HAL
-
హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీగా డాక్టర్ డీకే సునీల్
ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ డీకే సునీల్ నియమితులయ్యారు. ఆయన నియామకం సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వస్తుందని హెచ్ఏఎల్ పేర్కొంది.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 2022 సెప్టెంబర్ 29 నుండి డైరెక్టర్ (ఇంజనీరింగ్, ఆర్&డీ)గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్, ఎండీగా ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్ 30 వరకు లేదా రక్షణ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అది కొనసాగుతుంది.ఉస్మానియా పూర్వ విద్యార్థిడాక్టర్ సునీల్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. మద్రాస్ ఐఐటీ నుండి ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. 2019లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ సైన్స్‌లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ సునీల్ 1987లో సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. తర్వాత ఇప్పటి వరకు వివిధ పాత్రలలో పనిచేశారు. డిజైన్, ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో సేవలు అందించారు. సునీల్ నాయకత్వంలో హై పవర్ రాడార్ విద్యుత్ సరఫరా, వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్ సిస్టమ్, కంబైన్డ్ ఇంటరాగేటర్ ట్రాన్స్‌పాండర్ వంటి కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేశారు. ఇవి కంపెనీకి కొత్త వృద్ధి ప్రాంతాలుగా మారాయి. -
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
ఏరోస్పేస్లో స్టార్టప్‌లకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను అందుకునేదిశగా.. స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్‌తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్‌లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది. ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్ఆర్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్ఏఎల్తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్‌ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్‌లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్‌తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు. -
హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్ ట్రెయినీలు–80, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు–70. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ► వెబ్సైట్: hal-india.co.in ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌లు హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05. ► విభాగాలు:ఈసీఈ,సీఎస్ఈ,మెకానికల్,ఈఈఈ. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.01.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి. ► స్టైపెండ్: ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022 ► వెబ్సైట్: ecil.co.in హెచ్‌పీసీఎల్, విశాఖ రిఫైనరీలో 100 అప్రెంటిస్‌లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), విశాఖ రిఫైనరీ.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్(ఇంజనీరింగ్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 100 ► సబ్జెక్టులు/విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 07.01. 2022నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022 ► వెబ్సైట్: mhrdnats.gov.in -
చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ
ద్వితీయ శ్రేణి నగరాలు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తొలి చిన్న విమానం గాలిలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. హల్ ఆధ్వర్యంలో విమానయాన రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర రాజధానులే కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే నిర్ణయంతో ఉంది. అందులో భాగంగా తక్కువ రన్ వేలో టేకాఫ్, ల్యాండ్ అయ్యేలా సివిల్ డూ 228 (డార్నియర్ 228) విమానాలను హిందుస్తాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ రూపొందిస్తోంది. కాన్పూరులో ఈ విమానాలను తయారీ జరుగుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో పూర్తిగా కొండ ప్రాంతాలతో నిండి ఉండే అరుణాచల్ ప్రదేశ్‌లో తొలిసారిగా ఈ విమానాలను సివిల్ ఏవియేషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు హల్, సివిల్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఆర్మీ ఆధ్వర్యంలో ఈ విమానాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిర్ అంబులెన్సులుగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. పలు రకాలుగా హల్ తయారు చేస్తోన్న సివిల్ డూ 228 విమనాల్లో 19 మంది ప్రయాణించవచ్చు. మెయింటనెన్స్ ఖర్చు తక్కువ. ప్రయాణికుల రవాణాతో పాటు వీఐపీ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ అంబులెన్స్, ఫ్లైట్ ఇన్స్పెక్షన్, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, రిక్రియేషన్ యాక్టివిటీస్‌కి ఉపయోకరంగా ఉంటుంది. త్వరలో వరంగల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రామగుండం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీఎంఆర్ ఒప్పందాల నుంచి మినహాయింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది, ఈ విషయాల్లో క్లారిటీ వస్తే జిల్లా కేంద్రాల నుంచి రివ్వున ఎగిరేందుకు డూ 228 విమానాలు రెడీ అవుతున్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
దేశానికి డ్రోన్ల రక్ష; భారత్ సరికొత్త వ్యూహం!
ఇందుగలడు.. అందుగలడు అన్నట్లు యుద్ధ క్షేత్రంలోకి కూడా డ్రోన్లు చొచ్చుకొస్తున్నాయి. మానవరహిత డ్రోన్ల సాయంతో ప్రత్యర్థుల ప్రదేశాల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించడానికి అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. మిసైల్స్, బాంబులతో ప్రత్యర్థుల శిబిరాలపై విరుచుకుపడే డ్రోన్లను తమ అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇలా మానవరహితంగా గగనతలం నుంచి దాడులు చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 30 యుద్ధ డ్రోన్లను కొనడానికి సన్నద్ధమైంది. అమెరికా కంపెనీ జనరల్ ఎటోమిక్స్‌తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ 30 డ్రోన్లను పది పది చొప్పున ఆర్మీకి, నేవీకి, వాయుసేనకు ఇవ్వనుంది. యుద్ధ విమానాలపై శత్రువులు దాడి చేస్తే పైలట్ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఈ నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో యుద్ధ డ్రోన్ల వైపు భారత్ మొగ్గుచూపుతోంది. ఇప్పటి వరకూ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో పొరుగుదేశాల సైనికుల కదలికపై నిఘా కోసం మాత్రమే మన దేశం హెరాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వేటగాడు డ్రోన్ వేటగాడు (ప్రెడేటర్) డ్రోన్‌గా పిలిచే ఎంక్యూ9 రీపర్‌లోని సెన్సార్స్, రాడార్ల వ్యవస్థతో లక్ష్యాలను గుర్తించగలుగుతుంది. ఇది యుద్ధ క్షేత్రంలో 27 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే సామర్థ్యం కలిగిఉంది. 6 వేల నాటికల్ మైళ్ల వరకూ 1,700 కిలోల బరువైన మందుగుండును మోసుకెళ్లగలదు. 50 వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. శత్రుభయంకర మిసైళ్లు, లేజర్ నిర్దేశిత బాంబుల వర్షం కురిపించగలుగుతుంది. ఇరాక్, అప్ఘనిస్థాన్, సిరియా దేశాల్లో అమెరికా బలగాలు ఈ డ్రోన్లను వినియోగించాయి. చైనా, పాకిస్థాన్‌ల చొరబాట్ల నేపథ్యంలో కశ్మీర్, లడక్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఇలాంటి హై అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (హెచ్ఏఎల్ఈ) డ్రోన్ల అవసరం భారత మిలిటరీకి ఎంతో ఉంది. ముందున్న చైనా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)ల వినియోగం విషయంలో చైనా చాలా ముందుంది. దాయాది పాకిస్థాన్ కూడా డ్రాగన్ దేశం సహకారంతో ఇలాంటి డ్రోన్లను సమకూర్చుకోవడానికి చూస్తోంది. సాధారణ డ్రోన్ల తయారీకి చైనా ఎంత కృషి చేసిందో.. అలాగే దాడులు చేసే డ్రోన్ల తయారీకి కూడా అంతే కష్టపడింది. డ్రోన్ల టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి విషయంలో అన్ని దేశాల కంటే చైనా ముందుంది. ఇక భారత్ కొనుగోలు చేసే డ్రోన్లను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాలకు తగ్గట్టుగా మారుస్తారని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారంలో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ భారత పర్యటన సందర్భంగా ఆ డ్రోన్ల కొనుగోళ్ల సంబంధించిన చర్చలు జరగనున్నాయి. కాగా, 2007లో అమెరికాతో 18 బిలియన్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. దేశీయ తయారీకి మొగ్గు భవిష్యత్‌లో యుద్ధ క్షేత్రాల్లో కీలకమైన యూఏవీలను దేశీయంగా తయారు చేసే అవకాశాలను కూడా భారత్ పరిశీలిస్తోంది. యూఏవీల తయారీకి భారత్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఇటీవలే డ్రోన్ల తయారీకి తన బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. ఈ మానవరహిత డ్రోన్లను మానవసహిత జెట్ ఫైటర్లకు అనుసంధానించే పనిని హెచ్ఏఎల్ ఇప్పటికే ప్రారంభించింది. జెట్ ఫైటర్లు 150 కిలోమీటర్ల నుంచి డ్రోన్లను కంట్రోల్ చేయగలవు. ఒకేసారి నాలుగు దిశల్లో నాలుగు డ్రోన్లకు జెట్ ఫైటర్లు లక్ష్యనిర్దేశం చేయగలవు. స్వదేశీ ఫైటర్ జెట్స్ తేజస్, జాగ్వార్లతో డ్రోన్లను అనుసంధానించే అవకాశం ఉందని, ఇది వచ్చే మూడు నాలుగేళ్లలో కార్యరూపం దాల్చుతుందని భావిస్తున్నారు. -
ఎస్సెల్ ప్రొప్యాక్ జూమ్- హెచ్ఏఎల్ స్కిడ్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించిన నేపథ్యంలో నేలచూపులతో కదులుతున్న ఇంజినీరింగ్ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్సెల్ ప్రొప్యాక్ లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించాక మరింత జోరందుకున్న ఎస్పెల్ ప్రొప్యాక్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 306ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి తొలి రెండు గంటల ట్రేడింగ్‌లోనే 4 లక్షల షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్యూ1లో ఎస్సెల్ ప్రొ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను తాకింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వరుసగా నాలుగో రోజు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పతనమై రూ. 871 వరకూ నీరసించింది. గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 26 శాతం నష్టపోయింది. గత గురువారం(27న) కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ద్వారా 14.82 శాతం వాటాకు సమానమైన 49.56 మిలియన్ ఈక్విటీ షేర్లను విక్రయించిన విషయం విదితమే. ఇందుకు ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1001గా అమలు చేసింది. తద్వారా కంపెనీలో వాటాను 89.97 శాతం నుంచి 75.15 శాతానికి తగ్గించుకుంది. అయితే ఫ్లోర్ ప్రైస్ కంటే దిగువకు తాజాగా షేరు క్షీణించినప్పటికీ గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 60 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
గాడ్ఫ్రే ఫిలిప్స్ భళా- హెచ్ఏఎల్ బోర్లా
సానుకూల ప్రపంచ సంకేతాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలలో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన టొబాకొ ప్రొడక్టుల దిగ్గజం గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయానికి తాజాగా ఫ్లోర్ ధరను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ నష్టాలతో కళ తప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా దేశీయంగా మాల్బోరో బ్రాండ్ సిగరెట్ల తయారీ, విక్రయాలకు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోనున్నట్లు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న మార్కెట్లలో సొంత బ్రాండ్లను పెంచుకునేందుకు చూస్తున్నట్లు తెలియజేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 1092ను అధిగమించింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీలో 10 శాతం వాటాను ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అధిక స్పందన లభిస్తే అదనంగా 5 శాతం వాటాను సైతం అమ్మివేయనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 1,001కాగా.. ఇది బుధవారం ముగింపు ధర రూ. 1178తో పోలిస్తే 15 శాతం తక్కువ. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 89.97 శాతం వాటా ఉంది. వాటా విక్రయం ద్వారా రూ. 5020 కోట్లవరకూ సమీకరించనుంది. ఫ్లోర్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 5 డిస్కౌంట్ లభించనుంది. ఈ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 14 శాతం పడిపోయి రూ. 1014 వద్ద ట్రేడవుతోంది. -
దిగుమతులపై నిషేధం- డిఫెన్స్ షేర్ల హవా
ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది. తద్వారా 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధానికి తెరతీసింది. 2020 ముసాయిదా విధానం కింద వారాంతాన 101 ప్రొడక్టులతో కూడిన జాబితాను రూపొందించింది. ఆయుధాలు, విభిన్న పరికరాలు తదితర 101 ప్రొడక్టులపై రక్షణ శాఖ దశలవారీగా నిషేధాన్ని విధించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీటిలో చాల ప్రొడక్టులను దేశీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2020-2024 మధ్యకాలంలో దశలవారీగా పలు ప్రొడక్టుల దిగుమతులను నిషేధించే యోచనలో ప్రభుత్వమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీ కంపెనీలు సొంత డిజైన్, తయారీ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకునే వీలు చిక్కనున్నట్లు వివరించాయి. కాగా.. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల తయారీకి వీలుగా రానున్న 6-7ఏళ్లలో రూ. 4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అవకాశమున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంబంధిత కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ఏఎల్ దూకుడు రక్షణ రంగ పరికరాల దిగుమతులపై నిషేధ వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 1058ను తాకింది. డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ 5.2 శాతం పెరిగి రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో డైనమాటిక్ టెక్నాలజీస్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 596 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదేవిధంగా వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ 5 శాతం ఎగసి రూ. 55 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 108 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఫోర్జ్ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 423ను తాకగా.. మిశ్రధాతు నిగమ్(మిధానీ) 4 శాతం పెరిగి రూ. 213కు చేరింది. ఇక ఆస్ట్రా మైక్రోవేవ్ 5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద, భారత్ డైనమిక్స్ 5.2 శాతం పురోగమించి రూ. 441 వద్ద ట్రేడవుతున్నాయి. -
వాయుసేనలోకి ‘తేలికపాటి’ తేజస్
కోయంబత్తూరు: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన తొలి లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే–1ను బుధవారం స్క్వాడ్రన్ నం.18 ఫ్లయింగ్ బుల్లెట్స్‌లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు శివార్లలో సూలూరులో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించింది. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ ఆర్.మాధవన్ సంబంధిత పత్రాలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాకు అందజేశారు. తేజస్ ఎంకే–1 నాలుగోతరం సూపర్‌సానిక్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం. ప్రత్యేకతలు.. ► ఒక ఇంజిన్, డెల్టా వింగ్‌తో కూడిన నాలుగో తరం యుద్ధ విమానం. ► హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని డిజైన్ చేసింది. ► ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► బరువు 6,560 కిలోలు ► 15 కిలోమీటర్ల ఎత్తులోనూ పనిచేయగలదు. ► పొడవు 13.2 మీటర్లు... పరిధి ► 1,850 కిలోమీటర్లు తేజస్ చరిత్ర ► 1983: మిగ్–21 విమానాల స్థానంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తేలికపాటి యుద్ధ విమానాన్ని సిద్ధం చేసే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ► 1986: తేలికపాటి యుద్ధ విమానం లేదా ఎల్సీఏ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.575 కోట్లు కేటాయించింది. ► 2001: ఎల్సీఏ తొలి ప్రయోగాత్మక పరీక్ష ► 2003: ఎల్సీఏకు ‘తేజస్’ అని నామకరణం చేసిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ► 2016: భారతీయ వాయుసేనలోని 48వ స్క్వాడ్రన్‌లో తొలిసారి తేజస్ నియామకం. బహ్రెయిన్‌లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై తేజస్ ప్రదర్శన ► 2017: 68వ గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారి తేజస్ ప్రదర్శన ► 2018: వాయుసేన నిర్వహించిన గగన్ శక్తి కార్యక్రమంలో సత్తా చూపిన తేజస్ ► 2020: వాయుసేన 18వ స్క్వాడ్రన్‌లోకి తేజస్. -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్‌కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్‌తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్‌తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్‌కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
సమ్మె బాటన 20,000 మంది ఉద్యోగులు
బెంగళూర్ : వేతన పెంపుపై యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు చెందిన 20,000 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణపై యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదని, తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఏఎల్కు చెందిన తొమ్మిది కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ వెల్లడించారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా 15 రోజుల కిందటే తాము సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. మరోవైపు సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారని హెచ్ఏఎల్ పేర్కొంది. కాగా హెచ్ఏఎల్కు చెందిన బెంగళూర్, హైదరాబాద్, కోరాపుట్, లక్నో, నాసిక్‌లోని 5 ప్రొడక్షన్ కాంప్లెక్స్‌ల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా హెచ్ఏఎల్కు 4 పరిశోధన అభివృద్ధి కేంద్రాలున్నాయి. -
అంబానీ కోసమే...
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత స్వరం పెంచారు. సోమవారం పార్లమెంట్ వెలువల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగా రూ.లక్ష కోట్ల కాంట్రాక్టులో హెచ్ఏఎల్కు ఒక్క ఆర్డర్ కానీ, ఒక్క రూపాయి కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. ఆమె రక్షణ మంత్రిగా కాదు, మోదీకి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను బలహీన పరుస్తోందని ఆరోపించారు. ‘ఎంతో అనుభవం, ప్రతిభావంతులైన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఉన్న హెచ్ఏఎల్కు రూ.15,700 కోట్లను చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బకొట్టిన విషయంలో సమాధానం చెప్పేందుకు చౌకీదార్ (ప్రధాని మోదీ) సభలో ఉండరు. సభకు రావడానికి ఆయన భయపడుతున్నారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. -
రక్షణ మంత్రి రాజీనామాకు రాహుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై పార్లమెంట్లో అసత్యాలు పలికిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై ప్రధానిని సమర్ధించేందుకు పార్లమెంట్లో ఆమె అసత్యాలు చెప్పారని అందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు రూ లక్ష కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు రేపు (సోమవారం) పార్లమెంట్లో డాక్యుమెంట్లు చూపాలని లేదా రాజీనామా చేయాలని రక్షణ మంత్రిని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ లక్ష కోట్ల ఆర్డర్ల కోసం హెచ్ఏఎల్ వేచిచూస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథన ఆధారంగా రాహుల్ గాంధీ రక్షణ మంత్రిని ప్రశ్నించారు. తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని, రూపాయి కూడా కంపెనీకి విడుదల కాలేదని హెచ్యూఏల్కు చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారని ఆ కథనం తెలిపింది. రాహుల్ క్షమాపణ కోరిన నిర్మలా సీతారామన్ హెచ్ఏఎల్కు ప్రభుత్వ ఆర్డర్లపై లోక్‌సభలో తాను చేసిన ప్రకటనకు సంబంధించి రాహుల్ గాంధీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. హెచ్ఏఎల్కు ఆర్డర్లపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పూర్తిగా చదవాలని రాహుల్‌కు చురకలు అంటించారు. హెచ్ఏఎల్కు రూ లక్ష కోట్ల ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని మాత్రమే తాను చెప్పినట్టు అందులో స్పష్టంగా ఉందన్నారు. ఆర్డర్లు జారీపై సంతకాలు చేశామని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. 2014 నుంచి 2018 వరకూ హెచ్ఏఎల్కు ప్రభుత్వం రూ 26,570 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగిస్తూ సంతకాలు జరిగాయని, మరో రూ 73,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించడంపై సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించినందుకు రాహుల్ పార్లమెంట్లో క్షమాపణ చెబుతారా అని నిర్మలా సీతారామన్ నిలదీశారు. -
జీతాల కోసం వెయ్యికోట్ల రూపాయల అప్పు
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కోంటోంది. దీర్ఘకాలంనుంచి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నసంస్థ తాజాగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం, తదితర అవసరాల కోసం వెయ్యకోట్లు రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. 20వేలకు పైగా ఉన్న ఉద్యోగులకు మూడు నెలల జీతాల చెల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు మూడు దశాబ్దాల కాలంగా ధనవంతులుగా ఉన్న హెచ్ఏఎల్ సంస్థ మొదటిసారిగా నగుదు కోసం అప్పు (ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా) చేసామని హెచ్ఏఎల్ ఛైర్మన్ ఆర్ మాధవన్ వ్యాఖ్యాలని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. పుష్కలమైన ఆర్థిక నిల్వలతో ఉన్న సంస్థ తాజాగా లోటు బడ్జెట్లోకి జారుకుందని మాధవన్ పేర్కొన్నారు. మార్చినాటికి ఈ నగదు ప్రతికూలత భరించలేనంత స్థాయిలో రూ. 6వేల కోట్లకు చేరుకోనుందన్నారు. ప్రధానంగా హెచ్ఏఎల్కు అతిపెద్ద కస్టమర్‌గా ఉన్న భారత వైమానిక దళం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయిన కారణంగా ఆర్థిక ఒత్తిడికి దారితీసినట్టు ఛైర్మన్ తెలిపారు. 2017 సెప్టెంబర్ నాటికి రూ. 14,500కోట్లుగా బకాయిల్లో కేవల రూ. 2వేల కోట్లను మాత్రమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చెల్లించింది. 2017-18 సంవత్సరానికి రక్షణ మంత్రిత్వశాఖ 13,500 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. 2017-18 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయితో కలిపి సవరించిన బడ్జెట్ 33, 715 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు డిసెంబరు 31 నాటికి 15,700 కోట్లు తాకిన బకాయిలు మార్చి 31 నాటికి 20,000 కోట్ల రూపాయలకు చేరవచ్చన్నారు. రూ.14,500 కోట్లు ఐఏఎఫ్ చెల్లించాల్సి ఉండగా, మిగిలిన బకాయిలు భారతీయ సైన్యం, నావికాదళం, కోస్ట్ గార్డ్స్ నుంచి రావాల్సి ఉంది. ఈ పరిణామం సంస్థపై ఆధారపడిన దాదాపు 2వేల మంది సూక్ష్మ, చిన్నమధ్య తరహా వ్యాపారస్తులను ప్రభావితం చేయనుందని మాధవన్ ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరత అప్పులవైపు నెడుతోంది, లేదంటే బకాయిలు చెల్లించమని ఎంఎస్‌ఎఈలను బలవంతం చేయాలి. ఇది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. కాగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,035. వీరికి చెల్లించే నెలవారీ జీతాల మొత్తం రూ.358 కోట్లు. -
అస్త్ర క్షిపణి ప్రయోగం సక్సెస్
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల ‘అస్త్ర’ క్షిపణిని శాస్త్రవేత్తలు బుధవారం విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్–30యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించగా నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ క్షిపణి రూపకల్పనలో పాల్గొన్నాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్–30 విమానాన్ని హాల్ ఆధునీకరించింది. 154 కిలోల బరువు, 3.57 మీటర్ల పొడవున్న అస్త్ర క్షిపణి 20 కి.మీ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 15 కేజీల వార్‌హెడ్‌ను మోసుకుని 4.5 మ్యాక్(గంటకు 5556.6 కి.మీ) వేగంతో వెళ్తుంది. -
అంబానీ జేబులోకి పేదల సొమ్ము
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదల డబ్బు దోచుకుని పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ధారపోస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘దేశానికి కాపలా దారుగా (చౌకీదార్) ఉన్న వ్యక్తి పేద ప్రజలు, అమరవీరులు, జవాన్ల జేబుల్లో నుంచి రూ. 20 వేల కోట్లు తీసుకుని.. వాటిని అంబానీ జేబులో పెట్టారు. ప్రధాని అవ్వగానే ‘చౌకీదార్‌జీ’ నేరుగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశాధ్య క్షుడితో ఒప్పందం చేసుకున్నారు. హెచ్ఏఎల్ను కాదని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వమని కోరారు’ అని ఆరోపించారు. అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం విలువను ఎందుకు బయటపెట్టడం లేదని, అంబానీకి కాంట్రాక్టు ఎలా దక్కిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రలో పాకిస్తాన్ పాత్ర: బీజేపీ రాఫెల్ ఒప్పందం రద్దుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలండ్ అందులో భాగమని బీజేపీ ఆరోపించింది. బావ రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి సాయం చేసేందుకు ఒప్పందం రద్దును రాహుల్ కోరుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. వాద్రాకు సంబంధమున్న కంపెనీని రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తిగా తీసుకోకపోవడంతో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుందన్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్ పాత్ర ఉందని కూడా షెకావత్ చెప్పారు. తదుపరి భారత ప్రధాని రాహుల్ అంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ట్వీట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. తనపై ఆరోపణల్ని వాద్రా తోసిపుచ్చారు. నిజాలు నిగ్గుతేల్చండి: రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సీవీసీ కేవీ చౌదరీకి పూర్తి వివరాలతో మెమొరాండం సమర్పించింది. ఖజానాకు ప్రభుత్వం నష్టం చేకూర్చిందని, కొందరు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ బృందం అందులో ఆరోపించింది. ‘రాఫెల్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణం. రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ అవినీతి జాడలు బయటపడుతున్నా.. రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాఫెల్ ఒప్పందంలోని అవినీతి, ఆశ్రిత పక్షపాత దుర్గంధం రోత పుట్టిస్తోంది. ఇందులో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి’ అని కాంగ్రెస్ కోరింది. -
గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్
బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
చైనీస్ జెట్ ఫైటర్లకు చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : సుఖోయ్ 30ఎమ్‌కేఐను ఈశాన్య భారత్‌లో కేంద్రీకరించడం ద్వారా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎత్తుగడలను నిలువరించవచ్చని భారత రక్షణ పరిశోధన విభాగం తెలిపింది. ఇందుకోసం భారత వాయుసేన సుఖోయ్ సూ- 30ఎమ్కేఐ రాడార్‌ను వినియోగించనుంది. తద్వారా చైనాకు చెందిన చెంగ్డూ జే- 20 ఫైటర్ల కదలికలను గమనించడం ద్వారా ప్రమాదాలను ముందే అరికట్టవచ్చని భావిస్తోంది. రష్యా సాంకేతిక సాయంతో సుఖోయ్ 30ఎమ్‌కేఐను నవీనీకరించడం ద్వారా ఒకేసారి 30 లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా సుఖోయ్ సూ- 30ఎమ్‌కేఐను తీర్చిదిద్దనుంది. భారత వాయుసేనాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా మాట్లాడుతూ.. సుఖోయ్ సూ- 30ఎమ్కేఐ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని పేర్కొన్నారు. తద్వారా జే 20 ఫైటర్ల కదలికలను గమనించవచ్చని తెలిపారు. ఎమ్కేఐని నవీనీకరించడం ద్వారా భారత వాయు వ్యవస్థ మరింత బలోపేతం అయిందని తెలిపారు. గతంలో చైనాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు అత్యధిక ఎత్తులో ప్రయాణించడం వల్ల లక్ష్యాలను ఛేదించడం కష్టతరమయ్యేదని.. కానీ ప్రస్తుతం ఆ సమస్యని అధిగమించామని వ్యాఖ్యానించారు. గగన్ శక్తి 2018 ఎవరికీ వ్యతిరేకం కాదు.. 13 రోజుల పాటు నిర్వహించిన గగన్ శక్తి- 2018 ప్రత్యేకంగా ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదని ధనోవా స్పష్టం చేశారు. ఈ ఏడాది అనుకున్న దాని కన్నా ఎక్కువ లక్ష్యాలను సాధించామని ఆయన తెలిపారు. గగన్ శక్తి వార్‌గేమ్‌లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెట్ స్వదేశీ పరిఙ్ఞానంతో కొత్తగా రూపొందించిన తేజస్ సూపర్సోనిక్ ఫైటర్ జెట్‌ను కూడా పరీక్షించినట్లు తెలిపారు. -
తేజస్ కీలక పరీక్ష విజయవంతం
బెంగళూరు: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్సీఏ) ‘తేజస్’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తేజస్ ఎల్ఎస్పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్ మొట్టమొదటిదని హాల్ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది. -
‘రాఫెల్’ అవినీతిపై మోదీ బదులేది?
సాక్షి, బళ్లారి: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విమర్శలను తీవ్రం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణమనీ, ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను రాఫెల్ కాంట్రాక్టు నుంచి తప్పించి తన సన్నిహితుడికి ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటలో జరిగిన ఎన్నికల ‘జనాశీర్వాద్ యాత్ర’లో రాహుల్ మాట్లాడారు. ‘రాఫెల్’ వ్యవహారంపై తాను సంధించిన 3 ప్రశ్నలకు మోదీ జవాబివ్వలేకపోయారన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనిస్తూ నడిపే వాహనదారు మాదిరిగా.. ప్రధాని మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెనుక వాటిని చూస్తూ వాహనాన్ని ముందుకు నడిపితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. కాగా, బళ్లారి, కొప్పాల్, రాయిచూర్, కలబురిగి, బీదర్ జిల్లాల్లో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారంలో రాహుల్ బస్సులో ప్రయాణిస్తూ సభలు, ర్యాలీల ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు. కాగా, యూపీఏ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమే కుదరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.