Insurance Coverage
-
రూ.7.83లక్షల కోట్లకు చేరిన జీవిత బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీవిత, సాధారణ బీమా సంస్థలు మెరుగైన వృద్ధిని చూపించాయి. జీవిత బీమా ప్రీమియం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి రూ.7.83 లక్షల కోట్లకు చేరుకుంది. సాధారణ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం సైతం 16.4 శాతం వృద్ధితో రూ.2.57 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి (ఐఆర్డీఏఐ) సంస్థ విడుదల చేసింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 16.34 శాతం పెరగ్గా, ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) ఆదాయం 10.90 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రీమియంలో రెన్యువల్ (పాత పాలసీల పునరుద్ధరణ) ప్రీమియం 52.56 శాతం వాటాను ఆక్రమించింది. మిగిలిన 47.44 శాతం ప్రీమియం నూతన పాలసీల రూపంలో సమకూరింది. రెన్యువల్ ప్రీమియం 8.88 శాతమే పెరగ్గా.. నూతన పాలసీ ప్రీమియం ఆదాయం 17.90 శాతం వృద్ధి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 285 లక్షల పాలసీలు 2022–23లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 284.70 లక్షల నూతన పాలసీలను జారీ చేశాయి. ఇందులో ప్రభుత్వరంగ బీమా సంస్థలు జారీ చేసినవి 204.29 లక్షలుగా (71.75 శాతం) ఉన్నాయి. ప్రైవేటు జీవిత బీమా సంస్థలు 80.42 లక్షల పాలసీలను (28.25 శాతం) జారీ చేశాయి. జీవిత బీమా సంస్థల పన్ను అనంతరం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.42,788 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7,751 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల లాభం 800 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా సంస్థల లాభం 72.36 శాతం వృద్ధిని చూసింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా) రంగం మొత్తం రూ.257 లక్షల కోట్ల స్థూల ప్రీమియాన్ని అండర్ రైటింగ్ చేసింది. 27 ప్రైవేటు రంగ బీమా సంస్థలు (స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు సహా) రూ.1.58 లక్షల కోట్ల ప్రీమియాన్ని అండర్రైట్ చేశాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 38.42 శాతం వాటా కలిగి ఉంటే, ప్రైవేటు సాధారణ బీమా సంస్థల వాటా 61.58 శాతంగా ఉంది. మొత్తం వ్యయాల్లో కమీషన్ (మధ్యవర్తులకు), నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. నాన్ లైఫ్ బీమా సంస్థల అండర్‌రైటింగ్ నష్టాలు రూ.32,797 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,810 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా నష్టాలు 3 శాతం పెరిగాయి. స్విస్ ఆర్ఈ సిగ్నా నివేదిక ప్రకారం మన దేశంలో జీవిత బీమా విస్తరణ 2022–23లో 3 శాతానికి తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 3.2 శాతంగా ఉంది. -
మరింత మంది రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది. పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు. స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి. ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్‌లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు. ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్‌లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు. 2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్‌బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్‌కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
విపత్తుల నుంచి రక్షణ ఉందా ?
ఏటా వానాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే నష్టం భారీగా ఉంటోంది. ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు వర్షం పడితే పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటి మధ్య చిక్కుకుపోవడం గురించి వింటూనే ఉన్నాం. వాహనాలు నీట మునగడం, ఇంటికి నష్టం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. చెరువులు తెగి, నదులు పొంగడం వల్ల గ్రామాల్లోనూ పంటలకు, ఇతరత్రా ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే పరిణామం. ఈ విషయంలో మనం పెద్దగా చేయగలిగేదేమీ ఉండదు. కాకపోతే ఒక్క చర్యతో విపత్తుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాల తాలూకు నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చు. తగినంత బీమా కవరేజీ కలి్పంచుకోవడమే ఇందుకు ఉన్న ఏకైక మార్గం. సమగ్రమైన కవరేజీతో, అన్ని నష్టాలకూ రక్షణ కల్పించే విధంగా బీమా కవరేజీ ఉండాలి. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది. కార్లకు బీమా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసే వాహన బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సమగ్రమైన కవరేజీతోపాటు, స్టాండర్డ్ పాలసీల్లో నచి్చంది తీసుకోవచ్చు. కాకపోతే కారుకు కాంప్రహెన్సివ్ బీమా పాలసీ తీసుకున్నామని చెప్పి నిశి్చంతంగా ఉండడానికి లేదు. వరద నీరు కారణంగా ఇంజన్‌కు నష్టం ఏర్పడితే ఈ పాలసీల్లో పరిహారం రాదు. టైర్లు పేలిపోవడం, వరదనీరు కారణంగా వాహనం నిలిచిపోయినా పరిహారం రాదు. ‘‘వరద నీటి వల్ల ఇంజన్ ఆన్ అవ్వకపోతే అందుకు కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో కవరేజీ రాదు. అంతేకాదు విడిభాగాలు మార్చాల్సి వచి్చనా లేదా విడిభాగాలకు మరమ్మతులు చేయాల్సి వచి్చనా కానీ, తరుగుదలకు చెల్లింపులు చేయవు. అందుకని వాహనదారు తప్పనిసరిగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, స్పాట్ అసిస్టెన్స్, డిప్రీసియేషన్ కవర్ తప్పకుండా తీసుకోవాలి’’అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ సూచించారు. సాధారణంగా ఈ కవరేజీలు యాడాన్ లేదా రైడర్ రూపంలో అందుబాటులో ఉంటాయని, వాహన బీమాతోపాటు వీటిని కూడా తీసుకోవాలన్నారు. వ్యాధుల నుంచి రక్షణ వర్షా కాలంలో దోమల వల్ల, నీరు కలుషితం కావడం వల్ల, వైరస్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరం, డయేరియా, చికున్ గునియా ముప్పు వర్షాకాలంలో ఎక్కువ. వీటి కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. వేలు, లక్షల బిల్లు చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకుని వెక్టార్ బోర్న్ డిసీజ్ ఇన్సూరెన్స్‌ను ప్రతీ కుటుంబం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఈ కవరేజీ కింద దోమలు, ఇతర కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వచ్చే వ్యాధులకు సైతం కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా రిస్క్ ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోత వీటిల్లో ప్రాణ ప్రమాదం ఏర్పడొచ్చు. మనదేశంలో డెంగీ, మలేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా లక్షలాది మంది వీటి బారిన పడుతున్నారు. ‘‘కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లేని వారు, తప్పకుండా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్ కవరేజీని తమకు, తమ కుటుంబ సభ్యులకు తీసుకోవాలి. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యం చికిత్సలకు పరిహారాన్ని ఇవి చెల్లిస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యానికి చికిత్స పొందేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే రిస్క్ ఉంటుంది. డెంగీ బారిన పడితే కోలుకునేందుకు 8–10 రోజులు పట్టొచ్చు. చికిత్సా ఖర్చు రూ. లక్షల్లో ఉంటుంది. మెట్రోల్లో రూమ్ రెంట్ రూ. లక్ష ఉంటుందని, ఒక్కసారి ప్లేట్లెట్లు ఎక్కించేందుకు రూ.40,000 తీసుకుంటున్నారని పాలసీబజార్ అంచనా. డెంగీ కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే ఒకరికి ఒకటికి మించిన సార్లు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి రావచ్చు. బీమా పరిశ్రమ ప్రత్యేకంగా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్, వెక్టార్ బోర్న్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. డెంగీ జ్వరం, మలేరియా, ఫైలేరియా, కాలా అజార్, చికెన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్‌లకు వీటిల్లో కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు జీవిత కాలంలో ఒక్కసారే క్లెయిమ్ చేసుకోగలరు. ‘‘మీ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీటికి కవరేజీ లేకపోతే.. ఒక్కో వ్యాధికి విడిగా కవరేజీ తీసుకోవచ్చు. డెంగీ, మలేరియా ఈ రెండూ మన దేశంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు. కనుక వీటికి కవరేజీ కలిగి ఉండడం ఎంతో అవసరం’’అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చాబ్రా సూచించారు. ఇంటికి బీమా వర్షాలు, వరదలకు ఇంటికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వడగండ్లు, పిడుగులతో కూడిన వర్షాలకు ఇంటి నిర్మాణం దెబ్బతినొచ్చు. కుండపోతకు ఇంటి పైకప్పుకు నష్టం కలగొచ్చు. అలాగే, ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర వస్తువులు, ఫరి్నచర్ దెబ్బతినడం వల్ల ఆరి్థక నష్టం ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితుల్లో హోమ్ ఇన్సూరెన్స్ ఎంతో ఆదుకుంటుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో హోమ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. హౌస్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేకపోవడం, తప్పుడు అభిప్రాయాల కారణంగా మన దేశంలో దీని విస్తరణ చాలా నిదానంగా ఉందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ నాన్‌మోటార్ నేషనల్ హెడ్ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. అయితే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ‘‘ప్రకృతి విపత్తుల (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా వాటిల్లే నష్టానికి కవరేజీనే ఈ బీమా పాలసీలు ఆఫర్ చేస్తాయి. అలాగే, ఊహించని ఇతర ఉత్పాతాల వల్ల నష్టానికి కూడా రక్షణనిస్తాయి. ఏడాదికి మించిన కవరేజీని ఒకేసారి తీసుకోవడం వల్ల ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ హోమ్ కవర్ తీసుకోవాలి. దోపిడీ, దొంగతనం, వ్యక్తిగత ప్రమాద కవరేజీ, ఇల్ల దెబ్బతినడం వల్ల నష్టపోయే అద్దె ఆదాయాన్ని భర్తీ చేసే కవరేజీలు ఉండాలి. ఇంట్లోని ఖరీదైన పెయింటింగ్‌లు, ఆభరణాలకూ బీమా రక్షణ కలి్పంచుకోవాలి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కూడా తీసుకోవాలి’’ అని గురుదీప్ సింగ్ సూచించారు. ఇంటి నవీకరణ, పునరి్నర్మాణ సమయంలో ఏవైనా మార్పులు చేసినట్టయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కచి్చతమైన విలువను పేర్కొనాలని సింగ్ పేర్కొన్నారు. ‘‘మీ ఇల్లు దీర్ఘకాలం పాటు ఖాళీగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఎంతో అవసరం. సరైన చిరునామా, ప్రాపర్టీ విలువ సరిగ్గా పేర్కొనడం వల్ల పాలసీదారు తన వంతు నష్టాన్ని భరించాల్సిన అవసరం లేకుండా నివారిస్తుంది’’ అని సింగ్ తెలిపారు. ఇంట్లోని వస్తువులకు బీమా కవరేజీ కోసం విడిగా ఒక్కో ఆరి్టకల్ వివరాలను పూర్తిగా పేర్కొనడం, వాటి విలువను కూడా నమోదు చేయడాన్ని మర్చిపోవద్దు. రీప్లేస్మెంట్ లేదా రీఇన్స్టేట్మెంట్ కవర్‌ను తీసుకోవాలి. ‘‘హోమ్ ఇన్సూరెన్స్ విభాగంలో మార్కెట్ వేల్యూ కవరేజీ లేదంటే రీఇన్స్టేట్మెంట్ కవరేజీ తీసుకోవచ్చు. మార్కెట్ వేల్యూ కవర్లో తరుగుదల పోను మీ ఇంటి విలువలో మిగిలిన మొత్తాన్ని పరిహారం రూపంలో పొందుతారు. రీఇన్స్టేట్మెంట్ కవర్లో ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సమాన స్థాయిలో బీమా పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు వరదలు వచ్చి ఇల్లు దెబ్బతింటే, అప్పుడు ఇంటిని తిరిగి నిర్మించుకోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భాల్లో హౌస్ రీఇన్స్టేట్మెంట్ కవర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు. ఇవి ఉండేలా చూసుకోవాలి ► ఆటో బీమా: ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజన్ ఆయిల్, నట్లు, బోల్టులు, గ్రీజులు, వాషర్లతో కూడిన కన్జ్యూమబుల్ రైడర్లను కూడా తీసుకోవాలి. ► హోమ్ ఇన్సూరెన్స్: రీప్లేస్మెంట్ కాస్ట్ క్లాజ్ ఉందేమో చూసుకోవాలి. ఇది ఉంటే అప్పుడు ఇంటి పునరి్నర్మాణానికి కావాల్సినంత బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంట్లోని విలువైన గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సైతం కవరేజీ ఉండాలి. మరమ్మతులు, ప్లంబింగ్, కార్పెంటరీ, పెస్ట్‌కంట్రోల్ కవరేజీ ఉందేమో చూడాలి. దాదాపు అన్ని రకాల నష్టాలకు పరిహారం ఇచ్చే సమగ్రమైన ప్లాన్‌ను తీసుకోవడమే సరైనది. ► వెక్టార్ బోర్న్ డిసీజ్: తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెక్టార్ బోర్న్ డిసీజ్‌కు కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే విడిగా కొనుగోలు చేసుకోవాలి. విడిగా ఒక్కో వ్యాధి, దానికి ఉప పరిమితుల గురించి అడిగి తెలుసుకోవాలి. బీమా లేక భారీ నష్టం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కోసారి గణాంకాలను చూస్తే కానీ అర్థం కాదు. 2001 నుంచి ప్రకృతి విపత్తుల కారణంగా 85,000 మంది మరణించగా, వేలాది కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. హోమ్ ఇన్సూరెన్స్ కేవలం 8 శాతం మందే కలిగి ఉండడంతో, పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వచి్చనట్టు వాస్తవాన్ని గుర్తు చేసింది. 1900 నుంచి ప్రకృతి వైపరీత్యాల పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. మన దేశంలో 764 సహజ విపత్తులు సంభవించాయి. తుపానులు, వరదలు, భూకంపాలు, కొండ చరియలు విరిగి పడడం, కరువు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా 1900 నుంచి 2000 మధ్య 361 పెద్ద వైపరీత్యాలు నమోదు కాగా, ఆ తర్వాత 22 ఏళ్లలో (2001–2022) 402 విపత్తులు చోటు చేసుకున్నాయి. అంటే గతంతో పోలిస్తే ప్రకృతి విపత్తులు పెరిగిపోయినట్టు ఈ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా 41 శాతం వైపరీత్యాలు వరదల కారణంగా సంభవించినవే ఉన్నాయి. ఆ తర్వాత తుపానుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో వచి్చన వరదల కారణంగా రూ. 52,500 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇందులో బీమా కవరేజీ ఉన్నది కేవలం 11 శాతం ఆస్తులకే కావడం వాస్తవం. ఇంటికి, ఆస్తులకు, ఆరోగ్యానికి, జీవితానికి బీమా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. -
ఈవీ జోరు.. బీమా లేదంటే బేజారు!
అతని పేరు శివకుమార్ (40). 2022 ఏప్రిల్‌లో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు. ఆ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో ఉంది. దాంతో బ్యాటరీని తీసి తన బెడ్రూమ్లోనే రాత్రి చార్జింగ్ పెట్టాడు. అదే బెడ్ రూమ్‌లో శివకుమార్, అతడి భార్యాపిల్లలు నిద్రించారు. అర్ధరాత్రి బ్యాటరీ నుంచి మంటలు వచ్చి గది అంతటా వ్యాపించాయి. ఈ మంటలకు శివకుమార్ ప్రాణాలు కోల్పోగా, భార్యా పిల్లలు గాయాలపాలయ్యారు. ఆ మధ్య ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావడం తెలిసిందే. అంతెందుకు ముంబైలో ఓ ప్రముఖ కంపెనీ కారు పార్క్ చేసి ఉండగా, ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిజానికి కంబషన్ ఇంజన్‌తో కూడిన వాహనాల్లో అగ్ని ప్రమాదం జరగదని కాదు. కానీ, చాలా చాలా అరుదు. అదే ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీలు) అయితే బ్యాటరీ సిస్టమ్‌లో లోపాల వల్ల అగ్ని ప్రమాద రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అగ్ని ప్రమాదాలకు వాహన బీమాలో కవరేజీ ఉంటుందా? వేటికి అసలు కవరేజీ వస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ప్రస్తుతం మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల)కు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌కు కొత్త. ఇంత కాలం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలే ఉండడంతో బీమా ఉత్పత్తులు వీటికి అనుగుణంగానే తయారయ్యాయి. వీటినే బీమా సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లకు సైతం జారీ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ కాంప్రహెన్సివ్ పాలసీలు ఒక రకం. ఓన్ డ్యామేజ్ తోపాటు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌తో కూడిన సమగ్ర బీమా ఇది. మోటారు ఇన్సూరెన్స్ విభాగంలోకి రాని తక్కువ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలకు అస్సెట్ ఇన్సూరెన్స్ పాలసీలను బీమా సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇవి ప్రమాద నష్టాలను భర్తీ చేస్తాయి. ‘‘25 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే అన్ని రకాల ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఓన్ డ్యామేజీ కవరేజీ అనేది కేవలం వాహనదారు ఇష్టం మేరకు తీసుకోవచ్చు. అదే 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం కలిగిన ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి కాదు. కానీ, వాహనదారులు తమ వాహనాలకు సరైన రక్షణ కలి్పంచుకునేందుకు వీలుగా సరిపడా బీమా రక్షణను తీసుకోవాలని మేము సూచిస్తాం’’అని డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ ఆదర్శ్ అగర్వాల్ తెలిపారు. అన్నింటికీ కాదు.. బీమా ఉన్నంత మాత్రాన వాహనంలో ఏ నష్టం జరిగినా బీమా వస్తుందని భావించడానికి లేదు. ఈవీకి ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) కంటే ఈవీలు భిన్నంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈవీలో ఒక్క బ్యాటరీ ధరే మొత్తం వాహనం ధరలో 40 శాతం మేర ఉంటుంది. ‘‘ఇప్పటికీ మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా చాలా తక్కువ. భారీ సంఖ్యలో అమ్మకాలు పెరిగితే తప్ప వాటికి ఎదురయ్యే నష్టాలను విశ్లేషించలేము. తగినంత డేటా, క్లెయిమ్స్ అనుభవం ఉన్నప్పుడే ఈవీలకంటూ ప్రత్యేకమైన పాలసీలను తీసుకురావడం సాధ్యపడుతుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కొంత కాలం క్రితం ఈవీల కోసమే ప్రత్యేకమైన పాలసీని రూపొందించినట్టు ప్రకటించింది. ‘ఆటో సెక్యూర్ ఈ వెహికల్ కాంప్రహెన్సివ్ పాలసీ’ పేరుతో తీసుకొచ్చిన ప్లాన్‌లో ఓన్ డ్యామేజీతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినా కవరేజీ అందులో భాగంగా ఉంది. కానీ, ఇప్పటికీ ఇది మార్కెట్లోకి రాలేదు. బ్యాటరీకి లేదు రక్షణ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ పాలసీల్లో పెద్ద లోపం ఉంది. బ్యాటరీ ఒక్కటే డ్యామేజ్ అయితే పరిహారం రాదు. మొత్తం వాహనం డ్యామేజ్ అయితేనే బీమా సంస్థలు క్లెయిమ్‌లు ఆమోదించి పరిహారం చెల్లిస్తున్నాయి. ‘‘వాహన విడిభాగాలు విఫలమైతే మోటారు ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ ఉండదు. సంప్రదాయ పాలసీల్లో అయితే ప్రమాదం వల్ల, అల్లర్లు, దోపిడీలు, వరదల వల్ల వాహనం, దాని విడిభాగాలకు నష్టం జరిగితే పరిహారం వస్తోంది’’అని గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రాక్టీస్ లీడర్ ఎన్ భోజరాజన్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనంలో ఖరీదైన బ్యాటరీని ఎవరైనా ఎత్తుకుపోయాంటే క్లెయిమ్‌ను బీమా సంస్థలు ఆమోదించకపోవచ్చు. ఈవీలకు బ్యాటరీ అత్యంత కీలకం కనుక బ్యాటరీ ఒక్కదానికే కవరేజీ ఇచ్చే పాలసీల అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘బ్యాటరీలు, చార్జింగ్ ఎక్విప్మెంట్కు ఉద్దేశించిన ప్రత్యేకమైన పాలసీలు అవసరం. ఈవీ చార్జింగ్ సదుపాయాలతో ముడిపడిన రిస్క్‌ల కారణంగా ఈవీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాల వల్లే నష్టం జరగాలని లేదు. బ్యాటరీ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం వాటిల్లితే బ్యాటరీతోపాటు, కనెక్టర్కూ నష్టం జరుగుతుంది. సంప్రదాయ పాలసీలో బ్యాటరీతోపాటు వాహనం కూడా అగి్నకి ఆహుతి అయితే తప్ప క్లెయిమ్‌ను ఆమోదించవు’ అని భోజరాజన్ వివరించారు. అందుకే ఈవీలకే ఉద్దేశించిన ప్రత్యేక పాలసీల అవసరం ఉందని అన్నారు. మనం ఏమి చేయగలం? బీమా సంస్థలు పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల తరమే కనుక ఈవీల కోసం ప్రత్యేక పాలసీలకు రూపకల్పన చేస్తున్నాయి. కనుక వాహనదారులు అన్ని బీమా సంస్థలను సంప్రదించిన తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోవాలి. బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను ఏదైనా సంస్థ ఆఫర్ చేస్తే ఎంపిక చేసుకోవడం మెరుగు. ప్రీమియం కొంచెం ఎక్కువైనా, బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను తప్పక తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా ఈవీల కోసమే ఉద్దేశించిన ఎన్నో ఫీచర్లతో పాలసీలను అందుబాటులోకి తెస్తాయి. కేవలం థర్డ్ పార్టీ డ్యామేజ్ కాకుండా ఓన్ డ్యామేజ్ కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్లను కూడా యాడ్ చేసుకోవడాన్ని పరిశీలించాలి. డిప్రీసియేషన్ కవర్, గ్యాప్ వ్యాల్యూ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ తీసుకోవాలని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రెసిడెంట్ ఉదయన్ జోషి సూచించారు. ముఖ్యంగా ఈవీ వాహనదారులు రిటర్న్ టు ఇన్వాయిస్ రైడర్‌ను తీసుకోవాలని పాలసీబజార్ మోటార్ రెన్యువల్స్ హెడ్ అశ్విని దూబే సూచించారు. ఈ రైడర్‌తో వాహనం ఇన్వాయిస్ విలువ మేర పరిహారం పొందొచ్చన్నారు. కారు చోరీకి గురైనా లేక రిపేర్ చేయడానికి అనుకూలంగా లేని రీతితో దెబ్బతిన్నా లేక అగ్ని ప్రమాదంతో మొత్తం నష్టం వాటిల్లినప్పుడు ఈ రైడర్ కింద పరిహారం వస్తుందన్నారు. పాలసీ కొనుగోలుకు ముందే వేటికి కవరేజీ వస్తుంది, వేటికి మినహాయింపు ఉన్నదీ తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. ప్రీమియం భారం అనుకోవద్దు.. ఈవీలకు ఇచ్చే బీమా పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల కంటే ఈవీలకు థర్డ్ పార్టీ కవర్ 15% వరకు తక్కువ. ‘‘ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీ కార్లు, బైక్‌లకు కాంప్రహెన్సివ్ కవరేజీ ప్రీమియం 5–20% వ్యత్యాసంతో ఉంటోంది. ఓన్ డ్యామేజ్ కవరేజీలోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఏడాది కాలానికి 30 కిలోవాట్ అవర్ ఎలక్ట్రిక్ కారుకు థర్డ్ పార్టీ ప్రీమియం రూ.2,000 స్థాయిలో ఉంది. అదే ఐఈసీ వాహనాలకు (1,000 సీసీ మించని) ప్రీమియం మరో రూ.200 వరకు అటూ ఇటూగా ఉంటోంది. ‘ఈవీలకు ప్రీమియం, బీమా సంస్థ ధరల విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఈవీ తయారీ, మోడల్, బ్యాటరీ సామర్థ్యం, ప్రాంతం, వాహనం వయసు వంటి అంశాలు ప్రీమియం ధరపై ప్రభావం చూపిస్తాయి’ అని ఉదయన్ జోషి వెల్లడించారు. ఈవీలకు సంబంధించి మరిన్ని క్లెయిమ్‌లు వస్తే కానీ, ప్రీమియం మెరుగ్గా మారగలదన్నారు. ఈవీలకు ఉన్న రిస్‌్కల నేపథ్యంలో వాటికంటూ ప్రత్యేకమైన ఉత్పత్తులు తీసుకువచ్చేందుకు ఐఆర్డీఏఐ సైతం బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
Fact Check: ఆతృతతో రామోజీ వికృత రాతలు
సాక్షి, అమరావతి: రాక్షస ఆలోచనలతో నిండిపోయిన రామోజీ మెదడుకు వాస్తవాలు బయటికొస్తాయనే భయం ఏకోశానా లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్ ఆధారంగా బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఆ పండు ముసలి ప్రాణం కడుపుమంటతో రగిలిపోతోంది. యూనివర్సిల్ కవరేజ్ విషయంలో ఏపీని స్ఫూర్తిగా కేంద్రం కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో కలిసి ఫసల్ బీమాను అమలుచేస్తోంది. పలు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఏపీ బాటపట్టాయి. కానీ, క్షుద్ర రాతలతో అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేసే రామోజీకి ఇవన్నీ తెలిసినా కణకణాన ఓర్వలేనితనం ఆయన్ను రోజురోజుకీ దిగజారుస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం అందించింది. కానీ, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్న రామోజీ నిత్యం ఈ పథకంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. రైతులను గందరగోళ పర్చేలా ‘ఏది బీమా?’ అంటూ తాజాగా ఈనాడు ఎంతో ఆతృతతో మరో అబద్ధాల సంకలనాన్ని అచ్చేసింది. నిజానికి.. ఖరీఫ్–21 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారం ఇంకా అందని వారెవరైనా మిగిలి ఉన్నారేమోనని దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించి ఈ నెల 14న మరో 9 వేల మందికి రూ.90 కోట్ల పరిహారం జమచేసి రైతులపట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ, ఇవేమీ పట్టించుకోని ఈనాడు విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ఫిల్‌్మసిటీ కోటలో కాలుజాపుకుని ఇంకెన్నాళ్లు ఈ ఎల్లో జర్నలిజం చేస్తారు? మీ కథల్ని ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుసా? ‘ఏది బీమా?’పై ఇదీ నిజం.. చదవండి రామోజీ.. ఆరోపణ: బీమా హుళక్కేనా? వాస్తవం: ఈ–పంట నమోదు జరిగిన వెంటనే రైతుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో మెస్సేజ్‌లు పంపడమే కాదు.. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తికాగానే ప్రతీ రైతుకు భౌతిక రశీదులు అందించారు. వీటి ప్రామాణికంగానే పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు వ్యవసాయ రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సాగు చేసిన పంటలలో నోటిఫై చేసిన పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నీ ఆ రశీదుల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో ఎలాంటి గందరగోళంలేదు. ఈనాడుకు తప్ప. ఆరోపణ: ఆ పంటలకు బీమా కవరేజ్ ఏదీ? వాస్తవం: నాసిరకం విత్తనాలవల్ల పంటలు దెబ్బతిన్నా, ఆశించిన దిగుబడులు రాకపోయినా, వాతావరణం వల్ల పంటలు దెబ్బతిన్నా నోటిఫై పంటలకు బీమా పరిహారం అందిస్తారు. పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలన్నీ నోటిఫైడ్ పంటలే. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే కవరేజ్ ఉండేది. అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ పరిహారం సొమ్ములు దక్కేవి కావు. అది కూడా అరకొరగానే. కానీ, నేడు రైతులపై పైసా భారం పడకుండా నాలుగేళ్లుగా పంటల బీమా పరిహారం ఇస్తున్నారు. ఆరోపణ : అన్నదాతను ఆదుకోవడంలో అలసత్వమేలా? వాస్తవం: పంటల పరిహారం చెల్లింపులో ఈనాడు చెబుతున్నట్లుగా ఎలాంటి గందరగోళంలేదు. యూనివర్సల్ కవరేజ్ విషయంలో కేంద్రం దిగిరావడంతో ఖరీఫ్–22 సీజన్‌కు సంబంధించి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవై–డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేస్తుండగా వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ ఉచిత బీమా పథకం కింద కవరేజ్ కల్పిస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను కూడా ప్రభుత్వం చెల్లించింది. మే నెల వరకు వాతావరణ ఆధారిత పంటల బీమా కవరేజీ కొన్ని పంటలకు మిగిలి వున్నందువలన బీమా పరిహారం లెక్కింపు తదనుగుణంగా పూర్తికావస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు వారాలైనా ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లింపుపై రైతులకు ఎలాంటి సమాచారం లేదనడంలో వాస్తవంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అసలు కసరత్తు చేయడంలేదని ఆరోపించడం హాస్యాస్పదం. ఆరోపణ: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? వాస్తవం: జూలై 8న ఖరీఫ్–22 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని జమచేస్తామని సీఎం జగన్ స్వయంగా రైతుభరోసా ఇచ్చిన జూన్ 1నే ప్రకటించారు. ఎందుకంటే జూలై 8న రైతు దినోత్సవంతో పాటు వైఎస్సార్ జయంతి కూడా. కనుక ఇది ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ఇవ్వలేదని రాయడం సబబేనా? ఇక.. ముందే చెప్పినట్లుగా ఆ తేదీకి సీఎం ఇచ్చేస్తే మేం చెప్పాం కాబట్టే ఇచ్చారని డబ్బా కొట్టుకునేందుకేనా ఈ రాతలు? మరోవైపు.. పంటల బీమాకు అర్హుల జాబితా మదింపు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో అభ్యంతరాలను స్వీకరించి వాటిని జూలై మొదటి వారంలో పరిష్కరిస్తారు. ఆ వెంటనే తుది జాబితాలను ఆర్బీకేల ద్వారా ప్రదర్శిస్తారు. ఆరోపణ: అమ్మఒడి కోసం జాప్యం చేస్తున్నారు.. వాస్తవం: 2016 నుంచి పీఎంఎఫ్‌బీవై అమలవుతోంది. అంతకుముందు వ్యవసాయ బీమా పథకం కింద బీమా కవరేజ్ కల్పించేవారు. గడిచిన సీజన్‌కు సంబంధించి చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని గతంలో ఆగస్టు నెలాఖరులోపు ఇచ్చిన దాఖలాలే లేవు. పలు సీజన్లలో సెప్టెంబర్‌లో కూడా ఇచ్చారు. అది కూడా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేకానీ పరిహారం దక్కేది కాదు. కానీ, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడిచిన సీజన్‌కు సంబంధించిన పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్ ప్రారంభమయ్యేలోగా అర్హుల జాబితాలను ప్రకటించి జూన్–జూలైలో పరిహారం అందిస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరించి అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున పంటల బీమా పరిహారం జూలై లేదా ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉందంటూ చేతికొచ్చినట్లు రాయడం ఈనాడుకే చెల్లింది. ఆరోపణ : ఈకేవైసీ అంటూ కొత్త మెలిక పెట్టారు.. వాస్తవం: మొదట్లో ఈ–క్రాప్‌లో నమోదు చేయించుకుంటే చాలని, ఆ తరువాత ఈ–కేవైసీ చేయించుకుంటేనే పరిహారం ఇస్తామని మెలిక పెట్టిందనడంలో కూడా వాస్తవంలేదు. నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసేందుకు జారీచేసిన నోటిఫికేషన్లో రైతు తన ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ చెయ్యాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పత్రికాముఖంగా రైతులకు విజ్ఞప్తి చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. చెల్లించాల్సిన క్లెయిమ్స్‌ను ఆధార్ ఆధారిత నగదు బదిలీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకు జమచేస్తున్నందున ఈ–కేవైసీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.ఈ వాస్తవాలను కప్పిపుచ్చి రైతులను గందరగోళ పరిచేలా తప్పుడు వార్తలు రాయడం, విషం కక్కడం ఈనాడుకు నిత్యకృత్యమైపోయింది. -
అప్పటికల్లా అందరికీ బీమా! మూడంచెల విధానం.. యూపీఐ తరహా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి బీమాను అందరికీ చేరువ చేసేందుకు.. లభ్యత, పొందడం, అందుబాటు అనే మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు అవుతున్నందున అప్పటికీ, బీమాను అందరికీ చేరువ చేయాలని ఐఆర్డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి గడిచిన ఏడాది కాలంలో పలు చర్యలు కూడా తీసుకుంది. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాండా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బీమా రంగంలో యూపీఐ తరహా విప్లవాన్ని తీసుకొచ్చేందుకు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిళ్లతో కలసి పనిచేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఓ ఊహాత్మక కార్యాచరణ గురించి ఆలోచించాం’’అని పాండా తెలిపారు. దేశంలో బీమా వ్యాప్తి తక్కువగా ఉండడం, పెద్ద మార్కెట్ కావడంతో ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్టు చెప్పారు. -
ఐపీవో తర్వాత,తొలిసారి ఎల్ఐసీ కొత్త ప్లాన్..అదేంటో తెలుసా?
హైదరాబాద్: జీవిత బీమా పరిశ్రమలో అదిపెద్ద కంపెనీ అయిన ఎల్ఐసీ కొత్తగా బీమా రత్న పేరుతో ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. మే 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీలతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమాతో కూడిన ప్లాన్ అని ఎల్ఐసీ తెలిపింది. ఇందులో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించడం, మనీ బ్యాక్ ప్లాన్, గ్యారంటీడ్ అడిషన్ సదుపాయాలు ఉన్నాయి. 15, 20, 25 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎంపిక చేసుకున్న ప్లాన్ కాల వ్యవధికి నాలుగేళ్లు ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి ప్లాన్ తీసుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లింపుల టర్మ్ ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే పాలసీ ప్లాన్ గడువు ముగిసే చివరి రెండు సంవత్సరాల్లో ఏటా 25 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్ వెనక్కి వస్తుంది. గడువు తీరిన తర్వాత మిగిలిన 50 శాతం సమ్ అష్యూర్డ్ (బీమా)తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్‌ను ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఈ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీ, అంతకంటే ఎక్కువకు తీసుకోవచ్చు. పాలసీపై రుణం తీసుకోవచ్చు. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత కాకుండా ఐదేళ్లపాటు తీసుకునే సదుపాయం కూడా ఉంది. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగుల బీమాకు సంబంధించి ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని ప్రకటించింది. ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు భారీ పరిహారంతో ప్యాకేజీని ప్రవేశపెడుతోంది. దీంతోపాటు మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసుశాఖ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్న ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది. ఈ మేరకు సేŠట్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రంలో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా.. తాజాగా కార్పొరేట్ బీమా ప్యాకేజీ ప్రకటించడంతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లయింది. ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాల ఖాతాలను ఎస్బీఐ ద్వారా నిర్వహిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న బీమా సౌకర్యానికి అదనపు ప్రయోజనాలు చేకూర్చి, ఇందుకోసం ప్రభుత్వం ఎస్బీఐతో సంప్రదింపులు జరిపింది. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు కూడా కార్పొరేట్ ప్యాకేజీ అందించేందుకు ఆసక్తి చూపాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు ఎస్బీఐకి వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకు అయినందున ఎస్బీఐకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. 50,500 మంది జీతాల ఖాతాలు ఉన్నందున ఆర్టీసీ గట్టిగా డిమాండ్ చేయగలిగింది. దీంతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీకి ఎస్బీఐ సమ్మతించింది. ఈ మేరకు ఆర్టీసీకి, ఎస్బీఐకి మధ్య ఒప్పందం కుదిరింది. బీమా ప్యాకేజీ ఇలా.. ఆర్టీసీ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఇప్పటివరకు ఈ పరిహారం రూ.30 లక్షలు ఉండేది. ఇప్పుడు రూ.10 లక్షలు పెంచారు. ప్రమాదంలో గాయపడి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షల పరిహారం ఇస్తారు. వారి పిల్లల పేరిట రూ.5 లక్షల వరకు ఉన్న విద్యారుణాలు, ఆడపిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తారు. వీటికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తారు. దీనికి ఒక్కో ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లించాలి. ఇంతతక్కువ ప్రీమియంతో రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఇదే తొలిసారి. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ తీసుకొస్తోంది. దీంతో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ సమష్టిగా పనిచేసి సంస్థను అభివృద్ధిపథంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. – సీహెచ్.ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ -
బీమా కవరేజీలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. ప్రభుత్వమే వారి తరఫున బీమా ప్రీమియం చెల్లించడం.. అలాగే, ఉచిత వైద్యం అందిస్తుండడంతో ఏపీ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించింది. 2020–21కి గానూ దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీమా కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారో గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 74.60 శాతం మంది కవరేజీతో మొదటి స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మందే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేసేలా.. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి అమలుచేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని ఇంత పెద్దఎత్తున ఉచిత ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకువచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేవని నీతిఆయోగ్ స్పష్టంచేసింది. తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలే కాదు.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు సైతం ఇన్సూ్యరెన్స్ కవరేజీలో ఏపీతో పోటీపడలేక పోయాయి. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో సైతం కేవలం 15 శాతం మంది మాత్రమే కవరేజీలో ఉన్నట్లు నీతి ఆయోగ్ తన తాజా గణాంకాల్లో పేర్కొంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పథకంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ఎక్కువమందికి లబ్ధి కలిగేలా చేశారు. దీంతో ఇన్సూ్యరెన్స్ ద్వారా అధికశాతం మందికి ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కలిగింది. -
కరోనా : వారికి ఎస్బీఐ భారీ ఊరట
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కాలంలో తన విశ్రాంత ఉద్యోగులకు ఊరట అందించే వార్త చెప్పింది. ఎస్బీఐ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం కొత్త బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో కోవిడ్-19 చికిత్స కూడా చేర్చడం విశేషం. మెడికల్ బెనిఫిట్స్ స్కీమ్ కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ) లేదా ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు సైతం ఆసుపత్రిలో చేరేందుకు బ్యాంక్ అనుమతించింది. ఈమేరకు ఎస్బీఐ తన రిటైర్డ్ ఉద్యోగులకు సమాచారాన్ని అందించింది. (ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ ) ప్రస్తుత పథకాన్ని సమీక్షించి ఎస్బీఐ ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కోవిడ్-19 ను అంటువ్యాధిగా చేర్చాలని నిర్ణయించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఇప్పుడు 20 నుండి 25 వరకు వ్యాధుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇంట్లో కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు గృహ చికిత్స కోసం రూ. 25000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కోవిడ్ కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య సంస్థ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. కాగాఎస్‌బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స కవరేజ్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. -
50 కోట్ల మంది కోసం.. ఉపాసన సరికోత్త ఆలోచన
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవితంలో అత్యంత విలువైనదిగా భావించేది ప్రాణం. అందుకే ఏ చిన్న పాటి అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే వారు కోకొల్లలు. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. కరోనా వచ్చాక మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిందనే చెప్పవచ్చు. హెల్త్ పాలసీలు తీసుకునే వారిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే అధికం. ఎందుకంటే వారు గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్లలేరు.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ హస్పటిల్‌కు వెళ్లే ధైర్యం కూడా చేయలేరు. దాంతో మధ్యే మార్గంగా ఆరోగ్యబీమా పాలసీలతో నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్ కవరేజ్ మోడల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేశారు. ‘అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ.. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్ కవరేజ్ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్’ అంటూ ఉపాసన ట్వీట్ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ‘దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ ఇన్యూరెన్స్ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు. (చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్) AFFORDABLE HEALTHCARE FOR ALL ! We are keen to pledge our support by partnering with insurance companies & the government to develop the best suited health coverage model for the 50 crore #missingmiddle Indians. @FHPLHealth Jai Hind 🙏🏼 pic.twitter.com/XdqHZkK58q — Upasana Konidela (@upasanakonidela) August 24, 2020 ఎఫ్‌హెచ్‌పఎల్.. ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ (ఎఫ్‌హెచ్‌పఎల్), 1995లో విలీనం చేయబడింది. 2002 లో ఐఆర్డీఏ లైసెన్స్ పొందింది. నేడు దేశంలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ పొందిన ఐఆర్డీఏ లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లలో ఎఫ్‌హెచ్‌పఎల్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఉండగా దేశవ్యాప్తంగా 55కు పైగా స్థానాల్లో, 25 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. వ్యక్తిగత కస్టమర్లు, కార్పొరేట్ ఖాతాదారులకు, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య పథకాలకు ఆరోగ్య బీమా ప్రయోజనాల పరిపాలన అవసరాలను ఎఫ్‌హెచ్‌పీఎల్ అందిస్తోంది. నాణ్యత ప్రమాణాలు, ప్రక్రియల కోసం ఐఎస్ఓ 9001: 2008 తో ధృవీకరించబడిన మొదటి లైసెన్స్ పొందిన థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఎఫ్‌హెచ్‌పీఎల్ కావడం విశేషం. -
బీమా చిన్నదే..కానీ ఎంతో ఆదా
నేటి పరిస్థితుల్లో ఎన్నో రూపాల్లో మనకు రక్షణ కల్పించే సాధనం బీమా. అందుకే ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో బీమా తప్పనిసరిగా ఉండాలి. ఎన్నో కారణాలతో మనపై పడే ఆర్థిక భారాన్ని కేవలం కొంచెం ప్రీమియం భరించడం ద్వారా తొలగించుకోవచ్చు. జీవిత బీమా ఒక్కటే కాకుండా, ఆరోగ్య బీమా, ఇంటికి, ఇంట్లోని వస్తువులకు, వాహనాలకు, చివరికి మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ వరకు ఎన్నో రూపాల్లో బీమా రక్షణ లభిస్తోంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా, గృహ బీమా తప్పించి ఇతరత్రా దేనికీ బీమా ఉండదు. కాకపోతే ఇతర బీమా రక్షణ కూడా తీసుకోవాలా..? లేదా అనేదానిని వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యమే నిర్ణయిస్తుంది. కానీ, నిజం ఏమిటంటే కేవలం రూపాయి ప్రీమియానికే వచ్చే బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నా యి. వీటిని సాచెట్ లేదా బైట్సైజు బీమా కవరేజీలుగా పిలుస్తారు. వీటి ప్రయోజనాలను వివరంగా తెలియజేసే ప్రాఫిట్ కథనం. దేశంలో బైట్ సైజు (చిన్న ఉత్పత్తులు)/మైక్రో ఇన్సూరెన్స్ (సూక్ష్మ బీమా) బీమా పాలసీలు అన్నవి ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే వీటిల్లో ఉండే సౌకర్యం, సరళతరం కారణంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. ఈ పాలసీల కాల వ్యవధి ఒక్క రోజుతో మొదలుకొని, ఏడాది వరకు కొనసాగుతాయి. ఈ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులను కంపెనీలు ప్రధానంగా మొదటి సారి బీమా పాలసీలు తీసుకునే వారిని లక్ష్యం చేసుకుని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించినవారు) కోసం. అప్పటి వరకు పాలసీలు తీసుకోని వారు ముందు ఈ పాలసీలను తీసుకోవడంతో తమ ప్రయాణాన్ని ఆరంభించొచ్చు. ఆ తర్వాత అయినా సమగ్ర బీమా పథకాలను తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయి రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలపై సంబంధిత నిపుణుల సలహాలు తీçసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పర్యటన రద్దయితే పరిహారం.. డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న పర్యాటక బీమా పాలసీలో.. పర్యటన ఆలస్యం, విమాన సర్వీసు రద్దు అయితే పరిహారం చెల్లించే ఆప్షన్లు ఉన్నాయి. దేశీయ విమాన సర్వీసులు అయితే 75 నిమిషాల కంటే ఆలస్యం అయినప్పుడు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇతర బీమా సంస్థలు అయితే కనీసం ఆరు గంటల పాటు విమానం ఆలస్యమైనప్పుడే పరిహారం చెల్లిస్తున్నాయి. ఇక విమాన ప్రయాణాన్ని నిర్ణీత సమయానికి 24 గంటలు ముందుగా రద్దు చేసుకున్నట్టయితే, డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.20,000కు గరిష్టంగా చెల్లిస్తుంది. టికెట్లో నాన్ రిఫండబుల్ రూపంలో కోల్పోయే మొత్తంపై ఈ పరిమితికి లోబడి పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు చెన్నై–జైపూర్ మధ్య మూడు రోజుల ట్రిప్‌నకు డిజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ.329 వసూలు చేస్తోంది. ఇదే పాలసీలో బ్యాగేజీని నష్టపోయినా, వ్యక్తిగత ప్రమాదం, అత్యవసరంగా వైద్య చికిత్సలకు సైతం రక్షణ కల్పిస్తోంది. ఫ్లయిట్ ఆలస్యం అయితే దానిని డిజిట్ సంస్థ తనంతట తానే గుర్తించి క్లెయిమ్ చేసుకోవాలంటూ పాలసీదారులకు మెస్సేజ్ పంపిస్తుంది. క్లెయిమ్ పరిష్కారం కూడా ఆన్లైన్లోనే సులభంగా చేసుకోవచ్చు. మొబైల్ కవరేజీ.. ఖరీదైన మొబైల్స్‌కు ప్రొటెక్షన్ ప్లాన్ ఎంతో మేలు. అకో జనరల్ ఇన్సూరెన్స్ రూ.7,500–10,000 మధ్య ధర ఉండే నూతన మొబైల్ ఫోన్లకు ప్రొటెక్షన్ ప్లాన్‌ను అమెజాన్ వేదికగా ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, ధర ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు శామ్సంగ్ గెలాక్సీ ఎం30 ధర రూ.9,999. ఇందుకోసం అకో జనరల్ రూ.299ను ఏడాది ప్రీమియంగా వసూలు చేస్తోంది. చేజారి కింద పడిపోయినా, నీళ్లలో పడి దెబ్బతిన్నా పరిహారానికి క్లెయిమ్ చేయవచ్చు. కాకపోతే దొంగ తనం వల్ల కోల్పోతే పరిహారం రాదు. నేరుగా కస్టమర్ ఇంటికే వచ్చి ఫోన్‌ను తీసుకెళ్లి రిపేర్ చేయించి తిరిగి అందించడం చేస్తుంది. ఒకవేళ ఫోన్ అసలుకే పనిచేయకుండా పోయి పూర్తి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకుంటే, అప్పుడు ఫోన్ విలువలో తరుగుదలను మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. డిజిట్ ఇన్సూరెన్స్ కూడా మొబైల్ ఫోన్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. కాకపోతే ప్రమాదవశాత్తూ ఫోన్ స్క్రీన్ దెబ్బతిన్న సందర్భాల్లోనే ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. కొత్త ఫోన్లకు, అప్పటికే కొంత కాలం వినియోగించిన ఫోన్లకు సైతం ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న వారు తమ ఫోన్ స్క్రీన్ దెబ్బతింటే, స్థానికంగా ఉన్న ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయించుకుని, అందుకు సంబంధించి వీడియో, బిల్లును అప్లోడ్ చేయడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఫిట్నెస్ బీమా సింబో ఇన్సూరెన్స్ సంస్థ ఫుట్‌బాల్, పరుగు పందేల్లో పాల్గొనే వారికి ఫిట్నెస్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. ఒక సెషన్ నుంచి ఏడాది వరకు పాలసీని తీసుకోవచ్చు. ఆట సమయంలో గాయపడి చికిత్స అవసరం అయినా, ప్రాక్టీసు చేస్తూ గాయపడినా, ఫిజియో థెరపీ కావాల్సి వచ్చినా, ఇతరత్రా పరిహారాన్ని పాలసీ కింద అందిస్తోంది. రూ.5,000 వరకు ఎముక గాయాలకు, రూ.25,000 వరకు లిగమెంట్ టియర్, రూ.10,000 వరకు పంటి గాయాలకు కవరేజీని కేవలం రూ.9 ప్రీమియానికే ఒక మ్యాచ్‌కు ఆఫర్ చేస్తోంది. సింబో మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టర్ సర్టిఫికెట్, వ్యాధి నిర్ధారణ పరీక్షల కాపీలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే, వేగంగా పరిహారం లభిస్తుంది. కీటకాలతో వచ్చే వ్యాధులకు.. వెక్టార్ బోర్న్ డిసీజ్ కవర్ అన్నది, ముఖ్యంగా దోమలు, పురుగులు కుట్టడం వల్ల అనారోగ్యం పాలైనప్పుడు.. చికిత్సలు, ఇతర వ్యయాలకు రక్షణ కల్పించేది. డెంగ్యూ, మలేరియా, కాలా అజార్, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్, ఫైలేరియాలకు ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. ఏడాదికి ప్రీమియం రూ.49 నుంచి ఆరంభమవుతుంది. తమ ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. అయితే, ఇతర ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ఉండే విధంగానే.. వీటిల్లోనూ వేచి ఉండే కాలం, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 15 రోజుల తర్వాతే క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా కీటకాల కారణంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స అవసరమైన వారికే పరిహారం లభిస్తుంది. నగదు రహితం లేదా రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర కంపెనీల పోర్టళ్ల నుంచి నేరుగా ఈ పాలసీని పొందవచ్చు. మొబిక్విక్ లేదా టాఫీ ఇన్సూరెన్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా ఈ తరహా పాలసీ తీసుకోవచ్చు. మొబిక్విక్ సంస్థ మ్యాక్స్బూపాకు చెందిన మస్కిటో ఇన్సూరెన్స్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.10,000 సమ్ ఇన్సూర్డ్‌కు రూ.49ను ఏడాదికి చార్జ్ చేస్తోంది. అదే బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి మీరు ఇంతే మొత్తానికి ఏడాది కోసం రూ.160 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సమ్ ఇన్సూర్డ్ ఇంకా అధికంగా ఉండాలని కోరుకుంటే ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. డెంగ్యూ వ్యాధుల నుంచి ఆర్థిక రక్షణ దిశలో ఈ తరహా పాలసీలు ఎంతో మంచివనడంలో సందేహం లేదు. ఇంటికి సైతం కొన్ని రోజులకే కవరేజీ..? సంప్రదాయ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ 30 రోజులు, ఏడాది, 20 ఏళ్ల కాలానికి లభిస్తోంది. ఇంత కంటే ఇంకా తక్కువ వ్యవధికే పాలసీ తీసుకునే వీలు కూడా ఉండడం సానుకూలం. ఉదాహరణకు ఐదు రోజుల పాటు ఊరెళుతూ, అన్ని రోజులకే మీ ఇంటికి బీమా రక్షణ తీసుకోవాలనుకుంటే అది సాధ్యమే. కనీసం రూ.2లక్షల బీమా కవరేజీకి కనీస ప్రీమియం రూ.200గా ఉంది. ఎన్ని రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు, నివసించే ఇల్లు రకం (భవనమా లేక అపార్ట్మెంట్లో ఫ్లాటా), ఏ అంతస్తులో ఉంటున్నారనే అంశాల ఆధారంగా తీసుకునే బీమా మొత్తం, ప్రీమియం మారిపోవచ్చు. ఇంట్లోని వస్తువులకు ఒక్క రోజుకు కూడా బీమా కవరేజీ తీసుకోవచ్చు. దొంగతనాలు, దోపిడీలు, ప్రకృతి విపత్తుల కారణంగా కలిగే నష్టానికి ఈ పాలసీ రక్షణనిస్తుంది. బీమా మొత్తంలో గరిష్టంగా 20 శాతం వరకు ఇంట్లో ఉంచిన ఆభరణాలకూ కవరేజీ పొందొచ్చు. అలాగే, రూ.50,000 వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి కూడా అవకాశం ఉంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉంటాయి. -
కరోనాకు బీమా కవరేజ్
సాక్షి, ముంబై: సాధారణ బీమా పాలసీలకు కరోనా వైరస్ (కోవిడ్ –19) కవరేజ్ ఉందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది. అంటువ్యాధులకు బీమా వర్తిస్తుందని, ఇందులో భాగంగానే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని బీమా రంగంలోని 44 కంపెనీలను సభ్యులుగా కలిగి ఉన్న కౌన్సిల్ స్పష్టంచేసింది. ఈ అంశంపై చైర్మన్ ఏ.వీ గిరిజా కుమార్ మాట్లాడుతూ.. ‘దాదాపు మనుగడలో ఉన్న అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా కవరేజ్ ఉంది. ఈ విషయాన్ని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) బుధవారం ప్రకటించింది. కవరేజ్ వర్తింపజేయడం కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని, ఈ వ్యాధి కేసులకు త్వరితగతిన చికిత్స అందేలా చూడాలని పరిశ్రమను మాత్రమే ఐఆర్డీఏఐ కోరింది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఐఆర్డీఏఐ సర్క్యులర్‌పై సుబ్రమణ్యం బ్రహ్మజోయిసులా (అండర్ రైటింగ్ అండ్ రీఇన్స్యూరెన్స్ హెడ్) వ్యాఖ్యానిస్తూ సంబంధిత వ్యక్తి కనీసం 24 గంటలు ఆసుపత్రిలో చేరినట్లయితే భారతదేశంలో చాలా ఆరోగ్య బీమా చెల్లిస్తాయన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా భారత ప్రభుత్వం ఒక మహమ్మారిగా ప్రకటించినట్లయితే, బీమా చెల్లింపు ఉండదని తెలిపారు. తమ హాస్పిటలైజేషన్ పాలసీల కింద పాలసీదారులకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. ఏదేమైనా, రోగి క్వారంటైన్ లో ఉంటే క్లెయిమ్‌లను పరిష్కరిస్తారా అనే దానిపై బీమా సంస్థలు మౌనంగా ఉన్నాయి. చదవండి: అమెజాన్, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ ఆల్‌టైం గరిష్టానికి పసిడి, నెక్ట్స్ ఏంటి? బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్ -
రియల్టీకి ఊతం!
న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్పీఏలుగా ప్రకటించనివి, ఎన్సీఎల్టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు. మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు.. ► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ► ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు. ► నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు. ► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు. ► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు. -
హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్ ప్లాన్, మార్కెట్ ఆధారిత ప్లాన్ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. -
అధికార పార్టీ నేత నిర్వాకం
సాక్షి, ప్రొద్దుటూరు : అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీసిన సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని చర్చాంశనీయంగా మారింది. వాస్తవానికి 20 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కుందూనదిలో ట్రాక్టర్ బోల్తాపడి తీవ్రంగా నష్టం జరిగింది. డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అప్పుడు ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపునకు గడువు ముగి యడంతో యజమాని ట్రాక్టర్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి బీమా కోసం అదే ప్రాంతంలో ట్రాక్టర్‌ను మళ్లీ పడేశారు. తద్వారా ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ దువ్వూరు మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా రోజూ ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామం వద్ద ఉన్న కుంటకు వచ్చి మట్టి తీసుకెళుతున్నారు. ఇలా వచ్చి వెళుతుండగా గత నెల 27న ఉదయం 7.30 గంటలకు మార్గం మధ్యలోని కుందూ నదిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ పడింది. టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరుకు చెందిన రామముర్తి కుమారుడు డ్రైవర్‌గా ఉన్నాడు. వాస్తవంగా ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ప్రమాద సమయంలో చాలా వరకు డీజల్ కారిపోయి కిందపడింది. ఇది జరిగిన సంఘటన. ప్రస్తుతం జరిగిన సంఘటన ప్రమాదం జరిగిన రోజున క్రేన్ సహాయంతో చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఈ ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు చెల్లింపు ఆలస్యమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివనాగిరెడ్డి ఇటీవల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇన్సూరెన్స్ కోసం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డ్రైవర్ ద్వారా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి అదే కుందూ నదిలో పడేశారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి బంధువులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. -
ఉద్యోగం కోసం హత్య...
-
బీమా సొమ్ము కోసం భర్తను చంపేసింది
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో ఓ తపాలాశాఖ ఉద్యోగి మరణం వెనుక దాగిన కుట్ర బయటపడింది. బీమా సొమ్ము కోసం మొదటి భార్యే భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి డబ్బు ఆశ చూపి భర్తను చంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ సి. గాంధీ నారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలోని భవానీనగర్ కాలనీకి చెందిన కేశ్యా నాయక్‌తో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బొర్రయపాలెంకు చెందిన కేతవత్ పద్మకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్థలతో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఎనిమిదేళ్ల క్రితం తిరుమలగిరి పోలీసు స్టేషన్లో పద్మ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. బీమా సొమ్ము ఇస్తానని ఆశజూపి... కేశ్యానాయక్ శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడని, తాను మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోందని భావించిన పద్మ... భర్తను హత్య చేస్తే రూ. 60 లక్షల బీమా సొమ్ముతోపాటు ఆయన ఉద్యోగం తనకు వస్తుందని భావించింది. ఇందులో భాగంగా కోర్టు వాయిదాల కోసం కేస్యనాయక్‌తో కలసి వచ్చే డ్రైవర్ సభావత్ వినోద్‌తో పద్మ పరిచయం పెంచుకుంది. భర్త తనను పట్టించుకోవడం లేదని, అందువల్ల ఆయన్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే వచ్చే రూ. 60 లక్షల బీమా డబ్బులో రూ. 10 లక్షలు ఇస్తానని ఆశచూపింది. అతనికి నమ్మకం కలిగించేందుకు తొలుత రూ. 15 వేలు చెల్లించింది. వీరి పథకం ప్రకారం ఈ నెల 1న ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తున్న కేస్య నాయక్‌కు వినోద్ ఫోన్ చేసి ఎల్బీ నగర్లో కలిశాడు. టీఎస్07యూఈ 2221 నంబర్ గల కారులో గుర్రంగుడ దగ్గర ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యా నాయక్‌కు మోతాదుకు మించి మందు తాగించాడు. శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వెళ్లే మార్గంలో కారు ఆపి వెనుక సీట్లోకి వెళ్లిన వినోద్... ముందుసీట్లో కూర్చున్న కేస్యా నాయక్ (43) గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంజాపూర్ కమాన్ దగ్గరగల హైటెన్షన్ కరెంట్ స్తంభానికి కారు ఎడమవైపును మాత్రమే ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ పద్మ ఆదివారం ఉదయం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది హత్యేనని నిరూపించే ఆధారాలు లభించాయి. మృతుని మెడ కమిలిపోయి ఉండటం, పోస్టుమార్టం నివేదికలోనూ గొంతు నులమడంతోనే కేస్యా నాయక్ మరణించినట్లు వెల్లడైంది. ఈ ఆధారాలనుబట్టి పోలీసులు సోమవారం ఉదయం ఇంజాపూర్ కమాన్ దగ్గర పద్మ, వినోద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. -
బీమా కవరేజీ ఎంత ఉండాలి..
అంతర్జాతీయ రీఇన్సూరెన్స్ సంస్థ స్విస్ ఆర్ఈ 2015లో రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో సగటు జీవిత బీమా కవరేజీ ప్రామాణిక స్థాయి కన్నా 92 శాతం మేర తక్కువగా ఉంది. మరో రకంగా చెప్పాలంటే రూ. 100 మేర బీమా కవరేజీ అవసర మైతే.. తీసుకునే కవరేజీ రూ. 7.8 మాత్రమే ఉంటోంది. అంటే అవసరమైనదానికి, తీసుకుంటున్న కవరేజీకి మధ్య ఏకంగా 92.2 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రామాణికంగా తీసుకోదగిన జీవిత బీమా కవరేజీ ఎంత అన్నది తెలియజేసేదే ఈ కథనం. ప్రస్తుత జీవన ప్రమాణాలతో కుటుంబ నిర్వహణకు ఎంత జీవిత బీమా కవరేజీ అవసరం అన్నది తెలుసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. రూ. 50 లక్షల జీవిత బీమా డబ్బుని ఫిక్సిడ్ డిపాజిట్ వంటి సురక్షిత సాధనంలో 6 శాతం వడ్డీ రేటుకు (దీర్ఘకాలిక) ఉంచితే.. నెలవారీగా రూ. 25,000 వస్తాయనుకుందాం. ప్రస్తుతం నగరాల్లో సగటు మధ్యతరగతి కుటుంబం ఖర్చులకు ఇది సరిపోయే పరిస్థితి లేదు కదా. కాబట్టి.. మన ప్రస్తుత నెలవారీ ఖర్చుల సరళిని బేరీజు వేసుకుంటే ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. ఇందుకోసం ఈ కింది విధానాన్ని పరిశీలించవచ్చు. దశలవారీగా లెక్కింపు.. మీ మొత్తం నెలసరి ఇంటి ఖర్చులన్నీ (ఈఎంఐలు సహా) లెక్కేయండి. అందులో నుంచి ఈఎంఐలను తీసివేస్తే.. మొత్తం నెలవారీగా ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది. ముందుగా దీనికోసం కవరేజీ పొందాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులను 12తో గుణిస్తే.. ఏడాది మొత్తానికి ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది.ఇక దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ రేటుతో వార్షిక ఇంటి ఖర్చులను భాగిస్తే మీ ఆదాయాన్ని సంరక్షించుకోవడానికి ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత తీసుకున్న రుణాలకు చెల్లించాల్సిన అసలును కూడా దీనికి కలిపితే.. మొత్తం కవరేజీ ఎంత తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీకు కొంత జీవిత బీమా కవరేజీ ఉండి ఉంటే .. మీరు లెక్క వేసిన మొత్తం కవరేజీ నుంచి దాన్ని తీసివేస్తే ఇకపై తీసుకోవాల్సింది ఎంత అన్నదానిపై స్పష్టత వస్తుంది. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు మొదలైన ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. వీటిని కూడా లెక్క వేసి .. కవరేజీ మొత్తానికి కలిపితే నికరంగా ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఈ విధంగా అవసరమైన కవరేజీని లెక్క వేసుకుని తగిన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వొచ్చు. - భరత్ కల్సి ,చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ -
ఉద్యోగం పోయినా.. భద్రత ఉండాలి!
పాత టెక్నాలజీల్ని కొత్తవి ఆక్రమిస్తున్నాయి. మనుషులు చేసే పనులకు ఆటోమేషన్ పోటీ పడుతోంది. ప్రైవేటు ఉద్యోగుల ముందు ఈ తరహా సవాళ్లెన్నో ఉన్నాయి. ఉన్నట్టుండి ఓ కంపెనీ ‘రాజీనామా చేయండి’ అని అడిగితే... వెంటనే మరో కంపెనీ వెల్కమ్ చెప్పే పరిస్థితులను అన్ని వేళలా ఊహించలేం. టెలికం, ఈ–కామర్స్, ఐటీలో ఉద్యోగాలు కోల్పోవడం సాధారణంగా మారింది. ఇక మెరుగైన అవకాశాల కోసం, తమ నైపుణ్యాలను మెరుగుపెట్టుకునేందుకు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినా లేదా వదిలిపెట్టినా ఆర్థికంగా సమస్యలు ఎదురు కాకుండా... ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నది నిపుణుల సలహా. కిట్టీ ఏర్పాటు చేసుకోవాలి... ఉద్యోగం పోతే రోజువారీ అవసరాలు ఆగకూడదు. రుణాలు తీసుకుని ఉంటే వాటికి చేసే చెల్లింపులూ ఆగకూడదు. వివాహమై, పిల్లలున్నవారికి కుటుంబ ఖర్చులు ఎక్కువే ఉంటాయి. అందుకే కనీసం ఓ ఆరు నెలల కుటుంబ, ఇతర అవసరాలకు సరిపడా నిధుల్ని ఉద్యోగంలో ఉన్నపుడే పక్కన పెట్టుకోవాలి. ఈ వ్యయాల గురించి లెక్కించేటపుడు రుణాలపై ఈఎంఐలు, టెలిఫోన్, విద్యుత్ బిల్లులు, ఇంటద్దె, పాలు, కిరాణా, వైద్యం, మందుల ఖర్చు, పిల్లల స్కూలు ఫీజులు, రవాణా వ్యయాలు, బీమా పాలసీ ప్రీమియంను పరిగణనలోకి తీసుకోవాలి. కొంచెం కూడా రిస్క్ ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ చేసే సిప్ పెట్టుబడులు లేదా రికరింగ్ డిపాజిట్లను కూడా కలుపుకుంటే మంచిది. ఎంత మొత్తం కావాలో స్పష్టత వచ్చాక ఆ మేరకు నిధిని సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఈ నిధి సమకూరేంత వరకు ప్రతి నెలా ఇతర అవసరాలను త్యాగం చేయడానికి వెనకాడకూడదు. అత్యవసర నిధి సమకూరాక వీలును బట్టి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అవసరమైన సమయంలో వెంటనే తీసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఈ రెండింట్లో లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువ. బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలపై 4 శాతమే వడ్డీ కాగా, దీంతో పోల్చుకుంటే లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి రెండు శాతం ఎక్కువే ఉంటుంది. ఇలా అత్యవసర నిధి సమకూరాక ఉద్యోగం కోల్పోయినా, లేదా మీ అంతట మీరు మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాన్ని వదిలినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నెలవారీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడదు. అన్ని చెల్లింపులూ యథావిధిగా అత్యవసర నిధి నుంచి చేసేయవచ్చు. ఒకవేళ మీరు పనిచేస్తున్న రంగంలో ఉద్యోగ భద్రత తక్కువగా ఉండి, అదే సమయంలో కొత్త ఉద్యోగాలకు అవకాశం తక్కువగా ఉంటే గనుక కనీసం తొమ్మిది నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భార్యా భర్తలు ఇద్దరూ ఆర్జనా పరులైతే పరస్పరం కలసి అత్యవసర నిధిని సమకూర్చుకోవచ్చు. బీమా రక్షణ తప్పనిసరి...: ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో మీకంటూ ఆరోగ్య బీమా రక్షణ తప్పకుండా కొనసాగడం అవసరం. బీమా పాలసీలో మీతోపాటు జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ తప్పకుండా ఉండాలి. ఆ పనిని ఉద్యోగంలో ఉన్నప్పుడే చేయాలి. ఒకవేళ అవివాహితులు అయితే తల్లిదండ్రులను పాలసీ కవరేజీలో భాగం చేసుకోవాలి. ఇలా కాకుండా సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ పేరుతో పెద్దలకు ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పాలసీని తీసుకోవడం మంచి ఆలోచనే. సాధారణంగా కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకూ కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ నుంచి తప్పుకుంటే, బీమా రక్షణ కొనసాగుతుందా? అన్నది స్పష్టం చేసుకోవాలి. కవరేజీ కొనసాగదంటే విడిగా పాలసీ తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఖర్చులకు కళ్లెం వేయాలి..: ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ ఖర్చులను నియంత్రించుకోవడం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయే ముప్పు ఉన్నవారికి ఇది మరీ అవసరం. క్రెడిట్ కార్డు ఉండి దానిపై రుణం తీసుకుని ఉంటే, వీలైనంత వేగంగా చెల్లింపులు చేసేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే అధిక వడ్డీ భారం పడే ఈ తరహా రుణాలు ఉద్యోగం కోల్పోతే సమస్యగా పరిణమిస్తాయి. మరీ ముఖ్యంగా తక్కువగా వినియోగించడం ద్వారా నగదు లభ్యత ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉండి దానిపై క్రెడిట్ లిమిట్ వినియోగించుకోకుండా ఉండుంటే, ఒకవేళ ఉద్యోగం లేని సమయంలో వినియోగానికి అక్కరకు వస్తుంది. అయితే, ఉద్యోగం లేని సమయంలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని పూర్తిగా లిమిట్ వాడేయడం కూడా ఆమోదనీయం కాదు. మరో ఉద్యోగం రావడం కాస్త ఆలస్యమైతే, లేదా తక్కువ వేతనానికి చేరాల్సి వస్తే చెల్లింపులు కష్టమవుతాయి. కనుక ఆచితూచి వినియోగించాలి. ఇక ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఏవి త్యాగం చేసినా దీర్ఘకాలిక అవసరాలకు ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. తాత్కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం. రెండు మూడు నెలలే కదా, ఆపితే ఏం కాదులేనన్న ధోరణి వల్ల నష్టమే. ఉద్యోగం లేని పరిస్థితులను అధిగమించేందుకు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
హైదరాబాద్: దేశీ అతిపెద్ద బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్ఐసీ) తాజాగా పాలసీల పునరుద్ధరణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది పాలసీదారులకు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షరతులకు లోబడి పాలసీల పునరుద్ధరణ ఉంటుందని పేర్కొంది. పాలసీదారులు సక్రమంగా లేని పాలసీలను సమీక్షించుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్‌ను కొనసాగించుకునే వెసులుబాటు పొందొచ్చని తెలిపింది. -
మీ పర్సుకు రక్షణ ఉందా..?
కార్డు మోసాలకు సైతం బీమా కవరేజీ వినూత్న ఫీచర్లతో కార్డు ప్రొటెక్షన్ ప్లాన్లు వ్యాలెట్ పోగొట్టుకున్నా అప్పటికప్పుడు సాయం కార్డుల బ్లాకింగ్ నుంచి బీమా కవరేజీ దాకా అన్నీ చూసుకుంటామంటున్న ‘రక్షణ’ సంస్థలు విజయ్‌కి రెండు క్రెడిట్ కార్డులున్నాయి. తరచు టూర్లకు వెళుతుంటాడు. ఈ మధ్య మలేసియా వెళ్లినపుడు క్రెడిట్ కార్డు వాడాడు. తను కార్డుపై వాడింది 1000 రింగెట్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.17,000. కానీ ఆ నెల బిల్లు చూసి కళ్లు తిరిగాయి. రూ.90 వేలకు బిల్లు వచ్చింది. విజయ్‌కి ఏమీ పాలుపోలేదు. తీరా క్రెడిట్ కార్డు సంస్థకు, పోలీసులకు ఫిర్యాదు చేశాక... దర్యాప్తు జరిగాక ఆలస్యంగా తెలిసిందేమిటంటే... ఆయన కార్డును అక్కడ ఎవరో క్లోన్ చేశారు. దాని సాయంతో అక్కడే ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించారు. విజయ్‌ని లూటీ చేశారు. సురేష్‌ది మరో కథ... తనకు రెండు క్రెడిట్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు ఉన్నాయి. తరచు ట్రావెల్ చేస్తుంటాడు. ఈ మధ్య రాజస్తాన్ వెళ్లినపుడు అక్కడ కోటలు, పర్యాటక ప్రాంతాలు చూస్తుండగా పర్సు పోగొట్టుకున్నాడు. ఆ వ్యాలెట్‌లోనే కార్డులతో పాటు డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు అన్నీ ఉన్నాయి. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాక... కార్డు జారీ చేసిన బ్యాంకులకు ఒక్కొక్కదానికీ ఫోన్ చేసి దాన్ని బ్లాక్ చేయించాడు. మళ్లీ లెసైన్సు, పాన్ కార్డు కోసం పాట్లు పడుతున్నాడు. విజయ్, సురేష్ లాంటి సంఘటనలు చాలామందికి జరుగుతుంటాయి. వీటిని నివారించటం సులువేమీ కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరిగే ఆస్కారం ఉంది. మరి దారేంటి? ఇదిగో... ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే కార్డు రక్షణ సంస్థలు. ఒన్ అసిస్ట్, సీపీపీ ఇండియా వంటి సంస్థలతో పాటు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కూడా కార్డు రక్షణ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిని తీసుకుంటే పలు మోసాల నుంచి రక్షణ పొందొచ్చు. ఎందుకంటే కార్డుదారు మోసానికి గురైతే కంపెనీ తన బాధ్యత లేదంటుంది. దీనిపై కోర్టులోనో, అంబుడ్స్‌మన్ వద్దో ఫిర్యాదు చేసి దీర్ఘకాలం పోరాడాలి. మోసానికి కారణం తన నిర్లక్ష్యం కాదని నిరూపించుకోవాలి. అదే కార్డు రక్షణ ప్లాన్ ఉంటే... ఆ మోసం కార్డుదారు నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత కంపెనీపై పడుతుంది. అదీ కథ. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ పథకాలు ఎలా పనిచేస్తాయంటే... ఒన్ అసిస్ట్ సంస్థ ‘వ్యాలెట్ అసిస్ట్’ను... సీపీపీ ఇండియా ‘ప్రొటెక్షన్ ప్లాన్’ను అందిస్తున్నాయి. ఇవి రెండూ ఒకలాంటివే. వినియోగదారు వీటి సభ్యత్వం తీసుకున్నాక తన వద్ద ఉన్న కార్డులన్నిటినీ వీటిలో నమోదు చేయాలి. మోసం జరిగినపుడు బీమా కవరేజీతో పాటు... వ్యాలెట్ పోతే అయ్యే ఖర్చులు కూడా ఈ ప్లాన్లతో తిరిగొస్తాయి. కార్డును పోగొట్టుకున్నా, మోసం జరిగినట్లు గుర్తించినా వీటి కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే చాలు. వాళ్లు బ్యాంకులతో మాట్లాడి అన్ని కార్డులూ బ్లాక్ చేస్తారు. ఇవీ లాభాలు... నగరాల్లో చాలామందికి కనీసం ఒక క్రెడిట్ కార్డు, రెండు డెబిట్ కార్డులు ఉంటాయి. మోసం జరిగినా, వ్యాలెట్ పోయినా... వారు ప్రతి బ్యాంకుకూ వ్యకిగతంగా ఫోన్ చెయ్యాలి. వెరిఫికేషన్ ఉంటుంది. అదయ్యాక కార్డు బ్లాక్ చెయ్యమని చెప్పాలి. అదంతా పెద్ద తతంగం. కార్డ్ ప్రొటెక్షన్ తీసుకుంటే... కస్టమర్ తరఫున ఈ కంపెనీలే బ్యాంకుకు ఫోన్ చేసి అవన్నీ చూసుకుంటాయి. మనం మోసానికి గురయ్యామని వెంటనే తెలియకపోవచ్చు. తెలిసేసరికి కొన్ని రోజులు పట్టొచ్చు. అప్పుడు ఫిర్యాదు చేస్తాం. అందుకే వ్యాలెట్ అసిస్ట్, కార్డ్ ప్రొటెక్షన్లు... ఫిర్యాదు చేయడానికి చాలా రోజుల ముందు జరిగిన మోసాలకు కూడా కవరేజీ ఇస్తున్నాయి. నేరాల రక్షణకు సంబంధించి ఇవి బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. క్లెయిమ్ చెయ్యడానికి కార్డుదారు ఫారాన్ని నింపి, ఎఫ్ఐఆర్ను జత చేసి, ఇతర డాక్యుమెంట్లతో కలిపి అందజేయాలి. బీమా కంపెనీ దర్యాప్తు జరిపి, వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లెయిమ్ సొమ్మును అందజేస్తుంది. టాటా ఏఐజీ... ఇది పలు కార్డు కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. కవరేజీ, ప్లాను, ప్రీమియం ఇవన్నీ అవసరానికి తగ్గట్టు మారుస్తారు. కంపెనీ మొత్తం 4 వ్యక్తిగత ప్లాన్లను అందజేస్తోంది. వీటిని విడివిడిగా, లేదా కలిపి తీసుకోవచ్చు. వివరాలు చోరీకి గురైనా... కార్డులపై మోసపూరితంగా ఛార్జీలు వేసినా... ఏటీఎంలో దాడికి గురైనా... దొంగతనానికి గురైనా... వ్యాలెట్‌ను పోగొట్టుకున్నా ఈ కవరేజీ పొందొచ్చు. అదనపు లాభాలెన్నో... నిజానికి ఒన్ అసిస్ట్, సీపీపీ సంస్థల ప్లాన్లలో కవరేజీ కన్నా ముఖ్యమైనది వ్యాలెట్ పోగొట్టుకున్నపుడు వారందించే సాయం. ‘‘మా కస్టమరు వ్యాలెట్ పోగొట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తనకు అత్యవసర హోటల్, ట్రావెల్ సహాయం అందిస్తాం. దీనికోసం ట్రావెల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. వ్యాలెట్ పోయి డబ్బులు లేకపోతే కార్డుదారుకు వడ్డీలేని నగదు అందిస్తాం. హోట ల్ బిల్లులు చెల్లించటమే కాక విమాన టిక్కెట్లు ఏర్పాటు చేస్తాం’’ అని సీపీపీ ఇండియా కంట్రీ మేనేజరు దీపక్ మతాయ్ చెప్పారు. ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు సీపీపీ ఏడాదిపాటు ఉచిత ఎఫ్సెక్యూర్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. పాన్‌కార్డు పోతే కొత్తది తెప్పిస్తోంది. వ్యాలెట్ అసిస్ట్ అయితే ఫారెక్స్ కార్డులకూ కవరేజీ ఇస్తోంది. డ్రైవింగ్ లెసైన్స్ పోతే తిరిగి తెప్పిస్తోంది. అన్ని మోసాలకూ కవరేజీ ఉండదు...! సీపీపీ ఈ కార్డ్ ప్రొటెక్షన్ పథకాలేవీ ఇంటర్నెట్ లేదా ఫోన్ బ్యాంకింగ్ మోసాలకు పనికిరావు. కార్డు విషయానికొచ్చినా అన్ని రకాల మోసాలకూ ఈ కవరేజీ ఉండదు. కార్డుదారు నిర్లక్ష్యం వల్ల గనక మోసం జరిగితే క్లెయిము తిరస్కరణకు గురవుతుంది. నేరగాళ్లు కార్డుదార్లకు ఫోన్ చేసి... వారి ద్వారానే ఓటీపీ వంటి వివరాలు తెలుసుకుని మోసపూరిత లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి విషింగ్ మోసాలకు సంబంధించిన క్లెయిముల్ని తిరస్కరిస్తారు. ‘‘కస్టమర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతాయి కనక మొదట్లో విషింగ్ మోసాలకు సంబంధించిన క్లెయిములన్నీ తిరస్కరణకు గురయ్యేవి. ఇపుడు కొన్ని రకాలైన విషింగ్ మోసాలకు సంబంధించి మా భాగస్వామ్య సంస్థలు క్లెయిములు అంగీకరిస్తున్నాయి. అంతిమంగా క్లెయిముపై నిర్ణయం బీమా కంపెనీదే’’ అని మతాయ్ వివరించారు. ఒన్ అసిస్ట్ ఏఏ రకాల మోసపూరిత లావాదేవీలు కవరేజీ పరిధిలోకి వస్తాయో జాబితా రూపొందించింది. కార్డు పోగొట్టుకున్నాక దానిపై జరిగే లావాదేవీలు... కార్డుల్ని మరో వ్యక్తి మోసపూరితంగా ఉపయోగించి చేసే ఆన్లైన్ లావాదేవీలు... చిప్‌లేని కార్డుల్ని ఏటీఎంలలో ఉపయోగించినా, స్వైపింగ్ చేసినా... ఈమెయిల్, ఫోన్‌కాల్స్, కార్డు వివరాలను కాపీచేయటం వంటి మార్గాల్లో నేరగాళ్లు గనక సమాచారం తస్కరించినా... ఇవన్నీ కవరేజీ పరిధిలోకి వస్తాయి. బ్లాక్ చేసిన తరవాత గనక కార్డును విని యోగిస్తే దానికి బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కనక అది కవరేజీ పరిధిలోకి రాదు. ఏఐజీ.. టాటా కార్డు లేదా వ్యాలెట్ పోయినట్లు ఫిర్యాదు చేయటానికి 48 గంటల ముందు జరిగిన లావాదేవీలు, విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే కవరేజీ ఇస్తోంది. కొన్ని కవరేజీల్లో కొంత సొమ్ము మినహాయిస్తోంది కూడా. ఉదాహరణకు కార్డు పోతే... దానికి రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘దీనివల్ల చిన్న చిన్న చిన్నవాటికి కూడా క్లెయిము చేయటమనేది తగ్గుతుంది. కార్డుదారుకు నిజంగా బాధ కలిగించే లావాదేవీల్ని కవర్ చేయటమే ఈ బీమా ఉద్దేశం’’ అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తరచు ప్రయాణాలు చేసేవారికైతే బెటర్... ఎవరికైనా వివిధ బ్యాంకులు జారీ చేసిన... మూడు కన్నా ఎక్కువ కార్డులుంటే ఇలాంటి ప్లాన్లు ఎంచుకోవటం మంచిది. తరచు విదేశాలకు ప్రయాణించేవారికైతే ఇది అవసరం ఎంతో కూడా. ఎందుకంటే కార్డుల క్లోనింగ్, స్కిమ్మింగ్ అనేవి పలు దేశాల్లో సాధారణమైపోయాయి. దీంతో పాటు విదేశాల్లో మీరు గనక మీ వ్యాలెట్ పోగొట్టుకుంటే... అన్ని కార్డుల్నీ ఒకేసారి ఒకే కాల్‌తో బ్లాక్ చేయటం సాధ్యమవుతుంది. -
బీమా..ఎంపిక ఇలా!
ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ధీమాను కల్పించేది బీమా. అయితే పాలసీ తీసుకున్న వారిలోనూ చాలా మంది.. ఏదో ఒక పాలసీ ఉంటే చాలు అనుకునే వారే ఉంటున్నారు తప్ప.. ఇది తప్పనిసరి అవసరంగా భావించి తీసుకునే వారి సంఖ్య తక్కువ. బీమాపై ఇంకా ప్రజల్లో పూర్తిగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. కొన్ని విషయాలపై కసరత్తు చేస్తే మనకు, మన కుటుంబానికి అవసరమైన కవరేజీని చౌకగా అందించే.. అనువైన బీమా పథకాన్ని ఎంచుకోవడం సులభతరం అవుతుంది. అలాంటి అంశాల గురించి వివరించేదే ఈ కథనం. 1. రిస్కు బేరీజు: ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్న పక్షంలో ముందుగా మనం ఆరోగ్యపరంగా గతంలో ఎదుర్కొన్న సమస్యలు, భవిష్యత్‌లో తలెత్తే అవ కాశం ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మనకు రిస్కు ఎంత మేర ఉందన్న దానిపై ఒక అంచనాకు రావొచ్చు. సాధారణంగా పాలసీల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటుంటాయి. ఒకవేళ సరైనది ఎంచుకోకపోతే మనకు కావల్సిన దానికి కవరేజీ లేకుండా పోతుంది. ఫలితంగా కట్టిన ప్రీమియం అంతా వ్యర్థమవుతుంది. గృహ బీమాకు కూడా ఇది వర్తిస్తుంది. స్థానికంగా నేరాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల గృహానికి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్నది బేరీజు వేసుకోవాలి. ఇంటిలోని వస్తువుల విలువను లెక్కగ ట్టి .. తగిన స్థాయిలో కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవాలి. ఇక వాహన బీమా విషయానికొస్తే.. బీమా అవసరాలపై తగిన దృష్టి పెట్ట్లాలి. 2. ‘చౌక’ అన్ని వేళలా సరికాదు! బీమా కవరేజీ చాలా కీలకమైనది. చౌకగా వస్తోంది కదా అని ఏ పాలసీబడితే అది తీసుకోకూడదు. పాలసీకి కట్టాల్సిన ప్రీమియం కన్నా దాని ద్వారా వచ్చే కవరేజీకి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వైద్యం, పిల్లల విద్యాభ్యాసం మొదలైన వాటన్నింటికీ ఎలాంటి అవాంతరం లేకుండా చూసుకోవడానికి వీలవుతుంది. గృహ బీమాకు సంబంధించి తక్కువ కవరేజీ తీసుకున్న పక్షంలో ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే అరకొర క్లెయిమ్ మొత్తాల వల్ల ఒరిగే ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. ఇంటిని మళ్లీ రిపేరు చేయాలన్నా, తిరిగి కట్టుకోవాల్సి వచ్చినా, ఇంట్లో వస్తువులను తిరిగి కొనుక్కోవాల్సి వచ్చినా.. తగినంత విలువకు కవరేజీ తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. వాహన బీమాకు సంబంధించి కూడా కవరేజ్ అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. 3.ఏటా కవరేజీ సమీక్షించుకోవాలి: మన రిస్కులను ప్రతి ఏడాదీ సమీక్షించుకుంటూ ఉండాలి. ఎంచుకున్న కవరేజీ దానికి తగ్గట్లుగానే ఉందా లేదా అన్నది చూసుకోవాలి. 4. పేరొందిన బీమా సంస్థనే ఎంచుకోవాలి: వీలైనంత వరకూ పేరొందిన బీమా సంస్థ పాలసీలనే ఎంచుకోవడం మంచిది. క్లెయిమ్‌ల పరిష్కారంలో పాలసీదారుల నమ్మకాన్ని కష్టపడి సాధించుకున్న టాప్ రేటింగ్ కంపెనీలు సాధ్యమైనంతవరకూ విశ్వసనీయమైన ఆఫర్లనే అందిస్తుంటాయి. 5. మినహాయింపులు చూసుకోవాలి: పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోవాలి. సందేహాలొస్తే మొహమాటపడకుండా ఏజెంటును ప్రశ్నించి తెలుసుకోవాలి. ఒకవేళ పాలసీలో ఏదైనా సందర్భానికి మినహాయింపు ఉన్న పక్షంలో... యాడ్ ఆన్ ఆప్షన్స్ లాంటివి ఉన్నాయేమో కనుక్కోవాలి. -
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా
- వంట గ్యాస్ ప్రమాదానికి రూ.40 లక్షల బీమా! - వినియోగదారునికి తెలియకుండా దాచిఉంచిన ఇంధన కంపెనీలు, డీలర్లు సంగారెడ్డి టౌన్: వంట గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వినియోగదారునికి రూ. 40 లక్షలు బీమా కవరేజ్ ఉంది. అంతే కాకుండా సిలిండర్ పేలి బతికి బయట పడ్డ వారికి కూడా రూ. 30 లక్షల బీమా ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎంతమంది వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకు తెలుసనేది ప్రశ్న? ప్రమాదాలు జరిగిన వారికి ఇంధన కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన సందర్భాలున్నాయి? ఆలోచించాల్సిందే. వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. సదరు వినియోగదారుడు బీమాకు అర్హుడవుతాడు. ఈ విషయం గ్యాస్ కంపెనీలలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలియపోవడం విడ్డూరం. ఉద్యోగస్తులకే తెలియంది సామాన్యులకు ఎలా తెలుస్తుంది. అంతే కాదు.. గ్యాస్ కనెక్షన్ తీసుకోవడంతోనే తమకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని వారికే తెలియదాయే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిబంధన ప్రకారం వంట గ్యాస్ వినియోగదారులందరికీ కంపెనీలు బీమా చేస్తారు. ఈ విషయం గ్యాస్ వినియోగదారులకు సంబంధిత డీలర్లు చెప్పడం లేదు. అసలు వారికి కూడా ఈ విషయం తెలుసనేది సందేహం. ఎందుకంటే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కుమ్మక్కై ఇలాంటి ముఖ్య సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు. ఇప్పటి వరకు కొన్ని వందల గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలు జరిగాయి. ఏ ఒక్కరికి ఈ పాలసీ ద్వారా లబ్ధిపొందిన దాఖలాలు లేవు. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగిన వెంటనే వినియోగదారులు సంబంధిత డీలరుకు విషయం తెలుపాలి. ఆ డీలర్ ఈ విషయం కంపెనీకి తెలపాల్సి ఉంటుంది. విచారణ జరిపి బాధితునికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం రహస్యంగా ఉండడం శోచనీయం. ఈ విషయంపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 18002333555కు ఫిర్యాదు చేయవచ్చు.