Guntur District News
-
జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ శనివారం పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు లిఖిత పూర్వకంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. బ్లడ్‌బ్యాంక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్‌పై ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో సదరు సంఘటనపై విచారణ చేపట్టారు. రక్తనిధి కేంద్రంలో రాత్రివేళ ఇలా.. బ్లడ్‌బ్యాంక్‌లో రాత్రి సమయాల్లో అవసరం లేకపోయినా ఓ డాక్టర్ తిష్టవేసి తమతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుకు బ్లడ్‌బ్యాంక్‌లో చేతులు కోసుకున్న సంఘటన ఉదాహరణగా చెబుతున్నారు. రెండు నెలల క్రితం బ్లడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు ఓ డాక్టర్ తన వాడంటే, తన వాడంటూ చేతులు కోసుకున్న సంఘటన కలకలం రేకెత్తించింది. దీనిపై విచారించిన అధికారులు సదరు డాక్టర్‌పై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో అతని రాసలీలకు అడ్డు లేదని అంటున్నారు. ఇప్పుడు లైంగిక వేధింపుల సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్‌బ్యాంక్‌లో మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాల్సిన పనులన్నీ ఓ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బంది సదరు ఉద్యోగిపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయాలన్నా, తనకు నచ్చినట్లు ఉంటేనే మంజూరు చేస్తాడన్నారు. లేనిపక్షంలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్‌లో అసభ్యకర ప్రవర్తన ఫిర్యాదు చేసిన విద్యార్థినులు విచారణకు కమిటీ ఏర్పాటు బ్లడ్‌బ్యాంక్‌లో అసభ్యకర ప్రవర్తన చేస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్‌పై ఐదుగురు విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుపై తక్షణమే విచారణకు కమిటీని నియమించామన్నారు. సంఘటనపై బ్లడ్‌బ్యాంక్‌లో డాక్టర్‌ను కూడా పిలిపించి విచారిస్తున్నట్లు వెల్లడించారు. -
అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత లక్ష్మీపురం: శనివారం ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలిలు పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలను శుభ్రం చేశారు. పౌర సరఫరాల కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పాటిస్తామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయాలను, పరిసర ప్రాంగణాలను శుభ్రంగా ఉండేలా అధికారులు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏవో పూర్ణ చంద్రరావు, మత్స్య శాఖ డీడీ గాలిదేముడు, డీపీఓ సాయికుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఉప సంచాలకులు వందనం, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తితో ప్రార్థిస్తే పరమాత్మ అనుగ్రహం
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025తెనాలి: ప్రజలందరూ భగవత్ ధ్యానంలో తరిస్తూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) సూచించారు. ఆర్యవైశ్యుల దేవత శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) తొలిసారిగా శనివారం సాయంత్రం స్వస్థలమైన తెనాలికి వచ్చారు. శ్రీసాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురుపాదుక పూజకు హాజరయ్యారు. అక్కడ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. భక్తిశ్రద్ధలతో పరమాత్ముడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం పొందుతారని చెప్పారు. స్థితప్రజ్ఞతతో మనసులో అలజడులు లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ‘వైదిక ధర్మం’ చానల్‌తో ఆధ్యాత్మిక సేవ చేస్తున్నట్లు గుర్తుచేశారు. తొలుత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెనాలి వచ్చిన బాలస్వామికి పట్టణ సరిహద్దులోని భారీ వినాయక విగ్రహం వద్ద సాలిగ్రామ మఠం బాధ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. వినాయకుడికి పూజల అనంతరం పట్టణంలో శోభాయాత్రను నిర్వహించారు. మార్కెట్ మీదుగా గాంధీచౌక్, గ్రంథాలయం రోడ్డులోంచి గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం చేరుకున్నారు. అక్కడ పాదుక పూజలో పాల్గొన్నారు. సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) -
ప్రక్షాళన పేరుతో అసలుకే ఎసరు
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రక్షాళన పేరుతో ఈ విభాగంపై కన్నేశారు. విజిలెన్స్ ఎస్పీ మొదలు ఇతర ప్రధాన అధికారులను వెంటనే బదిలీ చేశారు. కూటమి ప్రభుత్వ అండదండలున్న కొందరు బదిలీపై వచ్చేశారు. పోలీస్ శాఖ నుంచి ఇద్దరు సీఐలు విధుల్లో చేరారు. మండల పరిషత్ నుంచి ఎంపీడీవో పోస్ట్ ఖాళీగా ఉంది. వాణిజ్య పన్నుల శాఖ నుంచి డీసీటీవో లేదా ఏసీటీవోలను నియమించలేదు. పోలీస్ శాఖ నుంచి గతంలో డీఎస్పీగా ఉన్న శ్రీనివాసరావు బదిలీ అయ్యాక ఇప్పటి వరకు పోస్టు ఖాళీగా ఉంది. ఎన్నికల తర్వాత ఎస్ఐ రామచంద్రరెడ్డిని ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు (హెచ్‌సీ), సుమారు ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కాలేదు. కీలకమైన తహసీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో ఆ విధులు నిర్వర్తించిన నాగమల్లేశ్వరరావు కృష్ణా జిల్లా అవనిగడ్డకు బదిలీ అయ్యారు. సూపరింటెండెంట్ పోస్ట్ కూడా నెలలుగా ఖాళీగా ఉంది. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ వడ్డే శంకర్ చేబ్రోలు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎటువంటి కాలుష్యం లేని ఆహారం, గాలి, మంచి నీటిని అందించగలుగుతామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ వడ్డే శంకర్ అన్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. వేజెండ్ల గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్ –1 లో జరిగిన కార్యక్రమంలో సోక్ పిట్ కొలతలు, నిర్మాణ పనివిధానాన్ని వడ్డే శంకర్ పరిశీలించి అవగాహన కల్పించారు. గ్రామంలో మంజూరైన 62 సోక్ పిట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి, మండల, గ్రామ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. చెత్తబుట్టలపై ఎంపీడీఓ ఎ. ఉమాదేవి అవగాహన కల్పించారు. ఈవోపీఆర్డీ టి.ఉషారాణి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాలరావు, ఓబుల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. వృద్ధురాలిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితులు అరెస్ట్ కాకుమాను: ఇటీవల పెదనందిపాడు శివారులోని పూరి గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పెదనందిపాడు పోలీసు స్టేషన్లో శనివారం సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన పెదనందిపాడు శివారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పూరి గుడిసెలో నివశిస్తున్న వృద్ధురాలు(64)పై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థులైన పాలపర్తి మంజు, పాలపర్తి సాంబ అనే ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి హత్య చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిందితుల కోసం పేరేచర్ల, అనకాపల్లి, హైదరాబాద్, విశాఖపట్నంలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం పెదనందిపాడు పరిసర ప్రాంతాల్లో నిందితులు ఉన్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు. పెదనందిపాడు ఎస్ఐ మధు పవన్, సిబ్బంది పాల్గొన్నారు. యువకుడిపై దాడి.. హత్యాయత్నం ● తీవ్రంగా కొట్టి, రైలు పట్టాలపై పడేసేందుకు తీసుకెళుతున్న నిందితులు ● అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని అడ్డుకున్న రాత్రి గస్తీ పోలీసులు తెనాలిరూరల్: యువకుడిపై దాడి చేయడమే కాకుండా రైలు పట్టాలపై పడేసి హతమార్చేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. యువకుడిని కారులో తీసుకెళుతుండగా వారి వాహనాన్ని పోలీసులు ఆపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి... పట్టణంలోని నందులపేటకు చెందిన యువకుడు మణి హైదరాబాద్‌లో వ్యభిచార గృహం నడిపేవాడు. అక్కడి పోలీసులకు విషయం తెలిసి దాడులు నిర్వహించగా తెనాలికి తిరిగి వచ్చేశాడు. హైదరాబాద్‌లో ఇతని వద్ద కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సతీష్ పని చేశాడు. కొన్ని నెలల జీతం బకాయి ఉంది. తరచూ మణికి ఫోన్ చేసి బకాయి గురించి అడుగుతుండడంతో సతీష్‌ను శుక్రవారం సాయంత్రం విజయవాడకు రమ్మని చెప్పాడు. తన ఇద్దరు స్నేహితులతో కలసి కారులో విజయవాడ వెళ్లిన మణి, సతీష్‌ను కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. అదే కారులో రాత్రికి తెనాలికి తీసుకువచ్చి ఇక్కడి సుల్తానాబాద్‌లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మరోసారి తీవ్రంగా దాడి చేశారు. రైలు పట్టాలపై పడేసి చంపేస్తామని చెప్పి అర్ధరాత్రి దాటాక కారులో తీసుకెళుతుండగా రాత్రి గస్తీ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని నిలిపి ప్రశ్నించడంతో విషయం తెలుసుకుని బాధితుడు సతీష్‌ను వైద్యశాలకు పంపి చికిత్స అందించారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
గుంటూరు రూరల్: అప్పులబాధతో పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వరగాని బాబూరావు(60) వ్యవసాయం చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటపని చేస్తుండేది. వీరికి ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉంది. ముగ్గురికి వివాహాలు జరిపించారు. బాబూరావు తనకున్న 40 సెంట్ల భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పంటలకు మద్దతు ధరలు లేక, పంటలు నష్టపోవటంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఈనెల 13వ తేదీన తన చిన్నకుమారుడు రాజుకు ఫోన్‌చేసి తాను వ్యవసాయం వలన నష్టపోయి అప్పులపాలయ్యానని, అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తమ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫోన్‌చేసి చెప్పాడు. బంధువులతో కలిసి పొలంవద్దకు వెళ్ళి చూడగా అప్పటికే పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు.. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లయ్య లింగంభవన్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మిర్చికి కనీసం క్వింటాకు రూ.25 వేలు మద్దతు ధర ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగానే సోమవారం మిర్చి యార్డుకు సందర్శిస్తామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, పచ్చల శివాజీ, ఆకీటి అరుణ్ కుమార్, షేక్ వలి, బందెల నాసర్ జీ, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ -
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణా నది దిగువ ప్రాంతంలోని గేట్ల వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానిక మత్స్యకారులు తాడేపల్లి పోలీసులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జె. శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అతడి వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎస్ఐ మాట్లాడుతూ సుమారు 27 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఖాకీ ఫ్యాంట్ షాట్, వైలెట్ కలర్ ఫుల్‌హ్యాండ్స్ టీషర్ట్, మాసిన గడ్డం ఉందని, బహుశా ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 086452721865కు ఫోన్ చేయాలని కోరారు. -
ఇకపై వారానికోసారి సివిల్ పోలీసులకు పరేడ్
తెనాలి రూరల్: పరేడ్‌తో క్రమశిక్షణ అలవడుతుందని, ఇప్పటివరకూ ఏఆర్ సిబ్బందికే ఉన్న ఈ పరేడ్ ఇకపై సివిల్ పోలీస్లకూ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ(ఏఆర్) హనుమంతు, ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది పరేడ్ నిర్వహిస్తూ ఎస్పీకి గౌరవ వందనం చేశారు. మార్చ్ ఫాస్ట్, వెపన్ డ్రిల్, పోలీస్ బ్యాండ్ ఆకట్టుకున్నాయి. ఆర్ఎస్ఐ సంపంగిరావు సెరిమోనియల్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు వి.మల్లికార్జునరావు, కె. రాములు నాయక్, ఎస్.రమేష్ బాబు, ఏఆర్ సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
వీఐటీ– ఏపీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
తాడికొండ: వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరాపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ ఆర్థిక శాస్త్ర సీనియర్ సలహాదారు డాక్టర్ ప్రవాకర్ సాహూ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని రూ.2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ప్రభుత్వ దార్శనిక విధానం, స్వర్ణాంధ్రకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్ 2047కు ఇది అనుగుణంగా ఉన్న విధానాలను వివరించారు. వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ అనేక అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలతో చేసుకున్న ఎంఓయూలు తమ వర్సిటీకే తలమానికమన్నారు. తమ వర్శిటీలోని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా విద్యార్థులలోని యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నిధులను కూడా అందజేస్తున్నామని వివరించారు. గౌరవ అతిథులు న్యూకాలజీ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేయా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాన్సిస్కో పోలూచి, ఎడిన్బర్గ్ బిజినెస్ స్కూల్ హెరియట్– వాట్ యూనివర్సిటీ యూకే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ స్వీనీలు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యాపార సామ్రాజ్యం మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, రీసెర్చ్ డీన్ డాక్టర్ రవీంద్ర ధూలి, అసోసియేట్ డీన్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఎ అస్రార్ అహ్మద్, డాక్టర్ సుహైల్ అహ్మద్,భట్, డాక్టర్ మొహమ్మద్, అబ్దుల్ ముఖీత్ మాజ్ పాల్గొన్నారు. -
సత్రశాలలో మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ బసవ శ్రీనివాసరావు సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని గుంటూరు దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అర్చకులు మల్లికార్జునశర్మ నీలం మల్లయ్య, మున్నా లింగయ్య తదితరులు ఉన్నారు. -
ముగిసిన గంగాదేవి తిరునాళ్ల
అచ్చంపేట: ఓర్వకల్లులో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వయంభు గంగాదేవి పేరంటాళమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.5,05,497 రాగా, అమ్మవారి దర్శన టిక్కెట్ల రూపంలో రూ.74,340 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.కోటేశ్వరరావు తెలిపారు. ఆలయం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నెమలికల్లుకు చెందిన తుమ్మా నరేంద్రరెడ్డి పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రుద్రవరం గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలకు గంగమ్మతల్లి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సత్తెనపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ వి.లీలావతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష అమర్తలూరు: మహాశివరాత్రి తిరునాళ్ల విజయవంతం చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 11 గంటలకు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. గుంటూరు డీవైఈవోగా ఏసురత్నం గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా నియమితులైన సీనియర్ ఎంఈవో జి. ఏసురత్నంకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో గుంటూరు డీవైఈవోగా పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)పై నియమితులైన జి. ఏసురత్నం డీఈవో రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఏ.తిరుమలేష్, ఎంఈవో అబ్దుల్ ఖుద్ధూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. చిరుమామిళ్లలో ఆలయాల వార్షికోత్సవం నాదెండ్ల: చిరుమామిళ్ళ గ్రామంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం వార్షికోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎస్టీ కాలనీలోని శివాలయం, నాదెండ్ల డొంకరోడ్డులోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను 2019లో గ్రామానికి చెందిన విద్యాదాత నడికట్టు రామిరెడ్డి తన సొంత నిధులతో నిర్మించారు. ప్రత్యేక పూజల్లో నడికట్టు రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు సిరిపురపు అప్పారావు, గ్రామస్తులు యన్నం శివారెడ్డి, మద్దూరి భాస్కరరెడ్డి, అప్పిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, మిట్టపాలెపు వెంకటేశ్వరరావు, భవనం శ్రీనివాసరెడ్డి, కమ్మ సీతయ్య, నర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి పాల్గొన్నారు. రూ.50 వేలు మించి నగదు ఉండరాదు లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉందని, తగిన ఆధారం లేకుండా రూ.50 వేలకు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదని సహాయ రిట ర్నింగ్ అధికారి, డీఆర్ఎం షేక్ ఖాజావలి శనివారం తెలిపారు. నిబంధనలు పాటించకుంటే నగదును జప్తు చేస్తామని పేర్కొన్నారు. -
పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
పెదకాకాని: చదువుతో పాటు క్రీడల్లోనూ శ్రీలక్ష్మి రాణిస్తూ మన్ననలు పొందుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడి శిక్షణతో ఫుట్‌బాల్‌లో రాణిస్తోంది. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఆమె క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్రం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం కూడా పంపింది. పెదకాకాని: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిబోయిన తాతారావు, శాంతి దంపతుల చిన్న కుమార్తె శ్రీలక్ష్మి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తాతారావు సాంఘిక నాటక రచయిత. శ్రీలక్ష్మి బాగా చదువుతోంది. బాలికలోని క్రీడా ప్రతిభను చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినయ్‌కుమార్ 8వ తరగతి నుంచే ఫుట్‌బాల్‌లో శిక్షణ ప్రారంభించారు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో సైతం సత్తా చాటుతోంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన శ్రీలక్ష్మి 13 నుంచి 17వ తేదీ వరకు ప్రోగ్రాంలో పాల్గొంది. క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఢిల్లీలో జరిగిన బాలల హక్కులు, బాల కార్మికులు, బాల్యవివాహాలకు సంబంధించిన సెమినార్‌కు ఎంపికై ంది. గుంటూరు జిల్లాలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన డిబేట్లో ప్రథమ స్థానం పొందింది. ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. జిల్లా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి డీఈఓ సీవీ రేణుక నుంచి సర్టిఫికెట్ అందుకుంది. ఐఏఎస్ కావడమే లక్ష్యం: శ్రీలక్ష్మి ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల రుణం తీరనిది. ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోను. బాగా చదివి కలెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు. జాతీయస్థాయి ఫుట్‌బాల్‌లో జిల్లా బాలిక ప్రతిభ చదువు, ఇతర పోటీల్లోనూ రాణిస్తున్న శ్రీలక్ష్మి జిల్లా ఉన్నతాధికారుల నుంచి పలు ప్రశంసాపత్రాలు -
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
క్వారీ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన జరిగే తిరునాళ్లకు బందోబస్తు, గుడి వద్ద ఏర్పాట్లు, ఫెన్సింగ్, ట్రాఫిక్, ప్రభలు నిలుపు ప్రదేశాలు తదితరాలను ఆయన పరిశీలించారు. దేవదాయ, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించే ప్రదేశం, చిన్న దుకాణాల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలని సూచించారు. గుంటూరు – తెనాలి ప్రధాన రహదారి వెంట ఆలయం ఉండటంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభల నిర్వాహకులకు నిర్ణీత స్థలం కేటాయించాలని, డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టాలని తెలిపారు. తర్వాత దీప స్తంభ నిర్మాణానికి ఎస్పీ భూమిపూజ చేశారు. నారకోడూరు ప్రధాన జంక్షన్ వద్ద, నారా కోడూరు – తెనాలి రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్దన్‌రావు, దేవదాయ శాఖాధికారి పోతుల రామకోటేశ్వరావు, పొన్నూరు రూరల్ సీఐ వై కోటేశ్వరరావు, ఎస్ఐ డీవీ కృష్ణ పాల్గొన్నారు. -
మా భూములు చూపించండి సారూ
సంతమాగులూరు (అద్దంకి): తమకు పూర్వార్జితంగా సంక్రమించిన భూమిని చూపాలని కోరుతూ గ్రామానికి చెందిన అర్వపల్లి కుటుంబీకులు శుక్రవారం సంతమాగులూరు మండల తహసీల్దార్ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. సంతమాగులూరు మండలంలో భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆక్రమణదారులు పెచ్చుమీరుతున్నారు. ఇతరుల భూమిని సైతం తప్పుడు రికార్డులు సృష్టించి తమ పేరుతో ఆన్లైన్ చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సర్వే నంబరు 171/1లో తమకు పూర్వార్జితంగా సక్రమించిన 3.50 ఎకరాల భూమి తమ పేరుతో లేకుండా పోయిందని సంతమాగులూరులోని అర్వపల్లి ఇంటిపేరు కలిగిలిన అర్వపల్లి రత్నారావు, వెంకటనారాయణ, పిచ్చయ్య, రామారావు, శ్రీనివాసరావు తదితరులు వాపోయారు. తమ రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమిని ఎవరు ఆక్రమించారో గుర్తించి ఆన్లైన్ చేయాలని.. తమకు ఆ భూమి ఎలా తమకు సక్రమించిందో చూపే పత్రాలను తహసీల్దార్‌కు అందజేశారు. తహీల్దారు విచారణలో ఈ సర్వే నంబరుకు సంబంధించి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆయా భూములు కలిగిన పట్టాదారుల రికార్డుల విచారణతో పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది. -
హార్బర్‌కు కూటమి గ్రహణం
రేపల్లె రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన నిజాంపట్నం హర్బర్ అభివృద్ధిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా హార్బర్ రెండో దశ నిర్మాణానికి రూ.451 కోట్లు కేటాయించింది. 2022లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ వచ్చాయి. 70 శాతం పనులు పూర్తయ్యాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇటీవల 10 రోజులుగా మొదలైనా అవీ నత్తనడకన సాగుతున్నాయి. హార్బర్లో 1980లో 60 బోట్లు నిలిపేలా 250 మీటర్లతో జెట్టీ రూపొందించారు. బోట్ల సంఖ్య పెరగడంతో నిలిపేందుకు జెట్టీ సామర్థ్యం సరిపోలేదు. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సముద్రంలోకి బోట్ల రాకపోకలకు ఏర్పాటు చేసిన మొగ సామర్థ్యం కుచించుకుపోవటం, ప్రస్తుత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బోట్లు జెట్టీ వద్దకు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తుల సమయంలో దీనివల్ల నష్టం భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గత వైస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. రూ.451 కోట్లతో రెండో దశ నిర్మాణ పనులు చేపట్టింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 500 మీటర్లతో జెట్టీ నిర్మాణం, ప్రస్తుత మొగ సామర్థ్యం పెంపు, ఇరువైపులా 1570 మీటర్ల బౌల్డర్స్ ఏర్పాటు వంటి ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొగకు ఇరువైపులా బౌల్డర్స్ పనులు పూర్తయ్యాయి. బోట్ల రాకపోకలకు ఆటంకం లేకుండా బ్రేక్‌వాటర్ సిస్టం నిర్వహిస్తున్నారు. ఆఫీసు బిల్డింగ్, రెస్ట్ రూమ్, ఐస్‌ప్లాంట్, ఓవర్ హెడ్ ట్యాంక్, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, పార్కింగ్ ప్లేస్, ఆక్షన్ హాల్, బోటు బిల్డింగ్ యార్డ్, నెట్ రిపేర్ షెడ్, బీఎల్సీ పార్కింగ్, సోలార్ ప్యానల్స్ వంటివి అధునాతన సౌకర్యాలతో నిర్మించాల్సి ఉంది. ప్రగతి పనులు పూర్తయితే 9 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వలసలకు అడ్డుకట్ట పడనుంది. ఇతర ప్రాంతాల బోట్లు నిజాంపట్నం హార్బర్ నుంచి ఎక్కువగా రాకపోకలు సాగించనున్నాయి. మత్స్యసంపద ఎగుమతులు, దిగుమతులు పెరిగే అవకాశం కలగనుంది. నిజాంపట్నంలో నత్తనడకన అభివృద్ధి పనులు రెండో దశపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు పూర్తయితే వేల మందికి ఉపాధి అవకాశాలు వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు కూటమి వచ్చాక నామమాత్రంగా పనుల్లో కదలిక కీలకమైన హార్బర్‌పై పాలకులతీవ్ర నిర్లక్ష్యం త్వరగా పూర్తి చేయాలి ఏళ్లుగా వేటపై ఆధారపడ్డాం. జెట్టీ సామర్థ్యం చాలక బోట్లు నిలపడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బోట్లు ప్రకృతి విపత్తుల సమయంలో ధ్వంసం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. –బి.వెంకటేశ్వరరావు, బోటు ఓనరు మత్స్యకారుల చిరకాల వాంఛ హార్బర్ అభివృద్ధి మత్స్యకారుల చిరకాల వాంఛ. పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించనుంది. నిజాంపట్నం ఉపాధి కేంద్రంగా మారుతుంది. కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. ఎక్కడా నాణ్యత లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలి. –కె.మాణిక్యారావు, మత్స్యకారుడు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. మొగ సామర్థ్యం పెంచాం. డ్రెజ్జింగ్, ఉత్తర, దక్షిణ వైపు బౌల్డర్స్, బ్రేకింగ్ వాటర్ సిస్టం పనులు పూర్తికావటంతో బోట్ల రాకపోకలు సాగుతున్నాయి. భవన నిర్మాణాలు, ఫిషింగ్ బోర్డు పనులు జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – నాగమహేష్, పనుల పర్యవేక్షణ అధికారి నిజాంపట్నం హార్బర్ రెండో దశ నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఎన్నికల నాటికి 70 శాతం పూర్తయిన హార్బర్ రెండో దశ పనులను ఇప్పటి ప్రభుత్వం విస్మరించింది. -
వివక్షపై న్యాయ విద్యార్థుల ఆవేదన
● ఏఎన్‌యూలో విభాగాధిపతి మార్పునకు డిమాండ్ ● లేదంటే తమకు టీసీలిచ్చి పంపించాలని వేడుకోలు ● ఆందోళనకు దిగిన విద్యార్థులతో రిజిస్ట్రార్ చర్చలు ● సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ పెదకాకాని: వివక్షతో న్యాయ శాస్త్రం విభాగాధిపతి, కొందరు ఆచార్యులు తమను మొదటి ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఎల్ఎల్ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం న్యాయ శాస్త్ర విభాగానికి వెళ్లి విద్యార్థులతో, ఆచార్యులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాజరు సరిపోలేదని కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులను విభాగాధిపతి పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకంటే తక్కువ రోజులు క్లాసులకు వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించారని, ఇదేంటని ప్రశ్నించారు. వివక్ష రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభాగాధిపతి, కొందరు ఆచార్యుల వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు టీసీలు సైతం తీసుకొని అర్ధాంతరంగా వెళ్లిపోయారని తెలిపారు. ఈ వైఖరి సరికాదని, దీనిపై విచారణ జరపాలని కోరారు. గత సంవత్సరం కూడా హాజరు సరిపోలేదని 11 మంది విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదని, వారిలో ఎక్కువ శాతం అణగారిన సామాజిక వర్గాల వారే ఉన్నారని గుర్తుచేశారు. దీనిని వర్సిటీ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విభాగంలో ఓ ఆచార్యుడు సుదీర్ఘకాలం సెలవు పెట్టి తరగతులకు రాకపోయినా హాజరైనట్లు చూపించారని, అతడే కొందరు విద్యార్థులకు హాజరు లేకపోయినా పరీక్షలు అనుమతించారని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు వివక్షతోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ కిషోర్ అనే ఆచార్యుడు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అని, ఎంతో ప్రతిభ కలిగిన ఆయన అర్ధాంతరంగా సెలవు పెట్టి వెళ్లిపోవటం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, దీని వెనక కొన్ని వర్గాల కుట్ర ఉందని ఆరోపించారు. అన్ని విషయాలు విన్న రిజిస్ట్రార్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు వివాదాలకు దిగవద్దని ఆదేశించారు. కొందరు అతిథి ఆచార్యులు మాట్లాడుతూ తమ విషయంలో కూడా విభాగాధిపతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమను అవమానకరంగా చూస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. తరగతులకు నిత్యం హాజరుగాని ఓ వర్గం విద్యార్థికి హాజరు వేసి ప్రథమ ఇంటర్నల్ పరీక్ష రాయించిన ఓ అతిథి ఆచార్యుడు వివాదాన్ని ముందుగానే ఊహించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. -
పార్ట్ టైం.. ఫుల్ చీటింగ్!
పట్నంబజారు ఇంటి వద్దే పని అని చెప్పడంతో చాలామంది వెంటనే లింకులు క్లిక్ చేసి బోల్తా పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలు, అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో విడతల వారీగా ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. లింకులపై క్లిక్ చేశాక ఫోనులోని ఫొటోలు సేకరించిన సైబర్ దుండగులు మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిల్‌కు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఒక మహిళకు కూడా ఓ దరఖాస్తు పంపిన దుండగులు అన్నిరకాలుగా ఫోన్లో అనుమతులు కోరారు. ఆమె ఇవ్వడంతోపాటు ఫొటోలను అప్లోడ్ చేశారు. రోజుల వ్యవధిలోనే బెదిరింపులకు దిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమె చెల్లించకపోవటంతో మార్ఫింగ్ ఫొటోలతో వేధించారు. విడతలవారీగా లాగేశారు.. పాత గుంటూరుకు చెందిన ఒక నిరుద్యోగి ‘పార్ట్ టైం ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం అని తొలుత రూ.3 వేలు అడగటంతో కట్టాడు. తర్వాత ఈ చలానా.. ఆ ఫీజు అని చెప్పి సుమారుగా రూ.80 వేల వరకు దుండగులు లాగేశారు. నెల రోజుల పాటు ఈ తంతు సాగింది. అప్రూవల్ వస్తుందని.. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అంటూ పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం మాత్రం రాలేదు. వారి సెల్‌ఫోన్ నెంబర్లు స్విచ్ఛాప్ అయ్యాయి. అప్పటికిగానీ మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ● బ్రాడీపేటకు చెందిన ఒక బీటెక్ విద్యార్థిని సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం వెతికారు. సైబర్ నేరగాళ్లు వల విసిరారు. వారికి ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించారు. రెండు నెలలపాటు రూ.10 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని రూ.50 వేలు కట్టించుకుని మోసగించారు. ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల లింక్‌లపై క్లిక్ చేస్తే అంతే సంగతులు వివిధ చార్జీల నెపంతో డబ్బు వసూలు బాధితుల్లో ఉన్నత విద్యావంతులే అధికం పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు నిండా ముంచుతున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఆశల వల విసిరి పెద్దమొత్తంలో కొల్లగొడుతున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో సైబర్ నేరం జరుగుతున్నా చాలామంది అవగాహన పెంచుకోవడం లేదు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌లపై క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అప్రమత్తత చాలా అవసరం. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జి ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – ఎస్. సతీష్‌కుమార్, ఎస్పీ, గుంటూరు -
‘అధికారిక’ వత్తాసు
● వార్డెన్లు సహకరించకుంటే బిల్లులు ప్రాసెస్ నిలుపుదల ● రెండు రోజుల క్రితం సమావేశంలో ఏఎస్డబ్ల్యూఓ హుకుం ● కొంత మంది వార్డెన్లు మామూళ్లు ఇవ్వబోమని అడ్డుతిరిగిన వైనం నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఉన్నతాధికారులు చెబితేనే డబ్బులు (ప్రోటోకాల్ ఖర్చులు) వసూలు చేస్తున్నామని.. ఎవరైనా సహకరించకపోతే బిల్లులు ప్రాసెస్ చేసేది లేదని గుంటూరు అర్బన్ ఏఎస్డబ్ల్యూఓ చెంచులక్ష్మి రెండు రోజుల కిత్రం జరిగిన హాస్టల్ వార్డెన్ల సమావేశంలో తెగేసి చెప్పారు. దీంతో కొంత మంది వార్డెన్లు ఇప్పటికే నెలవారీ మామూలు ఇస్తున్నామని.. మళ్లీ ప్రోటోకాల్ ఖర్చులు భరించలేమని తేల్చిచెప్పారు. దీంతో ఏఎస్డబ్ల్యూఓకి, వార్డెన్లకి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ప్రోటోకాల్ ఖర్చులు అందరూ ఇవ్వాల్సిందేనని.. లేకపోతే హాస్టల్‌ను తనిఖీ చేసేటప్పుడు ఏదైనా వ్యతిరేక రిపోర్టు రాస్తే అదే ఫైనల్ అవుతుందని.. అప్పుడు చిక్కుల్లో పడాల్సి వస్తుందని వార్డెన్లను ఏఎస్‌డబ్ల్యూఓలు బహిరంగంగానే బెదిరించారు. మీరు కూడా రాసివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో బిల్లులు ప్రాసెస్ చేయాలన్నా... ఏ పని చేయాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని ఈ నెల 7వ తేదీన ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చింది. ‘మామూలిస్తే ఎస్..సీ..’ అనే ఈ కథనంపై ఎస్సీ వెల్ఫేర్ అధికారులు స్పందించారు. దీనిపై ఎటువంటి మామూళ్లు వసూలు చేయడం లేదని తెనాలి డివిజన్ హాస్టల్ వార్డెన్లు రాసిచ్చారని.. మీరు కూడా రాసివ్వాలని గుంటూరు అర్బన్ ఏఎస్డబ్ల్యూఓలను రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆదేశించారని సమాచారం. దీనిపై కొంత మంది వార్డెన్లు తాము ఎందుకు రాసిస్తామని వాదించినట్లు తెలిసింది. స్టేట్ డైరెక్టర్‌కు ముడుపులు? ఇటీవల గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థినికి ప్రసవం అయిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా ఏఎస్డబ్ల్యూఓ రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిన వార్డెన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను సుమారు రూ.40 లక్షల వరకు ప్రాసెస్ చేసి, అందులోని రూ.7 లక్షలు స్టేట్ ఎస్సీ వెల్ఫేర్ డైరెక్టర్‌కు ఇచ్చినట్లు కార్యాలయంలో బహిరంగంగానే సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆ మొత్తం కూడా వార్డెన్ల నుంచి లాగేందుకు ఏఎస్డబ్ల్యూఓ బెదిరింపులకు దిగారు. ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో తీసుకుంటున్నట్లు వార్డెన్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సస్పెండ్ అయిన వార్డెన్ స్థానంలో ఇన్చార్జి వార్డెన్‌ను నియమించి.. గర్భవతి అయిన విద్యార్థినికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చూశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై గుంటూరు జిల్లా ఏఓ(ప్రస్తుతం సెలవులో ఉన్న ఆ శాఖ డీడీ మధుసూదన్‌రావు)ని ఎస్సీ వెల్ఫేర్ డైరెక్టర్ వివరణ అడిగారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీడీల జూమ్ మీటింగ్‌లో అడిగినట్లు తెలిసింది. నా దృష్టికి రాలేదు ఎస్సీ వెల్ఫేర్ డీడీ మధుసూదన్‌రావు సెలవులో ఉన్నారు. నేను సిబ్బంది జీతాల వ్యవహారాలు చూస్తుంటాను. మామూళ్లు వసూలు చేస్తున్నట్లు వచ్చిన కథనంపై వార్డెన్లను అడిగితే కొంత మంది అదేమి లేదని చెప్పారు. కింది స్థాయిలో జరిగే విషయాలు నాకు తెలియడం లేదు. – బి.మాణిక్యరావు, అకౌంట్స్ ఆఫీసర్ (ఇన్చార్జి డీడీ) -
రంగనాథరావుకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం కళారంగానికి చెందిన ప్రముఖులకు అందించే విశ్వనాథ సంస్కృతి పురస్కార వేడుకను శుక్రవారం గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించారు. 2025 సంవత్సరానికిగాను కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ బొమ్మలాట కళాకారులు, బొమ్మలాట కళకు పునరుజ్జీవనం కలిగించిన కీర్తిశేషులు ఎంఆర్ రంగనాథరావుకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, ప్రముఖ రంగస్థలం నటుడు దర్శకుడు రౌతు వాసుదేవరావుకు సూర్యకాంతం స్మారక రంగస్థలం పురస్కారం అందజేశారు. వారి తరఫున వారి కుమారుడు బొమ్మలాటలో వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎంఆర్ శ్రీనివాసరావుకు అందజేశారు. సభానంతరం ఎంఆర్ శ్రీనివాస్ నిర్వహణలో ఎనిమిది మంది కళాకారుల బృందం, శ్రీకృష్ణ తులాభారం బొమ్మలాటను ప్రదర్శించారు. ప్రదర్శన కన్నడ భాషలో సాగినప్పటికీ కథనం, సంగీతం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. విశ్వనాథ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్య అకాడమీ ద్వారా వివిధ భాషలకు చెందిన కళాకారులను సత్కరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, పి.సత్యనారాయణ రాజు, రావెల సాంబశివరావు, కళారత్న భూసురుపల్లి వెంకటేశ్వర్లు, మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు. -
దామోదరం సంజీవయ్యకు నివాళి
నగరంపాలెం: ఏపీకి అతి చిన్న వయసులో దామోదరం సంజీవయ్య సీఎం అయి చరిత్ర పుటల్లో నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. ఏపీకి తొలి దళిత సీఎంగా చేసిన దామోదరం సంజీవయ్య జయంతి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్నతనంలో తండ్రి మరణించినా సోదరుని సహకారంతో విద్యనభ్యసించారని అన్నారు. అనేక ఉద్యోగాలు నిర్వర్తించి, న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నేతగా ఎదిగిన ఆయన పిన్న వయసులో సీఎంగా చేశారని అన్నారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు విశేష కృషి చేశారని వివరించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎంటీ ఆర్ఐ శ్రీహరిరెడ్డి, పీఆర్ఓ తెనాలి విజయ్ పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి
చందోలు(కర్లపాలెం): పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆదేశించారు. చందోలు పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం డీఎస్పీ రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పరిష్కరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకునే విధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలో కోడి పందేలు, పేకాటలపై నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.స్వామి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు -
సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల ధర్నా
కొరిటెపాడు: ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) తరఫున బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ గుంటూరు మాడ్యూల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి తెలిపారు. సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లు, జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్బీఐ గుంటూరు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్లు బ్యాంకులోని అన్ని విభాగాలలో తగిన రిక్రూట్మెంట్, వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రీజినల్ సెక్రటరీ కె.ఆర్.వి.జయ కుమార్, యు.ఎఫ్.బి.యు. అడ్వైజర్ పి.కిషోర్, ప్రెసిడెంట్ ఇ.రవిచంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ మహమ్మద్ సయ్యద్‌బాషా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ సెక్రటరీ ఎం.రాంబాబు, బెఫీ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. 24 నుంచి బ్యాంకుల సమ్మెకు నేతల పిలుపు -
మహిళా రేషన్ డీలర్‌కు బెదిరింపులు
ఫిరంగిపురం: ఎన్నో ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్న మహిళను బెదిరించిన ఘటన మండలంలోని వేములూరిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన పి.కామేశ్వరి బీఏ బీఈడీ చేసింది. బీసీ కోటాలో ఎంతో కాలంగా రేషన్ దుకాణం నిర్వహిస్తోంది. కాగా నాలుగురోజుల కిందట గ్రామానికి చెందిన కొందరు వచ్చి రాజకీయ కారణాలతో రేషన్ డీలర్‌షిప్‌కు రాజీనామా చేయాలని హెచ్చరించారు. తరువాత రోజు గ్రామానికి చెందిన ఓ యువకుడు మధ్యాహ్నం రేషన్‌దుకాణం మూసి భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో రేషన్ దుకాణం వద్ద ఆటోలో తెచ్చిన పది బస్తాలు రేషన్ బియ్యం పడేసి వెళ్లినట్లు బాధితురాలు చెబుతోంది. కొద్దిసేపటికే సీఎస్‌డీటీ వచ్చి దుకాణం పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. సీఐకి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై సీఎస్‌డీటీని ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
వైభవంగా భావనాఋషి పెళ్లి కుమారుడి ఉత్సవం
మంగళగిరి: పాత మంగళగిరి భావనాఋషి స్వామి వారి పెళ్లి కుమారుడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఉత్సవాన్ని తిలకించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా డాక్టర్ తాడిపర్తి మురళి వెంకటేశ్వరరావు, విజయభారతి, డాక్టర్ తాడిపర్తి శ్రీనివాసమూర్తి దంపతులు పూజలు నిర్వహించారు. శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. పద్మశాలీయ బహుత్తమ సంఘ ప్రతినిధులు చింతికింది కనకయ్య, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్ర నాఽథ్, రామనాథం పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర లక్ష్మయ్య, జంజనం భిక్షారావు తదితరులు పాల్గొన్నారు.