James webb space telescope
-
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పండోరా క్లస్టర్
అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్ క్లస్టర్’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది. అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి. -
NASA: తారల తాండవం!
న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్) సాయంతో బంధించింది. మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది. -
జేమ్స్ వెబ్‌కు సాంకేతిక సమస్య
వాషింగ్టన్: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేటరీ అయిన జేమ్స్ వెబ్‌లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న జేమ్స్ వెబ్‌లో ఇలాంటి సమస్య రావడం ఇది రెండోసారి. అందులోని అత్యంత కీలకమైన నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్, స్లిట్‌లెస్ స్పెక్ట్రోగ్రాఫ్ పరికరాల్లో సమాచార అంతరాయం నెలకొంది. దాంతో సంబంధిత సాఫ్ట్వేర్ మొరాయించింది. అయితే హార్డ్‌వేర్‌లో ఎలాంటి సమస్యలూ తెలెత్తిన సూచనలు లేకపోవడం ఊరటనిచ్చే విషయమని నాసా పేర్కొంది. ఇన్ఫ్రారెడ్ ఇమేజర్ మాత్రం ప్రస్తుతానికి పని చేయడం లేదని ధ్రువీకరించింది. సమస్యను కనిపెట్టి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో తయారు చేసిన జేమ్స్ వెబ్ గత ఆగస్టులో కూడా ఇలాగే మొరాయించింది. దాని మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. బహుశా ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్దవైన అంతరిక్ష పదార్థాలు కెమెరా లెన్స్‌ను గుద్దుకోవడమే రెండోసార్లూ సమస్యకు కారణమైందని నాసా భావిస్తోంది. -
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!
వాషింగ్టన్: దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్హెచ్ఎస్ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడుతున్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్ చొప్పున వేసేస్తోందట! పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్హెచ్ఎస్ 475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది. -
‘ఆపాత’ పాలపుంతలు!
వాషింగ్టన్: అచ్చం మన పాలపుంత మాదిరిగా ఉండే నక్షత్ర మండలాలను నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. ఇవన్నీ విశ్వం ప్రస్తుత వయసులో కేవలం మూడో వంతు ఉన్నప్పుడు, అంటే దాదాపు 1,100 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డాయట! ఈ క్రమంలో విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలాన్ని కూడా జేమ్స్ వెబ్ గుర్తించింది. అది ఏకంగా 1,350 కోట్ల ఏళ్లనాటిదట. అప్పటికి విశ్వం ఆవిర్భవించి కేవలం 30 కోట్ల ఏళ్లేనట! ఈ నక్షత్ర మండలాల కేంద్ర స్థానం నుంచి ఇతర నక్షత్ర రాశుల దాకా విస్తరించి ఉన్న స్టెల్లర్ బార్స్‌ను కూడా వీటిలో గమనించడం విశేషం. ఈ బార్స్ మన పాలపుంతలోనూ ఉన్నాయి. అయితే విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లో ఇవి కన్పించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రద్ధా జోగీ అన్నారు. ఈ నేపథ్యంలో నక్షత్ర మండలాల పుట్టుక, వికాసాలను గురించిన సిద్ధాంతాలను సరిచూసుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నక్షత్ర మండలాలను గతంలో హబుల్ టెలిస్కోప్ కూడా గుర్తించినా వాటిలో ఈ బార్స్ కనిపించలేదన్నారు. ‘‘ఇవి నక్షత్రాలతో పాటు అంతరిక్ష ధూళి, వాయువుల కదలికలను ప్రభావితం చేయడంతో పాటు తారల పుట్టుక ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ సాయపడతాయి. అంతేగాక నక్షత్ర మండలాల కేంద్ర స్థానాల్లో అతి భారీ కృష్ణబిలాల పుట్టుకకూ దోహదం చేస్తుంటాయి. ఒకవిధంగా ఇవి నక్షత్ర మండలాల్లో సరఫరా వ్యవస్థ పాత్ర పోషిస్తుంటాయి. విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లోని స్టెల్లర్ బార్స్‌పై తొలిసారిగా పరిశోధన చేస్తున్నది మేమే. ఇది ఇప్పటిదాకా ఎవరూ చూడని కీకారణ్యంలోకి తొలిసారి అడుగు పెట్టడం వంటిదే’’ అంటూ శ్రద్ధా ముక్తాయించారు. -
James Webb Telescope: కొత్త ప్రపంచాలకు కిటికీ
జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్ 2022 జూలై నెలలో అంతరిక్షంలో అంతకుముందు అందని లోతుల చిత్రాలను పంపించింది. అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించారు. చిత్రాలతోబాటే అప్పట్లో ఒక గ్రాఫ్‌ను కూడా ప్రకటించారు. అటువంటి వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం మామూలే. ఆస్ట్రాన మర్లు మాత్రం ఆ వంకర గీతను చూచి అవాక్కయినట్టు తరువాత తెలిసింది. మన గ్రహం మీద కాక మరెక్కడయినా జీవం కొరకు జరుగుతున్న వెదుకు లాటలో ఈ గీత ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఎక్కడో మారుమూలన దాగి ఉన్న వాస్ప్ 96 బి అనే ఒక గ్రహం చుట్టూ వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్టు ఈ గ్రాఫ్ ఆధారంగా అర్థమయింది. అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వల్ల అవుతుంది అని ఎవరూ ఊహించని సమాచారాన్ని అది అందిస్తున్నది అంటున్నారు పరిశోధకులు. సుదూర ప్రాంతాల గ్రహాల చుట్టూ గల వాతావరణాల సంగతులను టెలిస్కోప్ తెలియజేస్తున్నదని అర్థం. కనిపించిన దృశ్యాల అందం కన్నా పరిశోధకులకు ఈ సమాచారం మరింత ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. కనుకనే వారంతా గ్రాఫ్ గురించి మరింత పరిశోధనలకు పూనుకున్నారు. అంతకుముందెన్నడూ లేనంత వివరంగా, అజ్ఞాత ప్రపంచాల వాతావరణ సంగతులు తెలుసుకుంటు న్నారు. అక్కడెక్కడయినా జీవం ఉంటేగింటే, వివరాలు తెలుసుకునే వీలు మాత్రం అందింది అంటున్నారు. అట్లాగని జీవం ఆనుపానులు దొరికినట్టే అనుకునే పద్ధతి సరికాదని మనకు తెలుసు. గతంలో 2022లోనే హబుల్ టెలిస్కోప్ ఆధారంగా ఇటువంటి పరిశీలనలు సాగినాయి. కొత్త టెలిస్కోప్ హబుల్ కన్నా బలం గలది గనుక ఈసారి పరిశీలనలు మరింత బాగా సాగుతాయి. పరిశీలిం చదగిన గ్రహాలను ఇప్పటికే గుర్తించేశారు కూడా. జీవం ఉనికి పరిశోధన మరింత బాగా కొనసాగుతున్నది. ‘గొప్ప ప్రయత్నం మరో సారి బలపడి ముందుకు జరిగే సందర్భం ఇది’ అన్నారు జర్మనీ పరిశోధకురాలు లారా క్రెయిడ్బెర్గ్ ఈ మధ్యన. కొంతకాలంగా సుదూర గ్రహాల వాతావరణంలోని మూలకాలు, రసాయన సమ్మేళనాల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో దుర్భిణీ యంత్రాల పాత్ర అందరికీ అర్థమయింది. ఇక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కారణంగా, మరింత లోతుగా అక్కడి వాతావరణాలలోకి చూడగలుగుతున్నారు. అందుకు ముఖ్యంగా మూడు కారణాలు ఆధారంగా నిలిచి వీలు కలిగిస్తున్నాయి. ఈ టెలిస్కోప్ భూమి నుంచి చాలా దూరంలో ఉంది. గమ్యాలను నిశ్చలంగా, నిశితంగా గమనించి ఎక్కువ లోతైన వివరాలను సేకరించగలుగుతుంది. తక్కువ బలంగల సంకేతాలను గూడా అది గుర్తించ గలుగుతుంది. ఈ టెలిస్కోప్‌లోని అద్దం డయామీటర్ 6.5 మీటర్లు. హబుల్ అద్దం 2.4 మీటర్లు మాత్రమే. అంటే కొత్త టెలిస్కోప్ ఎక్కువ కాంతిని, మరీ చిన్న వివరాలను కూడా చూడగలదు. ఇక ఇన్ఫ్రారెడ్ వర్ణపటం మొత్తాల్ని జేమ్స్ వెబ్ పరిశీలించగలుగుతుంది అన్నది మూడవ అంశం. అంటే గ్రహాల వాతావరణాలలోని రసాయనాల వివరాలు మరింతగా అర్థం అవుతాయి. ఒక నక్షత్రం చుట్టూ, సూర్య గోళం చుట్టూ మన భూగ్రహంలాగే తిరుగుతున్న గ్రహాలను మరింత బాగా పరిశీలించి జీవం ఉనికి నిర్ధారించడం సులభంగా వీలవుతుందని తేలిపోయింది. ఈ గమ్యం కొరకు పరిశీలించ వలసిన మరో రెండు మూడు సుదూర గ్రహాలు ఈ పట్టికలో ఉన్నాయి. ఇవన్నీ తమ తమ నక్షత్రాల చుట్టూ, జీవం ఉండ గల దూరాలలో తిరుగుతున్నాయి. వాటి మీద నీరు ఉండే వీలు ఉందని అర్థం. అయితే అవన్నీ భూమికన్నా చిన్నవి అయితే, వాటి వాతావరణం కూడా తక్కువగా ఉంటుంది. అవి తిరుగుతున్న నక్షత్రాలు కూడా సూర్య గోళానికి సమంగా వేడి గలవి కావు. భూమి నుంచి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్ గ్రహాలు, తమ నక్షత్రాలకు మరీ దగ్గరగా ఉన్నాయి. ఆ నక్షత్రాలు చల్లగా ఉన్నాయి. అంటే సూర్యునితో పోలిస్తే, అంత వేడిగలవి కావు. మనమిప్పుడు ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాము. కానీ భూమి మీద మొదట్లో ఉన్న జీవులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా శక్తిని సిద్ధం చేసుకుని ఆక్సిజన్‌ను, ఇప్పటి మొక్కల్లాగే వదిలిపెట్టేవి. ఆ వాయువును వాడుకుని బతికే జీవులు, ఆ తరువాత వచ్చాయి. మొత్తానికి సుదూర గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ ఉన్నట్టు తెలిస్తే, అక్కడ జీవం ఉన్నదని సూచన అనుకోవచ్చు. జీవులుంటేనే ఈ వాయువులుంటాయి. ‘అనుకోని చోట, జీవం సంకేతాలు కనబడితే, అంతకన్నా ఆశ్చర్యం లేదు’ అంటారు పరిశోధకులు డెమింగ్. నిజానికి ఈ పరిశోధన కొత్త దారులు తొక్కుతున్నది. మరిన్ని రకాల రసాయనాల ఆధారంగా జీవం ఉనికిని గుర్తించవచ్చు. జేమ్స్ వెబ్‌తో ఈ అవకాశం పెరుగుతున్నది. త్వరలోనే ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసే అవకాశం ఉంది. విశ్వంలో మనకు తోడుగా మరె క్కడా జీవులు లేవా? లేరా? అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో! ఓపికగా ఎదురుచూడటం ఒకటే దారి. కె.బి. గోపాలం, వ్యాసకర్త రచయిత, అనువాదకుడు -
రాకాసి హస్తం కాదు.. విశ్వం ఆవిర్భావానికి కారణ భూతం..!
చూడటానికి అచ్చం రాకాసి హస్తంలా ఉంది కదూ! నిజానికిది ఈ విశ్వావిర్భావానికి కారణ భూతంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావించే ధూళి మేఘం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పట్లాగే కాలంలో వెనక్కు వెళ్లి భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్‌ను ఇలా క్లిక్‌మనిపించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే తొలిసారి. చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం -
రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది. -
ఒకేసారి.. మోస్ట్ పవర్ఫుల్ ఫొటోలు ఇవి
జేమ్స్ వెబ్, హబ్బుల్ టెలిస్కోప్‌లు గురువారం మోస్ట్పవర్ఫుల్ చిత్రాలను విడుదల చేశాయి. డార్ట్ వ్యోమనౌక ఉద్దేశపూర్వకంగా గ్రహశకలంలోకి దూసుకెళ్లిన ఫొటోలు అవి. రెండు అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌లు ఒకే ఖగోళ వస్తువును గమనించడం ఇదే మొదటిసారి. భవిష్యత్‌లో ప్రాణాంతక గ్రహశకలాల నుంచి భూమిని రక్షించేందుకు.. చారిత్రాత్మక పరీక్ష నిర్వహించాయి. ఆ సమయంలో ఈ టెలిస్కోప్‌లు స్పేస్ రాక్ డైమోర్ఫోస్ వైపు తమ చూపును మళ్లించాయి. .@NASAWebb & @NASAHubble caught the DART impact on camera – the 1st time that Webb & Hubble were used to simultaneously observe the same celestial target. Looking forward to what we’ll learn about #DARTmission from our telescopes on Earth soon. https://t.co/Y0HOAbSkI0 https:/ pic.twitter.com/lgDwOBd7Om — Bill Nelson (@SenBillNelson) September 29, 2022 NASA డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) ఇంపాక్టర్ సోమవారం రాత్రి భూమి నుండి 11 మిలియన్ కిలోమీటర్ల (6.8 మిలియన్ మైళ్ళు) దూరంలో ఉన్న పిరమిడ్-పరిమాణ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఖగోళ శాస్త్రవేత్తలు సంతోషించారు. ఈ టెలిస్కోప్‌ల ద్వారా తీసిన చిత్రాలు.. అంతరిక్ష నౌక ఢీకొట్టిన విస్తరిస్తున్న దుమ్మును చూపించాయి. -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
మిస్టరీ గెలాక్సీ చిక్కింది
ఇంతకాలంగా అందీ అందనట్టుగా తప్పించుకుంటూ వస్తున్న ఓ మిస్టరీ గెలాక్సీ ఆనవాలు ఎట్టకేలకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్‌వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్‌లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి. అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్‌వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చిందీ తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట. అచ్చం బండి చక్రంలా... వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేయడం తెలిసిందే. కాలంలో వెనక్కు చూడగల ఇన్ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా కార్ట్‌వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది. ఈ ఫొటోల్లో కార్ట్‌వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్‌వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు. కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చట. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ (ఎంఐఆర్ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా. – నేషనల్ డెస్క్, సాక్షి -
సుదూర తార చిక్కిన వేళ...
ఫొటోలో బాణం గుర్తు ఎదురుగా మిణుకుమిణుకుమంటూన్న చిన్న వెలుగు కన్పిస్తోందా? లేదా? అయితే ఇన్సెట్లో చూడండి. కంటికి కొద్దిగా ఆనుతోంది కదా! అదేమిటో తెలుసా? మనకు తెలిసిన విశ్వమంతటిలోనూ అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రం. పేరు ఎరెండల్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా దీన్ని క్లిక్‌మనిపించింది. ఇది సన్‌రైజ్ ఆర్క్ అనే గెలాక్సీలో ఉందట. ఇంతకూ ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో ఉందో తెలుసా? ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో! ఇంతటి దూరాల్లో సాధారణంగా పాలపుంతలు మాత్రమే కన్పిస్తాయి. అలా చూస్తే ఈ సుదూర తార మనకు కన్పించడం యాదృచ్చికంగా కలిసొచ్చిన అదృష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఇది ముందుగా హబుల్ టెలిస్కోప్‌కు కన్పించిందట. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకుని ఆశ్చర్యానందాలకు లోనయ్యారట. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పట్టిందట! ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్ రూపం బిగ్‌బ్యాంగ్ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఎరెండెల్ అంటే వేకువ తార అని అర్థం. మనకు కన్పిస్తున్న ఎరెండెల్ రూపం విశ్వపు తొలి నాళ్లకు చెందినది గనుక ఈ పేరు సరిగ్గా నప్పిందంటూ సంబరపడుతున్నారు. -
జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన... తొలి సూపర్నోవా
వాషింగ్టన్: భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్నోవాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన తొలి సూపర్నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్నోవాగా పిలుస్తారు. అంతరిక్షంలో జరిగే అతి పెద్ద పేలుళ్లు ఇవేనంటారు. 2011లో హబుల్ టెలిస్కోప్ ఇదే పాలపుంతను క్లిక్‌మనిపించినా ఈ సూపర్నోవా మాత్రం దాని కంటికి చిక్కలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జేమ్స్ వెబ్‌ను ఇలాంటి అంతరిక్ష పేలుళ్లను గుర్తించేలా డిజైన్ చేయలేదు. అయినా దాని కెమెరా కన్ను సూపర్ నోవాను బంధించడం విశేషమేనంటూ నాసా శాస్త్రవేత్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వయసు మళ్లిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో ఇటీవలే అంతరిక్షంలోకి పంపిన జేమ్స్ వెబ్ విశ్వపు తొలినాళ్లకు, అంటే దాదాపు 1,350 కోట్ల సంవత్సరాల నాటి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించడం తెలిసిందే. చదవండి: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
దెబ్బ తిన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నాసా ఆందోళన
వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా. ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది. ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది. వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది. -
Joe Biden, NASA: కాలపు తొలి క్షణాల్లోకి తొంగిచూసిన వేళ...
వాషింగ్టన్: కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న ఈ దృశ్యాలు ఎప్పటివో తెలుసా? ఈ అనంత విశ్వం దాదాపుగా పొత్తిళ్ల పాపాయిగా ఉన్నప్పటివి! ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలే గనుక నిజమయ్యే పక్షంలో ఏకంగా ఈ విశ్వం పురుడు పోసుకున్నప్పటివి!! ఇంతటి అద్భుతమైన ఈ దృశ్యాలను నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన కళ్ల ముందుంచింది. ఇందుకోసం కాలంతో పాటు దూరంలోనూ ఏకంగా 1,300 కోట్ల సంవత్సరాలు వెనక్కు వెళ్లి, అత్యంత సుదూర గతంలోకి తొంగి చూసి మరీ ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించింది. లెక్కలేనన్ని తారలు, తారా సమూహాలు, అత్యంత సుదూరాల్లో నింపాదిగా, భారంగా పలు ఆకృతుల్లో ఊపిరి పోసుకుంటున్న భారీ, అతి భారీ పాలపుంతలు తదితరాలతో నమ్మశక్యం కానంత రమణీయంగా సాగిన విశ్వరూప విన్యాసాన్ని కళ్లకు కట్టింది. అంతరిక్షంలో అటు కాలంలోనూ, ఇటు దూరంలోనూ ఇంతటి గతంలోకి దృష్టి సారించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి. విశ్వావిర్భావానికి కారణంగా విశ్వసిస్తున్న బిగ్‌బ్యాంగ్ (మహావిస్ఫోటం) 1,380 కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని చెబుతుంటారు. వెలుగుజిలుగుల మధ్య నక్షత్ర మండలాల సమూహం విశ్వాంతరాళానికి సంబంధించి నాసా సరికొత్త జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్‌మనిపించిన తొలి ఫొటోలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌లో విడుదల చేశారు. ఇవి ఏకంగా 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కడుతున్నాయన్నది నమ్మశక్యం కాని వాస్తవమంటూ ఈ సందర్భంగా కాసేపు అబ్బురపాటుకు లోనయ్యారు. మానవాళి శాస్త్ర సాంకేతికతలో ఇది చరిత్రాత్మక క్షణమన్నారు. ఆయనే కాదు, అంతరిక్ష పరిశోధనల్లో తలపండిన నాసా శాస్త్రవేత్తలే ఈ ఫొటోలను చూసిన తొలి క్షణాల్లో చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యారట. దీన్ని ప్రస్తుతానికి స్మాక్స్ 0723గా పిలుస్తున్నారు. శక్తి నశించి క్రమంగా అంతర్ధానమవుతున్న నెబ్యులా తాలూకు భిన్న దశలు వీటిలో తెలుపు, పసుపు, ఎరుపు తదితర రంగుల్లో కనువిందు చేస్తున్న అపార తారా సమూహపు భారీ విన్యాస పరంపర నిజానికి అనంత విశ్వానికి సంబంధించిన అతి చిన్న భాగం మాత్రమేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. దీనికి కొనసాగింపుగా జేమ్స్ వెబ్ తీసిన మరో నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను నేడు విడుదల చేయనున్నట్టు నాటో ప్రకటించింది. మన సౌరవ్యవస్థకు కొద్దిగా ఆవల ఉన్న ఓ భారీ వాయుగ్రహం, పుడుతూ, గిడుతూన్న నక్షత్రాలతో కూడిన అతి మనోహరమైన నెబ్యులాలు, ఒకదాని చుట్టూ ఒకటి నాట్యం చేస్తున్నట్టుగా కన్పిస్తున్న ఐదు నక్షత్ర మండలాలు తదితరాలు వాటిలో ఉన్నాయట. ఇంతకూ జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటోలోని విశ్వం వయసు ఎంత అయ్యుండొచ్చు? అంతరిక్ష పరిశోధకులు కొన్నాళ్ల పాటు రకరకాల లెక్కలతో కుస్తీ పడితే గానీ ఇది తేలదట! జేమ్స్ వెబ్ త్వరలోనే విశ్వంలో ఇంతకంటే ఇంకా లోలోతులకు దృష్టి సారించి ఫొటోలు తీస్తుందని నాసా చెబుతోంది. జేమ్స్... హబుల్ వారసుడు జేమ్స్ వెబ్ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతమైన స్పేస్ టెలిస్కోప్. దీన్ని వయసు మళ్లిన హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా 10 బిలియన్ డాలర్ల భారీ ఖర్చుతో నాసా నిర్మించింది. ఇందుకు ఏకంగా 30 ఏళ్లు పట్టింది. 2021 డిసెంబర్లో దీన్ని అంతరిక్షంలోకి పంపింది. తర్వాత సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాని అద్దాలు, పరారుణ డిటెక్టర్లు తదితరాలను సరైన కోణాల్లో బిగించి సిద్ధం చేశారు. దీని చల్లదనాన్ని నిరంతరం పరిరక్షించేందుకు దానిపైన టెన్నిస్ కోర్టు సైజులో సన్‌షేడ్ ఏర్పాటు చేశారు. దీని సాయంతో మన సౌరకుటుంబంతో పాటు విశ్వంలోని సుదూరాలకు, విశ్వం పుట్టినప్పటి కాలంలోకి దృష్టి సారించి అనేకానేక రహస్యాలను శోధించనున్నారు. -
విశ్వంలోనే అత్యంత అద్భుతమైన చిత్రం ఇదే: బైడెన్
వాషింగ్టన్: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన మొట్ట మొదటి చిత్రాన్ని విడుదల చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సమక్షంలో ఈ ఫోటోను సోమవారం ప్రపంచానికి చూపించారు. ఈ విశ్వంలో ఇప్పటివరకు తీసిన ఫోటోల్లో ఇదే అత్యంత అద్భుతమైనదని ఆయన పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదో చారిత్రక క్షణమని చెప్పారు. ఖగోళశాస్త్రం, అంతరిక్ష అన్వేషణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అమెరికాతో పాటు మానవాళికి ఇదో గొప్ప మైలురాయి అని బైడెన్ ట్వీట్ చేశారు. The first image from the Webb Space Telescope represents a historic moment for science and technology. For astronomy and space exploration. And for America and all humanity. pic.twitter.com/cI2UUQcQXj — President Biden (@POTUS) July 11, 2022 జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ తొలి ఫోటో విశ్వం పుట్టుకపై మానవుల దృక్కోణాన్ని మార్చేలా ఉంది. పాలపుంతల సమూహాం ఎంతో అందంగా, అత్యంత స్పష్టంగా కన్పిస్తోంది. విశ్వంలో ఇప్పటివరకు ఇంత లోతైన చిత్రాన్ని చిత్రీకరించడం ఇదే తొలిసారి. ఈ టెలిస్కోప్ తీసిన మరిన్ని చిత్రాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వాటికి టీజర్‌గా తొలి చిత్రాన్ని బైడెన్ రివీల్ చేశారు. ఇదే ఇంత అద్భుతంగా ఉంటే.. మిగతా ఫోటోలు ఇంకెంత అందంగా ఉన్నయో అనే ఆసక్తి నెలకొంది. చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే.. రేసులో రిషి సునక్ సహా 11 మంది! -
అద్భుత ఘట్టం
‘రాశి చక్రగతులలో/ రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో/ప్రభవం పొందిన’ మానవాళి తన జైత్రయాత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన క్షణాలను నమోదు చేసుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతోపాటు యూరప్, కెనడా అంతరిక్ష సంస్థలు అహరహం శ్రమించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను మొన్న సోమవారం అనుకున్న సమయానికి, అనుకున్న రీతిలో, నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా వేలాదిమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సమష్టిగా కృషి చేసి సాధించిన అద్భుత విజయమిది. గత నెల 25న క్రిస్మస్‌నాడు అంతరిక్ష యాత్ర ప్రారంభించి, 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ టెలిస్కోప్ కోసం ప్రయోగించిన అంతరిక్ష నౌకకు వేయి కోట్ల డాలర్లు (సమారు రూ. 75,000 కోట్లు) వెచ్చించారు. అంతరిక్షంలో మరెక్కడయినా భూమిని పోలిన గ్రహాలున్నాయా... అక్కడ జీవరాశి ఉనికి ఉన్నదా అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాన్ని చిరకాలంగా వేధిస్తున్నాయి. మన దేశంతోపాటు చైనా, గ్రీస్, రోమ్, మధ్యప్రాచ్య అరబ్ దేశాల్లో అంతరిక్షాన్ని పరిశీలించడం, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం చరిత్రలో నమోదయ్యాయి. సాధారణ దృష్టికి తారసపడని అంతరిక్ష వింతలూ విశేషాలూ ఇతరేతర పరికరాల సాయంతో తెలుసుకోవచ్చునన్న ఆశ టెలిస్కోప్‌లతో మొదలుపెట్టి రేడియో టెలిస్కోప్, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్, గామా టెలిస్కోప్ తదితరాల ఆవిష్కరణలకు దారితీస్తే... ఇవి విశ్వంలో నిరంతరం ప్రసారమయ్యే అనేక రకాల తరంగాలను పసిగట్టి వాటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏముందో, విశ్వంలో ఏం జరుగుతున్నదో గ్రహించడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేక విధాల ప్రత్యేకతలున్నది. సుదూర తీరాల్లో మరెన్ని పాలపుంతలు దాగున్నాయో అన్వేషించటానికీ, మన సౌర కుటుంబానికి ఆవల గ్రహాల ఆచూకీ రాబట్టడానికీ, ఇప్పుడు విశ్వంలో ఆవరించి ఉన్న నక్షత్ర ధూళిలో భవిష్యత్తు నక్షత్రాలుగా రూపుదిద్దుకోగల అవకాశమున్నవి ఉన్నాయో లేదో తెలుసు కోవడానికీ అవసరమైన సమాచారాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పటికప్పుడు భూమికి చేరేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే విశ్వం పుట్టకకు దారితీసిన పరిస్థితులేమిటో నిర్ధారణగా చెప్పడం సాధ్యమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట. విశ్వాంతరాళంలో ఇప్పుడు తిరుగాడే రకరకాల టెలిస్కోప్‌లకు ప్రధాన సమస్య సూర్యకాంతి. సూర్యుడికి అటువైపు ఏముందో చూడటానికి ఆ కాంతి ప్రధాన ఆటంకం. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతాలు అయిదున్నాయని, అక్కడికి టెలి స్కోప్లను చేరేస్తే తక్కువ ఇంధన వినియోగంతో దీర్ఘకాలం పని చేయించడం సులభమవుతుందని ఎన్నడో 1772 లోనే ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ, గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ కనుక్కున్నాడు. ఆ అయిదు ప్రాంతాలనూ ఆయన పేరిటే ఎల్1, ఎల్2 వగైరాలుగా పిలుస్తున్నారు. వాటిలో ఎల్2 అనేకవిధాల ప్రయోజనకరమని మూడు దశాబ్దాలక్రితం నిర్ణయించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు కాంతులు పెద్దగా విరజిమ్మని ప్రాంతమది. ఆ దట్టమైన చీకటి ప్రాంతానికి అంతరిక్ష నౌకను పంపగలిగితే అనేక ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు. అయితే అక్కడ గురత్వాకర్షణ శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదొక పెద్ద అవరోధం. అలాంటి చోటకు సకల హంగులతో ఉన్న టెలిస్కోప్‌ను పంపడం శక్తికి మించిన పని అని కొన్నాళ్లకే అర్థమైంది. ఎందుకంటే అక్కడుండే మైనస్ 233 డిగ్రీల ఉష్ణోగ్రతలో అందులోని పరికరాలను పనిచేయించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరకు అనేక రకాల ప్రయోగాల తర్వాత అత్యంత శీతల ప్రదేశంలో పనిచేసే పరికరాల తయారీ ఒక కొలిక్కి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే, వాటన్నిటినీ అమర్చిన టెలిస్కోప్‌ను సురక్షితంగా ఎల్ 2 వద్దకు చేరేయడం మరో పెద్ద విన్యాసం. దాదాపు 350 రకాల ప్రక్రియలు పరస్పరం అనుసంధానించుకుంటూ సాగవలసిన ఈ ప్రయోగం విషయంలో చివరిదాకా శాస్త్రవేత్తలకు భయాందోళనలున్నాయి. మనిషి అంచనాకు అందని ఊహించని చిన్న లోపం చోటు చేసుకున్నా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోగం, మూడు దశాబ్దాల కాలం వృధా అవుతాయి. కానీ అంతా అనుకున్నట్టే పూర్తయింది. అది ఎల్2 కక్ష్యలోనే తిరుగాడటానికీ, ఎటూ జారిపోకుండా చూడటానికీ మూడు వారాలకొకసారి చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సివస్తుంది. అంతా సవ్యంగా పూర్తయితే విశ్వరహః పేటిక తెరుచుకుని, విశ్వాంతరాళంపై మన అవగాహన కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మనిషి రోదసిలోకి ప్రవేశించి, రకరకాల అంతరిక్ష నౌకలను ప్రవేశపెట్టి ఆరు దశాబ్దాలు దాటుతోంది. అలా చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి అపురూపమైన, సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేయగలగడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో, నిరంతర అంతరిక్ష అన్వేషణలో కీలకమైన మలుపు. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని అరుదైన అద్భుతాలను ఆవిష్కరించగలదనీ, ఈ విశ్వానికి సంబంధించి మన విజ్ఞానాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనీ నిస్సం దేహంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు ప్రశంసనీయులు. -
గమ్యస్థానం చేరిన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్
మెల్బోర్న్: మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్ వెబ్ టెలిస్కోపు తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)ను చేరినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఎల్2 పాయింట్ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్లో ఇకపై వెబ్ టెలిస్కోప్ పరిభ్రమణ జరుపుతుంది. నెల రోజుల క్రితం ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా దీని నిర్మాణం జరిగింది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్మెంట్) చెందడం వంటి పను లు పూర్తి చేయాల్సిఉంది. లక్ష్యాన్ని చేరడానికి ఒక రోజు ముందే టెలిస్కోప్‌లోని 18 దర్పణాలు పూరి ్తగా తెరుచుకోవడం విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. -
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగంలో మరో సంచలనం!
నాసా సైంటిస్ట్‌ల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శనివారంతో తన రెండు వారాల విస్తరణ దశను పూర్తి చేసింది. కాస్మిక్ చరిత్రలోని ప్రతి దశను అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చివరి మిర్రర్ ప్యానెల్‌ను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా లాస్ట్ వింగ్ డిప్లాయ్ పూర్తి చేసింది అంటూ నాసా ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రయోగం సత్ఫలితాల్ని అందించడంతో నాసా కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా కాన్ఫిగరేషన్ సమయంలో తలెత్తిన సమస్యను నాసా సైంటిస్ట్‌లు చాకిచక్యంగా వ్యవహరించి..గండం నుంచి గట్టెక్కించడంపై ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Congratulations, @NASAWebb! You are fully deployed! 🥳 Stay tuned over the coming months as the space telescope reaches its destination of Lagrange point 2 and prepares to #UnfoldTheUniverse: pic.twitter.com/qg6jmVRCsH — NASA (@NASA) January 8, 2022 కాగా డిసెంబర్ 25 శనివారం నాసా ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకునేలా భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుండగా, ఈ ప్రయోగం కీలక దశ విజయవంతమైందని నాసా ట్వీట్ చేసింది. చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం..!విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా! -
ఏలియన్స్ జాడ కోసం వేదాంత వేత్తలను నియమించుకుంటున్న నాసా..!
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వేదాంత వేత్తల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని నాసా కోరినట్లు సమాచారం. ఈ నెల డిసెంబర్ 26న హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ కంటే అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ను అంతరిక్షంలోకి నాసా, యూరోప్ దేశాలు ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వం పుట్టుకతో పాటు, ఏలియన్స్ జాడ కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తుంది. (చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!) -
ఆశ్చర్యపోయే అంశం.. సూర్యుడు లేని గ్రహాలు!
గ్రహం.. అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటి. కానీ, 2021 ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది. పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. బరువులో జూపిటర్కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు. (చదవండి: వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి) జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేషించాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్ రొయిగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన. (చదవండి: అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో! ప్రాణాలు పోతున్నా జనాల్ని కాపాడుతున్నారు) -
విను వీధిలోకి వెబ్ టెలిస్కోప్!
కౌరూ: ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం శనివారం దిగ్విజయంగా ముగిసింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకోవడంలో ఈ టెలిస్కోప్ కీలకపాత్ర పోషించనుంది. భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల పట్టవచ్చు. అక్కడ కక్ష్యలోకి ప్రవేశించి సర్దుకొని పని ప్రారంభించేందుకు మరో 5 నెలలు పడుతుందని అంచనా. అంటే 6 నెలల అనంతరం(సుమారు 2022 జూన్ నాటికి) వెబ్ టెలిస్కోపు తన ఇన్ఫ్రారెడ్ నేత్రంతో చూసేవాటిని భూమికి పంపడం ఆరంభమవుతుంది. ఒక టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఈ టెలిస్కోపులో పలు దర్పణాలున్నాయి. దీన్ని ఒరిగామి(జపాన్‌లో కాగితాన్ని వివిధ ఆకృతుల్లోకి మడిచే కళ) పద్ధతిలో మడిచి రాకెట్ కొనభాగంలో జాగ్రత్త చేశారు. నిర్దేశిత స్థానం చేరేలోపు ఇది నెమ్మదిగా దానంతటదే విచ్చుకుంటాయి. ఖగోళ రహస్యాల గుట్టు విప్పేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇదే అత్యంత క్లిష్టమైందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. నాసా హర్షం మన విశ్వాన్ని గురించి అందులో మన స్థానం గురించి మరింత అవగాహన కల్పించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగం విజయవంతం కావడంపై నాసా సంతోషం వ్యక్తం చేసింది. 1990నుంచి సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా భావిస్తున్న ఈ టెలిస్కోపుతో.. మనమెవరం? అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని బిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దీన్ని ఈ నెల 22న ప్రయోగించాల్సిఉండగా వివిధ కారణాలతో రెండు మార్లు వాయిదా పడి చివరకు క్రిస్మస్ రోజున నింగికెగిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీని ప్రయోగం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు లాంచింగ్ సమయం వచ్చేసరిగి లాంచింగ్ స్టేషన్ మొత్తం ఉద్విగ్నత వ్యాపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదున్నరకు ఏరియన్ రాకెట్ దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మానవాళి కోసమని ఏరియన్‌స్పేస్ సీఈఓ స్టీఫెన్ ఇస్రాయెల్ ఆనందం వ్యక్తం చేశారు. టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశించాక మనం ఆకాశాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. మరో మూడు రోజుల ప్రయాణం అనంతరం టెలిస్కోపులోని సన్ షీల్డ్ తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకునేందుకు 5 రోజులు పడుతుంది. అనంతరం 12 రోజుల పాటు మిర్రర్ సెగ్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో తెరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా జరిగేలా చూడడానికి వందలమంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు. జేమ్స్ వెబ్ విశేషాలు... ► దాదాపు 16లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ స్థానం వద్దకు చేరుతుంది. ► సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టే సామర్ధ్యం దీని సొంతం. ► బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ అంశాల పరిశీలన దీని ముఖ్య లక్ష్యం. ► దీని తయారీలో దాదాపు 10వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్లగంటల పాటు పనిచేశారు. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసాకు చెందిన దాదాపు 20కి పైగా దేశాలకు దీనిలో భాగస్వామ్యముంది. ► 50 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఆరంభించిన ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 966 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది. ► 1996లో ఆరంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పాతికేళ్లు పట్టింది. ► దీని సైజు 72గీ39 అడుగులు. బరువు 6 టన్నులు. కనీసం పదేళ్లు పనిచేస్తుంది. ► దీనిలో బంగారు పూత పూసిన 6.5 మీటర్ల వ్యాసమున్న 18 షట్కోణ ఫలకాల దర్పణం ఉంది. ► 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను ఈ దర్పణం గమనించగలదు. ► సూర్యకాంతిలో మండిపోకుండా –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియం సౌర కవచం అమర్చారు. ► కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. ► ఎల్2 వద్దకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో పనిప్రారంభించడానికి ఐదు నెలలు పడుతుంది. -
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం..!
నాసా సైంటిస్ట్‌ల 25 ఏళ్ల శ్రమ.. 20 దేశాల సహకారంతో రూపకల్పన. సుమారు 76 వేల కోట్ల రూపాయలు వ్యయం. వెరసీ అంతర్జాతీయ పరిశోదనా కేంద్రం నాసా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా తయారు చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ) ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ అరియాన్ రాకెట్ ద్వారా ఈ జేడబ్యూఎస్టీని నింగిలోకి ఎగిసింది. ఈ టెలిస్కోప్ భూమి నుంచి సుమారు 1.5 మైళ్ల దూరంలో ఉండనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టెలిస్కోప్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో కమ్యూనికేట్ చేస్తోందని నాసా వెల్లడించింది. ✅ Milestone achieved. @NASAWebb is safely in space, powered on, and communicating with ground controllers. The space telescope is now on its way to #UnfoldTheUniverse at its final destination one million miles (1.5 million km) away from Earth. pic.twitter.com/gqICd0Xojz — NASA (@NASA) December 25, 2021 జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో పాటు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో పాటు నాలుగు రకాలైన నియర్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా, నియర్ ఇన్ ఫ్రా రెడ్ స్పెక్ట్రోగ్రాఫ్, మిడ్ - ఇన్ ఫ్రా రెడ్ ఇన్స్ట్రుమెంట్, నియర్ ఇన్ ఫ్రా రెడ్ ఇమేజర్ అండ్ శాటిలైట్ స్పెక్ట్రో గ్రాఫ్ వంటి అత్యాధునికి సైన్స్ పరికరాల్ని పంపిస్తున్నారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం..ఈ నాలుగు అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ గెలాక్సీల పుట్టుపూర్వత్రాలు వాటి నిర్మాణం, గ్రహ వ్యవస్థలు, నక్షత్రాల గురించి తెలుసుకుంటాయని తెలిపింది. కెమెరాల్ని ఎందుకు పంపిస్తున్నారు? 1380 కోట్ల సంవత్సరాల కిందట దట్టమైన కణాలతో బిగ్ బ్యాంగ్ అనే విస్పోటనం ఏర్పడిందని సైంటిస్ట్‌లు నమ్ముతారు. ఆ బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత 150-200 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి విశ్వం యొక్క మొదటి కాంతి లేదా నక్షత్రాలు ఎలా ఉన్నాయనే' అంశాలతో పాటు గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు, అనేక అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో పంపిస్తున్నారు. ఇక ఈ ప్రయోగంలో జేడబ్ల్యూఎస్‌టీ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థ యొక్క గ్రహాలైన మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, వాటి ఉపగ్రహాలను అధ్యయనం చేయడానికి కూడా రూపొందించబడింది. ఇది తోకచుక్కలు, గ్రహశకలాలు, అంగారక కక్ష్యలో లేదా వెలుపల ఉన్న చిన్న గ్రహాలను కూడా అధ్యయనం చేస్తుందని నాసా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. డేటా సేకరించడం ఎలా? గెలాక్సీ, నక్షత్రాలు గుట్టు తెలుసుకునేందుకు నాసా పంపిస్తున్న ఈ టెలిస్కోప్ సాయంతో అంతరిక్షం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్ మీటర్ ద్వారా భూమి మీద ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపనుంది. తద్వారా అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది. చదవండి: అంతరిక్షంలో పెట్రోల్ బంకులు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాసా -
4 కోట్ల గంటలు.. 10 వేల మంది.. 76 వేల కోట్ల ఖర్చు
విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.. 10,000 మంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 25 సంవత్సరాలు 1996లో ఎన్జీఎస్టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. రూ.76 వేల కోట్లు సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది. లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం డిసెంబర్ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. 11 రోజులు ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్ డిటెక్టర్, స్టార్ ట్రాకర్స్, సోలార్ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి. 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్ వెబ్ పరారుణ సామర్థ్యంతో బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు. ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు. నేషనల్ డెస్క్, సాక్షి