Employee transfers
-
అన్నీ పొలిటికల్ బదిలీలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఎమ్మెల్యేల సిఫారసు లేకుండా ఏ ఉద్యోగి, ఏ అధికారి కూడా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గంలోని కార్యాలయంలోనైనా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించాలని కలెక్టర్లకు కూడా అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. సీనియారిటీ, ప్రతిభను కూడా పక్కన పెట్టి కేవలం సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరపాలని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వారే పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి మాత్రమే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలా లక్షకుపైగా సిఫారసు లేఖలు ఎమ్మెల్యేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 సిఫారసు లేఖలు ఇచ్చారని, కొందరు 250 నుంచి 300 లేఖలు కూడా ఇచ్చారని సమాచారం. జిల్లాకు సగటున 4 వేల సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 5 వేలకు పైగా సిఫారసు లేఖలు రావడంతో ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. బదిలీల్లో ఇంతటి రాజకీయ జోక్యం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎప్పుడూ చూడలేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ, పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పటికీ బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలా జిల్లాల్లో పాత తేదీలు వేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనధికారికంగా వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.‘దక్షిణ’ ఇస్తే ‘దమ్మున్న’ పోస్టింగ్ నియోజకవర్గాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో ఉంచుకునేలా ఎమ్మెల్యేలు అనువైన వారిని గుర్తించి సిఫారసు లేఖలు ఇచ్చారు. ఎక్కువ ముడుపులు ఇచ్చిన వారికి ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించారు. కుల ప్రాతిపదికన కూడా చాలామందికి సిఫారసు చేశారు. ఇందుకోసం అప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని బలవంతంగా లూప్లైన్లోకి, అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయించారు. కొందరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ పక్కన పెడుతున్నారు. కొన్నిచోట్ల బదిలీల జాబితాలో ఉన్న పేర్ల పక్కన టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థం అని రాశారు. టీడీపీకి అనుకూలమైన వారికే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌కి అనుమతిస్తున్నారు. లేకపోతే లూప్లైన్లోకి పంపించేస్తున్నారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా తమ వారినే నియమించుకుంటున్నారు. నిబంధనలు బేఖాతరు బదిలీల్లో నిబంధనలను అసలే పట్టించుకోవడంలేదు. తహశీల్దార్లను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయకూడదనే నిబంధనను అన్ని చోట్లా తుంగలో తొక్కారు. కాగితాలపై ఆ నియోజకవర్గం కాదని చూపించి మరీ సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఇదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పనిచేస్తున్న తహశీల్దార్ తన సొంత నియోజకవర్గమైన భీమవరం వేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చినా అధికారులు కాదనలేని పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్‌పై ఏసీబీ కేసు ఉన్నా ప్రధానమైన పోస్టు కోసం అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేల లేఖలను తప్పనిసరిగా ఆమోదించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున నిబంధనలకు విరుద్ధమైన వారికి కూడా పోస్టింగ్‌లు ఇవ్వక తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. -
బదిలీలు పారదర్శకంగా..
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి ఒకేచోట పోస్టింగ్.. పోస్టింగ్ ఒకచోట ఉంటే మరోచోట డిప్యుటేషన్.. అర్హతతో సంబంధంలేని విభాగంలో కొలువు, సీటులో ఉంటూ కాలయాపన.. ఇదీ గత కొన్నేళ్లుగా వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు ఉద్యోగుల పనితీరు. ఇప్పటికే ఈ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కార్ తాజాగా బదిలీల విషయంలోను సంస్కరణలకు పూనుకుంది. వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్ విధానంలో సాధారణ బదిలీలు చేపడుతోంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అన్ని కేడర్ల శాశ్వత ఉద్యోగులను బదిలీ చేస్తోంది. రాజకీయ సిఫార్సులు, ఆర్థిక లావాదేవీలు పైరవీలకు అవకాశంలేకుండా పారదర్శకంగా బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టింది. విధులపట్ల తీవ్ర నిర్లక్ష్యం ఇక ఒకేచోట ఏళ్ల తరబడి స్థిరపడిపోవడంతో కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పెట్టిన దృష్టి ప్రభుత్వ విధులపై ఉండడంలేదు. మరికొందరు వైద్యులు ఒకేచోట 10–20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయి విధులకు సరిగా హాజరుకావడంలేదనే ఆరోపణలున్నాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో కొందరు వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, గైర్హాజరైనా రిజిస్ట్రర్‌లో సంతకం చేసి విధులకు హాజరైనట్లు చూపించుకోవడం వంటి ఉదంతాలు గత ఏడాది వెలుగుచూశాయి. పీహెచ్సీ, ప్రాంతీయ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోని కొందరు వైద్యులు కూడా నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ విధులకు సరిగ్గా హాజరుకావడంలేదని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రభుత్వం సాధారణ బదిలీలను చేపడుతోంది. దీనికితోడు వైద్యులు, వైద్య సిబ్బంది కొరతన్న మాటకు తావు లేకుండా భారీగా నియామకాలూ చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 39 వేల పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టుల భర్తీ పూర్తవగా మిగిలిన పోస్టుల భర్తీ ఈనెలాఖరుతో పూర్తికానుంది. నేడు ఖాళీల ప్రదర్శన మరోవైపు.. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆయా విభాగాలు వేగవంతం చేశాయి. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు, మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు పనిచేసిన వారు రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అర్హులు. డీఎంఈ పరిధిలో 270 మంది ప్రొఫెసర్లు, 192 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 800 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 70 మంది ట్యూటర్లు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ఆన్లైన్లో వివరాల నమోదు పూర్తికాగా.. సోమవారం ఖాళీలు ప్రదర్శించి, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటామని డీఎంఈ రాఘవేంద్ర తెలిపారు. మిగిలిన విభాగాల్లో ఉద్యోగుల వివరాల సేకరణ తుదిదశకు చేరింది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో సోమవారం బదిలీలకు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రదర్శిస్తారు. అనంతరం ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఒక్కో ఉద్యోగి 20 ప్రాంతాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజారోగ్యం, ఏపీవీవీపీ, ఇతర విభాగాల్లో ఉద్యోగులు ఆన్లైన్లో బదిలీ దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం నుంచి వీలు కల్పించే అవకాశం ఉంది. -
AP: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు కసరత్తు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో అన్ని క్యా డర్లలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నేటి (మంగళవారం) నుంచి ఈ నెలాఖరు వరకు బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. బదిలీల విషయమై డీహెచ్, డీఎంఈ, ఏపీవీవీపీ, ఆయుష్ కమిషనర్, ఇతర అధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమీక్షించారు. ప్ర భుత్వం నిర్దేశించిన గడువులోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆన్లైన్లో బ దిలీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్‌ను రూపొందించారు. రాష్ట్ర, రీజనల్, జిల్లా కమిటీల వారీగా అధికారులు లాగిన్ అవడానికి వీలు కల్పించారు. వెబ్ అప్లికేషన్ పనితీరు, ఉద్యోగుల వివరా ల నమోదు, తదితర అంశాలపై జిల్లాల పరిపాలన విభాగం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఉన్నతాధికారులు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్‌గా సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరికి బదిలీ తప్పనిసరి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోపు ఉద్యోగ విరమణ చేసే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి అభ్యర్థన మేరకు మాత్రమే బదిలీలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఉద్యోగులను మినహాయించి తప్పనిసరి బదిలీకి అర్హులైన ఉద్యోగుల స్థానాలను ఖాళీల రూపంలో వెబ్ అప్లికేషన్లో ప్రదర్శించనున్నారు. మరోవైపు వైద్య, ఆరోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొన్ని పోస్టులు ప్రత్యక్షంగా, మరికొన్ని పదోన్నతుల ద్వారా భర్తీచేస్తున్నారు. -
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం
-
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారులను సొంత జిల్లాల నుంచి బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. లోక్ సభ, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. -
పన్నుల శాఖలో బదిలీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. శాఖ పునర్ వ్యవస్థీకరణ సాకుతో బదిలీలను అధికారులు నిలిపేశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్నందున అది పూర్తయ్యేవరకు బదిలీలుండవని తేల్చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పనిభారం పెరగడంతో సర్కిళ్లను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించిన అధికారులు.. ఒక్కో సర్కిల్లో 1,500–2,200 మంది డీలర్లు ఉండేలా ప్రస్తుత 91 సర్కిళ్లకు అదనంగా మరో 5 కలిపి 96 సర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ డివిజన్ల పెంపుపై మాత్రం ప్రతిపాదన చేయలేదు. 8 నుంచి 10 సర్కిళ్లు కలిపి ఓ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే డివిజన్ల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. బదిలీల నిలిపివేతపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. పునర్ వ్యవస్థీకరణ చేయడంలో తమకు ఇబ్బంది లేదని, కానీ ఆ కారణంతో బదిలీలు నిలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీ నాటి ప్రతిపాదన గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీని వల్ల పన్నుల శాఖ పరిధిలోని ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని.. వెంటనే సర్కిళ్లు, డివిజన్లను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 120 సర్కిళ్లు, 15 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. అయితే అప్పటి నుంచి ఆ ఫైలు పెండింగ్‌లో ఉంది. అదే సాకుతో పదోన్నతులనూ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ పునర్ వ్యవస్థీకరణ అంటూ బదిలీలు ఆపుతుండటంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా బదిలీల్లేవని, ఈ సాకుతో మళ్లీ నిలిపితే ఇప్పట్లో బదిలీలు జరగవేమోనని ఆందోళన చెందుతున్నారు. -
ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య. అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు.. ► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు? ► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు. ► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది. ► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు. ► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు -
‘పంచాయతీ’ ఉద్యోగుల బదిలీల్లో జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలపై అస్పష్టత కొనసాగుతోంది. జూలైలో గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. మే ఆఖరు వరకు ఇది పూర్తయ్యే అవకాశముంది. అనంతరం జిల్లాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యలను తేల్చడం, గ్రామాల వారీగా రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. బీసీ ఓటర్ల గణన మధ్యలో ఉన్నందున ఈ శాఖ ఉద్యోగులకు ఇప్పుడే బదిలీలు ఉండవని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మే 25 నుంచే బదిలీల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖలో దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు ఏవీ ఆ శాఖ ఉన్నతాధికారులకు చేరలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు వాయిదా పడినట్లేనని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే బదిలీలపైగానీ, వాయిదాపైగానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పీఆర్సీ, బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడ్రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయటంతో పాటు.. శాశ్వత ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ‘తెలంగాణ బదిలీల విధానం’ రూపొందిస్తామని ప్రకటించారు. జూన్‌లోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు వీలుగా చర్యలు చేపడుతామని తెలిపారు. వీటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బుధవారం ప్రగతి భవన్లో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో విలేకరుల సమావేశంలో సీఎం ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. ముగ్గురు కమిషనర్లతో కమిషన్ ఇప్పటివరకు ఆనవాయితీగా ఉన్న ఏక సభ్య కమిషన్‌కు బదులు కొత్త పీఆర్సీని ముగ్గురు కమిషనర్లతో (త్రిసభ్య కమిషన్) వేస్తామని సీఎం వెల్లడించారు. ‘‘గతంలో ఏడాదిపాటు పీఆర్సీ అధ్యయనం చేసేది. ఈసారి అందుకు భిన్నంగా శరవేగంగా పీఆర్సీ అధ్యయన ప్రక్రియ పూర్తి చేసేలా కమిషన్‌కు విధివిధానాలను నిర్దేశిస్తాం. ఆగస్టు 15కు పది రోజుల ముందే పీఆర్సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించేలా గడువు విధిస్తాం. పంద్రాగస్టు కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాం. ఈలోపే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీ వేయగానే.. వారిచ్చే సిఫారసుల మేరకు జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐఆర్ ప్రకటిస్తాం..’’అని చెప్పారు. బదిలీలకు శాశ్వత విధానం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధారణ బదిలీలకు అవకాశమివ్వలేదని సీఎం పేర్కొన్నారు. ‘‘అన్ని సంఘాలు బదిలీల అవసరముందని విజ్ఞప్తి చేశాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీఎస్పీలు తప్ప మిగతా ఉద్యోగుల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అందుకే బదిలీలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవినీతి లేకుండా పారదర్శకంగా, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా బదిలీల ప్రక్రియ జరగాలి. అందుకే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా అధ్వర్యంలో ముఖ్య కార్యదర్శులు అదర్ సిన్హా, శివశంకర్ ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ రేపు, ఎల్లుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఎప్పట్నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టాలి, అవినీతికి తావులేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిస్తుంది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫారసుల మేరకు బదిలీలకు ఉత్తర్వులు జారీ అవుతాయి. భార్యభర్తలను ఒకే చోటికి బదిలీ చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ముందే బదిలీలు పూర్తి చేస్తాం. జూన్ 15లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్నాం. బదిలీల్లో ఎక్కడ అవినీతి జరిగినా కఠిన చర్యలుంటాయి. ఇకపై బదిలీలకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక విధానం ఉండాలని నిర్ణయించాం. నిర్ణీత గడువు లేదా ప్రతి ఏడాది బదిలీలు చేయాలా.. చేస్తే ఎంత శాతం చేయాలి.. ఇవన్నీ పొందుపరుస్తూ బదిలీ విధానం ఉంటుంది. ఈ బాధ్యతను అధికారుల కమిటీతోపాటు మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించాం. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం’’అని వివరించారు. సీఎం వెల్లడించిన ముఖ్య నిర్ణయాలివీ.. ఒక డీఏ చెల్లించే ఫైలుపై సంతకం పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తాం. ఈరోజే డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశాను. మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తాం. పదోన్నతులకు విధానం సంఘాల కోరిక మేరకు ఉద్యోగుల పదోన్నతుల అర్హతకు రెండేళ్ల సీనియారిటీ ఉండేలా ఇచ్చిన వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తాం. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి ఒక విధానం రూపొందిస్తాం. పైరవీలతో ప్రమోషన్లు చేసుకోవాల్సి వస్తోంది. ఆరోపణలున్న ఉద్యోగులకు తప్ప తప్పు చేయని ఉద్యోగులందరికీ పదోన్నతులు రావాలి. ఏ హోదాలో ఉన్న ఉద్యోగికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలియాలి. అందుకు వీలుగా ఇప్పుడున్న లొసుగులన్నీ తొలిగించి పారదర్శకంగా విధానం తయారు చేయాలి. మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవు మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సెలవు ఇస్తాం. ఉద్యోగుల ఎల్టీసీకి సంబంధించి నిర్దిష్టమైన విధానం రూపొందిస్తాం. ఇప్పుడున్న ఎల్టీసీ విధానం గందరగోళంగా ఉంది. దుర్వినియోగమవుతుందనే ఫిర్యాదులున్నాయి. విదేశాలకు వెళ్లినా సరే.. ప్రతి ఉద్యోగికి ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇకపై బస్ టికెట్లు, బిల్లులు పెట్టే పద్ధతి ఉండదు. ప్రతి ఉద్యోగి ఏటా ఈ సదుపాయం వినియోగించుకునేలా విధానం ఉంటుంది. ఏటా లేదా మూడేళ్లకోసారి విదేశాలకు వెళ్లినా సరే. ఈ సదుపాయం వినియోగించుకునేలా ఓ నిర్ణీత విధానం ఖరారు చేస్తాం. రిమోట్ ఏరియా అలవెన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో లోపాలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లేదు. అందుకే మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రత్యేక అలవెన్స్ ఇస్తాం. ఏయే ప్రాంతాలు మారుమూలన ఉన్నాయి.. ఎక్కడ పని చేసే వారికి ఎంత అలవెన్స్ ఇవ్వాలనేది పీఆర్సీ అధ్యయనం చేసి వెల్లడిస్తుంది. పకడ్బందీగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హెల్త్ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్ విధానం రూపొందిస్తాం. 10 రోజుల్లో కారుణ్య నియామకాలు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకాలు పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. రిటైరైన ఉద్యోగులను సాదరంగా వీడ్కోలు పలకాలి. ప్రభుత్వం తరఫున అందించే పెన్షన్ బెనిఫిట్ ప్యాకేజీని అందించి సత్కరించాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వద్ద దింపి రావాలి. ఇప్పటికే ఈ ఉత్తర్వులిచ్చాం. కానీ పాక్షికంగా అమలవుతోంది. పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు ఆదేశాలు జారీ చేస్తాం. సీపీఎస్ ఉద్యోగులకు డెత్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ సీపీఎస్ ఉద్యోగులకు తమకు రావాల్సిన బెనిఫిట్స్ రావనే అనుమానాలున్నాయి. వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత మేరకు ప్రయోజనం కల్పిస్తాం. డెత్, రిటైర్మెంట్ గ్రాట్యుటీని చెల్లిస్తాం. త్వరలోనే ఈ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఏకీకృత సర్వీసులపై న్యాయపోరాటం ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసులు చిన్న మెలికతో ఆగిపోయాయి. ప్రభుత్వమే వారి తరఫున న్యాయపోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదనలు వినిపిస్తుంది. భాషా పండితులు, పీఈటీలపై.. భాషా పండితులు, పీఈటీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం. ఎయిడెడ్ టీచర్లు, అధ్యాపకులకు సంబంధించి నెలల తరబడి జీతాలు రావడం లేదనే ఫిర్యాదులున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర విధానం రూపొందిస్తాం. జోనల్ విధానంపై చర్చలు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడున్న జోనల్ విధానంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించి అభిప్రాయాలు తీసుకుంటాం. తదుపరి తుది నివేదికను కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. -
ఐదేళ్ల సర్వీసు ఉంటే బదిలీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, పదవీ విరమణ వయస్సు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు వంటి ప్రధాన అంశాల్లో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నవించింది. వాటి పై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం జేఏసీ నేతలు రవీందర్‌రెడ్డి, మమత, మధుసూదన్‌రెడ్డి, రాజేందర్, సత్యనారాయణ తదితరులు సీఎస్‌ను సచివాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. గతంలోనే ఉద్యోగులకు సంబంధించిన 18 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన జేఏసీ.. ఆయా అంశాల వారీ వివరాలను, వాటికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలను సీఎస్‌కు మంగళవారం అందజేశారు. సీపీఎస్ రద్దుపై పట్టు ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని జేఏసీ సభ్యులు సీఎస్‌ను కోరారు. సీపీఎస్‌లో చేరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని, సీపీఎస్ నుంచి వైదొలుగుతున్నట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసున్న ప్రతి ఉద్యోగి బదిలీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్లుగా 20 శాతం మందికే బదిలీలు కాకుండా అర్హత ఉన్న అందరి బదిలీలకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండేళ్ల సర్వీసున్న వారికి కూడా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ బదిలీలను కూడా పాత పది జిల్లాల ప్రాతిపదికనే చేపట్టాలని, ఇందుకు కౌన్సెలింగ్ విధానం తెచ్చి, ఉద్యోగుల అభిప్రాయాల మేరకు బదిలీలు చేయాలని సూచించారు. అలాగే పదోన్నతులు ఇవ్వాలని, ఇందుకు రెండేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, వెంటనే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పినట్లు జేఏసీ నేతలు వివరించారు. -
ఏప్రిల్‌లోనే బదిలీలు నిర్వహించాలి
టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): ఉద్యోగుల బదిలీలు సాధ్యమైనంత త్వరగా ఈ ఏప్రిల్‌లో నిర్వహించాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్ కోరారు. అలాగే, ఉద్యోగులకు పెన్షన్ సాధించే వరకు పోరాటాలు చేద్దామ ని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఉద్యోగుల ప్రమేయం లేకుండా పోస్టిం గులు ఇచ్చారని, అవి తాత్కాలిక కేటాయింపులని చెప్పినా ఇంకా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ విధానం కోసం త్వర లోనే ఈ ఏప్రిల్‌లో 28, 29న జాతీయ సమ్మేళ నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ విధానం కోసం రాష్ట్ర, జాతీయస్థాయిలో రాజీలేని పోరాటాలు చేయాల్సిందే అన్నారు. ఉద్యోగుల పెన్షన్ విధానానికి ఎంపీ కవిత కేంద్రానికి లేఖ రాశారన్నారు. -
పనితీరుకు పాతర
జిల్లాలో దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం {పజాప్రతినిధుల పట్టు వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజయవాడ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికాారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు. రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం జిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం. గుంటూరులోనూ అడ్డగోలే.. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రకియ అడ్డగోలుగా సాగుతోంది. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్నిశాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలను ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో కీలకంగా ఉన్న మంత్రి అన్ని శాఖల బదిలీల్లో కల్పించుకుని కావాల్సినవారికి కావాల్సిన పోస్టింగ్ ఇప్పించారని తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో 152 మంది ఉద్యోగులు బదిలీ అవగా 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే జరిగాయి. జిల్లాలో 20 మంది తహసీల్దార్లకు స్థానచలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. -
బంగ్లాకు బదిలీల దస్త్రం!
శ్రీకాకుళం టౌన్: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పది కేడర్ల కింద ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ప్రధానంగా ఎంపీడీవోలను మార్చడానికి నిబంధనలు అడ్డంకిగా మారారుు. అయితే ప్రస్తుత పాలకవర్గాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంగా కొంతమంది మండలాభివృద్ధి అధికారులను మార్చాలని ఒత్తిడి మొదలైంది. అందులో పలాస నియోజకవర్గంలో ఒకరిని బదిలీ చేయాలంటూ ఎమ్మెల్యే శివాజీ ఒత్తిడి పెంచారు. చాలా నెలలుగా ఎంపీడీవో, ఎమ్మెల్యేల మధ్య అంతరం ఉంది. దీంతో సాధారణ బదిలీల్లో అతన్ని మార్చాలని ఆయన అనుచరులు పట్టుబడుతుండడంతో బదిలీ తప్పని సరి. అయితే నిబంధనల ప్రకారం మార్చడం సాధ్యం కాక పోవడంతో డిప్యుటేషన్‌పై పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీడీవోలు డిప్యుటేషన్‌పై జిల్లాపరిషత్‌లోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వారిని జెడ్పీలోనే కొనసాగించినట్టయితే వారి స్థానాల్లో తాత్కాలికంగా ఎంపీడీవోలను నియమించాల్సిఉంది. వీరికి తోడు మరో ఇద్దరు బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి స్థానచలనం తప్పని సరి. వీరిని ఎక్కడెక్కడ నియమించాలన్న అంశంపై చర్చ సాగుతోంది. జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో ఉన్న జెడ్పీహైస్కూళ్లు, ఎంపీడీవో కార్యాలయాలు, ఇంజినీరింగ్ విభాగాలు, తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వివిధ కేడర్ ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. వీరిలో 74 మంది ఆఫీసు సబార్డినేట్లు, కింది తరగతి ఉద్యోగులు, మిగిలిన కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వీరు మా వారు.. వారిని అక్కడే ఉంచండి.. వారు కోరిన చోటు ఇవ్వండి.. ఇలాంటి సిఫారుసులు వస్తుండడంతో చైర్పర్సన్ దస్త్రాన్ని బంగ్లాకు పంపాలని హుకుం జారీ చేశారు. దీంతో సోమవారం రాత్రి దస్త్రం బంగ్లాకు చేరడంతో వాటిలో సిఫారుసులను కలుపుకుంటూ తుది జాబితాలను తయారు చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీలో టైపిస్టుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈదస్త్రంలో చేర్పులు మార్పులకు జోక్యం చేసుకుంటున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీలను బుధవారంలోగా పూర్తిచేసి తిరిగి ఆన్లైన్లో ఉంచాలన్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తుది జాబితా తయూరీకి తొందర పడుతున్నారు. జెడ్పీ సీఈవో బి.నగేష్ ఇప్పటికే ఈ విషయాన్ని జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కసరత్తు జరుగుతోందని చెప్పడంతో మౌనం వహించక తప్పలేదని తెలిసింది. ఏలాగైనా బుధవారం నాటికి బదిలీల ఉత్తర్వులు జారీ పూర్తిచేయాలని సీఈవో నగేష్ భావిస్తున్నారు. -
నిబంధనలు తూచ్
రాజకీయ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదిలీలు ఎమ్మెల్యేల మాటే నెగ్గింది వంత పాడిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెబ్ కౌన్సెలింగ్.. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు’ అంటూ సర్కారు పలికిన పలుకులు మాటల వరకే అని తేలిపోయింది. నిబంధనల్ని తోసిరాజనడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంతో ఉద్యోగుల బదిలీలన్నీ పక్క పక్క మండలాలకు, పక్క గ్రామాలకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే బదిలీలు చేయాలని ఆదేశించారు. సాయంత్రానికి కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల మాట వినండని పరోక్షంగా హితబోధ చేయడంతో ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా జరిగిపోయాయి. ఆన్లైన్ ద్వారానే బదిలీలు ఉంటాయని ప్రకటించినా కొందరు ఉద్యోగులు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం నేతల చెంతకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమకు అనుకూలంగా ఉండే వారి కోసం పైరవీలు చేశారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తుండగా.. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ విధానం వల్ల ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని అందరూ భావించారు. ఈ నిబంధనలతో ఉద్యోగుల్లో కొందరు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో అని హడలిపోయారు. వెంటనే ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. దీంతో కథ మారిపోయింది. దీంతో వారు తమకు అనుకూలమైన వారిని తమ నియోజకవర్గంలోనే ఉండేలా చక్రం తిప్పారు. నిబంధనలు గాలికి.. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఏజెన్సీలో పనిచేయని ఉద్యోగుల్ని గుర్తించి వారిని అక్కడకు పంపించాలి. ఏజెన్సీ ఏరియాలో పనిచేసిన వారిని అర్బన్ ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ఈ నిబంధనలను కాదని బదిలీలు జరిగాయి. ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా ఉన్న కొందరు.. సంఘ కార్యవర్గ పదవిలో ఉన్నట్టు చెప్పుకుని వారు ప్రస్తుతం ఉంటున్న స్థానాల నుంచి కదల లేదు. దివ్యాంగులకు మొండిచేయి దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయించాలనే నిబంధన ఉన్నా దానిని కూడా పక్కనపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఖజానా శాఖలో ఒక అంధ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. సర్వే శాఖలోనూ ఒక అంధ ఉద్యోగిని బదిలీ చేయడంపై సాక్షాత్తు ఏలూరు ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పెద్దగా పలుకుబడి, ఆదాయం రాని విభాగాల్లో మాత్రం బదిలీలు యథాతథంగా జరిగిపోయాయి. రెవెన్యూ విభాగంలో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం భారీగా చెల్లింపులకు కూడా సిద్ధమైనట్టు ఆరోపణలు వచ్చాయి. వీఆర్వోలు, ఆర్ఐలు చక్రం తిప్పడంతో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా అక్కడికక్కడే ఉద్యోగాలు కట్టబెట్టారు. దుగ్గిరాల వీఆర్వోను కిలోమీటరు దూరం కూడా లేని శనివారపుపేటలో నియమించారు. వట్లూరు వీఆర్వోను సైతం కిలోమీటరు దూరంలో ఉన్న సత్రంపాడులో నియమించారు. సాఫ్ట్వేర్ పనిచేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన బదిలీల సాఫ్ట్వేర్ పనిచేయలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్ బదిలీలు కాస్తా సాధారణ బదిలీలుగా మారాయి. జిల్లాస్థాయిలో ప్రారంభించిన వెబ్ బదిలీల ప్రక్రియ కొంత ఫలితాన్నిచ్చినా చివరకు రాజకీయ బదిలీలుగా మారడంతో ఆ ప్రక్రియ వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. -
పడిగాపులు
బదిలీల్లో గందరగోళం రాత్రి వేళ ఉద్యోగుల ఇక్కట్లు ఐసీడీఎస్, ఇంజనీరింగ్ శాఖల్లో బదిలీలు జరిగినా మళ్లీ ఫైలు తెమ్మంటున్న కలెక్టర్ మచిలీపట్నం : ‘ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి.. జిల్లాలో మరో విధంగా నిబంధనలు విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగితే సహించేది లేదు.’ - ఇదీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతల మధ్య చర్చ ‘పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జాబితాలు సిద్ధం చేసి సోమవారం ఉదయం ఏడు గంటల కల్లా విజయవాడ తీసుకురమ్మన్నారు. దీంతో బదిలీలు అక్కడే ఉంటాయని విజయవాడ వెళ్లాం. మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నంలోనే బదిలీల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. పడుతూ, లేస్తూ ఇక్కడికొచ్చాం. రాత్రి 8.30 గంటలైంది. ఇంతవరకు సీనియార్టీ జాబితాలు విడుదల చేయలేదు. జాబితా విడుదలైతేనే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది.’ - పలువురు ఉద్యోగుల మధ్య సంభాషణ ఇది ‘రాత్రి 8.15 గంటలైంది. మహిళా ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బందిపెట్టడం ఎంతవరకు సమంజసం? బయట కూర్చుంటే దోమలు.. జెడ్పీ సమావేశపు హాలులో కూర్చుంటే ఉక్కపోత.. బీపీ, షుగర్‌తో బాధపడే ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటికి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి ఇంటికి చేరాలి’ - ఇదీ మరికొందరు ఉద్యోగుల మధ్య చర్చ బదిలీల కోసం సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలుకు వచ్చిన ఉద్యోగులు అర్ధరాత్రి వరకు నానా పాట్లు పడ్డారు. సోమవారంతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా రాత్రి 8.30 గంటల వరకు సీనియార్టీ జాబితాలను ప్రకటించకపోవడంతో పడిగాపులు పడ్డారు. దోమల బాధ పడలేక, ఉక్కపోత తాళలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో, శని, ఆదివారాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయినప్పటికీ ఈ రెండు శాఖల ఫైళ్లను తన వద్దకు తేవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయటంతో సోమవారం అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. యూనియన్ నాయకులు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక, ఉన్నతాధికారులను ఒప్పించలేక సతమతమమయ్యారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ విభాగంలోని ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్, సీఈవో మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తామే నిర్వహిస్తామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఒప్పించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విజయవాడ నుంచి మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయానికి మారింది. అయితే కలెక్టర్ నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సోమవారం రాత్రి 8.30 గంటల వరకు రాకపోవటంతో బదిలీల ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాలని పేర్కొంది. మూడేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియను కాదని కలెక్టర్ బాబు.ఎ అందరు ఉద్యోగులు స్వీయ మదింపు వివరాలను ఆన్లైన్లో ఉంచాలని చెప్పటంతో గందరగోళం నెలకొంది. ఏ ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలను తయారు చేస్తారనే అంశంపై సోమవారం రాత్రి 8.30 గంటల వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ ఏర్పడింది. బదిలీల ప్రక్రియపై పలువురు ఉద్యోగులను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో తమకే తెలియటం లేదని చెప్పటం గమనార్హం. -
10 వేల ఉద్యోగాల భర్తీ
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం - పోలీసు శాఖలో 6 వేలు, ఇతర శాఖల్లో 4 వేల పోస్టులు - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ - జూన్ 10 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు సాక్షి, విజయవాడ బ్యూరో: వివిధ ప్రభుత్వ శాఖల్లో తొలి విడతలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు శాఖలో 6 వేలు, మిగిలిన శాఖల్లో 4 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగుల బదిలీలను జూన్ 10 నుంచి 20వ తేదీలోపు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం విజయవాడలో నవనిర్మాణ దీక్ష, 8వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో మహా సంకల్ప దీక్ష ద్వారా ప్రజలను చైతన్యపర్చాలని నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ నిర్ణయాలివీ... ►మొదటి విడతలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. పోలీసు శాఖలో 6 వేలు, గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1,000, వైద్య, ఆరోగ్య శాఖలో 422, టెక్నీషియన్లు 1,000, ఇతర ప్రభుత్వ శాఖల్లో 732 పోస్టుల భర్తీ. ►పోలీసు శాఖలో 6 వేల పోస్టుల భర్తీ బాధ్యత పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు, మిగిలిన 4 వేల పోస్టులను భర్తీ చేసే బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగింత. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జూన్ 10 నుంచి 20 తేదీలోగా పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలనుత్వరలో రూపొందించాలి. ►13 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ హైస్కూళ్లలో తొమ్మిదో చదువుతున్న 1.80 లక్షల మంది బాలికలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. ►రాష్ట్రంలో కోటిన్నర మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకం అమలు. ప్రమాదాల్లో మృతి చెందినవారు, శాశ్వతంగా అంగవికలురైన వారికి రూ.5 లక్షలు, పాక్షికంగా అంగవికలురైన వారికి రూ.3.62 లక్షలు, సహజంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.30 వేలు ఈ పథకం కింద ఇవ్వాలని నిర్ణయం. వ్యవసాయ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, కార్మికులు, చేతివృత్తుల వారు దీనివల్ల లబ్ధి పొందుతారు. పాత్రికేయులకూ ఈ పథకం వర్తింపు. ►రాష్ట్రంలోని 1.48 కోటి కుటుంబాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించేందుకు రెండు విడతల్లో స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించాలి. మొదటి విడత సర్వే జూన్ 20 నుంచి 30, రెండో విడత జూలై 5 నుంచి 30వ తేదీ వరకు. ►ఐటీ శాఖ ద్వారా తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు. ►అనంతపురం, విశాఖ, చిత్తూరు జిల్లాల్ల్లో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయం. ►ఏపీ టవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు విషయంలో ఏపీఐఐసీకి పూర్తి అధికారం. ప్రభుత్వ భవనాలపై పీపీపీ విధానంలో టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి. ►ఏపీ పారా మెడికల్ అండ్ అలైడ్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం. ►కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ విజన్(ఉదయ్)ని రాష్ట్రంలో చేపట్టేందుకు అంగీకారం. -
సిఫారసులు, పైరవీలతో బదిలీలకు బ్రేక్
నెల్లూరు కలెక్టరేట్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీఆర్వోలు, ఆర్ఐలు, డీటీల బదిలీల కౌన్సెలింగ్ 15వ తేదీ అర్థరాత్రికే పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఒక్కో అధికారి నాలుగైదు సిఫారసు లేఖలు తీసుకుని వస్తున్నారు. దీంతోపాటు తమకు ఫలానా అధికారే కావాలంటూ టీడీపీ నేతలు కొర్రీలు పెడుతున్నారు. ఈ కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం వరకు సాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇంకా 300 వీఆర్వోలు, 18 ఆర్ఐలకు కౌన్సెలింగ్ చేయాల్సి ఉంది. -
అంతా రహస్యమే!
జిల్లా పరిషత్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంతా రహస్యంగా నడిపారు. వివిధ ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగులను బదిలీ చేశారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చారు. జెడ్పీ సీఈవో కనుసన్నల్లోనే పూర్తి కథ నడిపారు. దీనిపై పలువురు ఉద్యోగులు విమర్శలు గుప్పించారు. - జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు - ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా ఎంపీడీవోలకు స్థాన చలనం - ముందుగా ఖరారైనస్థానాలకు మినిస్టీరియల్ సిబ్బంది నియామకం - మీడియాకు అనుమతి నిరాకరణ అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ చాంబర్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉద్యోగుల బదిలీలు నిర్వహించారు. ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్లు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరినీ తప్పనిసరిగా బదిలీ చేశారు. ఐదేళ్లు పూర్తికాని వారిలో కొందరికి పరిపాలన సౌలభ్యం దృష్ట్యా స్థాన చలనం కల్పించారు. జిల్లా పరిషత్ సీఈవో రామచంద్ర అంతా తానై వ్యవహరించారు. ఉద్యోగులు వారి సమస్యలు చెప్పుకునే వీలుకూడా లేని పరిస్థితిని కల్పించారు. ఉద్యోగులు పలానా ప్రాంతానికి నేను వెళ్తాను అని ముందుకొచ్చిన సమయంలో నీవు అక్కడ చేయలేవు మరో చోటకు కోరుకో అంటూ వారిని భయపెట్టి సీఈవోనే నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో పనిచేసే ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ త్వరలో పదోన్నతి వస్తున్న దృష్ట్యా దగ్గరలో ఉన్న రాప్తాడు మండల పరిషత్‌కు బదిలీ చేయాలని కోరితే నీవు అక్కడ తట్టుకోలేవని సర్ధిచెప్పినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ తనను అర్డబ్ల్యూఎస్కు బదిలీ చేయాలని కోరగానే ఆయనపై సీఈవో మండిపడినట్లు సమాచారం. ‘ఐదేళ్లుగా తినేందుకు అలవాటు పడినట్లు ఉన్నావ్.. ఒకసారి చెబితే అర్థం కాదా.. మళ్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు పోవాలని కోరుతావ్’ అంటూ అందరి సమక్షంలోనే ఫైర్ అయినట్లు తెలిసింది. ఊహించిన విధంగానే ఎంపీడీవోల బదిలీలు : ముందుగా ఊహించిన విధంగా ఈ సారి ఎంపీడీవోల బదిలీలు ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా జరిగాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభవుతున్న సమయంలోనే ఎంపీడీవో అసోషియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఎంపీడీవోలు చైర్మన్ చమన్‌ను కలిశారు. మండలాల్లో జరుగుతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. ఈ సారి బదిలీలు వద్దు.. ఎమ్మెల్యేలు ఎవరు చెబితే వారికి ఆ స్థానాలు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేలను కాదని కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేస్తే ఆయా మండలాల్లో పనిచేయలేమని స్పష్టం చేశారు. ఇందుకు చెర్మైన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సాధారణ బదిలీల అనంతరం నూతనంగా ఉద్యోగోన్నతి పొందిన 13 మంది ఎంపీడీవోలకు పోస్టింగ్ కేటాయిస్తామని తొలుత ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితమే వారికి పోస్టింగ్ ఖరారు చేసినట్లు తెలిసింది. 52 మంది ఉద్యోగుల బదిలీ నూతనంగా పదోన్నతి పొందిన 13 మంది ఎంపీడీవోలకు, అదనంగా కొం తమందికి స్థాన చలనం కల్పించారు. అయితే వీరికి శనివారం పోస్టింగ్‌లు కల్పించనున్నట్లు చెర్మైన్ చమన్ తెలిపారు. అలాగే ముగ్గురు సూపరిం టెండ్, నలుగురు టైపిస్టులు, 29 మంది జూనియర్ అసిస్టెంట్లు, 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు స్థానం చలనం కల్పించారు. ఉద్యోగుల బదిలీలు సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన జెడ్పీ చైర్మన్ చమన్‌ను ఉద్యోగ సం ఘాల నాయకులు అభినందించారు. -
సిఫార్సు బదిలీలు!
- ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వాలిపోతున్న ఎంపీడీఓలు - నేడు ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరిగేనా..? అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల విషయంలో సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో బదిలీలు జరిగిన ప్రతి సారీ ఈ విషయం బహిర్గతమైంది. తొలిరోజు అందరి సమక్షంలో బదిలీలు పారదర్శకంగా జరిగినా తెల్లారేసరికి అవి తారుమారు అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో మొత్తం ఇలాగే మారిపోయాయి. తొలుత కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుపుతున్నామని ప్రకటించినా చివరకు మాత్రం అంతా తారుమారవుతున్నాయి. ఉద్యోగుల బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చెర్మైన్ చమన్ నిర్ణయాలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చుతున్నారు. తమ నియోజకవర్గంలోకి వచ్చే అధికారి తన ప్రమేయంతోనే రావాలని భావిస్తున్నారు. గతసారి బదిలీల్లో చెన్నేకొత్తపల్లి, కూడేరు, శింగనమల తదితర మండలాల ఎంపీడీఓలు ఆయా మండలాల్లో బాధ్యతలు చేపట్టకుండానే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచే సిఫార్సు లేఖలతో జెడ్పీకి వాలిపోతున్నారు. పరిపాలన సౌలభ్యం ముసుగులో : పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాలపరిమితితో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం రాజకీయ అండదండలు ఉన్న ఉద్యోగులకు వరంగా మారుతోంది. పరిపాలన సౌలభ్యం ముసుగులో అనుకున్న స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాతాలకు వెళ్లినా డెప్యుటేషన్ ముసుగులో తిరిగి యధాస్థానానికి రావచ్చులే అన్న ధీమా మరికొంతమందిలో కనిపిస్తోంది. దీని వలన కొన్నేళ్ల నుంచి మారుమూల ప్రాంతాల్లోనే తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యోగాలు చేస్తున్న వారికి తీవ్ర నష్టం కలుగుతోంది. తొలుత సాధారణ బదిలీలు పూర్తై తర్వాత నూతనంగా పదోన్నతులు పొందిన ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు కల్పించాలని నిర్ణయించారు. అయితే అందులో ఉన్న కొంతమంది ముందే చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. చెర్మైన్ దగ్గర ఉన్న సంబంధాలతో మంచి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులతో కళకళలాడింది. దీంతో శుక్రవారం జరగనున్న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయా.? కౌన్సెలింగ్‌లో దక్కించుకున్న ఉద్యోగులను ఆయా స్థానాల్లో కొనసాగిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పరిశ్రమలకు భూములు
28 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం 6న ఉదయం 8.49 నిమిషాలకు రాజధాని నిర్మాణానికి భూమిపూజ జిల్లా మంత్రుల సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 28 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. శుక్ర వారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో పరిశ్రమలకు భూముల కేటాయింపు ఒకటి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించింది. ముఖ్యంగా పల్నాడు, జిల్లాలోని పలు ఆటోనగర్‌ల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను గుర్తించింది. వీటిల్లో అనేక భూములను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అనేక మంది వివిధ కారణాలను చూపుతూ అక్కడ పరిశ్రమలు స్థాపించలేక పోయారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే పల్నాడులోని ప్రభుత్వ భూములను ఈ పరిశ్రమలకు కేటాయించనున్నారు. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి వచ్చేనెల 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు భూమిపూజ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే భూమి పూజ ఎక్కడ చేయనున్నారో ప్రకటించలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు జిల్లా మంత్రుల సమక్షంలో జిల్లా కలెక్టర్లు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. టీడీపీకి అనుకూలమైన ఉద్యోగులకు ఈ విధానంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే, అవినీతికి అవకాశం లేకుండా పోతుందని మరో వర్గం పేర్కొంటుంది. జరూసలం వెళ్లే క్రైస్తవులకు ప్రయాణ ఖర్చులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం పట్ల ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. -
పైరవీల జాతర
నెల్లూరు (అగ్రికల్చర్) : వ్యవసాయశాఖలో బదిలీల కోసం పైరవీల జాతర ప్రారంభమైంది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న డీడీఏలు, ఏడీఏలు, ఏఓలు, మినిస్ట్రీరియల్ సిబ్బందికి స్థానచలనం కలిగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ శాఖలో బదిలీల కోసం సోమవారం ప్రత్యేకంగా జీఓ నంబర్ 211ను జారీ చేసింది. జీఓలో కౌన్సెలింగ్ పక్రియకు భిన్నంగా జిల్లా ఇన్చార్జీ మంత్రి కనుసన్నల్లో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. అనుకూలమైన స్థానం కోసం అధికార పార్టీ నేతల సిఫారస్ ఉత్తరాల కోసం బారులు తీరుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల లేఖ ద్వారా ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలిపితేనే కోరుకున్న స్థానం దక్కే అవకాశం ఉండటంతో పైరవీలు తప్పడం లేదని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. బదిలీల్లో అధికారం హవా ఉద్యోగుల బదిలీల్లో గత విధానాన్ని పక్కనపెట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారస్సులకు ప్రాధాన్యమివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే సిఫారస్ బదిలీలను తెరమీదకు తీసుకొచ్చారని, ఈ పక్రియలో పెద్దఎత్తున నగదు చేతులు మారే అవకాశం ఉందని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తమకు నచ్చిన అధికారులను నియమించాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జేడీఏ కార్యాలయ సిబ్బంది కార్యాచరణ రూపొందించేందుకు మంగళవారం నుంచే కసరత్తును ప్రారంభించారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న డీడీఏలు, ఏడీఏలు, ఏఓలు, సిబ్బంది, సీనియారిటీ, రిమార్క్సు, ఇతర కారణాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు.. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఫెవికాల్ వీరులు తమ సీటును కాపాడుకునేందుకు పైరవీలు ప్రారంభించారు. మరి కొందరు తమకు ఇష్టమైన స్థానాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. వీరికి స్థానచలనం తప్పనిసరి ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఏడీఏలు, ఏఓలకు స్థానచలనం తప్పదు. సొంత జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలను ఇతర జిల్లాలకు బదిలీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఏడీఏలకు బదిలీలు తప్పవని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో ఆత్మ ఇన్చార్జి పీడీగా డిఫ్యూటేషన్‌పై పనిచేస్తున్న విజయభారతి, జేడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఏడీఏలు మురళి, గయాజ్ అహ్మద్ ఉన్నారు. వీరిపై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ పైరవీలు చేసి వారి స్థానాలను కాపాడుకున్నట్లు సమాచారం. రబీ సీజన్లో యూరియా కొరత సమయంలో డీలర్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఏడీఏ మురళికి స్థానచలనం తప్పని పరిస్థితి. అదేవిధంగా సొంత జిల్లాలో పనిచేస్తున్న నెల్లూరు, పొదలకూరు, వెంకటగిరి ఏడీఏలు సత్యవాణీ, శ్రీలత, ఉషారాణిలు కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరి పైరవీరులు ఫలిస్తాయో ఈనెల 31 వరకు వేచిచూడాల్సిందే. -
బదిలీలకు రంగం సిద్ధం
పైరవీలకు అవకాశం ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో ప్రక్రియ దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్న ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా బదిలీలు చేయాలంటున్న ఉద్యోగ సంఘాల నేతలు కర్నూలు(అగ్రికల్చర్) : ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధం అయింది. ఇందులో రాజకీయాలదే పైచేయిగా ఉండే అవకాశం ఉంది. దీంతో బదిలీల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది భూమి రికార్డులు, సర్వే డిపార్ట్మెంట్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఐసీడీఎస్, పశుసంవర్ధక శాఖలో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈసారి కూడా బదిలీలను రాజకీయాలతో ముడిపెట్టడంతో అవకతవకలు భారీగా జరిగే వీలుందనే విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట రెండేళ్లు పైబడి పనిచేస్తున్నవారిని కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి అవకాశం కల్పించడమే అవకతవకలకు అవకాశం కలిగిస్తుంది. అంతేకాక బదిలీల ప్రక్రియ ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో జరగనున్నందున ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ నేతల హవా ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులు దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు కౌన్సెలింగ్ విధానాన్ని చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలుకుతుంది. రాజకీయాలకు అతీతంగా బదిలీలు జరగాలి ఉద్యోగుల బదిలీల్లో రాజకీయాల ప్రమేయం ఏమాత్రం ఉండరాదు. గతేడాది బదిలీల్లో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగింది. ఈసారి కూడా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే మళ్లీ అదే పరిస్థితి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగేలా ఉత్తర్వులు ఉండటం అనుమానాలకు కారణం. - శ్రీరాములు, కార్యదర్శి,జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి ఉద్యోగుల బదిలీలు 100 శాతం పారదర్శకంగా జరగాలి. రాజకీయాలకు బదిలీలతో సంబంధం లేకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలిస్తే అవకతవకలకు అవకాశం ఏర్పడుతోంది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు జరగాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. - టి.ఎం.డి.హుసేన్, అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అవకతవకలకు అవకాశం కల్పించరాదు గజిటెడ్, ఆపై స్థాయి అధికారుల బదిలీలకు కౌన్సెలింగ్ లేకుండా బదిలీ చేయనుండటం వల్ల భారీగా అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగే విధంగా ఉత్తర్వులు ఉండటం అందులో రాజకీయ ప్రమేయాన్ని సూచిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పైరవీలు ఉండే అవకాశం ఉంది. - డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సంఘం -
రంగు పడుద్ది!
►అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగనున్న బదిలీలు ►వారికి నచ్చితే సరి.. లేదంటే మరో చోటుకు ►ఐదేళ్లు పూర్తి అయిన గెజిటెడ్ అధికారులకు జిల్లా మార్పిడి ►ఇతర ఉద్యోగులను సొంత మండలాల్లో వేయొద్దని ఆదేశం జడ్పీ ఉద్యోగులలో సందిగ్ధత ఇంతవరకు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బదిలీల పక్రియను జడ్పీ చెర్మైన్, జడ్పీ సీఈవోలు మాత్రమే నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఇన్‌ఛార్జి మంత్రి చెర్మైన్‌గా ఏర్పడిన కమిటీ జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుందా.. లేక జడ్పీ చెర్మైన్, సీఈవోలే నిర్వహిస్తారా అన్న సందిగ్ధంలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా జీవోలో ఎలాంటి వివరాలు పొందుపరచలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, కడప : అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొకటి.. అన్నట్లు తయారైంది గెజిటెడ్ అధికారుల పరిస్థితి. కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయనుకుంటే అధికార పార్టీ నేతలకు ప్రాబల్యాన్ని పెంచుతూ, ఇన్‌ఛార్జి మంత్రి సిఫార్సులకు పెద్ద పీట వేస్తూ.. మంత్రుల కనుసన్నల్లోనే బదిలీలు జరగాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గెజిటెడ్ అధికారులను సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అధికారులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. అవసరమైన మేరకే బదిలీలు నిర్వహిస్తామంటూనే.. అనుకూలమైన వారందరికీ కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చేలా పథక రచన చేశారు. ఈనెల 18 నుంచి 31 వరకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని ఆయా శాఖల్లో బదిలీకు సంబంధించిన జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రెండేళ్లు పూర్తి అయిన వారికి బదిలీ లేకపోయినా.. ‘అవసరం మేరకు’ అనే కారణంతో తమకు కావాల్సిన వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్దపీట వేయనున్నారు. సరిపోకపోతే ఏదో ఒక కారణం చెప్పి మండలం దాటించే ప్రమాదం ఉందని ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండేళ్లు పూర్తి అయిన వారు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. గెజిటెడ్ అధికారులకు ఝలక్.. ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన జీవో నెంబరు 57లో గెజిటెడ్ అధికారులకు కొంత షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు ఇది వర్తిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. బదిలీల జాబితాలో లేని గెజిటెడ్ అధికారులెవరైనా సొంత జిల్లాల్లో పనిచేస్తుంటే వారికీ బదిలీ తప్పదా.. లేక కనీస కాల పరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్జీఓలను సైతం సొంత మండలానికి కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు త్వరలో ఉత్తర్వులు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని శాఖలకు సంబంధించి బదిలీలను మినహాయించింది. ఆ శాఖలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొంది. ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్య, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖలకు సంబంధించిన బదిలీలు త్వరలో జరుపుకొనేలా ఆదేశాలు ప్రత్యేకంగా రానున్నాయి. -
జెడ్పీలో కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్ చాంబర్లో చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, సీఈఓ మాల్యాద్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వీరితో పాటు రికార్డు అసిస్టెంట్లు, వాచ్మెన్, డ్రైవర్లనూ వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు. ఎంపీడీఓలకూ స్థాన చలనం కలిగించారు. ఈ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉద్యోగులతో జెడ్పీ కార్యాలయ ఆవరణం సందడిగా మారింది. వీడిన పీఠముడి: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ తన చాంబర్లో ఉంటుందం టూ జెడ్పీ సీఈఓ మాల్రాది ఇటీవల ప్రకటించారు. ఇది చర్చనీయాంశమైంది. గతంలో బదిలీల ప్రక్రియను చైర్మన్ చాంబర్లోనే నిర్వహించారు. అందుకు విరుద్ధంగా ఈసారి కౌన్సెలింగ్ తన చాంబర్లో ఉంటుందంటూ సీఈఓ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఒక దశలో చైర్మన్, సీఈఓ ఇద్దరూ పంతానికి పోయినట్లు తెలిసింది. దీంతో బదిలీలు జరుగుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు చైర్మన్ చాంబర్లోనూ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. బదిలీ అయిన వారికి రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీఈఓ తెలిపారు. -
పైసా.. పైరవీ.. బదిలీ
* నిబంధనలకు పాతర... * ఆమ్యామ్యాలు, అమాత్యుల అవసరాలే ఏకైక ప్రాతిపదిక * భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు * ప్రాంతం, పోస్టు ఆధారంగా బదిలీలకు ముడుపుల రేట్లు * బదిలీ కోరుతున్న వారితో కిటకిటలాడుతున్న సచివాలయం * ఈ నెల 22 వరకు బదిలీల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు * సింగపూర్ నుంచి రాగానే సీఎం తీసుకున్న తొలి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బదిలీల జాతర ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర సచివాలయం బదిలీ కోరుకుంటున్న వారితో పైరవీకారులతో కిటకిటలాడుతోంది. సీనియారిటీని పట్టించుకోరు.. సర్వీసునూ లెక్కలోకి తీసుకోరు.. అనారోగ్యమా కాదా అనేదీ పరిగణించరు.. ఖాళీలు ఉన్నాయా అనేదీ అవసరం లేదు.. ‘ముడుపులు ముట్టాయా? లేదా?’ అన్నదే ఏకైక ప్రాతిపదికగా ఈ బదిలీల పర్వం సాగుతోందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. ‘నీడ్ బేస్డ్’ (అవసరం ప్రాతిపదికగా) అనే పేరుతో జరుగుతున్న బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయన్నది సచివాలయంలో గుప్పుమంది. కీలకమైన పోస్టుల బదిలీల విషయంలో భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు అధికారవర్గాల్లో వినిపిస్తోంది. కొందరు అధికారులను తాము సూచించిన చోటికే బదిలీ చేయించుకోవడానికి మంత్రులు పట్టుబట్టి మరీ పని చేయించుకున్నారు. గత మూడు రోజులుగా సచివాలయంలో సాగుతున్న ఈ బదిలీ వ్యవహారాలు పలువురు మంత్రుల మధ్య చిచ్చుకు కూడా కారణమైంది. వాస్తవానికి ఈ బదిలీల ప్రక్రియ శనివారంతో ముగియాల్సి ఉండగా.. బదిలీల కోసం సచివాలయం కిటకిటలాడటంతో ఆ గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించటం విశేషం. పైరవీకారుల అవసరాలే ప్రాతిపదికగా... ఉద్యోగుల బదిలీలకు గతంలో చెప్పిన కౌన్సెలింగ్ విధానానికి పాతరేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీలు వద్దని కిందిస్థాయి ఉద్యోగులు మొత్తుకున్నా ససేమిరా అన్న సర్కారు కొత్తగా నీడ్ బేస్డ్ పేరుతో అమాత్యుల అవసరాలు తీర్చుతున్నారన్న విమర్శలు సర్వ త్రా వినిపిస్తున్నాయి. బదిలీలకు ఒక విధానం లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం, వారి అవసరాల మేరకు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు కౌన్సిలింగ్ విధానం తీసుకువచ్చానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. సాధారణంగా అయితే ఖాళీలున్నా, లేదా భార్య-భర్తల కేసులో, లేదా ఆరోగ్య సమస్యల కేసుల్లో లేదా మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. అయితే ఇప్పుడు అటువంటి విధివిధానాలేమీ లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పైరవీరీకారుల ‘అవసరాల’ కోసం బదిలీలు సాగుతున్నాయి. చిచ్చురేపిన విశాఖ ఆర్డీఓ బదిలీ.. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన ఒక ఉన్నతాధికారి బదిలీ విషయంలో ఇద్దరు మం త్రుల మధ్య వివాదం తలెత్తింది. విశాఖపట్నం ఆర్డీఓగా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి ఆ పోస్టులోకి వచ్చేందుకు.. గత ప్రభుత్వంలోను, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్న వ్యక్తికి, మరో ఎమ్మెల్యేకు నాడు 70 లక్షల రూపాయల వరకు ముట్టచెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పుడు ఆ వ్యక్తిని బదిలీ చేసి మరో వ్యక్తి నియామకానికి సదరు మంత్రి వ్యతిరేకించడమే కాకుండా.. సహచర మంత్రి అయ్యన్నపాత్రుడుపై దుష్ర్పచారానికీ దిగారని, ముఖ్యమంత్రికి సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. బుగ్గ కారుల్లో పైరవీకారుల షికార్లు... సచివాలయంలో గత నాలుగు రోజులుగా బది లీల కోసం సాగుతున్న పైరవీలను, సచివాల యం జనంతో కిటకిటలాడుతున్న తీరును చూసి ఉన్నతస్థాయి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా అయితే సచివాలయంలోకి మూడు గంటల తర్వాత సందర్శకులను అనుమతిస్తారు. అయితే మంత్రులు తాము వినియోగించే బుగ్గ కారులను బయటకు పంపించి మరీ సచివాలయంలోకి బదిలీలు కోరుతున్న పైరవీకారులను తీసుకువస్తున్నారు. దీంతో ఉదయం నుంచే సచివాలయం బదిలీల జనంతో నిండిపోతోంది. ‘సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరం ఇలాంటి బదిలీలు తీరు చూశాం గానీ.. మా వాళ్లు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటకముందే ఉత్సాహం చూపిస్తున్నారు’ అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ నుంచి తిరిగి హైదరాబాద్ రాగానే తీసుకున్న తొలి నిర్ణయం అవసరాల బదిలీలను మరో వారం రోజుల పాటు పొడిగించడమే. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ వరకు నీడ్ బేస్డ్ బదిలీలను పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కోరుకున్న పోస్టింగ్ కావాలంటే ‘చెన్నై’ వెళ్లి రావాలి... ఇక.. ఆర్డీఓ, మునిసిపల్ కమిషనర్లు, డీఈఓల బదిలీలకు పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా రేటు పలుకుతున్నట్లు సచివాలయం వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పోస్టింగ్ కోసం భారీ ముడుపులు డిమాండ్ చేస్తున్నారని రెండు రోజులుగా సచివాలయంలో చక్కర్లు కొడుతున్న ఒక డీఈఓ ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని జిల్లాల నుంచి బదిలీల కోసం సచివాలయం వచ్చిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కోరుకున్న చోటకు పోస్టింగ్ కావాలంటే చెన్నై వెళ్లి తాము చెప్పిన వ్యక్తిని కలిసి రావాలని ఒక మంత్రి కార్యాలయ సిబ్బందే బహిరంగంగా చెప్తున్నారు.