first match
-
Intercontinental Cup football 2024: టీమిండియాకు ‘సున్నా’
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు. సమష్టి వైఫల్యం... ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది. తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది. -
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్‌పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్‌కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్‌కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్‌కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్‌లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్‌గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్‌కార్తీ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ సిక్సర్‌తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్‌కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్‌కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్‌హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్‌కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్‌లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. -
Fifa World Cup Qatar 2022: ఎడారి దేశంలో.. సాకర్ తుఫాన్
రొనాల్డో... మెస్సీ... నెమార్... హ్యారీ కేన్... ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇవేమీ కొత్త పేర్లు కాదు... కానీ ఇప్పుడు మళ్లీ అవన్నీ మన ముంగిట కొత్తగా వినిపిస్తాయి. సాధారణంగా ఎప్పుడు పిలవని, నోరు తిరగని నామ ధేయాలు కూడా ఇప్పుడు మన నోటిపై జపం చేస్తాయి. క్రీడాభిమానుల కళ్లన్నీ నెల రోజుల పాటు మిగతా ఆటలన్నీ గట్టున పెట్టేసి ఈ మ్యాచ్‌ల ఫలితం కోసం ఎదురు చూస్తాయి. ఇప్పుడు లెక్క సెంచరీల్లోనో, పరుగుల సంఖ్యలోనో కాదు... సింగిల్ డిజిట్‌లోనే సీన్లు మారిపోతాయి... అంతా గోల్స్ గోలనే ... ఒక్క అంకె ఒకవైపు ఆనందం నింపితే, మరోవైపు గుండెలు బద్దలు చేస్తుంది. 32 దేశాల మెరుపు వీరులు మైదానంలో పాదరసంలా దూసుకుపోతుంటే... ఉత్సాహం, ఉద్వేగానికి లోటు ఏముంటుంది... 64 మ్యాచ్‌లలో మన కళ్లన్నీ బంతి మీదే నిలిస్తే ఆఖరి రోజున జగజ్జేతగా మనమే నిలిచిన భావన అభిమానిది... అవును, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు మీరంతా సిద్ధమైపోండి! మరి కొన్ని గంటల్లో... ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది... ఎడారి దేశం ఖతర్‌లో ఇసుక తుఫాన్లు సాధారణం. అయితే రాబోయే నెలరోజులు సాకర్ సంగ్రామం ఎడారి దేశాన్ని ఒక ఊపు ఊపనుంది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమైన మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగనుంది. ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి... కానీ 22వది మాత్రం అన్నింటికంటే భిన్నం! అమెరికా, యూరోప్ దేశాలను దాటి అరబ్ దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీ కాగా... ఆతిథ్య దేశం ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన నియమ నిబంధనలు ఈ మెగా టోర్నీని మరింత ప్రత్యేకంగా మార్చాయి... ఆతిథ్య హక్కులు కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు వివాదాలు వెంట వచ్చినా, ఖర్చు అంచనాలను దాటి ఆకాశానికి చేరినా వెనక్కి తగ్గని ఖతర్ దేశం టోర్నమెంట్‌ను మెగా సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే పండగ ముందు ఏర్పాట్లలో ఎంత కష్టం ఉన్నా... ఒక్కసారి ఆట మొదలైతే అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి.‘ఫిఫా’ కూడా సరిగ్గా ఇదే ఆశిస్తోంది. ఖతర్ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతర్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ జరగడం ఇది రెండోసారి కాగా... ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతీ ప్రపంచకప్ సాధారణంగా జూన్–జూలైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ఎడారి దేశంలో నిర్వహణ సాధ్యం కాదని ‘ఫిఫా’ మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చోపర్చలు, ఒప్పందాల్లో సవరణలు, వివిధ దేశాల్లో జరిగే ఫుట్‌బాల్ లీగ్‌ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ చివరకు దానిని నవంబర్–డిసెంబర్‌కు మార్చారు. అయితే ఈ సమయంలో కూడా వేదికలను సాధ్యమైనంత చల్లగా ఉంచేందుకు నిర్వాహక కమిటీ పలు కొత్త సాంకేతికలను ఉపయోగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ► మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్ కప్ ట్రోఫీని, 8 వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ‘ఇన్ఫినిటీ’ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు. మహిళా రిఫరీలు... పురుషుల ప్రపంచకప్‌లో మహిళా రిఫరీలను నియమించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్), సలీమా ముకసంగా (రువాండా), యోషిమి యమషిత (జపాన్) ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు మహిళలకు అసిస్టెంట్ రిఫరీలుగా కూడా తొలిసారి అవకాశం దక్కింది. ‘ఖతర్’నాక్ నిబంధనలు! అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాలతో పోటీ పడి 2010లో ఖతర్ నిర్వాహక హక్కులు దక్కించుకుంది. వైశాల్యంపరంగా చూస్తే ప్రపంచకప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న అతి చిన్న దేశం ఇది. గతంలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో పాల్గొనకుండా నిర్వహణ హక్కులు తీసుకున్న రెండో దేశం ఖతర్ (జపాన్ 2002లో కోసం 1996లోనే హక్కులు కేటాయించారు. అయితే నిర్వహణకు ముందు ఆ జట్టు 1998 టోర్నీకి క్వాలిఫై అయింది). ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివాదాలు కూడా వెంట వచ్చాయి. తగినన్ని అర్హత ప్రమాణాలు లేకపోయినా... ‘ఫిఫా’ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడి హక్కులు కేటాయించినట్లుగా విమర్శలు వచ్చాయి. విచారణలో అది వాస్తవమని కూడా తేలి చాలా మంది నిషేధానికి కూడా గురయ్యారు కానీ అప్పటికే ఏర్పాట్లు జోరుగా ఉండటంతో వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. స్టేడియాల నిర్మాణంలో 6 వేలకు పైగా కార్మికులు మరణించారని, మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగిందని కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే ఎన్ని జరిగినా... చివరకు ఆట మాత్రం ముందుకు వెళ్లింది. అయితే ఇప్పుడు సరిగ్గా మెగా ఈవెంట్ సమయంలో ఆ దేశపు నిబంధనలు అటు ‘ఫిఫా’ అధికారులను, ఇటు ప్రపంచవ్యాప్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ న్యాయవ్యవస్థ మొత్తం ‘షరియా’ ఆధారంగా ఉండటంతో అందరికీ ఇది కొత్తగా అనిపిస్తోంది. కానీ నిబంధనలు మాత్రం కఠినంగా ఉండటంతో పాటు ఉల్లంఘిస్తే శిక్షలు కూడా కఠినమే. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఇందులో ఉన్నాయి. ► ముందుగా ‘హయ్యా’ కార్డును తీసుకోవాలి. ఆ దశపు ‘వీసా’, మ్యాచ్ టికెట్ ఉన్నా సరే... హయ్యా కార్డు ఉంటేనే ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. రవాణా సౌకర్యం వాడుకునేందుకు కూడా ఇది అవసరం. ► స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్ నిషేధం.. బీర్లకు కూడా అనుమతి లేదు. దీని వల్ల సుదీర్ఘకాలంగా తమకు స్పాన్సర్‌గా ఉన్న ప్రఖ్యాత కంపెనీ ‘బడ్వైజర్’తో ‘ఫిఫా’కు ఒప్పంద ఉల్లంఘన సమస్య వచ్చింది. దీనిని సరిదిద్దేందుకు వారికి తలప్రాణం తోకకు వచ్చింది. చివరగా స్టేడియాలకు కొద్ది దూరంలో ‘ఫ్యాన్ ఫెస్టివల్’ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ తాగేందుకు అనుమతినిచ్చారు. అయితే ఎవరైనా తాగి గ్రౌండ్లోకి వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మాత్రం దేశం నుంచి బయటకు పంపించేస్తారు. ► ఇష్టమున్నట్లుగా దుస్తులు ధరిస్తే కుదరదు. భుజాలు, మోకాళ్లు కనిపించేలా మహిళల దుస్తులు ఉండరాదు. పబ్లిక్ బీచ్‌లలో స్విమ్సూట్లు ధరించరాదు. అది హోటల్ స్విమ్మింగ్పూల్లకే పరిమితం. మైదానంలో ఉత్సాహంతో షర్ట్లు తొలగించడం కూడా కుదరదు. స్పెషల్ జూమ్ కెమెరాలతో వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటారు. ► భార్యాభర్తలైనా సరే, బహిరంగ ప్రదేశాల్లో రూపంలో కూడా తమ ప్రేమను ప్రదర్శించరాదు. హోమో సెక్సువల్స్కైతే అసలే కలిసి ఉండేందుకు అనుమతి లేదు. విజేత జట్టుకు రూ. 341 కోట్లు ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ 440 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,500 కోట్లు) కాగా... విజేతలకు 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 341 కోట్లు), రన్నరప్‌కు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 244 కోట్లు) లభిస్తాయి. ► వరల్డ్ కప్‌లో జట్లు ఒక్కో మ్యాచ్ నుంచి మరో మ్యాచ్ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వెళ్లేలా వేదికలు ఉండటం 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒకే బేస్ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది. –సాక్షి క్రీడా విభాగం -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
ISL 2022: నేటినుంచి ఐఎస్ఎల్–9
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ బరిలోకి దిగుతుండగా...నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఆదివారం హైదరాబాద్ తమ తొలి పోరులో ముంబై సిటీ జట్టును ఎదుర్కొంటుంది. గత రెండు సీజన్లు కరోనా కారణంగా ఐఎస్ఎల్ మ్యాచ్‌లు గోవాకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు 11 టీమ్‌లకు కూడా సొంత వేదికల్లో, ప్రత్యర్థి వేదికల్లో (హోం అండ్ అవే) మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుండటం విశేషం. అభిమానులను కూడా ఆయా స్టేడియాల్లో అనుమతిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సీజన్ కొనసాగనుంది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ ద్వారా మరో రెండు స్థానాలను నిర్ణయిస్తారు. -
India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’
తిరువనంతపురం: ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్ బృందం తలపడనుంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ హోరాహోరీ పోటీ కోసమే కాదు... తుది కసరత్తుకు ఆఖరి సమరంగా టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడనుంది. ఇప్పటికే 11 మంది ఎవరనే ప్రాథమిక అంచనాకు వచ్చిన జట్టు మేనేజ్మెంట్కు డెత్ ఓవర్ల బెంగ పట్టి పీడిస్తోంది. బుమ్రా వచ్చాక కూడా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బౌలింగ్ దళంపై కంగారు పెట్టిస్తోంది. ఈ సమస్యను అధిగమిస్తేనే కసరత్తు పూర్తి అవుతుంది. బ్యాటింగ్ భళా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండటం కాదు... సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇన్నేళ్లయినా ఇద్దరి షాట్లు కుర్రాళ్లను మించి చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యకుమార్ ఇప్పుడు మెరుపుల్లో తురుపుముక్కలా మారాడు. ఆసీస్‌తో ఆఖరి మ్యాచ్ గెలుపునకు అతని ఇన్నింగ్సే అసలైన కారణం. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇలా బ్యాటింగ్‌లో అంతా మెరుగ్గానే ఉంది. నిలకడగా మెరిపిస్తోంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బౌలర్లే కీలకమైన దశలో డీలాపడటం, యథేచ్ఛగా పరుగులు కాదు వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్లు ఇచ్చుకోవడం జట్టు భారీ స్కోర్లను కూడా సులువుగా కరిగిస్తున్నాయి. సవాల్‌కు సిద్ధం జోరు మీదున్న భారత్‌కు దీటైన సవాల్ విసిరేందుకు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఓపెనింగ్‌లో డికాక్, కెప్టెన్ బవుమాలతో పాటు మిడిలార్డర్లో హార్డ్ హిట్టర్లు మార్క్రమ్, మిల్లర్లతో బ్యాటింగ్ లైనప్ ఆతిథ్య జట్టులాగే పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు భారత్ బౌలింగ్‌పై మెరిపించినా కష్టాలు తప్పవు. ఇక సఫారీ బౌలింగ్ ఒకింత మనకంటే మెరుగనే చెప్పాలి. ప్రిటోరియస్, రబడ, నోర్జేలు అద్భుతంగా రాణిస్తున్నారు. టి20 సమరానికి సరైన సరంజామాతోనే దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఆసీస్‌పై గెలిచిన ధీమాతో ఏమాత్రం ఆదమరిచినా టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తప్పదు. భారత క్రికెటర్లపై పూల వాన కేరళ అభిమానులు భారత క్రికెటర్లకు అడుగడుగునా జేజేలు పలికారు. విమానం దిగగానే మొదలైన హంగామా బస చేసే హోటల్ వద్దకు చేరేదాకా సాగింది. అక్కడ ఆటగాళ్లపై పూల వాన కురిసింది. కేరళ కళాకారుల నుంచి సంప్రదాయ స్వాగతం లభించింది. -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఇంగ్లండ్
కరాచీ: ప్రపంచకప్ దృష్ట్యా అన్నీ జట్లు టి20లు ఆడేందుకు తెగ సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో అసలు పాక్ గడపే తొక్కని ఇంగ్లండ్ కూడా పొట్టి ఫార్మాట్లో పెద్ద ముఖాముఖీ టోర్నీ ఆడేందుకు వచ్చింది. చివరిసారిగా 2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్ 17 ఏళ్ల తర్వాత ఏడు మ్యాచ్‌ల టి20ల సిరీస్ ఆడేందుకు ఇక్కడ అడుగుపెట్టింది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెగ్యులర్ సారథి జోస్ బట్లర్ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండగా, మొయిన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 20, 22, 23, 25 తేదీల్లో కరాచీలో నాలుగు మ్యాచ్‌లు... 28, 30, అక్టోబర్ 2 తేదీల్లో లాహోర్ వేదికగా మూడు టి20లు జరుగనున్నాయి. బట్లర్ ఆఖరి దశ మ్యాచ్‌ల్లో ఒకట్రెండు ఆడే అవకాశముందని జట్టు వర్గాలు తెలిపాయి. -
India vs Australia T20: సమరానికి సై
గత టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్ ఆడిన వేదికపై సత్తా చాటడం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. నాటి వైఫల్యానికి కారణమైన లోపాలను సరిదిద్దుకుంటూ టీమిండియా ఆ తర్వాతి నుంచి ఆటతీరును మార్చుకుంది. ఇప్పుడు సంవత్సరం తిరిగేలోగా మరో టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఆ మెగా ఈవెంట్‌కు ముందు సరిగ్గా ఆరు మ్యాచ్‌లతో రోహిత్ సేన సన్నద్ధం కానుంది. పిచ్‌లు, పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నా ఆత్మవిశ్వాసంతో ఆసీస్ విమానమెక్కేందుకు మిగిలిన మ్యాచ్‌లలోనే కూర్పు ను పరీక్షించేందుకు లభించిన అవకాశమిది. మొహాలి: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే జట్టుతో సొంతగడ్డపై భారత్ సమరానికి సై అంటోంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో కూడా భారత్ మూడు టి20లు ఆడనుంది. వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లందరినీ ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆడించి టీమ్ మేనేజ్మెంట్ ఒక అంచనాకు రానుంది. ముఖ్యంగా ఆసియా కప్‌లో టీమ్‌ను ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్‌ను సరిదిద్దుకోవడం భారత్‌కు కీలకంగా మారింది. అటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండటంతో సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. మూడో పేసర్‌ను ఆడిస్తారా... ఆసియా కప్‌తో పోలిస్తే భారత జట్టులో రెండు కీలక మార్పులు ఖాయం. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, కొంత కాలంగా ఆటకు దూరమైన హర్షల్ పటేల్‌ను కూడా పరీక్షించడం అవసరం. అలాంటప్పుడు మరో రెగ్యులర్ బౌలర్ భువనేశ్వర్‌ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. భువీకి ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వైవిధ్యం కోసం అర్‡్షదీప్‌ను కూడా ప్రయత్నించవచ్చు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్ పాత్రకు సరిపోడనేది ఆసియా కప్ నేర్పిన పాఠాల్లో ఒకటి. కాబట్టి అతడి బౌలింగ్‌ను కాకుండా రెగ్యులర్ బౌలర్‌ను నమ్ముకోక తప్పదు. ప్రధాన స్పిన్నర్‌గా చహల్‌కు చోటు ఖాయం. రెండో స్పిన్నర్‌గా అక్షర్, అశ్విన్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉన్నా, దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కుతుందా చెప్పలేని పరిస్థితి. టాప్–3గా రోహిత్, రాహుల్, కోహ్లి ఖాయం కాబట్టి తర్వాతి ముగ్గురు బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడటం అవసరం. సూర్యకుమార్, పంత్, హార్దిక్ సమష్టిగా విఫలం కావడంతోనే ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. హార్దిక్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే చూస్తూ ఐదుగురు బౌలర్లతో ఆడితే దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించడం కష్టం. ఫించ్‌పై తీవ్ర ఒత్తిడి... స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడటంపై ఆస్ట్రేలియా కూడా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. సిరీస్‌కు ముందే విశ్రాంతి అంటూ డేవిడ్ వార్నర్ తప్పుకోగా, మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు స్టార్క్, స్టొయినిస్, మిచెల్ మార్‡్ష కూడా దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ కచ్చితంగా రాణించాలి. పేలవ ఫామ్‌తో వన్డేల నుంచి రిటైర్ అయిన అతను టి20ల్లోనైనా సత్తా చాటితే జట్టుకు మేలు జరుగుతుంది. ఫించ్‌తో కలిసి వేడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్మిత్ మూడో స్థానంలో ఆడతాడని ఇప్పటికే ఆసీస్ ప్రకటించగా, మ్యాక్స్‌వెల్ తనదైన దూకుడును జోడించగలడు. ఈ సిరీస్ ఒక యువ ఆటగాడికి ఎంతో కీలకం కానుంది. అతనే టిమ్ డేవిడ్. ఇంత కాలం సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించి తొలిసారి ఆసీస్ జట్టులోకి ఎంపికైన అతను ఐపీఎల్ అనుభవంతో ఎంత దూకుడుగా ఆడతాడో చూడాలి. కమిన్స్, హాజల్‌వుడ్, కేన్ రిచర్డ్సన్ పేస్ భారం మోయనుండగా, లెగ్‌స్పిన్నర్ జంపాకు మంచి రికార్డే ఉంది. 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. -
ఆత్మవిశ్వాసంతో లంక.. మార్పులతో బరిలోకి ధావన్ సేన!
కొలంబో: వన్డే సిరీస్ ముగిసింది. ధనాధన్ షాట్లతో సాగే పొట్టి సమరానికి వేళైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో సమష్టిగా రాణించి భారత్‌పై నెగ్గిన శ్రీలంక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకొని టి20 సిరీస్‌లో శుభారంభం చేసేందుకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. వరుణ్‌కు చాన్స్! తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)తో సత్తాచాటి... యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్లో తన మిస్టరీ బంతులతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో అరంగేట్రం చేయకుండానే ఇంటిబాట పట్టాడు. అతడికి శ్రీలంక పర్యటన రూపంలో మరో అవకాశం లభించింది. టి20 ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేకపోవడంతో 29 ఏళ్ల వరుణ్‌ను పరీక్షించేందుకు ఇదే సరైన సమయం. దాంతో అతడికి తొలి టి20లో చాన్స్ దొరికే అవకాశం ఉంది. జట్టు కూర్పు విషయానికి వస్తే ఓపెనర్లుగా ధావన్, పృథ్వీ షా కొనసాగనున్నారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ బాధ్యతను మోయనున్నారు. ఆల్రౌండర్లుగా పాండ్యా బ్రదర్స్... కృనాల్, హార్దిక్ బరిలోకి దిగుతారు. దాంతో మనీశ్ పాండే బెంచ్‌కే పరిమతం అయ్యే అవకాశం ఉంది. చివరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న భువనేశ్వర్, దీపక్‌చహర్ మళ్లీ జట్టులోకి రానున్నారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, చహల్/రాహుల్ చహర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో లంక... కొత్త సారథి దసున్ షనక నాయకత్వంలోని శ్రీలంక నిలకడగా రాణిస్తోంది. రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన ఆ జట్టు... మూడో వన్డేలో భారత్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టి20 సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. అవిష్క ఫెర్నాండో సూపర్ ఫామ్‌లో ఉండటం... గత మ్యాచ్‌తో రాజపక్స కూడా టచ్‌లోకి రావడం ఆ జట్టుకు సానుకూల అంశాలు. పిచ్, వాతావరణం వన్డే సిరీస్‌కు వేదికైన ప్రేమదాస స్టేడియంలోనే టి20 సిరీస్ కూడా జరగనుంది. పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సూచన ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉంది. జట్ల అంచనా భారత్: ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చహర్, భువనేశ్వర్, వరుణ్ చక్రవర్తి, చహల్/రాహుల్ చహర్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, రాజపక్స, ధనంజయ డిసిల్వా, అసలంక, కరుణరత్నే, అకిల ధనంజయ, జయవిక్రమ, చమీర, రమేశ్ మెండిస్. -
44 మ్యాచ్‌ల తర్వాత...
టోక్యో: నాలుగుసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు 2016 రియో ఒలింపిక్స్ రన్నరప్ స్వీడన్ జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘జి’లో భాగంగా బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో అమెరికా 0–3 గోల్స్ తేడాతో స్వీడన్ చేతిలో ఓడింది. గత 44 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని అమెరికాకు స్వీడన్ రూపంలో పరాభవం తప్పలేదు. బ్లాక్స్టెనియస్ (25వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మరో గోల్‌ను లినా హర్టిగ్ (72వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు తమెక యలోప్ (20వ నిమిషంలో), స్యామ్ కెర్ (33వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను గబీ రెనీ (90+1వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో బ్రిటన్ 2–0 గోల్స్‌తో చిలీపై గెలుపొందింది. బ్రిటన్ తరఫున ఎలెన్ వైట్ (17వ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. గ్రూప్ ‘ఇ’లోనే జపాన్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. కెనడా ప్లేయర్ క్రిస్టినే (12వ నిమిషంలో) గోల్ చేయగా... జపాన్ క్రీడాకారిణి మనా ఇవబుచి (84వ నిమిషంలో) గోల్ చేసింది. గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన పోరుల్లో నెదర్లాండ్స్ 10–3తో జాంబియాపై, బ్రెజిల్ 5–0తో చైనాపై గెలిచాయి. ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా శుక్రవారం ఆ ఆరంభమ వుతాయి. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. మరోవైపు మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు కూడా బుధవారమే మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టు 8–1తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా... ఒలింపిక్స్ పోటీల ఆరంభ రోజు మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జాత్యహంకారానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. బ్రిటన్, చిలీ మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల క్రీడాకారిణులు మోకాలిపై కూర్చొని జాతి వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమెరికా, స్వీడన్ ప్లేయర్లు కూడా ఈ విధంగానే చేశారు. ఒలింపిక్స్ మొదలవ్వడానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. బుధవారం మొదటి రౌండ్ తొలి అంచె మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 12 జట్లు పోటీలో ఉండగా.... గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మూడు గ్రూప్‌లు (ఇ, ఎఫ్, జి)గా విభజించారు. ఫురుషుల విభాగంలో నేటి నుంచి మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఇందులో 16 జట్లు పాల్గొంటుండగా... నాలుగు టీమ్‌లు చొప్పున నాలుగు గ్రూప్‌లుగా (ఎ, బి, సి, డి) విభజించారు. తొలి రౌండ్లో భాగంగా ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన జట్లతో మూడేసి మ్యాచ్‌లను ఆడనుంది. -
మహిళా క్రికెట్: సమం సమం
తొలి రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్‌దే ఆధిపత్యం... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలతో ఆ జట్టు పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ చివర్లో భారత మహిళలకు పట్టు చిక్కింది. 21 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు తీసి ఆతిథ్య జట్టు జోరుకు మిథాలీ సేన అడ్డు కట్టి వేసింది. తొలి సారి ఇంగ్లండ్ సంతృప్తికర స్కోరు సాధించినా...ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన మన అమ్మాయిలు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బ్రిస్టల్: ఏకైక టెస్టులో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్టు తొలిసారి సమంగా నిలిచాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ హీతర్ వైట్ (175 బంతుల్లో 95; 9 ఫోర్లు), టామీ బీమాంట్ (144 బంతుల్లో 66; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి 100వ మ్యాచ్‌లో నాయకత్వం వహిస్తున్న వైట్ త్రుటిలో సెంచరీ కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణాకు 3, దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు విన్ఫీల్డ్ (63 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బీమంట్ శుభారంభం అందించారు. పెద్దగా పదును లేని భారత బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలను వీరిద్దరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఎట్టకేలకు వికెట్ కీపర్ తానియా అద్భుత క్యాచ్‌కు విన్ఫీల్డ్ వెనుదిరిగింది. అయితే బీమాంట్, కెప్టెన్ నైట్ అదే జోరును కొనసాగించారు. ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు స్నేహ్, దీప్తిలను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. భారత తుది జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ కూడా లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. కొద్ది సేపటికే బీమంట్ 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం షార్ట్‌లెగ్‌లో ముందుకు దూకుతూ షఫాలీ చక్కటి క్యాచ్ పట్టడం తో బీమాంట్ ఆట ముగిసింది. ఆ తర్వాత వచ్చిన నటాలియా స్కివర్ (75 బంతుల్లో 42; 6 ఫోర్లు) కూడా కెప్టెన్‌కు తగిన సహకారం అందించింది. 115 బంతుల్లో నైట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. మూడు రివ్యూలు... నిలదొక్కుకున్న స్కివర్‌ను దీప్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే అమీ జోన్స్ (1)ను కూడా రాణా ఇలాగే అవుట్ చేసింది. దీప్తి ఇదే జోరులో నైట్‌ను కూడా ఎల్బీగా పట్టేసింది. ఈ మూడు వికెట్లకు కూడా ఇంగ్లండ్ డీఆర్ఎస్ కోరగా...మూడు సార్లు ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడం విశేషం. సెంచరీ చేజార్చుకున్న నిరాశలో కెప్టెన్ వెనుదిరగ్గా, ఎల్విస్ (5) ఆమెను అనుసరించింది. క్యాచ్‌లు మిస్ దురదృష్టవశాత్తూ భారత జట్టు తొలి రోజు పేలవ ఫీల్డింగ్‌ను ప్రదర్శించింది. జులన్ బౌలింగ్‌లో విన్ఫీల్డ్ (3 పరుగుల వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను స్మృతి, హర్మన్ బౌలింగ్‌లో సివర్ (స్కోరు 36) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీప్తి వదిలేయగా...26 పరుగుల వద్ద నైట్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను హర్మన్ అందుకోలే కపోయింది. సమన్వయలోపంతో ఒక సునాయాస రనౌట్ చేయడంలో కూడా మన అమ్మాయిలు విఫలమయ్యారు. తీవ్రమైన ఎండ కూడా మహిళలను కొంత ఇబ్బంది పెట్టింది. ఐదుగురు అరంగేట్రం ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు ప్లేయర్లు తొలిసారి టెస్టు క్రికెట్ బరిలోకి దిగారు. దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియాలకు ఆ అవకాశం దక్కింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: విన్ఫీల్డ్ (సి) తానియా (బి) పూజ 35, బీమాంట్ (సి) షఫాలీ (బి) రాణా 66, హీతర్ నైట్ (ఎల్బీ) (బి) దీప్తి 95, స్కివర్ (ఎల్బీ) (బి) దీప్తి 42, జోన్స్ (ఎల్బీ) (బి) రాణా 1, డంక్లీ (బ్యాటింగ్) 12, ఎల్విస్ (సి) దీప్తి (బి) రాణా 5, బ్రంట్ (బ్యాటింగ్) 7, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (92 ఓవర్లలో 6 వికెట్లకు) 269. వికెట్ల పతనం: 1–69, 2–140, 3–230, 4–236, 5–244, 6–251. బౌలింగ్: జులన్ గోస్వామి 18–2–44–0, శిఖా పాండే 11–3–36–0, పూజ వస్త్రకర్ 12–3–43–1, స్నేహ్ రాణా 29–4–77–3, దీప్తి శర్మ 18–3–50–2, హర్మన్ ప్రీత్ 4–0–16–0. -
నేటి నుంచి ఐపీఎల్–2021
-
క్రికెట్ కుంభమేళా: నేటి నుంచి ఐపీఎల్–2021
ఐపీఎల్ ఆటకు వేళయింది. టైటిల్ వేటకు రంగం సిద్ధమైంది. ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్’ల గోల మొదలైంది. డగౌట్లో మాస్క్‌లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్ రెడీ రెడీ అంటోంది. ఓ విధంగా ఇది క్రికెట్ కుంభమేళానే! కానీ వైరస్ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలకే అతుక్కుపోయే క్రికెట్ మేళా ఇది! ఒకప్పుడు ఐపీఎల్ అంటే బౌండరీ మీటర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్‌లే తారుమారయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్, ఐసోలేషన్లు లీగ్‌లో భాగమయ్యాయి. ఆటగాళ్లు తేల్చుకుంటారు మైదానంలో! మనం మాత్రం చూసుకుందాం టీవీల్లో! ఎందుకంటే కరోనా వైరస్ కాచుకుంది. గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా... అది పరాయిగడ్డ! కానీ మన నగరాల్లో మెరుపులు మెరిపిస్తున్నా... అవి మనకు బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. ఈల గోల ఉండదు. ఆడే ఆటగాళ్లు, తీర్పులిచ్చే అంపైర్లు, ఖాళీగా కుర్చీలు కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్ తగ్గదు. బౌలింగ్ పదును తగ్గదు. తొలి పంచ్ విసిరేందుకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమంటోంది. -
అదిరే ఆరంభంతో...
పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్ ఘనవిజయంతో టి20 ప్రపంచకప్‌కు తెరలేపింది. పేస్‌తో శిఖా పాండే, గూగ్లీలతో పూనమ్ మన మహిళల జట్టుకు అద్భుత గెలుపు అందించారు. పూనమ్ యాదవ్ సిడ్నీ: ఆసీస్ మహిళల జట్టు భారత్ కంటే ఎంతో మెరుగైంది. మరెంతో పటిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురే లేని జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్. ఇప్పుడు జరిగేది వారి సొంతగడ్డపైనే! దీంతో ప్రత్యర్థులకు డిఫెండింగ్ చాంపియన్ అంటే ఒకింత ‘కంగారూ’. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్‌కు దిగితే తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ను 6 పరుగులలోపే అవుట్ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో అయితే... మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ అదిరే ఆరంభానికి ఆసీస్ చెదిరిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/19) బౌలింగ్ వారిపట్ల సింహ స్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా! శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (46 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు) రాణించింది. జెస్ జొనసెన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హీలీ (35 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. పూనమ్ యాదవ్ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. శిఖా (3/14) నిప్పులు చెరిగింది. రాణించిన దీప్తి షఫాలీ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున 4 ఓవర్లలో 41 పరుగులు చేశాక స్మృతి (10), షఫాలీ, హర్మన్‌ప్రీత్ (2) స్వల్పవ్యవధిలో అవుటయ్యారు. దీంతో ఏడో ఓవర్ ముగియకముందే భారత్ స్కోరు 47/3. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 26) షాట్ల జోలికి వెళ్లకుండా దీప్తి శర్మతో కలిసి పరుగుల పోరాటం చేసింది. దీంతో మరో వికెట్ పడకుండా భారత్ 15.5వ ఓవర్లలో వందకు చేరుకుంది. అయితే మరుసటి బంతికే జెమీ మా... కిమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ దశలో దీప్తికి వేద (9 నాటౌట్) జతయ్యింది. హీలీ శ్రమ వృథా ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్ ఇలా ఏ రకంగా చూసిన భారత్ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్‌కు కష్టమైందేమీ కాదు. అలాగే 5.3 ఓవర్లదాకా ఆస్ట్రేలియా స్కోరు 32/0. ఇక గెలిచేందుకు 101 చేస్తే సరిపోతుంది. కానీ మూనీ (6)ని శిఖా పాండే అవుట్ చేశాకా ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్ హీలీ పోరాటం చేస్తున్నా... గార్డ్నర్ (34) అండగా నిలిచినా... లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వాళ్లిద్దరిని పెవిలియన్‌కు చేర్చిన పూనమ్ యాదవ్ తన స్పిన్ ఉచ్చును బిగించడంతో ఆసీస్ చెదిరిపోయింది. పూనమ్‌కు తోడు శిఖా పాండే నిప్పులు చెరుగుతుంటే ఆసీస్ ఇన్నింగ్స్ కూలిపోయింది. లానింగ్ (5), హేన్స్ (6), పెర్రీ (0), జొనసెన్ (2), అన్నబెల్ (2), కిమిన్స్ (4), స్ట్రానో (2), షట్ (1 నాటౌట్) ఇలా ఏ ఒక్కరు నిలువలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) అన్నబెల్ (బి) పెర్రీ 29; మంధాన ఎల్బీడబ్ల్యూ (బి) జెస్ జొనసెన్ 10; జెమీమా ఎల్బీడబ్ల్యూ (బి) కిమిన్స్ 26; హర్మన్‌ప్రీత్ (స్టంప్డ్) హీలీ (బి) జెస్ జొనసెన్ 2; దీప్తి శర్మ నాటౌట్ 49; వేద కృష్ణమూర్తి నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు)132. వికెట్ల పతనం: 1–41, 2–43, 3–47, 4–100 బౌలింగ్: స్ట్రానో 2–0–15–0, పెర్రీ 3–0–15–1, షట్ 4–0–35–0, జెస్ జొనసెన్ 4–0–24–2, కిమిన్స్ 4–0–24–1, గార్డ్నర్ 3–0–19–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) పూనమ్ 51; మూనీ (సి) గైక్వాడ్ (బి) శిఖా 6; లానింగ్ (సి)భాటియా (బి) గైక్వాడ్ 5; హేన్స్ (స్టంప్డ్) భాటియా (బి) పూనమ్ 6; గార్డ్నర్ (సి) అండ్ (బి) శిఖా 34; పెర్రీ (బి) పూనమ్ 0; జెస్ (సి) భాటియా (బి) పూనమ్ 2; అన్నబెల్ (స్టంప్డ్) భాటియా (బి) శిఖా 2; కిమిన్స్ రనౌట్ 4; స్ట్రానో రనౌట్ 2; షట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–32, 2–55,3–67, 4–76, 5–76, 6–82, 7–101, 8–108, 9–113, 10–115. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–17–0, రాజేశ్వరీ గైక్వాడ్ 4–0–31–1, శిఖా పాండే 3.5–0–14–3, అరుంధతి 4–0–33–0, పూనమ్ 4–0–19–4. -
మార్చి 29 నుంచి ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్లు జరుగుతాయి. దాంతో లీగ్ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్‌లో...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. -
ఎవరిదో శుభారంభం!
అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలు... విస్మయపరిచే బౌలర్ల ప్రదర్శనలు... కళ్లు చెదిరే బౌండరీలు... చుక్కలనంటేలా భారీ సిక్సర్లు... ఓవర్ ఓవర్‌కు మారే విజయ సమీకరణాలు.. వెరసి వెస్టిండీస్‌తో టి20 ఫార్మాట్ మజామజాగా సాగింది. ఇక రోజంతా క్రికెట్ కబుర్లు పంచేందుకు వన్డే ఫార్మాట్ సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఫామ్ దృష్ట్యా వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చెన్నై: పుష్కర కాలంగా వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. తాజాగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకున్న కోహ్లిసేన అదే ఉత్సాహంతో వన్డే సిరీస్ విజయంపై గురి పెట్టింది. మరోవైపు భారత్ చేతిలో తమ పరాజయాల పరంపరకు కళ్లెం వేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది భారత్ జోరుకు బ్రేకులేసేందుకు విండీస్ సేన సిద్ధమైంది. ఇలా ఇరు జట్లు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే వరుణుడు నేనున్నానంటూ పలకరించాడు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా తుడిచి పెట్టుకుపోయింది. నేటి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే వీలున్న నేపథ్యంలో మ్యాచ్ ఏవిధంగా సాగబోతుందోనన్న ఆసక్తి అందరిలో పెరిగింది. ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన... ఏ జట్టుకు అయినా సొంతగడ్డపై భారత్‌ను వన్డేల్లో ఓడించడం శక్తికి మించిన పనే. ఈ విషయం వెస్టిండీస్‌కు తెలిసినంత క్షుణ్ణంగా మరో జట్టుకు తెలిసి ఉండదేమో! ఇంకా చెప్పాలంటే గత కొన్నేళ్లుగా విండీస్ పరిస్థితి చూస్తుంటే ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగానే ఉంది. 2006–07 సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆరుసార్లు పర్యటించిన విండీస్ ఖాళీ చేతులతోనే వెళ్లడం దీన్ని నిర్ధారిస్తోంది. ఈసారి కూడా వెస్టిండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేందుకే భారత్ సిద్ధమైంది. దీనికి తగినట్లుగానే కోహ్లి, రోహిత్, రాహుల్‌లతో కూడిన భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. గాయపడిన ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు... వన్డేల్లో అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో ఆందోళన రేకెత్తించిన నాలుగో నంబర్ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కుదురుకుంటున్నట్లే కనబడుతున్నాడు. దూకుడు, నిలకడలేమితో విమర్శలెదుర్కొంటున్న యువ వికెట్‌కీపర్ పంత్‌కు ఈ సిరీస్ మరో మంచి అవకాశం. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని నిలిపేలా అతను మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే రవీంద్ర జడేజా ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం. మనీశ్ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. భువనేశ్వర్ స్థానంలో వచ్చిన శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ పేస్ విభాగాన్ని నడపనున్నారు. స్పిన్ విభాగంలో ‘కుల్చా’ ద్వయం మరోసారి జోడీ కట్టనుంది. చివరిసారిగా వన్డే ప్రపంచకప్‌లో కలిసి ఆడిన కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ చెపాక్ పిచ్‌పై తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించనున్నారు. కడవరకు నిలబడితేనే... దూకుడు, పవర్‌హిట్టింగ్‌కు మారుపేరు వెస్టిండీస్. వచ్చీరాగానే భారీ షాట్లతో విరుచుకుపడటం, బంతుల్ని బౌండరీలకు తరలించడమే లక్ష్యంగా ఆడతారు విండీస్ వీరులు. తాజా టి20 సిరీస్‌లోనూ వారు కురిపించిన సిక్సర్ల వాన అభిమానులను మురిపించింది. అయితే ఈ తరహా ఆట రోజంతా సాగే వన్డే ఫార్మాట్‌కు పనికిరాదు. ప్రస్తుతం దీనిపైనే విండీస్ దృష్టి సారించింది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, వికెట్ కాపాడుకుంటూ కడవరకు క్రీజులో ఉండటమే లక్ష్యంగా ఆడతామని వెస్టిండీస్ సహాయక కోచ్ ఎస్ట్‌విక్ అన్నారు. ముంబై మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయడిన భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్ నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. కెప్టెన్ పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ కూడా జట్టుతో చేరడంతో విండీస్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. పేసర్లు షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్.. స్పిన్నర్ జూనియర్ వాల్‡్ష భారత టాపార్డర్‌ను తొందరగా పెవిలియన్ పంపించేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నప్పటికీ అనూహ్యమైన ఆటతీరుకు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. జట్లు (అంచనా) భారత్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్ చేజ్, రొమారియో షెఫర్డ్, సునీల్ ఆంబ్రిస్, నికోలస్ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, వాల్‡్ష జూనియర్, కీమో పాల్. పిచ్, వాతావరణం గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. ఆదివారం ఆకాశం మేఘావృతంగా ఉండటంతోపాటు వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. 12: చెన్నైలో భారత్ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. 4: ఈ వేదికపై వెస్టిండీస్‌తో భారత్ నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది (2011లో), మరో రెండు మ్యాచ్‌ల్లో (1994, 2007లో) ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. -
చెమటోడ్చి ఛేదన..!
పరుగుల ప్రవాహమే అనుకుంటే... వికెట్లు టపటపా పడ్డాయి. ఇరు జట్ల నుంచి ఒకటైనా సెంచరీ నమోదవుతుందని ఊహిస్తే... వంద పరుగులు చేయడం, ఛేదించడమే కష్టమైపోయింది. పట్టుమని పది ధనాధన్ షాట్లైనా లేవు... మెరుపు ఇన్నింగ్స్ అనే మాటే లేదు... అసలు ఆడుతున్నది టి20నేనా అనేంత అనుమానంతో సాగింది భారత్–వెస్టిండీస్ మ్యాచ్. మొదట్నుంచి నిస్సారంగానే కనిపించినా చివరకు టీమిండియానే విజయం సాధించడంతో ఊరట దక్కింది. లాడర్‌హిల్ (అమెరికా) ప్రపంచ కప్ అనంతర ప్రయాణాన్ని భారత్ విజయంతో ప్రారంభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌లో శనివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్ర పేసర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవదీప్ సైనీ (3/17) అదరగొట్టడంతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో ప్రత్యర్థిని కట్టిపడేసిన కోహ్లి సేన... బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు చేయడంతో లక్ష్యాన్ని అందుకోగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (49 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. పొలార్డ్ మినహా నికొలస్ పూరన్ (16 బంతుల్లో 20; ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. లక్ష్యం స్వల్పమే అయినా ఛేదనలో భారత్ చెమటోడ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ (25 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫటాఫట్ షాట్లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (29 బంతుల్లో 19; ఫోర్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు) అవసరమైన పరుగులు చేశారు. దీంతో 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం ఇక్కడే రెండో టి20 జరగనుంది. ఆడింది విండీసేనా...? టి20ల్లో భీకర హిట్టింగ్‌కు వెస్టిండీస్ మారుపేరు. కానీ, ఈ మ్యాచ్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. టీమిండియా బౌలింగ్ దాడిని ప్రారంభించిన యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (0)ను ఔట్ చేశాడు. ఇదే మైదానంలో మూడేళ్ల క్రితం భారత్‌పై చెలరేగి శతకం బాదిన ఓపెనర్ ఎవిన్ లూయీస్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. సిక్స్‌తో తనకు స్వాగతం పలికిన పూరన్‌పై ఆ వెంటనే సైనీ ప్రతీకారం తీర్చుకున్నాడు. దూకుడైన హెట్‌మైర్ (0)ను తదుపరి బంతికే బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే, రావ్మన్ పావెల్ (4) అడ్డుకున్నాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత పావెల్‌ను ఖలీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసిన ఈ దశలో విండీస్ స్కోరు 33/5. స్పిన్నర్లు జడేజా, కృనాల్ రంగంలోకి దిగాక సిక్స్‌లు బాది పొలార్డ్ స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ, కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ (24 బంతుల్లో 9) మరీ పేలవంగా ఆడాడు. బ్రాత్‌వైట్‌ను కృనాల్, నరైన్ (2)ను జడేజా వెనక్కుపంపాక కరీబియన్లు తేరుకోలేకపోయారు. అప్పటికీ సైనీ, భువీ ఓవర్లలో సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ కాసిన్ని పరుగులు జోడించాడు. 120 బంతుల విండీస్ ఇన్నింగ్స్‌లో 79 బంతులకు పరుగే రాకపోవడం గమనార్హం. ఇబ్బందిపడ్డా... గెలుపు గట్టెక్కారు గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఓపెనర్ ధావన్ (1) నిరుత్సాహపర్చినా రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత్ ఛేదనను నడిపించాడు. కోహ్లి అతడికి సహకరించాడు. అయితే, నరైన్ (2/14) వరుస బంతుల్లో రోహిత్, రిషభ్ పంత్ (0)ను ఔట్ చేసి కలవరపెట్టాడు. నరైన్ యార్కర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రోహిత్ లాంగాన్‌లో పొలార్డ్‌కు చిక్కాడు. పంత్ బంతి గమనాన్ని ఊహించకుండా బల ప్రయోగం చేసి వికెట్ పారేసుకున్నాడు. దాదాపు విండీస్ తరహాలోనే 32/3తో నిలిచిన భారత్‌ను కోహ్లి, పాండే ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 30 బంతుల్లో 32 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. వీరిద్దరూ ఒకరివెంట ఒకరు వెనుదిరిగినా... కృనాల్ (12), జడేజా (10 నాటౌట్) లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చారు. కీమో పాల్ ఓవర్లో సిక్స్ కొట్టిన సుందర్ (8 నాటౌట్) లాంఛనాన్ని ముగించాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కాంప్‌బెల్ (సి) కృనాల్ (బి) సుందర్ 0; లూయిస్ (బి) భువనేశ్వర్ 0; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 20; పొలార్డ్ ఎల్బీ (బి) సైనీ 49; హెట్‌మైర్ (బి) సైనీ 0; పావెల్ (సి) పంత్ (బి) ఖలీల్ 4; బ్రాత్‌వైట్ (సి అండ్ బి) కృనాల్ 9; నరైన్ (సి) ఖలీల్ (బి) జడేజా 2; పాల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 3; కాట్రెల్ నాటౌట్ 0; థామస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–28, 4–28, 5–33, 6–67, 7–70, 8–88, 9–95. బౌలింగ్: సుందర్ 2–0–18–1, భువనేశ్వర్ 4–0–19–2, సైనీ 4–1–17–3, ఖలీల్ 2–0–8–1, కృనాల్ 4–1–20–1, జడేజా 4–1–13–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పొలార్డ్ (బి) నరైన్ 24; ధావన్ ఎల్బీ (బి) కాట్రెల్ 1; కోహ్లి (సి) పొలార్డ్ (బి) కాట్రెల్ 19; పంత్ (సి) కాట్రెల్ (బి) నరైన్ 0; పాండే (బి) పాల్ 19; కృనాల్ (బి) పాల్ 12; జడేజా నాటౌట్ 10; సుందర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.2 ఓవర్లలో 6 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–4, 2–32, 3–32, 4–64, 5–69, 6–88. బౌలింగ్: థామస్ 4–0–29–0, కాట్రెల్ 4–0–20–2, నరైన్ 4–0–14–2, పాల్ 3.2–0–23–2, బ్రాత్‌వైట్ 2–0–12–0. అమెరికాలో మ్యాచ్... అయినా అగ్ర రాజ్యం అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు... అటు కరీబియన్ దీవులకు దగ్గరగానూ ఉండే ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌కు తొలి మ్యాచ్‌లో స్పందన అంతంతే కనిపించింది. ఈ మైదానంలో మూడేళ్ల క్రితం భారత్–విండీస్ మ్యాచ్‌కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈసారి మాత్రం కనిష్ట టికెట్ ధర 50 డాలర్లే అయినా స్టాండ్స్ నిండలేదు. లాడర్‌హిల్‌లో మొత్తమ్మీద ఇది తొమ్మిదో మ్యాచ్ కావడం గమనార్హం. సై.. సై.. సైనీ తొలి టి20లో భారత్‌కు పెద్ద సానుకూలాంశం నవదీప్ సైనీ. ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్‌ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్‌కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్‌ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా ముగించి భళా అనిపించాడు. -
అదిరే ఆరంభం
‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ గెలవలేం’ అని తమ టీమ్ నినాదంగా మార్చుకున్న జట్టు మొదటి అడుగును బ్రహ్మాండంగా వేసింది. అద్భుతమైన ఆట, సొంతగడ్డపై టోర్నీ, ఎన్నో అనుకూలతలతో, భారీ అంచనాలతో ప్రపంచ కప్ బరిలో దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో వాటిని అందుకుంది. అన్ని రంగాల్లో సమష్టిగా చెలరేగి 2019 ప్రపంచకప్‌నకు ఘనారంభం అందించింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ కలగలిసి దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెన్ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ హీరోలుగా నిలిచారు. లండన్: పన్నెండో ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఏకపక్ష ఫలితాన్ని అందించింది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 89; 9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (60 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (53 బంతుల్లో 54; 8 ఫోర్లు), జో రూట్ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ స్కోరులో కీలక పాత్ర పోషించారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా, తాహిర్, రబడ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. క్వింటన్ డి కాక్ (74 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డసెన్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆర్చర్ 27 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా... స్టోక్స్, ప్లంకెట్ చెరో 2 వికెట్లు తీశారు. సోక్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు అర్ధ సెంచరీలు... గత కొంత కాలంగా అద్భుతమైన ఆరంభాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న ఇంగ్లండ్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ప్రధాన పేసర్లను కాదని స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో తొలి ఓవర్ వేయించిన డు ప్లెసిస్ వ్యూహం ఫలించింది ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో (0)ను ఇన్నింగ్స్ రెండో బంతికే తాహిర్ ఔట్ చేశాడు. అయితే జేసన్ రాయ్, రూట్ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో వీరు బ్యాటింగ్ చేశారు. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. అనంతరం ఒకే ఓవర్లో రాయ్, రూట్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రాయ్‌కు 51 బంతులు పట్టగా, రూట్ 56 బంతులు తీసుకున్నాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపించి దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ఫెలుక్వాయో వేసిన షార్ట్ బంతిని ఆడబోయిన రాయ్ మిడాఫ్‌లో ప్లెసిస్‌కు క్యాచ్ ఇవ్వగా... రబడ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్లో డుమినికి రూట్ క్యాచ్ ఇచ్చాడు. రాయ్, రూట్ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో సెంచరీ భాగస్వామ్యం ఇంగ్లండ్ కోలుకునేలా చేసింది. ఈసారి కెప్టెన్ మోర్గాన్, స్టోక్స్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఇన్‌గిడి ఓవర్లో మోర్గాన్ వరుసగా రెండు సిక్సర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం 50 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. మరోవైపు ప్రిటోరియస్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్టోక్స్ 45 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నాలుగో వికెట్‌కు స్టోక్స్‌తో కలిసి 106 పరుగులు జత చేసిన తర్వాత మార్క్రమ్ పట్టిన చక్కటి క్యాచ్‌తో మోర్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ దశలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సఫలమయ్యారు. ఇన్‌గిడి వేసిన 49వ ఓవర్లో రివర్స్ పుల్కు ప్రయత్నించిన స్టోక్స్...ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. రాణించిన డి కాక్, డసెన్... ఇన్నింగ్స్ ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత కొంత వరకు డసెన్ ... వీరిద్దరు రాణించడం మినహా ఏ దశలో కూడా దక్షిణాఫ్రికా విజయం దిశగా వెళుతున్నట్లు కనిపించలేదు. ముందు గా ఆర్చర్ తన రెండో ఓవర్లో 144.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్ తలకు తగిలి ఆమ్లా రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా... వరుస ఓవర్లలో మార్క్రమ్ (11), కెప్టెన్ డు ప్లెసిస్ (5)లను ఔట్ చేసి ఆర్చర్ మళ్లీ దెబ్బ తీశాడు. ఈ దశలో డి కాక్, డసెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. 6 పరుగుల వద్ద డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బట్లర్ వదిలేశాడు. 58 బంతుల్లో డి కాక్ అర్ధసెంచరీ పూర్తయింది. ప్లంకెట్ ఓవర్లో డి కాక్ ఫోర్, సిక్స్ కొట్టగా... అలీ వేసిన తర్వాతి ఓవర్లో డసెన్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో జోరు పెరిగింది. నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించాక డి కాక్‌ను ఔట్ చేసి ప్లంకెట్ ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత సఫారీల పతనం మొదలైంది. డసెన్‌ను ఆర్చర్ ఔట్ చేయడం... కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన ఆమ్లా (13) కూడా చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. తాహిర్‌తో బౌలింగ్ షురూ... ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను తాహిర్ బౌల్ చేశాడు. తద్వారా ఒక ప్రపంచ కప్ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన మొదటి స్పిన్నర్‌గా అతను గుర్తింపు పొందాడు. 1992 ప్రపంచ కప్‌లో దీపక్ పటేల్ (న్యూజిలాండ్) కొత్త బంతితో బౌలింగ్ చేసినా...అతను రెండో ఓవర్‌తో తన బౌలింగ్ మొదలు పెట్టాడు. మరోవైపు 40 ఏళ్ల 64 రోజుల వయస్సున్న తాహిర్...దక్షిణాఫ్రికా తరఫున ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్వాయో 54; బెయిర్‌స్టో (సి) డి కాక్ (బి) తాహిర్ 0; రూట్ (సి) డుమిని (బి) రబడ 51; మోర్గాన్ (సి) మార్క్రమ్ (బి) తాహిర్ 57; స్టోక్స్ (సి) ఆమ్లా (బి) ఇన్‌గిడి 89; బట్లర్ (బి) ఇన్‌గిడి 18; అలీ (సి) డుప్లెసిస్ (బి) ఇన్‌గిడి 3; వోక్స్ (సి) డుప్లెసిస్ (బి) రబడ 13; ప్లంకెట్ (నాటౌట్) 9; ఆర్చర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 311. వికెట్ల పతనం: 1–1, 2–107, 3–111, 4–217, 5–247, 6–260, 7–285, 8–300. బౌలింగ్: తాహిర్ 10–0–61–2; ఇన్‌గిడి 10–0–66–3; రబడ 10–0–66–2; ప్రిటోరియస్ 7–0–42–0; ఫెలుక్వాయో 8–0–44–1; డుమిని 2–0–14–0; మార్క్రమ్ 3–0–0–16–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 68; ఆమ్లా (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 13; మార్క్రమ్ (సి) రూట్ (బి) ఆర్చర్ 11; డుప్లెసిస్ (సి) అలీ (బి) ఆర్చర్ 5; వాన్‌డర్ డసెన్ (సి) అలీ (బి) ఆర్చర్ 50; డుమిని (సి) స్టోక్స్ (బి) అలీ 8; ప్రిటోరియస్ (రనౌట్) 1; ఫెలుక్వాయో (సి) స్టోక్స్ (బి) రషీద్ 24; రబడ (సి) ప్లంకెట్ (బి) స్టోక్స్ 11; ఇన్‌గిడి (నాటౌట్) 6; తాహిర్ (సి) రూట్ (బి) స్టోక్స్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 207. వికెట్ల పతనం: 1–36; 2–44; 3–129; 4–142; 5–144; 6–167; 7–180; 8–180; 9–207; 10–207. బౌలింగ్: వోక్స్ 5–0–24–0; ఆర్చర్ 7–1–27–3; రషీద్ 8–0–35–1; అలీ 10–0–63–1; ప్లంకెట్ 7–0–37–2; స్టోక్స్ 2.5–0–12–2. స్టోక్స్, -
భారత్ రికార్డు ఛేదన
పోచెఫ్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళ జట్టు జోరు కొనసాగుతోంది. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్ టి20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (48 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిథాలీకి టి20ల్లో ఇది 11వ అర్ధసెంచరీ. మిథాలీతోపాటు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న 17 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్), వేద కృష్ణమూర్తి (22 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో... భారత్ 18.5 ఓవర్లలో 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టి20ల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. గతంలో ఆస్ట్రేలియాపై 141 పరుగుల చేధనే అత్యధికంగా ఉండేది. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (38; 5 ఫోర్లు, 1 సిక్స్), డు ప్రీజ్ (31; 5 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో ట్రియాన్ (7 బంతుల్లో 32; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అనుజా 2, శిఖా, పూజ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో బరిలోకి దిగిన భారత్‌కు మిథాలీ, స్మృతి (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అనంతరం వరుస బంతుల్లో మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (0) ఔటైనా... జెమీమాతో మిథాలీ మూడో వికెట్‌కు 69, వేదతో నాలుగో వికెట్‌కు అజేయంగా 52 పరుగులు జతజేసింది. దీంతో భారత్ మరో 7 బంతులు మిగిలుండగానే 168 పరుగులు చేసి గెలుపొందింది. అజేయంగా జట్టును గెలిపించిన మిథాలీకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మడమ గాయం కారణంగా ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు దూరమైంది. -
ఇక టి20 సిరీస్‌పై దృష్టి
పోట్చెఫ్స్ట్రూమ్: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు టి20లపై కన్నేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ నేడు జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతోంది. తొలి రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుపొందిన మిథాలీ సేన మూడో మ్యాచ్‌లో మాత్రం ఓడింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నేతృత్వంలో పొట్టి ఫార్మాట్లోనూ తమ ఆధిపత్యం చాటాలని భావిస్తోంది. ఇందులో 17 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ ఆకర్షణగా నిలవనుంది. భారత క్రీడాకారిణుల్లో స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్ ధాటిగా ఆడటంలో దిట్ట. మూడో వన్డేలో విశ్రాంతి తీసుకున్న వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి తిరిగి తుది జట్టులోకి రావడం భారత్‌కు లాభించనుంది. ఈమెతో పాటు శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్ నిలకడగా ఆడారు. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ ఫామ్‌లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. -
హైదరాబాద్ హంటర్స్ శుభారంభం
గువాహటి: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. కొత్త జట్టు నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 5–2తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో మార్కిస్ కిడో–యు యోన్ సియోంగ్ (హంటర్స్) ద్వయం 15–10, 13–15, 15–13తో కిమ్ జి జంగ్–షిన్ బేక్ జోడీపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో లీ హున్ ఇల్ (హంటర్స్) 15–13, 11–15, 15–6తో అజయ్ జయరామ్‌ను ఓడించాడు. ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకున్న మూడో మ్యాచ్‌లో కరోలినా మారిన్ 15–9, 15–11తో మిచెల్లి లీపై గెలిచింది. దాంతో హంటర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకున్న నాలుగో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ప్లేయర్ జు వీ వాంగ్ 11–15, 15–6, 15–6తో సాయిప్రణీత్‌ను ఓడించడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. చివరిదైన ఐదో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–పియా జెబాదియా ద్వయం 15–8, 15–11తో ప్రాజక్తా సావంత్–షిన్ బేక్ జంటపై నెగ్గడంతో హంటర్స్ జట్టు ఓవరాల్‌గా 5–2తో విజయం దక్కించుకుంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
భారత్ పరాజయం
హువా హిన్ (థాయ్‌లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. థాయ్‌లాండ్‌తో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో సానియా మీర్జా, అంకిత రైనా, ప్రేరణ బాంబ్రీ, ప్రార్థన తొంబారేలతో కూడిన భారత్ 0-3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 2-6, 5-7తో బున్యావి థామ్చైవాట్ చేతిలో... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6-7 (5/7), 3-6తో లుక్సికా కుమ్కుమ్ చేతిలో ఓడిపోయా రు. డబుల్స్‌లో ప్రేరణ-ప్రార్థన ద్వయం 7-6 (8/6), 2-6, 4-6తో కమోన్‌వన్ బుయామ్-పీంగ్తార్న్ జంట చేతిలో పరాజయం పాలైంది. -
శుభారంభంపై కుర్రాళ్ల గురి
నేడు ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ అండర్-19 ప్రపంచ కప్ మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లలో చెలరేగిన భారత జట్టు అసలు పోరుకు సిద్ధమైంది. నేడు (గురువారం) గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగే మ్యాచ్‌లో భారత్, ఐర్లాండ్‌తో తలపడుతుంది. పెద్దగా అనుభవం లేని ఐర్లాండ్‌తో పోలిస్తే భారత్ చాలా పటిష్టంగా ఉంది. జట్టు సభ్యులలో ఐదుగురు ఇప్పటికే రంజీ ట్రోఫీలో ఆడగా, సర్ఫరాజ్, భుయ్‌లాంటివారికి ఐపీఎల్లో అనేక మంది దిగ్గజ క్రికెటర్లతో ఆడిన అనుభవం కూడా ఉంది. వీటికి తోడు కోచ్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనం ఈ కుర్రాళ్లకు అదనపు బలం. ఆస్ట్రేలియా జట్టు తప్పుకోవడంతో భారత జట్టే ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో కెనడాను 372 పరుగులతో చిత్తు చేసిన భారత్, తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ గెలుపు టోర్నీ తొలి రోజు ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ 43 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 299 పరుగులతో ఫిజీని చిత్తుగా ఓడించింది. -
జైపూర్‌కు ఝలక్
యు ముంబా 29-28తో విజయం ప్రొ కబడ్డీ లీగ్-2 ముంబై: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది. గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఆడిన యు ముంబా జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన ఈ తొలి మ్యాచ్.. నువ్వా నేనా అనే రీతిలో సాగగా చివరకు ముంబా జట్టు 29-28 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒక్కో పాయింట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడ్డారు. అయితే కీలక సమయాల్లో ముంబై పాయింట్లు సాధిస్తూ జైపూర్పై ఒత్తిడి పెంచింది. 9-5తో ఆధిక్యంలో ఉన్న ఓ దశలో ముంబై ఏమరుపాటుతో ప్రత్యర్థి దూకుడు పెంచి 10-10తో సమంగా నిలిచింది. అయితే వెంటనే పుంజుకుని 16-15తో ముంబై తొలి భాగం ముగించింది. ఇక మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 25-25తో రెండు జట్లు సమంగా నిలిచాయి. ఈ దశలో షబీర్ బాపు ముంబైకి కీలక పాయింట్ అందించాడు. 29-26తో వెనుకబడిన తరుణంలో చివరి నిమిషంలో జైపూర్ రెండు పాయింట్లు సాధించినా అప్పటికే ఆలస్యమై పోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. అంతకుముందు లీగ్ ప్రారంభంలో బాలీ వుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కపిల్‌దేవ్, ఆమిర్‌ఖాన్, రిషీ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, జాన్ అబ్రహం తదితరులు హాజరయ్యారు. మరోవైపు ముంబై, పుణేలలో జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ముంబైలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
హమ్మయ్య.. సమ్మె ఆగింది!
సావో పాలో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు ఇప్పుడు ఇలాగే ఫీలవుతున్నారు. ప్రారంభ వేడుకలతో పాటు ఆరంభ మ్యాచ్ కూడా జరిగే ప్రధాన స్టేడియానికి రవాణా సదుపాయం కలిగించే సావో పాలో సబ్వే కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో అభిమానులను అక్కడికి ఎలా చేర్చాలనే దానిపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. అయితే తమ సమ్మె కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో.. ఏమో కానీ బుధవారం రాత్రి నుంచి తమ ఆందోళనను విరమించుకున్నారు. జీతాల పెంపు కోరుతూ చేస్తున్న ఈ సమ్మె పట్ల 15 వందల మంది సబ్వే కార్మికులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సరైందని నమ్ముతున్నట్టు యూనియన్ అధ్యక్షుడు అల్టినో ప్రెజర్స్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా తాము సమ్మెకు దూరం కాలేదని.. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రియో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మె రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభమైన గురువారం నుంచి ఒక రోజు పాటు రియో విమానాశ్రయ సిబ్బంది పాక్షిక సమ్మెకు దిగారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 70 శాతం మంది విధుల్లో ఉండగా మిగిలిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రపంచకప్ బోనస్, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, 12 శాతం జీతాల పెంపును వీరు డిమాండ్ చేస్తున్నారు.