన్యం కలిగించాలి ప్రజల్లో ఓటీఎస్‌పై చైతన్యం కలిగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రులు సూచించారు. ఇప్పటి వరకు పది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, 4.97 లక్షల మందికి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్ చేసినట్టు అధికారులు వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 2.83 లక్షల మంది డాక్యుమెంట్లకు అనుమతులు లభించాయన్నారు. సమీక్షలో సీసీఎల్ఏ కమిషనర్ జి.సాయిప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ రంగంలో అవకాశాలెన్నో: మోదీ
న్యూఢిల్లీ: డ్రోన్ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్ డ్రోన్’లను ప్రధాని ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి వర్చువల్ పద్ధతిలో శుక్రవారం ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. పూలు, పండ్లు, కూరగాయలను త్వరగా రవాణా చేయొచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్ అనే కొత్త అధ్యాయం మొదలైంది. డ్రోన్ రంగంలో స్టార్టప్ కంపెనీల సంస్కృతి దేశంలో షురూ అయింది. ప్రస్తుతం 200గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య త్వరలో వేలు దాటనుంది. ఈ రంగం భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తేనుంది. ఈ రంగం ఎదుగుదలకు ఎలాంటి విధానపర అడ్డంకులూ లేవు. డ్రోన్ సెక్టార్ విస్తరించేందుకు తగిన సంస్కరణలను గతంలోనే తెచ్చాం. కొన్నేళ్ల క్రితం రక్షణ రంగానికే పరిమితమైన డ్రోన్లు ఇప్పుడు వేర్వేరు విభాగాలకూ విస్తరించాయి. సరైన సంస్కరణలు తెస్తే వృద్ధి ఎంత బాగుంటుందనేందుకు డ్రోన్ రంగమే ఉదాహరణ. ఈ రంగం విస్తరణకు బీజేపీ సర్కార్ పచ్చజెండా ఊపడమే కాదు, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ అన్నారు. -
ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!
నిజానికి టెక్నాలజీ మానవాభివృద్ధికి తోడ్పడాలి గానీ అతని మనుగడే ప్రశ్నర్థకమయ్యేలా హింసాత్మక ధోరణికి దారితీసే విధంగా ఉండకూడదు. మానవుడు తాను సృష్టించిన టెక్నాలజీతో రకరకాల సమస్యలను సృష్టించుకుంటున్నాడు లేదా కొని తెచ్చకుంటున్నాడు అని నిపుణుల హెచ్చరిస్తున్న సందర్భాలను అనేకం చూశాం. ప్రస్తుతం అలాంటి టెక్నాలజీని యూఎస్‌లోని ఒక కంపెనీ ఆవిష్కరించడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే....యూఎస్‌లో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన బ్లేక్ రెస్నిక్ లాస్ వెగాస్‌లో 2017లో జరిగిన భారీ కాల్పుల నేపథ్యంలో అహింసాయుత రోబోల వినియోగంతో చట్టాలను అమలు చేసే సంస్థలకు సహాయం చేసే ఉద్దేశంతో బ్రింక్ అనే టెక్సంస్థను స్థాపించాడు. ఏ మంచి ఉద్దేశంతో ఆ కంపెనీని ప్రారంభించాడో అది ఇప్పుడు విభిన్నమైన మలుపు తీసుకుని సరిహద్దుల వద్ద వలసదారులను పట్టుకోవడానికి అత్యధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్లను రూపొదించింది. అయితే వీటిని వాల్ ఆఫ్ డ్రోన్స్ అని పిలుస్తారు. పైగా ఇది యుఎస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల కదలికలనే కాక వారిని ట్రాక్ చేయగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు డ్రోన్లు ముందుగా ప్రోగ్రామ్ చేసిన విమాన మార్గాన్ని అనుసరిస్తాయని చొరబాటుదారుల కోసం వెతకడానికి హై-డెఫినిషన్ కెమెరాల తోపాటు థర్మల్ ఇమేజర్లను ఉపయోగిస్తాయని రెస్నిక్ తెలిపారు. పైగా డ్రోన్ చొరబాటుదారుని గుర్తించినప్పుడల్లా సమీపంలోని నియంత్రణ కార్యాలయంలోని ఆపరేటర్లకు విషయాన్ని బదిలీ చేస్తుందన్నారు. ఈ మేరకు జోస్' అనే ఒక వలసదారుని పట్టుకున్నట్లు రెస్నిక్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్నాలజీ సంబంధించిన వీడియోని ప్రమోషన్ నిమిత్తం 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మనిషి స్వేచ్ఛయుత జీవనానికి ప్రతిబంధకం ఈ టెక్నాలజీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే కంపెనీ కూడా తన ఈ డ్రోన్ టెక్నాలజీ వినియోగం పై పునారాలోచించడమే కాక ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకున్నాం అని కూడా ప్రకటించడం కొసమెరుపు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
డ్రోన్ టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా భారత్
సాక్షి, హైదరాబాద్: విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి పరుస్తూ కీలక రంగాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔషధ సరఫరాకు డ్రోన్లను వినియోగించడం గొప్ప మార్పు అని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. విమానయాన రంగంలో డిజిటల్ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా అనుమతులను సులభతరం చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ‘ఓలా ట్యాక్సీ’ తరహాలో ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ విమానాశ్రయాన్ని విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. బేగంపేటలోని పాత విమాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో కూడా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశంలో విమాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్తో రాజకీయ పోరాటం అధికారిక పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో భేటీకావడం మర్యాదపూర్వకమేనని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే కేసీఆర్‌తోనూ ఉన్నాయన్నారు. కేంద్రమంత్రులు ప్రధాని విజన్‌ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని.. దానికి, రాజకీయాలకు సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీఆర్ఎస్తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ బలమైనరాజకీయ శక్తిగా మారనుందన్నారు. -
ఏడాది చివరికల్లా సరిహద్దుల్లో కంచె పూర్తి
న్యూఢిల్లీ: దేశ భూ సరిహద్దుల్లో చేపట్టిన 7,500 కిలోమీటర్ల పొడవైన కంచె నిర్మాణం ఈ ఏడాది చివరినాటికి ఎటువంటి ఖాళీల్లేకుండా పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ రక్షణ విధానంపై విదేశాంగ విధానం ప్రభావం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే దేశానికి స్వతంత్ర రక్షణ వ్యూహం రూపొందిందని చెప్పారు. బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భూ సరిహద్దుల్లో కొనసాగుతున్న రక్షణ కంచె నిర్మాణంలో కేవలం 3 శాతం ఖాళీల వల్లే దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలు, అక్రమ చొరబాట్లు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొనసాగుతున్నాయనీ, వీటన్నిటికీ 2022 నుంచి అట్టుకట్టపడుతుందని పేర్కొన్నారు. ధ్వంసం చేసేందుకు గానీ, కోసివేసేందుకు గానీ వీలులేనటువంటి కొత్త రకం కంచెను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలనే మనం కోరుకుంటున్నాం. ఎవరైనా మన సరిహద్దులకు భంగం కలిగించినా, మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినా, దీటుగా సమాధానం ఇవ్వడమే మన రక్షణ విధానంలో అత్యంత ముఖ్యమైంది’అని ఆయన తెలిపారు. ఇటువంటి విధానం లేకుండా మన దేశ ప్రగతి కానీ, ప్రజాస్వామ్యం మనుగడ కానీ అసాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం డీఆర్డీవో, కొన్ని ఇతర సంస్థలతో కలిసి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని దేశీయంగా త్వరలోనే సమకూర్చుకోనున్నామని తెలిపారు. కృత్రిమ మేథ, రోబోటిక్ సాంకేతికతను వినియోగిస్తూ సరిహద్దుల వెంట సాగే శత్రు దాడులను అడ్డుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా దేశ రక్షణకు మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను వివరించారు. 2008–14 మధ్య కాలంలో సరిహద్దుల్లో కేవలం 3,600 కిలోమీటర్ల రహదారులను నిర్మించగా, 2014–20 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం అంతకుమూడు రెట్లు అంటే, 4,764 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందన్నారు. ఇదే సమయంలో బడ్జెట్ కేటాయింపులు కూడా రూ.23 వేల కోట్ల నుంచి రూ.14,450 కోట్లకు పెంచామన్నారు. చైనాతో సరిహద్దుల వెంట గతంలో ఏడాదికి 230 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగ్గా తమ ప్రభుత్వం 470 కిలోమీటర్ల చొప్పున రహదారులను పూర్తి చేసిందని తెలిపారు. -
ఇండియా చేతికి ఇజ్రాయెల్ డ్రోన్‌గార్డ్ వ్యవస్థ?!
దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్ఐ–4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను(సీ–యూఏఎస్)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్ గార్డ్ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్ వార్తల ప్లాట్‌ఫామ్ జానెస్ తెలిపింది. ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు. తమ డోమ్ వ్యవస్థపై భారత్ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలా పనిచేస్తుంది ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్ గార్డ్ అడ్డుకోగలదు. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి. ఏఈఎస్ఏ, మల్టి మిషన్ 3డీ ఎక్స్ బాండ్ రాడార్, కామిన్ట్ జామర్, ఈఓ మరియు ఐఆర్ సెన్సర్ అనే విభాగాలు డ్రోన్ గార్డ్‌లో ఉంటాయని ఐఏఐ తెలిపింది. వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్ కిల్ అని, డీకేడీ(డ్రోన్ కిల్ డ్రోన్) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్ కిల్ అని అంటారు. తమ సీ– యూఏఎస్ చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుందని ఐఏఐ అధికారి ఎలి అల్ఫాసి వివరించారు. తమ వ్యవస్థలోని జామింగ్ ఫీచర్ దాడికి వచ్చిన డ్రోన్స్ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్ అయ్యేలా చేస్తుందన్నారు. ఇప్పటికే పలువురు కస్టమర్లకు దీన్ని విక్రయించామని, భారత్ కూడా దీనిపై ఆసక్తి చూపిందని గతంలో ఆయన చెప్పారు. తాజా దాడుల ప్రభావం? జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. దాని తర్వాత పాక్‌లోని భారత రాయబారి కార్యాలయ సమీపంలో డ్రోన్లు తచ్చాడాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడికి వచ్చిన డ్రోన్‌లో జీపీఎస్ అడ్రస్‌ను లాక్ చేశారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలను సైతం డ్రోన్ జారవిడిచింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దేశ మిలటరీ చరిత్రలో ఇది తొలి డ్రోన్ అటాక్‌గా భావిస్తున్నారు. దాడిలో పాక్ టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని జాతీయ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా జమ్మూ పోలీసు చీఫ్ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో మరిన్ని డ్రోన్ దాడులు జరగకుండా నివారించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని హోం, రక్షణ మంత్రులతో పాటు భద్రతా సంస్థలు, మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. అత్యున్నత రక్షణ విధానాన్ని రూపొందించాలని çనిర్ణయించారు. దీన్లో భాగంగానే డ్రోన్ గార్డ్‌ను భారత్ కొనుగోలు చేసి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. -
దేశానికి డ్రోన్ల రక్ష; భారత్ సరికొత్త వ్యూహం!
ఇందుగలడు.. అందుగలడు అన్నట్లు యుద్ధ క్షేత్రంలోకి కూడా డ్రోన్లు చొచ్చుకొస్తున్నాయి. మానవరహిత డ్రోన్ల సాయంతో ప్రత్యర్థుల ప్రదేశాల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించడానికి అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. మిసైల్స్, బాంబులతో ప్రత్యర్థుల శిబిరాలపై విరుచుకుపడే డ్రోన్లను తమ అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇలా మానవరహితంగా గగనతలం నుంచి దాడులు చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 30 యుద్ధ డ్రోన్లను కొనడానికి సన్నద్ధమైంది. అమెరికా కంపెనీ జనరల్ ఎటోమిక్స్‌తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ 30 డ్రోన్లను పది పది చొప్పున ఆర్మీకి, నేవీకి, వాయుసేనకు ఇవ్వనుంది. యుద్ధ విమానాలపై శత్రువులు దాడి చేస్తే పైలట్ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఈ నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో యుద్ధ డ్రోన్ల వైపు భారత్ మొగ్గుచూపుతోంది. ఇప్పటి వరకూ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో పొరుగుదేశాల సైనికుల కదలికపై నిఘా కోసం మాత్రమే మన దేశం హెరాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వేటగాడు డ్రోన్ వేటగాడు (ప్రెడేటర్) డ్రోన్‌గా పిలిచే ఎంక్యూ9 రీపర్‌లోని సెన్సార్స్, రాడార్ల వ్యవస్థతో లక్ష్యాలను గుర్తించగలుగుతుంది. ఇది యుద్ధ క్షేత్రంలో 27 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే సామర్థ్యం కలిగిఉంది. 6 వేల నాటికల్ మైళ్ల వరకూ 1,700 కిలోల బరువైన మందుగుండును మోసుకెళ్లగలదు. 50 వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. శత్రుభయంకర మిసైళ్లు, లేజర్ నిర్దేశిత బాంబుల వర్షం కురిపించగలుగుతుంది. ఇరాక్, అప్ఘనిస్థాన్, సిరియా దేశాల్లో అమెరికా బలగాలు ఈ డ్రోన్లను వినియోగించాయి. చైనా, పాకిస్థాన్‌ల చొరబాట్ల నేపథ్యంలో కశ్మీర్, లడక్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఇలాంటి హై అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (హెచ్ఏఎల్ఈ) డ్రోన్ల అవసరం భారత మిలిటరీకి ఎంతో ఉంది. ముందున్న చైనా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)ల వినియోగం విషయంలో చైనా చాలా ముందుంది. దాయాది పాకిస్థాన్ కూడా డ్రాగన్ దేశం సహకారంతో ఇలాంటి డ్రోన్లను సమకూర్చుకోవడానికి చూస్తోంది. సాధారణ డ్రోన్ల తయారీకి చైనా ఎంత కృషి చేసిందో.. అలాగే దాడులు చేసే డ్రోన్ల తయారీకి కూడా అంతే కష్టపడింది. డ్రోన్ల టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి విషయంలో అన్ని దేశాల కంటే చైనా ముందుంది. ఇక భారత్ కొనుగోలు చేసే డ్రోన్లను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాలకు తగ్గట్టుగా మారుస్తారని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారంలో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ భారత పర్యటన సందర్భంగా ఆ డ్రోన్ల కొనుగోళ్ల సంబంధించిన చర్చలు జరగనున్నాయి. కాగా, 2007లో అమెరికాతో 18 బిలియన్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. దేశీయ తయారీకి మొగ్గు భవిష్యత్‌లో యుద్ధ క్షేత్రాల్లో కీలకమైన యూఏవీలను దేశీయంగా తయారు చేసే అవకాశాలను కూడా భారత్ పరిశీలిస్తోంది. యూఏవీల తయారీకి భారత్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఇటీవలే డ్రోన్ల తయారీకి తన బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. ఈ మానవరహిత డ్రోన్లను మానవసహిత జెట్ ఫైటర్లకు అనుసంధానించే పనిని హెచ్ఏఎల్ ఇప్పటికే ప్రారంభించింది. జెట్ ఫైటర్లు 150 కిలోమీటర్ల నుంచి డ్రోన్లను కంట్రోల్ చేయగలవు. ఒకేసారి నాలుగు దిశల్లో నాలుగు డ్రోన్లకు జెట్ ఫైటర్లు లక్ష్యనిర్దేశం చేయగలవు. స్వదేశీ ఫైటర్ జెట్స్ తేజస్, జాగ్వార్లతో డ్రోన్లను అనుసంధానించే అవకాశం ఉందని, ఇది వచ్చే మూడు నాలుగేళ్లలో కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నారు. -
అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు
డెహ్రాడూన్: హిమానీనదం వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగ ముఖద్వారం మట్టి, రాళ్ల పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయ చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. భారీ యంత్రాల సాయంతో వాటిని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సొరంగంలో చిక్కుకుపోయిన 25–35 మంది కార్మికుల్ని కాపాడడానికి డ్రోన్లను, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించి గాలిస్తున్నారు. ‘‘సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లడానికి భారీగా పేరుకుపోయిన రాళ్లతో కూడిన బురద అడ్డంగా ఉంది. దానిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఉత్తరాఖండ్ డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నె చెప్పారు. సొరంగ మార్గంలో శిథిలాలతో కూడిన బురద ఎండిపోవడంతో గట్టిపడి లోపలికి వెళ్లడానికి వీల్లేకుండా ఉంది. ఇప్పటివరకు 80 మీటర్ల లోపలికి తవ్వకాలు జరిపారు. 100 మీటర్ల వరకు వెళితే లోపల చిక్కుకున్న వారీ ఆచూకీ తెలియవచ్చు’’అని వెల్లడించారు. అలుపెరుగని సాయం.. కేవలం సొరంగ మార్గం వద్ద సహాయ చర్యల కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సహస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది 600 మందికి పైగా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మంచుపెళ్లల్ని పెకిలించడం, నీటిని భారీ యంత్రాలతో తోడుతున్నప్పటికీ ఇంకా బాగా వస్తూనే ఉంది’’అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అయితే సొరంగానికి అడ్డంగా ఉన్న శిథిలాల తొలగింపు ఆలస్యమవుతున్న కొద్దీ లోపలున్న వారి పరిస్థితి ఎలాగ ఉందోనన్న ఆందోళన పెరుగుతోంది. ‘‘కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్మికులు సజీవంగా ఉంటారన్న నమ్మకం పోతోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే వారిని కాపాడుకోవచ్చు’’అని రాష్ట్ర సహాయ బృందం సభ్యుడు పీయూష్ అన్నారు. ‘రేయింబగళ్లు శిథిలాలను తొలగిస్తున్నా పని పూర్తి అవడం లేదు. సొరంగం వెలుపల ఆక్సిజన్ సిలండర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే అన్నారు. -
అనంతపురంలో భారీ డ్రోన్ సిటీ
సాక్షి, అమరావతి : వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం అనంతపురం జిల్లాలో భారీ డ్రోన్ సిటీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు డ్రోన్ తయారీ, పరిశోధన అభివృద్ధి, పరీక్ష కేంద్రాలను ఒకేచోట ఏర్పాటు చేసే విధంగా 360 ఎకరాల్లో భారీ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్‌రెడ్డి తెలిపారు. ఈ డ్రోన్ సిటీలో భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా 38 కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. (అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం!) వీటిని పరిశీలించిన తర్వాత అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలను ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే అనంతపురంలో కంటికి కనిపించనంత దూరంగా (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ – బీవీఎల్వోఎస్) డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి ఇవ్వడంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అనంతపురాన్ని శాశ్వత డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దడంపై దృష్టిపెడుతున్నామని, దీనికోసం పుట్టపర్తి విమానాశ్రయాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. భారీగా పెరుగుతున్న డిమాండ్ భూముల సర్వే, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, సరుకుల డెలివరీ.. ఇలా అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా డ్రోన్‌పై పరిశోధనల్లో అత్యధిక నిధులను అందుకుంటున్న దేశాల్లో మన దేశం ఒకటి. ఏటా దేశీయ డ్రోన్ మార్కెట్ 22 శాతం వృద్ధి చెందుతూ సుమారు రూ.6,554.18 కోట్లకు చేరింది. ఇందులో మెజార్టీ వాటాను కైవసం చేసుకునే దిశగా ఏపీఏడీసీఎల్ పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. దీన్లో భాగంగానే దేశంలో తొలిసారిగా అనంతపురం జిల్లాలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసి డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ బరువును తీసుకువెళ్లే వాటి దగ్గర నుంచి వ్యవసాయరంగంలో వినియోగించేందుకు 250 కిలోల బరువును మోసుకెళ్లే డ్రోన్ల వరకు తయారీకి ఈ డ్రోన్ సిటీ వేదిక కానుంది. -
మహిళల భద్రతకు డ్రోన్లు వాడాలి
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వాడటం వల్ల నేరాలు తగ్గే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నిర్మించిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘డయల్ 100కు కాల్ చేయడం వల్ల ఐదు నిమిషాల్లో ఘటనకు చేరుతారు, అదే ఎస్‌వోఎస్ బటన్ నొక్కి డ్రోన్లు వినియోగించడం వల్ల ఒక నిమిషం వ్యవధిలో అక్కడికి చేరుతారు. అదే సమయంలో పోలీసు సైరన్ మోగిస్తే నిందితుడు పారిపోతాడు. దీనివల్ల బాధిత మహిళ నేరం బారినపడకుండా ఉంటుంది. పోలీసులు బాధితురాలికి భరోసా ఇచ్చి నిందితులను పట్టుకోవచ్చు’అని అన్నారు. వీటి వినియోగం కోసం డీజీసీఏ అనుమతులు తీసుకునే అంశాల్నీ పోలీసులు పరిశీలించాలని సూచించారు. నేరం చేయాలంటే దొంగలు భయపడుతున్నారు.. ‘దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘నేను సైతం’ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాలు బిగించుకుంటు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలున్నాయి. వీటిని పది లక్షలు చేసే దిశగా ముందుకెళుతున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఈ సీసీటీవీలు సైబరాబాద్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ అనుసంధానం చేయడం వల్ల నేరాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌లో దొంగత నాలు చేయాలంటే అంతర్రాష్ట ముఠాలు భయపడుతున్నాయి. ఒకవేళ చేసినా 24 గంటలు గడవక ముందే సీసీటీవీల సహాయంతో పట్టేస్తున్నారు. అయితే ఈ డేటా సెంటర్ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేతాటిపైకి తీసుకురావాలి, ఆయా పనులను కలిసికట్టుగా చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్ వల్లే రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలు నిలువరించేలా ఎప్పటికప్పుడూ సిబ్బంది సైబర్ వారియర్లుగా మారి ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అంబులెన్స్ వాహనాలను అనుసంధానించాలి... ‘ఈ సెంటర్ ద్వారా పోలీసు పెట్రోలింగ్ వాహనాలు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే వీలుంది. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం దగ్గరగా ఉంటే వారికి సమాచారమిచ్చి సులువైన మార్గంలో వెళ్లేలా సెంటర్ సిబ్బంది మార్గదర్శనం చేస్తారు. ఇదే మాదిరిగా అత్యవసర వైద్యసహాయం కోసం రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌లకు కూడా పెట్రోలింగ్ వాహనాలకు మాదిరిగానే ఈ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ప్రమాదసమయాల్లో ప్రాధమ్యంగా భావించే గోల్డెన్ అవర్‌లో రోగి సమీప ఆసుపత్రికి వెళ్లే దారి చూపేలా వైద్యారోగ్య శాఖతో మాట్లాడి అనుసంధానం చేయాల’ని సంబంధిత అధికారులకు కేటీఆర్ సూచించారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు ట్విన్ టవర్స్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఎక్కడి పోలీసులకైనా ఇది ఐకానిక్‌గా నిలుస్తుందని అన్నారు. ప్రతి వెయ్యిమందికి 30 సీసీటీవీలు: మహమూద్ అంతకుముందు హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 30 సీసీటీవీ కెమెరాలున్నాయని, ఇది ఎంతో భద్రతపరమైన నగరమని అన్నారు. ‘ఈ సెంటర్ వల్ల కిందిస్థాయి సిబ్బందికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. నేరం జరిగే ప్రాంతానికి వెళ్లేలోపు సమగ్ర సమాచారం చేతికి అందేలా ఈ సెంటర్ చూస్తుంద’ని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీలో పోలీసులకు శిక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ, ఐటీఈఎస్ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది, ఎల్ అండ్ టీ స్మార్ట్ ప్రతినిథి జేవీఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ
న్యూఢిల్లీ: 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎర్ర కోట సమీపంలో శనివారం మోహరించారు అధికారులు. ఈ లేజర్ వెపన్ ఆకాశంలో 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాక జామ్ చేయగలదు. అలానే 1-2.5 కిలోమీటర్ల దూరంలోని లేజర్ వెపన్ టార్గెట్లను వాటేజ్‌ను బట్టి చేధించగలదని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాలలో పెరిగిన డ్రోన్ ఆధారిత కార్యకలాపాలకు ఇది తగిన సమాధానం అవుతుందని భావిస్తున్నామన్నారు అధికారులు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను గుర్తు చేసుకుని వారికి నివాళులు ఆర్పించారు. ‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత మాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన లక్షలాది మంది కుమారులకు, కుమార్తెలకు మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనందరం స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అంటే వారి ప్రాణత్యాగ ఫలితమే. వారి త్యాగాలను మనం స్మరించుకోవాలి. అలానే మా భద్రత కోసం ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసులతో సహా ఇతర భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది’ అన్నారు నరేంద్ర మోదీ. అలానే స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో (అరవింద్ ఘోష్) ను ఆయన జయంతి సందర్భంగా ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు. -
సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్‌లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు. -
కోవిడ్‌పై డ్రోన్‌తో యుద్ధం
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఆధునిక యంత్రాలను వినియోగిస్తోంది. కరోనా చైన్‌ను తెంచేందుకు ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలతో ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను అధికారులు రెడ్జోన్లుగా ప్రకటించి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని నింగి నుంచి పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెడ్జోన్ల పరిధిలో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉల్లంఘనులను పట్టిస్తున్నాయి. కరోనా గీత దాటిన వారిని హెచ్చరించేందుకు, చర్యలు తీసుకునేందుకు దోహదపడుతున్నాయి. డ్రోన్లతో రెడ్జోన్ల పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సైతం స్ప్రే చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు: లాక్డౌన్, రెడ్జోన్ల నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై గుంపులు గుంపులుగా గుమికూడినా, రాకపోకలను సాగిస్తున్నా.. గుర్తించి కట్టడి చేసేందుకు పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా నేత్రాలు (డ్రోన్)లను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 డ్రోన్లు రెడ్జోన్లు, చెక్‌పోస్టుల వద్ద నింగిలో చక్కర్లు కొడుతూ పహారా కాస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ప్రతిక్షణం పరిశీలిస్తున్న పోలీసులు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు హెచ్చరికలతో పాటు చైతన్యవంతులను చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిల్లా పోలీ సు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకు వచ్చారు. రోడ్లపై ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడడంతో పాటు అత్యవసర పనులకు వెళ్లే వాహనాలు మినహా మిగిలిన వాహనాల రాకపోకల నియంత్రణకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ అధికంగా ఉన్న రెడ్జోన్లను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. రెడ్‌జోన్ ఏరియాల్లో నుంచి ఎవరిని బయటకు రానివ్వకుండా, బయట వారిని లోనికి వెళ్లనివ్వకుండా చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి ప్రజలు జిల్లాలోకి రాకుండా ఇంటర్‌స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్, సబ్‌డివిజన్ స్థాయిల్లో సుమారు 122 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది రోడ్లపై విధులు నిర్వహిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. అధునాతన పరిజ్ఞానంతో నిఘా కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. రెడ్జోన్లలోని కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వహించడం కష్టతరంగా మారడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 10 (వీడియో చిత్రీకరణ), రెండు వీడియో, ఆడియో సిస్టం కలిగిన డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. వీఆర్‌లో ఉన్న సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్లను కలిపి బృందాలుగా ఏర్పాటు చేశారు. వారు డ్రోన్ల సాయంతో రెడ్జోన్లు (కంటైన్మెంట్ ఏరియా)లో పరిస్థితులను పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు. రోజుకు మూడు పర్యాయాలు నిర్దేశిత జోన్ల వద్ద మూడు కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లు నింగిలో తిరుగుతూ లాక్డౌన్ అమలు తీరుతెన్నులు? నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయా? తదితరాలను చిత్రీకరిస్తున్నాయి. వాటి ద్వారా అక్కడి స్థితిగతులను అధికారులు తెలుసుకుని సిబ్బందికి సూచనలు, సలహాలిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ఉన్న డ్రోన్ల సహాయంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రెడ్జోన్లలో డ్రోన్లతో విస్తృత నిఘా నెల్లూరు(క్రైమ్): అత్యంత సాంకేతిక కెమెరాలతో కూడిన డ్రోన్ల సాయంతో రెడ్జోన్లలో స్థితిగతులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రెడ్జోన్లలో వీటిని వినియోగించారు. నగరంలోని ఖద్దూస్‌నగర్, మన్సూర్‌నగర్, కోటమిట్ట, పెద్దబజారు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో డ్రోన్లతో లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. 10 కిలోల బరువు కలిగిన ఈ యంత్రం చుట్టూ నాలుగు కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో పాటు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం (మైక్)ను అమర్చారు. సెల్‌ఫోను నుంచి మైక్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. దీనిని వినియోగించి గుంపులుగా గుమికూడిన ప్రజలను అక్కడి నుంచి తరిమేశారు. అందుబాటులో స్ప్రేయింగ్ డ్రోన్ కరోనా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం తరచూ శానిటైజ్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్లు, వాటర్ ట్యాంకర్లు తదితరాల సాయంతో సోడియం హైపో క్లోరైట్‌ను స్ప్రే చేయిస్తున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వాయుమార్గాన స్ప్రే చేయించేందుకు స్ప్రేయింగ్ డ్రోన్‌ను జిల్లా పోలీసు యంత్రాగం అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్ప్రేయింగ్ డ్రోన్‌కు సమారు ఆరు లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు (సోడియం హైపోక్లోరైట్ ద్రావణం నింపిన)ను అమర్చి రెడ్జోన్లలో ద్రావణం స్ప్రే చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో దానిని వినియోగిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఓ వైపు లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘనులపై చర్యలు తీసుకునేందుకు, మరో వైపు ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు, ఇంకో వైపు ద్రావణాన్ని స్ప్రే చేసి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో డ్రోన్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. -
కరోనా వైరస్: డ్రోన్ స్ప్రే
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్(కోవిడ్–19) విశ్వాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శరవేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ నిర్మూలనకు విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ) అధికారులు వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో మనుషులు వెళ్లకుండా డ్రోన్లతో వైరస్‌ను సంహరించే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. నగరంలో ఐదు డ్రోన్ల సాయంతో.. ఒక్కో డ్రోన్‌లో 5 లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తున్నారు. హైపో క్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ వల్ల వైరస్ క్షణాల్లో చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటోన్మెంట్(కాలుష్య) జోన్లు, ఐసోలేషన్ కేంద్రాలతోపాటు నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఈ విధంగా పిచికారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. (గల్లీల్లో 'ఢిల్లీ') డ్రోన్ స్ప్రే ఎక్కడెక్కడ అంటే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల రింగ్‌రోడ్డు, రమేష్ ఆస్పత్రి రింగ్‌రోడ్డు, విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్, లబ్బీపేటలోని ఉషాకార్డియాక్ సెంటర్, రైల్వే ఆస్పత్రి, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, రాజరాజేశ్వరీ పేటలోని వీఎంసీ మెటరి్నటీ ఆస్పత్రి, చెక్‌పోస్టు వద్దనున్న లిబర్టీ హాస్పిటల్ వద్ద డ్రోన్ల సాయంతో పిచికారీ చేస్తున్నారు. -
కరోనా.. కొత్త టెక్నాలజీలు!
సాక్షి, హైదరాబాద్: నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తే..ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడని అప్పుడెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పాడట..కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది ఇందులోనూ మానవాళికి మరింత మేలు చేసే కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు వెతుకుతున్నారు. ఇప్పుడు కాకపోయినా..రాబోయే రోజుల్లో ఇలాంటి మహమ్మారి మానవాళిని కబళించే ప్రయత్నం చేస్తే ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి ఈ ఆవిష్కరణలు. షిప్పింగ్ కంటెయినర్లలో ఐసీయూలు! కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే వారం రోజుల్లో చైనా వెయ్యి పడకలతో కూడిన ఆసుపత్రిని హుటాహుటినా కట్టేసింది. అన్నిచోట్ల చైనా మాదిరి పరిస్థితులుండవు కదా.. అందుకే కనెక్టెడ్ యూనిట్స్ ఫర్ రెస్పిరేటరీ ఎయిల్‌మెం (కూరా) షిప్పింగ్ కంటెయినర్లనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లుగా మార్చేసేంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు వీలైన ఈ ఐసీయూలు విపత్కర పరిస్థితుల్లో బోలెడన్ని ప్రాణాలు కాపాడతాయనడంలో సందేహం లేదు. కార్లో రాట్టీ అసోసియాటీ, ఇటాలో రోటా, స్టూడియో ఎఫ్ఎం మిలానో, హ్యుమానిటాస్ రీసెర్చ్ హాస్పిటల్, జాకబ్స్, స్క్వింట్ ఓపెరా తదితర సంస్థలన్నీ కలిసి ఈ వినూత్న ఐసీయూలను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి. నౌకల్లో సరుకుల రవాణాకు ఉపయోగించే 20 అడుగుల పొడవైన కంటెయినర్లను బాగా శుభ్రం చేసి.. కిటికీలు, తలుపులు ఏర్పా టు చేస్తారు. వీటిని ఒకదానితో ఒకటి కలిపేందుకు బుడగల్లాంటి నిర్మాణాలను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ గరిష్టంగా 40 పడకలతో కూడిన ఐసీయూ ఆసుపత్రిని సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవసరమైన వారెవరైనా ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారు చేసుకోవచ్చు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ కంటెయినర్లను నెగిటివ్ ప్రెషర్ తో కూడా రూపొందించవచ్చు. ఆçస్పత్రులకు అనుబంధంగా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఐసీయూల సా మర్థ్యాన్ని తక్కువ సమయంలో పెంచుకోవచ్చని అంచనా. క్షేత్రస్థాయి, తాత్కాలిక ఆçస్పత్రుల ఏర్పాటుకూ ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తు తం కూరా తొలి నమూనా ఐసీయూను మిలాన్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తోంది. డ్రోన్లతో కరోనా బాధితుల గుర్తింపు భవిష్యత్తులో రోడ్లపై ఏదైనా ఓ డ్రోన్ కనిపించిందనుకోండి.. అదేదో ఫొటో లు తీసేందుకు వచ్చిందని అనుకోకండి. మీలో కరోనా లాంటి వైరస్ ఉందేమో గుర్తించేందుకు ఎగురుతూ ఉండొచ్చు. ఆశ్చర్యంగా ఉందా? సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, కెనడాలోని డ్రాగన్‌ఫ్లై డ్రోన్ కంపెనీ సంయుక్తంగా ఈ వినూత్నమైన డ్రోన్లను రూపొందిస్తున్నాయి. కరోనా వంటి మహమ్మారిని అడ్డుకునేందుకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలన్నది తెలిసిందే. అయితే ఇందుకు బోలెడన్ని సమస్యలున్నాయి. ఇలా కాకుండా.. డ్రోన్ల ద్వారా సామూహికంగా ప్రజలందరినీ పరీక్షించగలిగితే వ్యాధి కట్టడి చాలా సులువవుతుంది. ప్రత్యేకమైన సెన్సార్లు, కంప్యూటర్ చూపులు కలిగి ఉండే ఈ డ్రోన్లు గాల్లో ఎగురుతూనే వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తిస్తాయి. నిజానికి ఈ టెక్నాలజీని మూడేళ్ల క్రితమే ప్రొఫెసర్ జవాన్ చహల్ సిద్ధంచేశారు. భూమికి 33 అడుగుల ఎత్తులో ఎగురుతూ కూడా డ్రోన్ వీడియోల ద్వారా దగ్గు, తుమ్ములను గుర్తించగలవు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకునే వేగం వంటి వాటివన్నింటినీ గుర్తించగలదు. 50 మీటర్ల ప్రాంతంలోని ప్రజలపై నిఘా పెట్టగలదు. ప్రస్తుతానికి ఈ డ్రోన్ల కచ్చితత్వం కొంచెం తక్కువేనని, కాకపోతే ప్రాథమిక పరిశీలనలకు ఎంతో ఉపయోగపడుతుందని చహల్ అంటున్నారు. -
శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేస్తాయి
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు మొదలుకొని వ్యవసాయం వరకు.. డ్రోన్లను వాడని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే.. ఉగ్రవాదులెవరైనా ఈ డ్రోన్లను వాడితే? దేశ రక్షణకు కీలకమైన స్థావరాలపై దాడులకు పాల్పడితే? ఏం ఫర్వాలేదంటున్నారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. ఇలాంటి శత్రు డ్రోన్లను గుర్తించేందుకు వీరు ఓ కొత్త రకం డ్రోన్లను డిజైన్ చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తూ, శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేసి, వాటి దిశ మార్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేస్తాయని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రోన్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రిం చొచ్చు. ఇవి పోలీసులు, మిలిటరీ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఇవి ఎంతో భిన్నం.. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల పని తీరుకు ఇవి పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ ద్వారా డ్రోన్లను నియంత్రించే అవకాశం ఉండటం వల్ల ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లను ఏకకాలంలో ఉపయోగించొచ్చు. వాహనాలు, మానవులు, ఇతర వస్తువులను గుర్తించేందుకు ఒకేసారి బోలెడన్ని ఈ డ్రోన్లను వాడొచ్చన్నమాట. చీకట్లోనూ పనిచేస్తుంది.. ఈ డ్రోన్లను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి వసు గుప్తా, ఐఐటీ మద్రాస్‌లోని ఆర్ఏఎఫ్టీ ల్యాబ్‌కు చెందిన రిషభ్ వశిష్టలు కలసి రూపొందించారు. ‘ఇవి తమ చూపుతోనే నేరుగా వస్తువులను, వ్యక్తులను కచ్చితంగా గుర్తించగలవు. నమూనా డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకొస్తాం’అని ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ మోహన్ వివరించారు. అవసరాలకు తగ్గట్టుగా వీటితో పనిచేయించుకోవచ్చని, ఒకేసారి బోలెడన్ని వాహనాలను ట్రాక్ చేయడమూ సాధ్యమని తెలిపారు. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ సాయంతో పనిచేసే ఈ కొత్త డ్రోన్ల సాయంతో చీకటిలోనూ కదలికలను గుర్తించొచ్చనని, ఇందుకు పరారుణ కాంతి కిరణాలను వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. గాల్లోనే హ్యాక్ చేస్తాయి.. ఈ కొత్త డ్రోన్లు నకిలీ జీపీఎస్ సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా శత్రు డ్రోన్లను తప్పుదోవ పట్టిస్తాయని, నకిలీ జీపీఎస్ ప్యాకెట్లను విడుదల చేస్తూ వాటిని కావాల్సిన చోట సురక్షితంగా దింపేస్తాయని వసు గుప్తా, రిషభ్ వశిష్టలు తెలిపారు. శత్రువుల డ్రోన్ల కోసం ప్రత్యేకంగా జీపీఎస్ సంకేతాలను అభివృద్ధి చేసి వాటిని హ్యాక్ చేస్తాయన్నమాట. తాము ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ ఆధారిత నకిలీ జీపీఎస్ సంకేతాలను అందుబాటులో ఉన్న అన్ని రకాల జీపీఎస్ రిసీవర్లతో పరిశీలించి చూశామని, నాలుగైదు సెకన్లలోనే శత్రువుల డ్రోన్లను తమ అధీనంలోకి తీసుకురావడం సాధ్యమైందని వివరించారు.