ghmc elecitons
-
‘ఒకరు మతం.. మరొకరు డబ్బు రాజకీయం’
నల్లగొండ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని చూస్తే, టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సే అని, గెలుపు ఓటములన్నది సహజమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, యోగి తదితర నేతలు హైదరాబాద్‌కు వచ్చి మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వెదజల్లిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు మత ప్రాతిపదికన తరహాలో జరిగాయని ఆరోపించారు. దుబ్బాకలో కూడా ఇదే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ బలహీనపడ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్ర వి«ధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అలాంటి ఉద్యమాలే రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. -
ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు విచారకరమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తావా? పాతబస్తీ హైదరాబాద్‌లో లేదా భారత దేశంలో లేదా అంటూ ప్రశ్నించారు. ఇటు సర్జికల్ స్ట్రైక్ అంటూ, అటు వెళ్లి బాగ్యలక్ష్మి అమ్మవారి అలయంలో పూజలు చేస్తాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదన్నారు. వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేస్తున్నా ఎంఐఎం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికలు గుర్తుకు రాగానే ఆక్రమణలు గుర్తొస్తున్నాయా? పీవీ ఘాట్,ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని ఇప్పుడు చెప్తున్నారు..ఏనాడైనా పార్లమెంట్లో పాతబస్తీ గురించి మాట్లాడారా? అంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. (సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్) -
ఓటు మన బాధ్యత
మనిషి ఇంట్లో ఉండటం తక్కువ. రోజంతా బయటే! చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు. అలసి ఇంటికి చేరిన వారిని ఇల్లు ఆదరిస్తుంది. ఫ్యాన్ వేసి కూర్చోబెడుతుంది. మంచినీళ్ల గ్లాసు చేతికి అందిస్తుంది. స్నానానికి వేణ్ణీళ్లు పెడుతుంది. అప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. సేదతీరాక, ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మనిషికి కూడా ఇలాంటి ఆదరణే ఉండాలి. రోజూ వెళ్లొచ్చే రోడ్లు బాగుండాలి. రాకపోకలకు రవాణా సౌకర్యం ఉండాలి. రద్దీ తక్కువగా ఉండాలి. రక్షణ, భద్రత ఉండాలి. ఒక్కమాటలో.. మహానగరమే అయినా మన ఇల్లులా ఉండాలి! ఆ నగర ‘గృహ’ బాధ్యత ‘మేయర్’ది అయితే, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల బాధ్యత. ఇంట్లో నీళ్ల ట్యాప్ అయినా, రోడ్డు మీద నడిచే మన బతుకు బండైనా ఉండేది మేయర్ చేతిలోనే. ఆ మేయర్‌ని ఎన్నుకునే అవకాశం మళ్లీ ఇప్పుడు నగరజీవి చేతికి వచ్చింది. డిసెంబర్ 1న హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో 74 లక్షలకు పైగా ఓటేయబోతున్నారు. వారిలో మహిళా ఓటర్లు 35 లక్షలకు పైగానే. ఈ మహిళల ఓట్లే ఇప్పుడు కీలకం! ఓటు హక్కును వినియోగించుకోడం తమ బాధ్యత అని భావిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్) పరిధిలోని మహిళా ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. ఎక్కువమంది మహిళల్లో ఓటు వేయడం పట్ల చైతన్యంతో కూడిన బాధ్యత వ్యక్తం అయింది. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసేదాన్ని. సిటీ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో నగర పాలకవర్గానిదే ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ఓటేస్తాను. మా శేరిలింగంపల్లి డివిజన్లో అనుమతి లేని నిర్మాణాల వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దగలిగిన వ్యక్తినే కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత, సరైన ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన విధి సిటిజన్‌గా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో నిరాసక్తంగా ఉండి తర్వాత ఎవరిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు. – పి. నీలిమ, ప్రాజెక్ట్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ అప్పట్లో మాకు 21 ఏళ్లకు ఓటు హక్కు వచ్చేది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నాను. ఎలక్షన్ల సమయంలో రేడియో ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే ఓటు వేయడం మానలేదు. ఉదయం ఓటింగ్ మొదలయ్యే సమయానికే బూత్‌కి వెళ్లి ఓటు వేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేదాన్ని. ఢిల్లీలో ఉద్యోగం చేసినన్నాళ్లు అక్కడ వేశాను, ఇప్పుడు హైదరాబాద్‌లో వేస్తున్నాను. తలవంచుకుని వెళ్లి ఓటు వేసి రావడం కాదు, ఓటింగ్ సరళిని గమనించి సమాచారంతో ఆఫీసుకు వెళ్తుంటాను. – ఎమ్.ఎస్.లక్ష్మి, న్యూస్ కరస్పాండెంట్, ఆల్ ఇండియా రేడియో మేము హైదరాబాద్‌కి వచ్చి ముప్పై ఏళ్లయింది. ఇక్కడ ఓటు వచ్చి ఇరవై ఏళ్లయింది. ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నాం. మా కష్టం ఎవరూ తీర్చరు. అలాగని ఓటు వేయకపోతే... మనం ఊర్లో ఉన్నా లేనట్లే చూస్తారు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఏదైనా పథకం పెట్టినప్పుడు మమ్మల్ని ఏ లీడరూ పట్టించుకోరు. మాకూ అర్హత ఉందని గట్టిగా అడగాలంటే ఓటు వేయాల్సిందే. – టి. సరస్వతి,పూల వ్యాపారి ఒకరొచ్చి చెప్పాలా?! ఓటు వేయడం ద్వారా మన జీవితంలో ఐదేళ్ల కాలాన్ని ఆ ప్రతినిధి చేతిలో పెడుతున్నాం. అందుకే ఆ ఎన్నిక ప్రక్రియలో విధిగా భాగస్వాములు కావాలి. సరైన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవాలి. నగరంలో మనిషికి ప్రభుత్వం చేయాల్సిన కనీస సర్వీసులు కరెంటు, వాటర్, డ్రైనేజ్ సర్వీసులే. అవన్నీ మనం కట్టే పన్నుల నుంచి అందుతున్న సర్వీసులే. ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను సక్రమంగా అందించే బాధ్యత ఆ ప్రతినిధిది. స్ట్రీట్ లైట్ వెలగకపోయినా, డ్రైనేజ్ పొంగినా మనకు అందాల్సిన సర్వీస్ గురించి అడగగలగాలి. అలాగే జనం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరో వచ్చి చైతన్యపరచాలని ఎదురు చూడకూడదు. ఎవరికి వాళ్లు చైతన్యవంతం కావాలి. ఇక చాలా మందికి క్యూలో నిలబడడం అంటే నామోషీ. బేషజాలకు పోయి విలువైన ఓటు హక్కును వినియోగించుకోరు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కూడా రాష్ట్రపతి హోదాలో నేరుగా వెళ్లి ఓటేయకుండా, క్యూలో నిలబడి తన వంతు కోసం ఎదురు చూసి మరీ ఓటేశారు. అంతకంటే స్ఫూర్తి మరేం కావాలి? నా మట్టుకు నేను ప్రతి ఎన్నికలోనూ ఓటేశాను. సాధారణ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యుయెన్సీ ఓటు కూడా వేశాను. ఇప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓటు వేస్తాను. – పి. హరిత, ఎంటర్ప్రెన్యూర్ -
విశ్వనగరమా? విద్వేష నగరమా?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం కావాలా? విద్వేష నగరం కావాలా? అన్న అంశంపై ఆలోచన చేయాలని హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి విజ్ఞప్తి చేశారు. తెల్లారి లేస్తే అనుమానాలతో ఒకరినొకరు చూసుకొనే హైదరాబాద్ నగరం కావాలా? అన్నదమ్ముల్లా కలసి ఉండే హైదరాబాద్ కావాలా? అని ప్రశ్నించారు. మతం పేరుతో ఆగమాగం కావడానికి ఇది అహ్మదాబాద్ కాదని, ప్రగతిశీల ఆలోచనలుగల హైదరాబాద్ నగరమన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తాను చదువుకొనే రోజుల్లో ఏటా నగరంలో అల్లర్లు చోటుచేసుకొని వారం, పది రోజులు కర్ఫ్యూ ఉండేదన్నారు. గత ఆరేళ్లలో అరగంట కూడా నగరంలో కర్ఫ్యూ విధించలేదన్నారు. హిందూ–ముస్లిం అనడం తప్ప బీజేపీ నేతలకు మరేదీ తెలియదన్నారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని ఎద్దేవ చేశారు. గత ఆరేళ్లుగా నగరంలో మత కల్లోలాలు, బాంబు పేలుళ్లు, ఆకాతాయిల ఆగాడాలు, చైన్ స్నాచింగ్‌లు, పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బు లేదన్నారు. నగరంలో 5 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే నిమి షాల్లో నిందితులను పట్టుకుంటున్నామన్నారు. చిన్న బిల్డర్ల సమస్యలను పరిష్కారిస్తామని, డిసెంబర్ 4 తర్వాత వారితో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ దేశంలో భాగం కాదా? కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తితే వారం రోజుల్లోనే రూ. 640 కోట్లను కేంద్రం ఇచి్చందని, గుజరాత్లో వరదలు రాగానే రూ. 500 కోట్లను ప్రధాని మోదీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ హైదరాబాద్‌లో వరదలొస్తే ఇప్పటివరకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని, భాగ్యనగరం భారతదేశంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. గత ఆరేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వెళ్లిందని, మరోవైపు కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయన్నారు. తెలంగాణకే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతికి ప్రధాని మోదీ ఏం ఇచ్చారు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున అమరావతి నిర్మాణానికి రూ. 100 కోట్ల విరాళాన్ని ప్రకటించడానికి సీఎం కేసీఆర్... రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ప్రధాని కేవలం తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చారని తెలుసుకొని సీఎం కేసీఆర్ ఆ సహాయాన్ని ప్రకటించలేకపోయారన్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో గుంతల్లేని రోడ్లున్నాయా? హైదరాబాద్‌లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష ఇస్తానని ఓ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొనడాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా గుంతల్లేని రోడ్లను చూపిస్తే తానే రూ. 10 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. నీరు–తారు శత్రువులని, వర్షాలకు రోడ్లపై గుంతలు పడటం సహజం అన్నారు. ఆరేళ్లలో రూ. 67 వేల కోట్లతో నగరాభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థపై సమ్మెటపోటు పడిందని, కరోనా రాక ముందే జీడీపీ పతనమై ఆర్థిక సంక్షోభం తలెత్తిందని కేటీఆర్ పేర్కొన్నా రు. లాక్డౌన్ తర్వాత జీడీపీ ఏకంగా 31 శాతం పతనమైందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ ఉన్నాయని బీజేపీ వాళ్లు అడుగుతున్నారని, రూ. 18 వేల కోట్లతో 111 చోట్ల లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వెళ్లి చూసుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిం దని బీజేపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఈ పథకం ద్వారా 91.3 శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వమే హడ్కో అవార్డు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. రూ. 20 లక్షల కోట్లతో కేంద్రం ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ ఒక మాయ అని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ చార్జిïÙట్ విడుదల చేసిందని... మరి ఇప్పటివరకు వివిధ విషయాల్లో విఫలమైనందుకు బీజేపీపై ఎఫ్ఐఆర్లు వేయాలా? అని కేటీఆర్ నిలదీశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్కు ఎలాంటి అవగాహన లేదని, ఆ పార్టీని పాతబస్తీలో ఓడిస్తామన్నారు. కాగా, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, నరసింహారావు తెలిపారు. -
'సోషల్' సైనికులు
జిందాబాద్‌లుండవు.. నినాదాలు వినిపించవు.. సభ, ర్యాలీల ఆర్భాటాలు కనిపించవు.. కానీ, జరగాల్సిన ప్రచారం జరిగిపోతుంది. చెప్పాల్సింది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతుంది. ఇది కదా ప్రచారమంటే! ఇప్పుడన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియానే అసలైన ‘గొంతుక’గా మారింది. ఎంతమంది కార్యకర్తలున్నా.. ఎంత మందీ మార్బలమున్నా, ఎంత గొప్ప ఉపన్యాసాలిచ్చినా.. అది ప్రజలకు చేరకపోతే వృథానే. పైగా కరోనా విజృంభిస్తోన్న తరుణంలో భారీగా జనసమీకరణ, బహిరంగసభలంటే ప్రజలే కాదు, కార్యకర్తలూ జంకుతున్నారు. అందుకే, అన్ని పార్టీలు బయట లక్షలాదిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా సరే.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలకు ఎంతమంది ఫాలోవర్లు ఉంటే.. తమ పోస్టులు అంతకుమించి జనాల్లోకి చేరతాయని పారీ్టలు విశ్వసిస్తున్నాయి. అందుకే, తమ పార్టీ సోషల్‌మీడియా విభాగాలను క్రియాశీలం చేశాయి. అన్ని పారీ్టల్లోని ‘సోషల్ సైనికులు’తమ పోస్టులు, షేర్లతో ప్రచార వేడిని రెండింతలు చేస్తున్నారు. ఎన్నికల్లో జెండాలు, ఎజెండాల కంటే ప్రచారం సందర్భంగా జరుగుతున్న ఘటనలే ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. అసలు పోటీలోనే లేదనుకున్న బీజేపీ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఏకంగా దుబ్బాక సీటును ఎగరేసుకుపోయింది. దీంతో అప్పటిదాకా సోషల్ మీడియాను ఎగతాళి చేసిన పార్టీలు, నాయకులు కూడా దానికి పెద్దపీట వేస్తున్నారు. కరోనా దెబ్బకు యువకులు, విద్యార్థులందరి చేతికి స్మార్ట్ఫోన్లు వచ్చాయి. డేటా, సోషల్‌మీడియా వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్రజల్ని ప్రభావి తం చేయడం పెద్ద పనికాదు. సోషల్ మీడియాలో వచ్చే ఒక్క పోస్టు కూడా జనంలోకి నేరుగా దూసుకుపోతుంది. ప్రచారం రూపేణా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆదరణ సోషల్ మీడియా ద్వారా వస్తుందని భావించే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పారీ్టలు ఈ మాధ్యమాన్ని విరివిగా వాడుకునే పనిలో పడ్డాయి. అటు ప్రచారం.. ఇటు పైసలు వివిధ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆకర్షితులై వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన పార్టీలు, నాయకులకు భారీగా విరాళాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడ్డ నగరవాసులతో అన్ని పార్టీలు నిరంతరం టచ్‌లో ఉంటున్నాయి. వారి నుంచి విరాళాలే కాదు, పారీ్టలకు మద్దతుగా వారి వీడియోలను కూడా సేకరిస్తున్నాయి. వీటిని స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తమ ఓటుబ్యాంకు నిలుపుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఫలానా సమయంలో తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్లే మీకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకోవడం కూడా పలు పార్టీలకు కలిసివస్తోంది. హైదరాబాద్‌లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలుంటారు. అందుకే, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ కంటెంట్‌ను అన్ని పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్.. చివరికి వాట్సాప్‌లోని స్టేటస్లు, డీపీలు, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ల ద్వారా కూడా ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు, సోషల్‌మీడియా విభాగాల సిబ్బంది జోరుగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గంటగంటకు వాట్సాప్ స్టేటస్‌లతో లక్షలాదిమందిని ప్రభావితం చేయవచ్చని కొన్ని పారీ్టలు గుర్తించి అనుకూలంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు దాదాపు అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ గ్రేటర్ ఎన్నికలపైనే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కంటెంట్‌కు డిమాండ్ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అంతా ఎవరికి వారే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అన్ని పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు ఇటీవల తాత్కాలిక ప్రాతిపదికన కంటెంట్ రైటర్లు, పీఆర్వోలు, కార్టూనిస్టులు, వీడియో ఎడిటర్లు, డీటీపీ ఆపరేటర్లను భారీగా నియమించుకున్నాయి. ప్రత్యర్థులపై పదునైన ‘పంచ్’వేస్తూ చేసే పోస్టులకు ప్రాధాన్యమిస్తున్నారు. వ్యంగ్య కా ర్టూన్లు, వెటకారం నిండిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ పనిచేసినందుకు ఒక్కొక్కరికి 15 రోజుల కోసమే రూ. 50 వేల దాకా ముట్టజెపుతున్నారంటే వీరికి ఎంతప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పీఆర్ ఏజెన్సీల చేతిలో ‘ట్విట్టర్ హ్యాండిల్స్’ పలువురు ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిళ్ల నిర్వహణ బాధ్యతను పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ఏజెన్సీలు చూస్తుంటాయి. వివిధ పరిణామాలపై ఇవి సదరు నాయకుని అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాయి. సంతాపాలు, శుభాకాంక్షలు వంటివి క్షణాల్లో సదరు నేతల హ్యాండిళ్లలో ప్రత్యక్షం అవుతున్నాయంటే అదంతా పీఆర్ ఏజెన్సీల పనే. రాష్ట్రంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తరువాత ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసద్. ఫేస్బుక్, ట్విట్టర్లలో వీరి ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్కు దాటింది. చాలామంది రాష్ట్ర నాయకుల సోషల్ మీడియా ఖాతాలను సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ కంటెంట్ రైటర్లు, విశ్రాంత విలేకరులు నిర్వహిస్తున్నారు. -
జీహెచ్ఎంసీ : ఆ వదంతులు నమ్మకండి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న అన్ని డీఆర్సీ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందితో చర్చించినట్లు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నట్లు సీపీ చెప్పారు. ఇప్పటివరకు 9 కేసుల్లో పట్టుబడిన హవాలా నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పామన్నారు. ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని తెలిపారు. ఇప్పటికే 1500ల లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయినట్లు వెల్లడించారు. (టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: పోసాని) 'బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని సున్నితమైన, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి గట్టి బందోబస్తు ఉంది. స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంటుంది' అని సీపీ పేర్కొన్నారు. నగరవాసులు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపారు. ఎన్నికల నియమావళికి ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్, సర్వే సత్యనారాయణ!) -
నేను ఫైటర్‌ను.. భయపడేది లేదు
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. గతంలోనూ టీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసిన సందర్భంలో పార్టీ లేచి దెబ్బకొడితే విపక్షాలకు నషాళానికి అంటింది. నేను ఫైటర్‌ను.. దేనికీ భయపడేది లేదు’అని గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘టీఆర్ఎస్ దేశంలోనే ఓ ప్రబల రాజకీయ శక్తి. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష. అసెంబ్లీ, పార్లమెంటు.. అన్ని ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లోనూ గెలుస్తుంది. గ్రేటర్ అభ్యర్థుల జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయి. అందరికీ న్యాయం చేస్తాం, కంగారుపడొద్దు’అని పార్టీ నేతలకు సూచించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.. ఈ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలి. దిక్కుమాలిన, సంకుచిత ఆలోచనలతో దేశాన్ని నడిపే శక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత టీఆర్ఎస్ పార్టీపైనా, తెలంగాణ రాష్ట్రంపైనా ఉంది. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను టిఆర్ఎస్ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలి’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంతోనే పెట్టుబడులు ‘హైదరాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణంతో నగరానికి పెట్టబడులు తరలివస్తున్నాయి. అమెజాన్ కంపెనీ ఒక్కటే 21 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ది సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు గమనించారు’అని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా? అగ్గిమండే హైదరాబాద్ కావాలా? మతకల్లోలాల హైదరాబాద్ కావాలా? మతసామరస్యం వెల్లివిరిసే హైదరాబాద్ కావాలా? మతం పేర కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా? అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండే హైదరాబాద్ కావాలా? నగరంలో అభివృద్ది కావాలా? అశాంతి రాజ్యమేలాలా? ప్రజలు ఆలోచించుకోవాలి’’అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులు, పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు, కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ‘దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ చేయని దుష్ప్రచారం, ఆడని అబద్ధం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, బ్యాలెట్ పేపర్ మీద హరీశ్‌రావు ఫోటోలేదని అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆమెను ఆగౌరవపరుస్తూ పోస్టింగులు పెట్టారు. ఇంత దుర్మార్గం ఉంటదా? ఇంత నీచమైన ప్రచారం చేస్తరా? జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇలాంటి దారుణాలే చేయాలని చూస్తరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టాలి’అని కేసీఆర్ కోరారు. వరద బాధితులకు రూపాయి ఇవ్వలేదు ‘భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బురద రాజకీయం చేస్తోంది. పేదలను ఆదుకునేందుకు ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు రూ.550 కోట్లు విడుదల చేశాం. ఇప్పటికే 6.78 లక్షల మందికి వరదసాయం అందగా, మిగతా వారి నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకుని బాధితులు అందరినీ అదుకుంటాం. కేంద్రం రూపాయి ఇవ్వకపోగా... పేదలకు ఆర్థికసాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. పేదల నోటికాడి బుక్క లాక్కునేలా చిల్లర రాజకీయాలు చేస్తోంది’అని కేసీఆర్ విమర్శించారు. నాయినికి నివాళి తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తిగా, రాజకీయాల్లో నైతికత గల వ్యక్తిగా నాయిని నర్సింహరెడ్డి నిలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో నాయినిని నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. – ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గుప్తాలను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. – జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా ఇన్చార్జిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67 వేల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ది కార్యక్రమాల జాబితాను తయారు చేసి, వాటిని డివిజన్ల వారీగా ఇన్చార్జిలకు అప్పగించారు. -
గ్రేటర్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలకమైన నేతలు పార్టీని వీడగా.. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గురువారం ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపుల అనంతరం.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2009 నుంచి 2012 వరకు ఆమె హైదరాబాద్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు. (జీహెచ్ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు) రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై మాజీ మేయర్‌కు బీజేపీ భరోసానిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కాషాయం తీర్థం పుచ్చుకునేందుకు బండ కార్తీక రెడ్డి సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని పరిణామం. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో జోరుమీద ఉన్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. (చదవండి: టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం) -
చీఫ్ జస్టిస్ బెంచ్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల పిల్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 52ఇ రిజర్వేషన్ పాలసీకి విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించ వద్దని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపిన న్యాయవాది అభిషేక్ రెడ్డి.. పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. రేపు ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు -
జీహెచ్ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ...కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లలో టికెట్ గుబులు పట్టుకుంది. ఐదేళ్ల పనితీరు ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సిట్టింగ్ కార్పొరేటర్లకు చెక్‌చెప్పే యత్నాలు చేస్తుండటంతో నగరంలో అధికార టీఆర్ఎస్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పార్టీ అధిష్టానం ఇప్పటికే సర్వేలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణతో ప్రతి సీటుకు ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేయగా, పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికే టికెట్ వస్తుందన్న ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఎవరి జాబితాలు..వారివే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి మెజారిటీ కార్పొరేటర్లకు ఏ మాత్రం సఖ్యత లేదు. ఎమ్మెల్యే ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసి తన ముఖ్య కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్ నుంచి గెలిచి మేయర్ పదవి చేపట్టిన బొంతు రాంమోహన్ ఈమారు తన భార్య శ్రీదేవిని అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారు. అయితే స్థానిక నాయకులు తమలో ఒకరికే టికెట్ ఇవ్వాలని బాహాటంగానే తేల్చిచెప్పారు. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు ముగ్గురు కార్పొరేటర్లను మారుస్తున్నామని, ఈ మేరకు ప్రత్యామ్నాయ జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కుత్బుల్లాపూర్‌లో ఓ కార్పొరేటర్ ప్రవర్తనపై జనమే విసిగిపోగా, మరో మహిళా కార్పొరేటర్ ఈమారు తాను పోటీ చేయటం లేదని ప్రకటించారు. కూకట్పల్లి, బేగంపేట డివిజన్ల విషయాల్లో ఎమ్మెల్యేల మధ్య పేచీ నెలకొంది. కూకట్పల్లి సిట్టింగ్‌ను కాదని ఇతరుల పేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిఫారసు చేస్తుండగా, సిట్టింగ్‌కే ఇవ్వాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పట్టుపడుతున్నారు. బేగంపేట డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ స్థానంలో కొత్త అభ్యర్థిని మంత్రి శ్రీనివాసయాదవ్ తెరపైకి తెచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, హైదర్‌నగర్ డివిజన్లలో కొత్త అభ్యర్థులను తెరమీదకు తేవాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాత టీఆర్ఎస్, కొత్త టీఆర్ఎస్ విభేదాలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లకు పొసగటం లేదు. ఇక్కడ కూడా చంపాపేట, చైతన్యపురి, నాగోలు కార్పొరేటర్లను మార్చే యోచన ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే గోపీనాథ్‌తో యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్ కార్పొరేటర్లకు తీవ్ర విభేదాలున్నాయి. ఈ ముగ్గురికి టికెట్ రాకుండా చూడాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉండగా, ఎలా రాదో మేమూ చూస్తామంటూ వారంటున్నారు. ఖైరతాబాద్ నియోకజవర్గంలో సోమాజిగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి తాను పోటీ చేయనని ప్రకటించగా, మిగిలిన అన్ని చోట్ల హేమాహేమీ అభ్యర్థులు తిరిగి పోటీకి సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం మూడు చోట్ల అయినా తనవారికి కొత్తగా టికెట్లు ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్‌మెట్, ముషీరాబాద్, సనత్‌నగర్‌లో బేగంపేట, మోండా, సికింద్రాబాద్‌లో తార్నాక కార్పొరేటర్లను మళ్లీ కొనసాగించే అంశంపై ఒకింత సందిగ్ధత ఉన్నట్టు సమాచారం. -
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. రేపు ఉదయం (శుక్రవారం) ప్రగతి భవన్లో ఈ భేటీ జరుగనుంది. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. (డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?) -
డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీలతో భేటీ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వార్డుల విభజనలో అవకతవకలు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినట్లు ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని వార్డుల్లో ప్రజలకు నష్టం, మరికొన్ని వార్డుల్లో ప్రజలకు లాభం కలుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం వార్డు వారీగా సగటు ఓట్లు 49,360 కాగా.. 140 వార్డుల్లో ఉండాల్సిన ఓటర్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. కేవలం పది వార్డుల్లో మాత్రమే చట్టం ప్రకారం ఓటర్లున్నారని సంఘం కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి(59)వార్డులో 79,290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం(112)లో 27,831 మంది ఓటర్లున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా వార్డుల విభజన చేపట్టడం వల్లే ఈ అక్రమాలు వెలుగుచూశాయన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేసేందుకు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఏమి చేయలేక మళ్లీ అదే తప్పు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాలని కోరారు. వార్డుల వారీగా ఓటర్ల విభజన సరిచేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. -
సంక్రాంతికి ‘జీహెచ్ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా బుధవారం కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ ఎక్కడ ఉందని కేసీఆర్ అన్నారని, ఆయన సొంత జిల్లాలోనే బీజేపీ ఉందని ఇప్పుడు చెబుతున్నానన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదన్నారు. ఓట్ల కొనుగోలు కోసమే జీహెచ్ఎంసీలో రూ.10 వేల నగదు పంచుతున్నారని విమర్శించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తామని, 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల విషయంలో బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిశీలించి పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. తమపై దుబ్బా క ప్రజలు గురుతర బాధ్యత పెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేశారు..: కిషన్‌రెడ్డి దుబ్బాకలో కేసీఆర్ ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిని జైల్లో పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర అధికారులతో చర్చించి ఏమి చేయాలనే దానిపై యోచి స్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగేందుకు పని చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ చొరవతో కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించాయని, పంట నష్టంపై కేంద్ర బృందాలకు ఇప్పటివరకు రాష్ట్ర సర్కార్ నివేదిక ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే పంట నష్టంపై అధికారులతో సమీక్ష చేసి రిపోర్ట్ పంపించాలని సూచించారు. (ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!) -
ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా, మొత్తం 150 డివిజన్ల (వార్డుల) వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 7న ముసాయిదా జాబితాలు ప్రచురిస్తారు. మిగతా ప్రక్రియలను ముగించి 13న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించే ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు కులం లేదా మతం వెల్లడించే విధంగా వివరాలు ఉండకూడదని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలిచ్చింది. వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఏవైనా క్లరికల్ లేదా ప్రచురణ దోషాలుంటే.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు మొదట అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఆ విధమైన లోపాలను సరిచేసి, ఆ తర్వాత వార్డు ఓటరు జాబితాల్లో సరిచేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లోని వివరాలకు అనుగుణంగానే వార్డుల వారీ జాబితాలు ఉంటాయని స్పష్టం చేసింది. హార్డ్, సాఫ్ట్ కాపీలు.. వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వద్ద నమోదై రిజర్వ్ చిహ్నం కేటాయించిన రాజకీయ పార్టీలకు ఉచితంగా సరఫరా చేసి వాటి నుంచి రశీదులు పొందాలని మున్సిపల్ అధికారులకు ఎస్ఈసీ సూచిం చింది. ఈ జాబితాల కాపీలు ఇతరులు కావాలని కోరిన పక్షంలో దానికయ్యే వాస్తవ ధర వసూలు చేసి హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేయొచ్చునని తెలిపింది. అవసరమైన ఓటరు జాబితా కాపీల ముద్రణకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి ప్రింట్ చేసుకోవాలని సూచించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను ఫొటోలు లేకుండా జీహెచ్ఎంసీ, ఎస్ఈసీ వెబ్‌పోర్టళ్లలో ఉంచాలని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కీలకమైనందున వివిధ అంశాలకు సంబంధించి ఎస్ఈసీ స్పష్టతనిచ్చింది. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) కరోనా నేపథ్యంలో విశాల గదుల్లోనే కరోనా నేపథ్యంలో విశాలమైన గదులు, హాళ్లు ఉన్న భవనాలల్లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. సాధ్యమైన మేర ఓటేసేవారు ఒక ద్వారం నుంచి ప్రవేశించి మరో ద్వారం గుండా బయటకు వెళ్లగలిగే హాళ్లు, గదులున్న భవనాలనే పోలింగ్ స్టేషన్లుగా ఎంపిక చేయాలి. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాలి. ఆయా వార్డుల పరిధిలోనే సంబంధిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి. ఓటర్‌కు అందు బాటులో ఉండేలా ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం లేకుండా పోలింగ్ కేంద్రాలు కేటాయించాలి. పోలింగ్ కేంద్రాలుగా పాఠశాల భవనాలను ఎంపిక చేస్తే ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటినే ఎంపిక చేయాలి. ళీ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతేనే చివరి ప్రయత్నంగా పోలింగ్ కేంద్రా లను తాత్కాలిక నిర్మాణాల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ఎంపిక చేయొద్దు. భవనాల కింది అంతస్తుల్లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. 7న ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ మొదలై 13న తుది జాబితాలను ప్రచురించనున్నందున.. అర్హులైన ఓటర్లు అసెంబ్లీ జాబితాల్లో తమ పేర్లను సరిచూసుకోవాలి. ళీ పేర్లు లేకుంటే తమ ఓటు నమోదుకు ఎన్వీఎస్పీ.ఇన్ పోర్టల్ ద్వారా నమోదు పత్రం లేదా నిర్దేశిత ఫారం– 6లో అసెంబ్లీ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారి వద్ద దరఖాస్తు పత్రం సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను ముందుగా అసెంబ్లీ జాబితాల్లో చేర్చి తదనుగుణంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాల్లో చేరుస్తారు. ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే తేదీ వరకు ఈ అవకాశముంటుంది. -
డిసెంబర్లోనే గ్రేటర్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రక్రియలో మళ్లీ కదలిక మొదలైంది. తాజా ప్రతిపాదనల మేరకు నవంబర్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే దిశ గా కసరత్తు వేగం పుంజుకుంది. తొలుత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించిన ప్పటికీ ఇటీవలి వర్షాలు, వరదలతో.. జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉం డొచ్చని భావించారు. కానీ మళ్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో.. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత వేగిరం చేసి, ఆపై ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలో వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న రూ.10 వేల సాయాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిం ది. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడవచ్చనే సంకేతాలిచ్చింది. పాత రిజర్వేషన్లే ఇప్పుడూ.. జీహెచ్ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణ మేరకు ప్రస్తుతం ఉన్న డివిజన్ల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించనున్నారు. అలాగే మహిళలకు 2016లో అమలైన 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించింది. ఈ మేరకు 150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే కేటాయిస్తారు. ఈ మారు మేయర్ పీఠం కూడా వారికే కేటాయించారు. దీంతో జీహెచ్ఎంసీ లో మహిళా నేతల సందడి మరింత పెరగనుంది. కాగా, 2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికంగానే తీసుకుని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల ముందురోజు వరకు అనుమతించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 వరకు ఉన్నా, 3 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి, కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు తాజా సవరణలు అనుమతిస్తున్నాయి. అంతా సవ్యంగా సాగితే జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం 45 రోజుల ముందుగానే కొలువుదీరనుంది. రిటర్నింగ్ అధికారుల నియామకం బల్దియా ఎన్నికలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను (ఏఆర్ఓ) నియమించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పంపిన జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల వారీగా 150 వార్డులకు ఆర్ఓలు, ఏఆర్‌ఓలతోపాటు రిజర్వులో ఉండేందుకు కూడా అధికారులను నియమించారు. -
సర్కార్ సై అంటేనే.. గ్రేటర్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రభుత్వ సమ్మతి తీసుకున్నాకే రాష్ట్ర ఎన్నికల సంఘం... ఇకపై ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం కోవిడ్–19 సంక్షోభం నెలకొని ఉంది. కుంభవృష్టి కురుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. ఇలాంటి సంక్షోభాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉంటుంది. శాంతిభద్రతలు, సిబ్బంది లభ్యత చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి... కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల తరహాలోనే జీహెచ్ఎంసీ చట్టంలో సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనను పొందుపరుస్తున్నాం’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టానికి 5 కీలకమైన సవరణలతో కూడిన బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టగా, స్వల్ప చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన ఉద్దేశాలకు కేటీఆర్ సభకు వివరించి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరోసారి అవే రిజర్వేషన్లు... డివిజన్ల రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగించాలని తాజాగా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణను ప్రతిపాదించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2015 ఎన్నికల్లో ఖరారు చేసి రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో య«థాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి సాధారణ ఎన్నిక కోసం డివిజన్ల రిజర్వేషన్లు మారుస్తూ ఉండాలని ప్రస్తుత జీహెచ్ంసీ చట్టంలో ఉందన్నారు. ప్రతిసారి రిజర్వేషన్లు మారుస్తుండటంతో ఎన్నికైన కార్పొరేటర్లలో జవాబుదారీతనం, శ్రద్ధ లోపిస్తోందన్నారు. ‘ఆమె’కు చట్టబద్ధంగా 50% కోటా.. తొలి రాష్ట్రంగా తెలంగాణలో 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను జీవో ద్వారా అమలు చేశామన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చట్టం ద్వారా మహిళలకు 50 శాతం కోటా అమలు చేయడానికి ఈ సవరణను ప్రతిపాదిస్తున్నామన్నారు. అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం కోటా అమలు చేస్తే బాగుంటుందా? అని కేంద్రం అభిప్రాయం కోరిందని సభకు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (టి) ప్రకారం కనీసం మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఉందన్నారు. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చామని, తాజాగా జీహెచ్ఎంసీ చట్ట సవరణతో అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటాను చట్టబద్ధంగా అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే ఉందని, ఇందుకు ప్రత్యేకంగా మళ్లీ సవరణ చేయాల్సిన అవసరం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేటీఆర్ గ్రేటర్లో గ్రీనరీకి జవాబుదారీతనం జీహెచ్ఎంసీ పరిధిలో మొక్కలు, నర్సరీల పెంపకం, నీళ్లు పోయడంతో పాటు కచ్చితంగా 85 శాతం నాటిన మొక్కలు బతికేలా స్థానిక కార్పొరేటర్, అధికారులు బాధ్యత తీసుకోవాలని, సంస్థ బడ్జెట్లో 10 శాతం నిధులను పచ్చదనానికి కేటాయించాలని మరో సవరణ తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో ఇప్పటి వరకు 2.5 శాతం మాత్రమే గ్రీన్ బడ్జెట్ పెట్టేవారని, దీన్ని 10 శాతానికి పెంచడం ద్వారా కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న హైదరాబాద్‌ను హరితవనంగా మార్చడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఫార్మా సిటీ, పర్యావరణం గురించి కాంగ్రెస్ మాట్లాడటం చూస్తే వంద ఎలుకలను తిన్న పిల్లి నీతులు చెప్పినట్టు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, వికేంద్రీకరణలో భాగంగా ప్రతి డివిజన్లో 4 రకాల కమిటీల ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ చట్టంలో పొందుపరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఒక్కో కమిటీలో 25 మంది చొప్పున ప్రతి డివిజన్లో 100 మంది వీటిలో ఉంటారని, మొత్తం 150 డివిజన్లలో 15 వేల మందితో శక్తివంతమైన పౌర సైన్యాన్ని తయారు చేస్తామన్నారు. కమిటీల్లో 50 శాతం మహిళలు ఉంటారన్నారు. యువజన, వయోజనులు, మహిళలు, ప్రముఖ పౌరులతో ఈ నాలుగు కమిటీలు ఏర్పాటు అవుతాయన్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలకు చెక్ పెట్టడం, ప్లాస్టిక్ నిర్మూలన, క్రీడలు, పార్కులను ప్రోత్సహించడం కోసం... పౌరసైన్యాన్ని జీహెచ్ఎంసీకి అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డు కమిటీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై సూచనలు చేస్తాయని, వాటిలో ముఖ్యమైన వాటిని కౌన్సిల్ ముందు ఉంచుతారన్నారు. రాజకీయాలకు అతీతంగా... ఎన్జీఓలు, కాలనీ అసోసియేషన్లు, క్రీయాశీలంగా ఉన్న వారికి ఈ కమిటీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. 2015లో ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ కింద వచ్చిన 1.13 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తైందని, లోపాలు సరి చేసుకోవాలని దరఖాస్తుదారులకు తెలియజేశామన్నారు. బీఆర్ఎస్పై హైకోర్టులో స్టే తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, స్టే తొలిగిపోతే దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య -
ధరణి సర్వే మతలబేంటి?
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదని కాంగ్రెస్ ఎన్నికల కో ఆర్డినేషన్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.బీజీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు జరగడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వార్డు విభజనలో గతంలో జరిగిన విధానాన్ని అడిగితే ఇప్పటి వరకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తాము అడిగిన సమాచారం ఇవ్వాలని సవాల్ చేశారు. 2021 ఫిబ్రవరి వరకు జీహెచ్ఎంసీ కాలపరిమితి ఉన్నా.. ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యలో సమగ్రకుటుంబ సర్వే చేశారు.,, ఇప్పుడేమో ధరణి సర్వే అంటున్నారు. అసలు ఆ సర్వే మతలబేంటని ప్రశ్నించారు. ధరణి సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్కు భారీ ఓటమి తప్పదని శశిధర్ అన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించామన్న ఎస్ఈసీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. స్థానిక ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. -
ఎన్నికల వేళ.. కేటీఆర్ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ మూడు కమిషనరేట్ల కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సోమవారం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పది లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. (హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ) దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరం హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరగా ఒక రిపోర్ట్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగించి పరిస్థితులను ముఖ్యమంత్రి సంకల్పించాలని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు పట్టణీకరణ లో భాగంగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు తోడుగా నూతనంగా పట్టణీకరణ చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాట్లపైన పరిసర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో తో కలిసి పనిచేయాలని పురపాలక శాఖ పోలీసు శాఖకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వీటితోపాటు పార్కులు, చెరువులు, బస్తి దావఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమి కూడే ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఉండాల్సిన అవసరం ఉందని ఆ దిశగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. త్వరలో తీసుకురానున్న నూతన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చట్టాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నదా అని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. (నవంబర్ 11 తర్వాత ఏ క్షణమైనా...) దీంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్ లను పోలీస్ శాఖ తయారు చేసుకోవలసిన అవసరం ఉందని సూచించారు. కట్టుదిట్టంగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా పోలీసు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ సూచించిన విధంగా పది లక్షల సీసీ కెమెరాలను ఇన్ స్టాల్ చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళికలు కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలను గట్టిగా నిర్వహించే కలుగుతుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల ద్వారా నేరాల సంఖ్య పెద్దఎత్తున తగ్గిందని, నేరాలు జరిగిన వెంటనే నేరస్థులను అదుపులోకి తీసుకునేందుకు సీసీ కెమెరాల ఫీడ్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా హోం మంత్రి అన్నారు. హైదరాబాద్ నగర అవసరాల దృష్ట్యా జిహెచ్ఎంసి, పోలీస్ శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు నగర పరిధిలోని మూడు కమిషనరేట్ల కమిషనర్లు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
150 పోలింగ్ స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి వార్డ్‌లోని ఒక పోలింగ్ స్టేషన్లో పైలట్ ప్రతిపాదికన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని సుమారు 150 పోలింగ్ స్టేషన్లలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ సి.పార్థసారథి వెల్లడించారు. పోలింగ్ బూత్‌లకు వెళ్లలేని వయోవృద్ధులు, దివ్యాంగులు, పోలింగ్ సిబ్బంది తదితరుల కోసం ఈ –ఓటింగ్ విధానాన్ని కూడా పైలట్ ప్రాతిపదికన ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కమిషన్ కార్యాలయంలో మంగళవారం సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు టీ–పోల్ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక వినియోగంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఆధునిక సాంకేతికతతో ఓటరు స్లిప్‌లను ,పోలింగ్ స్టేషన్లను, నియోజకవర్గం వారీగా పోలింగ్ స్టేషన్ వివరాలను ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చన్నారు. టీ–పోల్ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చునని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, పోలింగ్ పర్సనల్ ర్యాండమైజేషన్, ఎన్నికల వ్యయం వివరాల మాడ్యూల్ తదితర అంశాలపై అధికారులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు జోన్లవారీగా టీ– పోల్,ఎస్ఈసీ మాడ్యూల్స్, సంబంధిత యాప్స్‌పై జరిగిన శిక్షణలో జీహెచ్ఎంసీ అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు భారీగా నిధులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత ఐదు ఏళ్లుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు ఏళ్లలో తమ పని తీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. చదవండి: (కవిత పోటీ.. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని గుర్తుచేశారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. చదవండి: (తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి) ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు ఆయన సూచించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. చదవండి: మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ -
మేము సైతం.. రెఢీ
సాక్షి, హైదరాబాద్: సంస్థాగత బలోపేతం, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ గ్రేటర్ నగరంలో పావులు కదిపింది. మహానగరాన్ని ఆరు జిల్లాలుగా విభజిస్తూ కొత్త కమిటీలు ఏర్పాటు చేసింది. ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా ఆరుగురు కొత్త అభ్యర్థులకు పార్టీ పగ్గాలు అప్పగిచింది. ఇందులో గోల్కొండ –గోషామహల్ జిల్లా అధ్యక్షునిగా పాండు యాదవ్, భాగ్యనగర్ –మలక్‌పేట అధ్యక్షునిగా సంరెడ్డి సురేందర్‌రెడ్డి, మహంకాళి–సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షునిగా శ్యాంసుందర్‌గౌడ్, బర్కత్‌పురా – అంబర్‌పేట జిల్లా అధ్యక్షునిగా డాక్టర్.ఎన్ గౌతంరావులను నియమించారు. వీరితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన కూకట్పల్లి నియోజకవర్గ నాయకుడు పన్నాల హరీష్‌రెడ్డిని మేడ్చల్ అర్బన్ అధ్యక్షునిగా, టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకుడు సామ రంగారెడ్డికి రంగారెడ్డి అర్బన్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. చదవండి: (అంతా బోగస్: భట్టి) రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ తరహా కమిటీలపై పార్టీ సీనియర్ నాయకులు కొందరు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర కమిటీలో తమ అనుయాయులకు స్థానం దక్కలేదని పలువురు బహిరంగ విమర్శలకే దిగారు. అయితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనే లక్ష్యంతో వేసిన ఈ కమిటీలు ముఖ్యనాయకులు, కార్యకర్తలు, పాత, కొత్త శ్రేణులను ఎలా సమన్వయం చేస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఏ మేరకు ఎదుర్కొంటాయో వేచి చూడాల్సి ఉంది. రంగారెడ్డి అర్బన్: సామ రంగారెడ్డి మేడ్చల్ అర్బన్: హరీష్‌రెడ్డి పన్నాల గోల్కొండ గోషామహల్: వి.పాండుయాదవ్ భాగ్యనర్ మలక్‌పేట: సంరెడ్డి సురేందర్‌రెడ్డి మహంకాళి – సికింద్రాబాద్: శ్యాంసుందర్ గౌడ్ బర్కత్‌పురా – అంబర్‌పేట: డాక్టర్ ఎన్.గౌతంరావు మేడ్చల్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సాక్షి, మేడ్చల్ జిల్లా: త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గ్రేటర్ శివారులోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పార్టీ రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. విస్తరణే లక్ష్యంగా పట్టణ ప్రాంతాలైన మల్కాజిగిరి ,ఉప్పల్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 8 మున్సిపల్ డివిజన్లు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు మున్సిపల్ డివిజన్లు కలుపుతూ మేడ్చల్ బీజేపీ అర్బన్ జిల్లా కమిటీని ఖరారు చేశారు. అధ్యక్షుడిగా పి.హరిష్రెడ్డిని పార్టీ అ«ధిష్టానం మంగళవారం ప్రకటించింది. అయితే..మేడ్చల్ అర్బన్, రూరల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న మాధవరం కాంతారావు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి ఆశించటంతోపాటు మోజారిటీ నాయకులు, కేడర్ కూడా మొగ్గు చూపినప్పటికిని, రాజకీయ సమీకరణలో భాగంగా చివరి నిమిషంలో హరీష్‌రెడ్డిని పదవి వరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హరీష్‌రెడ్డి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల తర్వాత బీజేపీలో చేరారు. ఇక జిల్లాలోని రూరల్ ప్రాంతమైన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 61 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీలను కలుపుతూ మేడ్చల్ రూరల్ జిల్లా కమిటీగా ప్రకటించిన పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా పి.విక్రంరెడ్డిని నియమించింది. ఇక్కడ కూడా రేసులో మరో ఇద్దరు భోగారం ఎంపీటీసీ సభ్యుడు సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి కందాడి సత్తిరెడ్డి ఉన్నప్పటికిని, కేడర్ అభిప్రాయాలకు అనుగుణంగా విక్రంరెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. విక్రంరెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పని చేశారు. -
ఈవీఎంలా.. బ్యాలెటా?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదు నెలల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోవిడ్ నేపథ్యంలో ఈవీఎంలను వినియోగించాలా? బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచి, పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయాలని భావిస్తున్నారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, కోవిడ్ నేపథ్యంలో దురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన వివిధ పనుల గురించి జోనల్ నుంచి సర్కిల్ స్థాయి అధికారులకు శిక్షణ నిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై ఎన్నికల విధుల్లోని వారు తగిన అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ సిబ్బ ంది ర్యాండమైజేషన్ తదితర అంశాలు తెలిసి ఉండాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు, పోలింగ్ ప్రక్రియ త్వరితంగా జరిగేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు సీజీజీ సహకారంతో ఫేస్ రికగ్నిషన్, తదితరమైనవి వినియోగించుకోవాలన్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంటెన్సివ్ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ఇందుకు ఎన్జీఓలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఇతర పౌరసేవల సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా ఎన్నికల సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఈవీఎంలా.. లేక బ్యాలెట్లా అన్నదానిపై చాలాసేపు చర్చించారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణకు సంబంధించి అక్టోబర్ రెండో వారంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అడిషనల్ సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టార్గెట్ జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా నిత్యం సమీక్షలు..అభివృద్ధిపనులపై ఆరాలు..అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశాలతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్బిజీబిజీగా ఉంటున్నారు. గ్రేటర్లో అన్ని రకాల పథకాలు పరుగులు పెట్టాలని ఆయన ఆదేశిస్తూ వస్తున్నారు. ఇంత హడావుడి ఎందుకంటే... మరికొద్ది నెలల్లో రానున్నజీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా కేటీఆర్ పనిచేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలసీఎం కేసీఆర్ గ్రేటర్లో మళ్లీ గెలుపు మాదే.. వంద సీట్లు ఖాయం అని ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఇక ముఖ్యమైన ఎస్సార్డీపీ పనులు, డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు బాగా అమలైతేనే ప్రజల ఆదరణ లభిస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకేపెండింగ్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. నగరంలో కొత్తకొత్తగా ఎన్నెన్నో పార్కులు. పంచతత్వ మొదలుకొని వివిధ థీమ్‌లు. జంక్షన్ల సుందరీకరణలు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి. వందల్లో బస్తీ దవాఖానాలు, వేల సంఖ్యలోపబ్లిక్ టాయ్లెట్లు.. ఏ జోన్లో ఎంతవరకొచ్చాయనే అంశాలపై నిత్యసమీక్షలు. కొద్దికాలంగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోనే సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. ఐదేళ్ల కిందటి బీఆర్ఎస్ ఫైళ్ల పరిష్కారంపై దృష్టి సారించారు. హైకోర్టు ఆదేశమే ఆలస్యం అన్నట్లుగా రెడీగా ఉండాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్కు మరో దఫా అవకాశం కల్పించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలను 90 శాతం మాఫీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించారు. డిసెంబర్‌లోగా 85 వేలు పంపిణీ చేస్తామంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు? వేరుగా చెప్పాల్సిందేముంది. బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంటే దాదాపుగా జనవరి– ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వీలుంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సంక్షేమ ఫలాలు ప్రజలకందాలి. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలి. ఈ లక్ష్యంతోనే ఈ ఏడాది ఆరంభం నుంచే వివిధ పనుల వేగం పెంచారు. కలిసివచ్చిన లాక్డౌన్ కాలంతో ఫ్లై ఓవర్ల వంటి భారీ పనులూ పూర్తిచేశారు. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకప్పగించారు. ఆయా మార్గాల్లో లింక్రోడ్లూ వేగంగా పూర్తిచేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల కోసమే అని అందరికీ తెలిసినప్పటికీ.. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం కండంటూ తాజాగా సూచించారు. బల్దియా ఎన్నికల్లో గతంలో మాదిరే దాదాపు వంద సీట్లకు తగ్గవని, అన్ని సర్వేలూ అవే చెప్పాయని పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తెలిపారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే రాజుకున్న బల్దియా ఎన్నికల వేడి పెరిగింది. మంత్రి కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్ పరిధిలోకి వచ్చే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీనేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. హామీలిచ్చి నెరవేర్చని పనులేమైనా ఉంటే చెప్పండి పరిష్కరిస్తానన్నారు. చేసిన పనుల్ని మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న బల్దియా ఎన్నికల్లో మరింత మెజార్టీ చూపాల్సిన బాధ్యత మీదేనన్నారు. తమ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. అంతేకాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, తదితర సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు నిత్యం వివిధ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. డివిజన్లస్థాయిలో పనుల గురించి తెలుసుకుంటున్నారు. మిగతా ప్రజాప్రతినిధులూ బీజీగానే ఉన్నారు. ప్రచారాస్త్రాలు దండిగానే.. ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు చేసిన పనులు చాలానే ఉన్నాయి. ఎస్సార్డీపీలో భాగంగా పూర్తయిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు ఉండనే ఉన్నాయి. అతి త్వరలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 కారిడార్ ప్రారంభం కానున్నాయి. ఎస్సార్డీపీలో భాగంగా ఇప్పట్లో పూర్తవ్వాల్సిన పనులంటూ లేవు. మరింత వేగం పెంచితే కైతలాపూర్, హైటెక్సిటీల్లోని ఆర్ఓబీ, ఆర్యూబీలకు అవకాశముంది. వాటినీ పూర్తిచేయాలని సూచిస్తున్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో చేసిన పనులన్నీ వచ్చే నాలుగునెలల్లో ప్రజల మదిలో నిలిచేలా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే మార్గనిర్దేశం చేశారు. ‘దుర్గం’ జిలుగుల్..18న ప్రారంభం ..? దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని గతనెల మూడోవారంలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ, దానికి ఏర్పాటు చేయనున్న స్పెషల్ లైటింగ్ పనులకు సంబంధించిన మెటీరియల్ చైనా నుంచి రావడంలో జరిగిన జాప్యంతో ప్రారంభం కాలేదు. ప్రస్తుత సమాచారం మేరకు బహుశా ఈనెల 18వ తేదీన దుర్గం చెరువును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసమే ఆపిన రోడ్‌నెంబర్ 45 కారిడార్‌నూ దాంతోపాటే ప్రారంభించనున్నారు. -
టీఆర్ఎస్ కుట్రలను ఛేదిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బోగస్ ఓట్లతో, అక్రమ డీలిమిటేషన్ ప్రక్రియతో గెలవాలని అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్ నాయకులు అప్రమతంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి గ్రేటర్ ఎన్నికల్లో విజ యం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నగరంలో బోగస్ ఓట్లను చేర్పించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని, ఒక్కో డివిజన్లో ఒక్కో రకంగా ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా నగర కాంగ్రెస్ నాయకులు పోరాటం చేయాలని కోరారు. 150 డివిజన్లలో కాంగ్రెస్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని, నాయకులు గడప గడపకూ తిరిగి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్ల డీలిమిటేషన్, ఓట్ల చేర్పులో కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేశారని, మళ్లీ డివిజన్ రిజర్వేషన్లు మారుస్తారా అన్నది పరిశీలించాలని సూచిం చారు. 150 డివిజన్లలో ముఖ్య నాయకులను, ప్రధానంగా యువకులను గుర్తించి గడపగడపకూ పాదయాత్ర చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు, 40 బ్లాక్ అధ్యక్షుల సమావేశం ఇందిరా భవన్లో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ సమన్వయకర్తగా జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. దుబ్బాక.. దరిచేరేదెలా..? దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిం ది. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో కీలక నేతలతో సమావేశమై దుబ్బాక ఉప ఎన్నికపై చర్చించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సిం హ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా టికెట్ ఆశిస్తున్న నలుగురు ఆశావహులతో సమావేశమై ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి మాట్లాడారు. ఉప ఎన్నికల బరిలో దూకుడుగానే వ్యవహరించాలని, ఈనెల 11న నియోజకవర్గ పరిధిలోని గ్రామస్థాయిలో నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ఆశావహుల తో మరోమారు మాట్లాడి ఉత్తమ్ ఈనెల 13న జా బితాతో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారిలో గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన శ్రావణ్ కుమార్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రావు ఉన్నారని తెలుస్తోంది. ఉత్తమ్ తుది జాబితాతో ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈనెల 17 లేదా 18న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.