Kabaddi League
-
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. మొత్తంగా 16వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున ఆదర్శ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 15 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉంది. -
PKL 2022: 16వ పరాజయం.. మీరు ఆడడం దండగ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్‌తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్‌లో నెగ్గి, నాలుగు మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్‌ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్‌లు ఆడిన పట్నా 14 మ్యాచ్‌ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. వరుసగా ఎనిమిదో పరాజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. బెంగాల్ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27–28తో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది. 12 పాయింట్లతో టైటాన్స్ జట్టు 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50–40తో పుణేరి పల్టన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. -
నల్లగొండ ఈగల్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–3లో నల్లగొండ వారియర్స్ జట్టు అదరగొట్టింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 44–39తో మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తొలుత రైడింగ్‌లో మల్లికార్జున్ (24 పాయింట్లు) విజృంభించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి నల్లగొండ ఈగల్స్ జట్టు 23–21తో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలోనూ సమష్టిగా రాణించిన నల్లగొండ 21 పాయింట్లు స్కోర్ చేసి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకున్న పి. మల్లికార్జున్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మాŠయ్చ్’ అవార్డు అందుకున్నాడు. 3 పాయింట్లు సాధించిన కార్తీక్ యాదవ్ (మంచిర్యాల టైగర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. సైబరాబాద్‌పై వరంగల్ గెలుపు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ జట్టు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 39–26తో సైబరాబాద్ చార్జర్స్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్ ప్రారంభంలో సైబరాబాద్ జట్టు చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 21–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో చెలరేగిన వరంగల్ వారియర్స్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. రైడర్ జి. రాజు 17 పాయింట్లతో చెలరేగడంతో రెండో అర్ధభాగంలో ఏకంగా 28 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. వరంగల్ జోరు ముందు సైబరాబాద్ చతికిలబడింది. ఈ మ్యాచ్‌లో ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా జి.రాజు, ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా వి. రమేశ్ ఎంపికయ్యారు. -
మంచిర్యాల టైగర్స్ విజయం
హైదరాబాద్: తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్–3లో మంచిర్యాల టైగర్స్ జోరు కనబరుస్తోంది. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మంచిర్యాల టైగర్స్ 46–43తో రంగారెడ్డి రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన మంచిర్యాల జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది 26 పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకింది. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబరిచిన మంచిర్యాల తొలి అర్ధభాగంలో 20–17తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో మంచిర్యాల జట్టుకు దీటుగా బదులిచ్చిన రంగారెడ్డి రైడర్స్ 26–26తో సమానంగా పాయింట్లు సాధించింది. దీంతో మ్యాచ్ మంచిర్యాల జట్టు సొంతమైంది. రంగారెడ్డి రైడర్స్ ఆటగాళ్లు యుగేందర్ రెడ్డి (14 పాయింట్లు) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోగా... ఎస్కే అమీర్ (5 పాయింట్లు) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 34–30తో సైబరాబాద్ చార్జర్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 11 పాయింట్లు సాధించిన సైబరాబాద్ చార్జర్స్ రైడర్ రాజ్ కుమార్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’... నల్లగొండ ఈగల్స్ ప్లేయర్ సాయి కిరణ్ (4 పాయింట్లు) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులను అందుకున్నారు. కరీంనగర్ కింగ్స్, గద్వాల్ గ్లాడియేటర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్ 33–33తో టై అయింది. మ్యాచ్ ఆరంభంలో వేగంగా ఆడిన కరీంనగర్ తొలి అర్ధభాగంలో 20–15తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న గద్వాల్ గ్లాడియేటర్స్ స్కోరును సమం చేసి ఓటమి తప్పించుకుంది. 16 పాయింట్లు సాధించిన కరీంనగర్ జట్టు రైడర్ కె. సుశాంక్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. గద్వాల్ గ్లాడియేటర్స్ డిఫెండర్ సాయి కృష్ణకు ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. -
వరంగల్ వారియర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–3లో దూసుకుపోతోన్న వరంగల్ వారియర్స్ జట్టుకు తొలి దెబ్బ పడింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వరంగల్ వారియర్స్ ఓటమి పాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 52–35తో వరంగల్ వారియర్స్‌పై గెలుపొంది వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నల్లగొండ ఈగల్స్ రైడర్ మల్లికార్జున్ 23 రైడ్ పాయింట్లతో విజృంభించడంతో మ్యాచ్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత 26–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కనబరిచి 26–21తో మ్యాచ్‌ను గెలుపొందింది. మల్లికార్జున్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోగా... 5 పాయింట్లు సాధించిన సాయి రామ్ (నల్లగొండ ఈగల్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో కరీంనగర్ కింగ్స్ 60–22తో హైదరాబాద్ బుల్స్‌పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో కరీంనగర్ కింగ్స్ 33–8తో దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ కాస్త పోరాడినప్పటికీ కరీంనగర్ కింగ్స్ ఎక్కడా తగ్గకుండా పాయింట్లు సాధించింది. 15 రైడ్ పాయింట్లు సాధించిన మునీశ్ కుమార్ ‘బెస్ట్ రైడర్’గా, 6 పాయింట్లు సాధించిన శివ కుమార్ ‘బెస్ట్ డిఫెండర్’గా నిలిచారు. మరో మ్యాచ్‌లో మంచిర్యాల టైగర్స్ 42–31తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించి టోర్నీలో మూడో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టు తరఫున నితిన్ పన్వర్ 14 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తొలి అర్ధభాగంలో 22–15తో ఆధిక్యంలో నిలిచిన మంచిర్యాల టైగర్స్ రెండో అర్ధభాగంలో మరో 20–16తో మ్యాచ్‌ను గెలుపొందింది. ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా నితిన్.. ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా శుభమ్ నిలిచారు. -
సైబరాబాద్ చార్జర్స్ ఘనవిజయం
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో సైబరాబాద్ చార్జర్స్ జట్టు ఘన విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సైబరాబాద్ చార్జర్స్ 36–24తో గద్వాల్ గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. 11 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చార్జర్స్ రైడర్ రాజ్ కుమార్ ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకున్నాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేసిన చార్జర్స్ రైడర్ శ్రీ కృష్ణ (4 పాయింట్లు) ‘బెస్ట్ డిఫెండర్’గా నిలిచాడు. ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన చార్జర్స్ విరామ సమయానికి 16–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో మరింత చెలరేగిపోయిన రాజ్ కుమార్ తన రైడ్లలో పాయింట్లు తెస్తూ వచ్చాడు. నల్లగొండ ఈగల్స్ గెలుపు మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 42–31తో రంగారెడ్డి రైడర్స్‌పై గెలుపొందింది. ఈగల్స్ రైడర్ మల్లికార్జున్ 19 పాయింట్లతో చెలరేగగా... అతనికి సహచర ఆటగాడు జీవ గోపాల్ (5 పాయింట్లు) తన ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థి రైడర్లను పట్టేసి తోడ్పాటు అందించాడు. విరామ సమయానికి ఈగల్స్ 13–18తో వెనుకంజలో ఉండగా... అనంతరం మల్లికార్జున్, జీవ గోపాల్ చెలరేగడంతో జట్టు విజయం ఖాయమైంది. మల్లికార్జున్‌కు ‘బెస్ట్ రైడర్’ అవార్డు, గోపాల్‌కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డు లభించాయి. -
హైదరాబాద్ బుల్స్ ఘన విజయం
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–3లో హైదరాబాద్ బుల్స్ జట్టు ఘనవిజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ 40–28తో గద్వాల్ గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. 12 రైడ్ పాయింట్లు సాధించిన హైదరాబాద్ బుల్స్ ఆటగాడు ప్రసాద్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా... నీలేశ్ (గద్వాల్ గ్లాడియేటర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యారు. మరో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ జట్టు 43–37తో కరీంనగర్ కింగ్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జి. రాజు 17 రైడ్ పాయింట్లతో చెలరేగాడు. ట్యాకిల్‌లో కరీంనగర్ కింగ్స్ ప్లేయర్ నిఖిల్ గౌడ్ రాణించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్ వారియర్స్ జట్టు తొలి అర్ధభాగంలో 20–12తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో కరీంనగర్ కింగ్స్ 25–23తో ఆధిక్యంలోకి వచి్చంది. తర్వాత పుంజుకున్న వరంగల్ జట్టు ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దూసుకెళ్లింది. ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా రాజు... ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిఖిల్ గౌడ్ నిలిచారు. మూడో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ జట్టు 45–43తో మంచిర్యాల టైగర్స్‌పై నెగ్గింది. ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మల్లికార్జున్ 21 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. పి. రమేశ్ ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. -
నల్లగొండ ఈగల్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ టోర్నమెంట్లో నల్లగొండ ఈగల్స్ జట్టు విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 43–36తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నల్లగొండ ఈగల్స్ జట్టు తొలి అర్ధభాగం ముగిసేసరికి 23–16తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో ఈగల్స్ జట్టుకు దీటుగా గద్వాల్ గ్లాడియేటర్స్ జట్టు పోరాడింది. దీంతో రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ చెరో 20 పాయింట్లు సాధించాయి. అయితే తొలి అర్ధభాగంలో సాధించిన ఆధిక్యం కారణంగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. 19 పాయింట్లతో ఈగల్స్ జట్టుకు విజయాన్నందించిన పి. మల్లికార్జున్‌కు ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... డిఫెండింగ్‌లో రాణి ంచిన రామ్ ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. సైబరాబాద్ చార్జర్స్, వరంగల్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు ప్రతీ దశలోనూ సమఉజ్జీగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో 15–15, రెండో అర్ధభాగంలో 24–24తో సమంగా నిలిచిన ఈ జట్లు చివరకు 39–39తో మ్యాచ్‌ను ముగించాయి. సైబరాబాద్ తరఫున శ్రీ కృష్ణ... వరంగల్ జట్టులో రాజు మెరుగ్గా ఆడారు. రాజు (వరంగల్ వారియర్స్) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా... శ్రీకృష్ణ (సైబరాబాద్ చార్జర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గద్వాల్ గ్లాడియేటర్స్‌తో హైదరాబాద్ బుల్స్, నల్లగొండ ఈగల్స్‌తో మంచిర్యాల్ టైగర్స్, వరంగల్ వారియర్స్‌తో కరీంనగర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లన్నీ ఫేస్బుక్, స్టార్ స్పోర్ట్స్–1 (తెలుగు) చానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
తీరు మారని టైటాన్స్
గ్రేటర్ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్... తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 38–48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) ముందు చిన్నదైంది. టైటాన్స్‌కు సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... దానిని గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–33తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. అజిత్‌కుమార్ సూపర్‘టెన్’తో జట్టుకు విజయాన్ని అందించాడు నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్; యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు
చెన్నై: డబుల్ హ్యాట్రిక్ ఓటములకు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఫుల్స్టాప్ పెట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 29–26తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. రోహిత్ గులియా సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. 10–3తో వెనుకబడి ఉన్న గుజరాత్‌ను తన రైడింగ్ నైపుణ్యంతో రోహిత్ గెలిపించాడు. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ తన డుబ్కీ రైడ్‌తో సాధించిన ‘సూపర్ రైడ్’ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా జట్టు 29–24తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో వెనుకంజ వేసినా రెండో అర్ధ భాగంలో పుంజుకున్న ముంబై ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరును చివరి వరకు కొనసాగించిన ముంబై విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ జట్టు రైడర్ అతుల్ 7 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
జైపూర్ జోరుకు బ్రేక్
పట్నా: వరుస విజయాలతో ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్‌ను దబంగ్ ఢిల్లీ నిలువరించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–24తో జైపూర్ పింక్ పాంథర్స్‌కు షాక్ ఇచ్చింది. నవీన్ కుమార్ (12 పాయింట్లు), చంద్రన్ రంజిత్‌లు (10 పాయింట్లు) ఢిల్లీకి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో నాలుగో విజయాన్ని అందించారు. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా విశేషంగా రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు లభించలేదు. రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33–31తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై గెలిచింది. గిరీష్ (7 పాయింట్లు), పవన్ (6 పాయింట్లు)లు రాణించి పుణేని గట్టెక్కించారు. మ్యాచ్‌లకు నేడు విశ్రాంతి దినం. రేపు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో తమిళ్ తలైవాస్; పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
వారియర్స్‌కు బుల్స్ దెబ్బ
పట్నా : ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్ దెబ్బ కొట్టింది. శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో బుల్స్ 43–42తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరఫున పవన్ కుమార్ ఏకంగా 29 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 21–34తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. పాంథర్స్ రైడర్ దీపక్ నర్వాల్ 9 పాయింట్లతో మెరిశాడు. ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జైపూర్ జట్టు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
జైపూర్ హ్యాట్రిక్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 37–21తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీపక్ హుడా మరోసారి సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో చెలరేగడంతో హరియాణా చేతులెత్తేసింది. మరోవైపు హరియాణా స్టార్ రైడర్ నవీన్ కేవలం 3 పాయింట్లతో నిరాశపరిచాడు. రైడింగ్, డిఫెన్స్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జైపూర్ పాయింట్ల పట్టికలో ‘టాప్’కు చేరింది. ఖాతా తెరిచిన యూపీ యోధ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూపీ యోధ జట్టు ఖాతా తెరిచింది. యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 27–23తో గెలిచింది. సొంత ప్రేక్షకుల మధ్య ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. యూపీ యోధ తరఫున మోను, సుమిత్‌లు చెరో ఆరు పాయింట్లతో రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతుంది. -
ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ
సాక్షి, హైదరాబాద్: కేబీడీ జూనియర్స్ కబడ్డీ లీగ్‌లో లార్డ్స్ హైస్కూల్, కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ) జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదరాబాద్ అంచె పోటీల్లో భాగంగా నగరానికి చెందిన ఎనిమిది జట్లు ఇందులో పాల్గొన్నాయి. పలు లీగ్ మ్యాచ్‌ల అనంతరం లార్డ్స్, ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్), ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. తొలి సెమీఫైనల్లో లార్డ్స్ హైస్కూల్ 20–14 స్కోరుతో ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్)పై విజయం సాధించింది. రైడింగ్‌లో తరుణ్ కుమార్ (లార్డ్స్) 9 పాయింట్లతో అదరగొట్టగా, డిఫెండర్ సంతోష్ (లార్డ్స్) 2 పాయింట్లు చేశాడు. రెండో సెమీఫైనల్లో కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ; కేవీ–2) జట్టు 26–12తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై ఘనవిజయం సాధించింది. కేంద్రీయ విద్యాలయ ఆటగాళ్లు ఎడ్వర్డ్ లివ్‌స్టాన్ రైడింగ్‌లో 14 పాయింట్లు సాధించగా, డిఫెండర్ సుమన్‌దీప్ ప్రసాద్ 3 పాయింట్లు చేశాడు. రేపు లార్డ్స్, కేంద్రీయ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
కబడ్డీలో మరో లీగ్
న్యూఢిల్లీ: ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ పొందిన గ్రామీణ క్రీడ కబడ్డీలో మరో లీగ్ రానుంది. ‘ఇండో ఇంటర్నేషనల్ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (ఐపీకేఎల్)’ పేరిట మే 13న ప్రారంభం కానున్న ఈ లీగ్ జూన్ 4 వరకు అభిమానులను అలరించనుంది. లీగ్ విశేషాలతో పాటు లోగోను బుధవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. పుణే, మైసూర్, బెంగళూరు వేదికల్లో ఈ టోర్నీని నిర్వహిస్తామని ఐపీకేఎల్ డైరెక్టర్ రవికిరణ్ ప్రకటించారు. తొలి సీజన్లో 44 మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 160 మంది క్రీడాకారులు ఇందులో తలపడనున్నారు. వీరిలో 16 మంది విదేశీ ఆటగాళ్లు. ఆటగాళ్లకు యాజమాన్యం ఇచ్చే ప్రైజ్‌మనీ, జీతంతో పాటు, లీగ్ ద్వారా వచ్చే రెవెన్యూలో 20 శాతం అందజేయడం ఈ లీగ్ ప్రత్యేకత. డీడీ స్పోర్ట్స్‌తో పాటు 18 చానల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ మూడు దశలుగా జరుగుతుంది. తొలి దశలో పుణేలోని బాలేవాడి స్టేడియంలో మే 13నుంచి 21వరకు 20 మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత మైసూర్‌లోని చాముండీ విహార్ స్టేడియంలో మే 24నుంచి 29 వరకు 17 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్ 1నుంచి 4వరకు ఫైనల్‌తో కలిపి మొత్తం 7 మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగళూరు రైనోస్, చెన్నై చాలెంజర్స్, డైలర్ ఢిల్లీ, తెలుగు బుల్స్, పుణే ప్రైడ్, హరియాణా హీరోస్, ముంబై చిరాజ్, రాజస్తాన్ రాజ్‌పుత్స్ జట్లు టైటిల్కోసం తలపడనున్నాయి. టోర్నమెంట్ లోగో ఆవిష్కరణ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘జకార్తా పాలెంబాంగ్ ఆసియా క్రీడల కబడ్డీ టోర్నీలో భారత్ ఓడినప్పుడు నాతో పాటు దేశం మొత్తం బాధపడింది. కబడ్డీ దేశానికి గర్వంగా నిలిచే క్రీడ. కబడ్డీలో ఐపీకేఎల్ రావడం హర్షించదగిన విషయం. మరింత మంది కబడ్డీ ప్లేయర్లకు ఈ లీగ్ ఉపయోగపడుతుంది’ అని సెహ్వాగ్ అన్నాడు. -
విజేత వరంగల్ వారియర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–2లో ఆరంభం నుంచి అదరగొట్టిన వరంగల్ వారియర్స్ జట్టు చివరకు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 37–28తో పాలమూరు పాంథర్స్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. రైడింగ్, ట్యాకిల్‌లో సత్తా చాటిన వరంగల్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. విజేత జట్టులో విక్రాంత్ ‘బెస్ట్ రైడర్’, చౌగులే ‘బెస్ట్ డిఫెండర్’ పుర స్కారాలను గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్ కింగ్స్ 31–26తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. టోర్నీలో రాణించిన కరీంనగర్ ప్లేయర్లు మునీశ్ బెస్ట్ రైడర్, కె.శ్రీనివాస్ బెస్ట్ డిఫెండర్ అవార్డును గెలుచుకున్నారు. హైదరాబాద్ ఆటగాడు హనుమంతు మోస్ట్ టాలెంట్ ప్లేయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. -
సెమీస్‌లో పాలమూరు పాంథర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో పాలమూరు పాంథర్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. టోర్నీ లీగ్ దశలో 7 మ్యాచ్‌లాడిన వారియర్స్, పాంథర్స్ చెరో 5 విజయాలు సాధించి 27 పాయింట్లతో లీగ్‌లో వరుసగా టాప్–2 స్థానాల్లో నిలిచాయి. కరీంనగర్ కింగ్స్ 25 పాయింట్ల (4 విజయాలు, 1 డ్రా)తో, గ్లాడియేటర్స్ జట్టు 23 పాయింట్ల (4 విజయాలు)తో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి సెమీస్‌లో అడుగు పెట్టాయి. సరూర్‌నగర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు పాంథర్స్ జట్టు 30–17తో హైదరాబాద్ బుల్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో 10–12తో వెనుకబడిన పాంథర్స్ జట్టు రెండో అర్ధభాగంలో విరుచుకుపడింది. రైడింగ్‌లో చెలరేగి ఏకంగా 20 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు ట్యాకిల్‌లోనూ సత్తా చాటిన పాం థర్స్ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టుకు రెండో అర్ధభాగంలో కేవలం 5 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. పాంథర్స్ తరఫున శ్రీకాంత్ ‘బెస్ట్ రైడర్’, రవీందర్ ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను గెలుచుకున్నారు. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కరీంనగర్ కింగ్స్ 42–28తో మంచిర్యాల టైగర్స్‌పై సాధికార విజయాన్ని సాధించి 25 పాయింట్లతో సెమీస్‌లో చివరి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
వరంగల్ వారియర్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో వరంగల్ వారియర్స్ మూడో విజయాన్ని సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 38–23తో హైదరాబాద్ బుల్స్‌ను ఓడించింది. వరంగల్ జట్టులో విక్రాంత్‌కు ‘బెస్ట్ రైడర్’, నీలేశ్‌కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులు లభించాయి. మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 28–20తో మంచిర్యాల టైగర్స్‌పై విజయం సాధించింది. నల్లగొండ ఈగల్స్ తరఫున మల్లికార్జున ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకోగా... మంచిర్యాల టైగర్స్ జట్టులో జి. రమేశ్ ‘బెస్ట్ డిఫెండర్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. -
హైదరాబాద్ బుల్స్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో హైదరాబాద్ బుల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ 35– 29తో నల్లగొండ ఈగల్స్‌పై గెలుపొందింది. ఇప్పటివరకు లీగ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇదే తొలి గెలుపు. ఈ సీజన్లో ఒక్క విజయాన్ని కూడా అందుకోని నల్లగొండ ఈగల్స్ జట్టు పట్టుదలగా ఆడటంతో తొలి అర్ధభాగంలో 18–12తో హైదరాబాద్ బుల్స్ వెనకబడే ఉంది. అయితే రెండో అర్ధభాగంలో అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రైడర్ హన్మంతు, డిఫెండర్ శ్రీధర్ చురుగ్గా కదలడంతో విజయం హైదరాబాద్ సొంతమైంది. మరో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 61–25తో మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో గద్వాల్ గ్లాడియేటర్స్‌తో కరీంనగర్ కింగ్స్, రంగారెడ్డి రైడర్స్‌తో పాలమూరు పాంథర్స్ తలపడతాయి. -
కరీంనగర్ కింగ్స్‌కు తొలి గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో కరీంనగర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 44– 26తో పాలమూరు పాంథర్స్ జట్టుపై ఘనవిజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న కరీంనగర్ కింగ్స్... పాంథర్స్‌పై ఎదురులేని విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన పాలమూరు పాంథర్స్ ఆతర్వాత తడబడింది. కింగ్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ తొలి అర్ధభాగాన్ని 22–13తో ముగించారు. రెండో అర్ధభాగంలోనూ పాంథర్స్ తేలిపోవడంతో కరీంనగర్ జట్టును విజయం వరించింది. విజేత జట్టులో మునీశ్ ‘బెస్ట్ రైడర్’, కె. శ్రీనివాస్ ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను అందుకున్నారు. మరో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 40–21 నల్లగొండ ఈగల్స్‌పై విజయం సాధించింది. నేడు జరుగనున్న మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బుల్స్‌తో గద్వాల్ గ్లాడియేటర్స్, రంగారెడ్డి రైడర్స్‌తో మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి. -
రంగారెడ్డి రైడర్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో రంగారెడ్డి రైడర్స్ జట్టు ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చివర క్షణాల్లో విజృంభించిన రంగారెడ్డి రైడర్స్ 26–19తో హైదరాబాద్ బుల్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సమానంగా పోరాడినప్పటికీ రంగారెడ్డి తొలి అర్ధభాగాన్ని 13–10తో ముగించింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించి గెలుపును అందుకుంది. విజేత జట్టు తరఫున పి. అన్వేశ్ ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకున్నాడు. -
ఆటకు ‘సై’ : రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్ 2లో ఓ జట్టును తీసుకున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి, కుమారుడు కార్తికేయలతో కలిసి నల్లగొండ ఈగల్స్ టీంను సొంతం చేసుకున్న జక్కన్న టీం ప్రొమోషన్‌ను కూడా సినిమాటిక్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా తమ టీంను ప్రమోట్ చేస్తూ ఓ థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్ 2 ఈ నెల 14 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. 16 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 8 టీంలు పాల్గొననున్నాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో నల్లగొండ ఈగల్స్‌తో పాటు హైదరాబాద్ బుల్స్, రంగారెడ్డి రైడర్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, పాలమూరు పాంతర్స్, మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి. -
టైటాన్స్‌కు మనోజ్, మహేందర్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన వేలం గురువారంతో ముగిసింది. రెండోరోజూ వేలంలో ఫ్రాంచై జీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. కృష్ణా జిల్లా క్రీడాకారుడు చందన మనోజ్ కుమార్, హైదరాబాద్ ప్లేయర్ మహేందర్ రెడ్డిలకు తొలిసారిగా ప్రొ కబడ్డీ లీగ్‌లో చోటు దక్కిం ది. తెలుగు టైటాన్స్ యాజమాన్యం వీరిద్దరినీ చెరో రూ. 8 లక్షలకు (సి కేటగిరీ) దక్కించుకుంది. ఓవరా ల్గా 12 ఫ్రాంచైజీలు రూ. 45.93 కోట్లు వెచ్చించి 181 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తెలుగు టైటాన్స్ జట్టు రూ. 3.98 కోట్లు ఖర్చుచేసి 18 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ప్రశాంత్ కుమార్‌కు రూ. 79 లక్షలు తొలిరోజు స్టార్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన యజమానులు... రెండోరోజు వేలంలో రెండో శ్రేణికి చెందిన ‘బి’ కేటగిరీ, తదుపరి స్థాయి ‘సి’, ‘డి’ కేటగిరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. యూపీ యోధ జట్టు, రైడర్ ప్రశాంత్ కుమార్ రాయ్‌ని రూ. 79 లక్షలకు చేజిక్కించుకుంది. దీంతో పీకేఎల్ ‘బి’ కేటగిరీలో అత్యధిక మొత్తం దక్కించుకున్న క్రీడాకారుడిగా ప్రశాంత్ ఘనతకెక్కాడు. అతని తర్వాత చంద్రన్ రంజిత్ (రూ. 61.25 లక్షలు– దబంగ్ ఢిల్లీ), వికాస్ ఖండోలా (రూ. 47 లక్షలు– హరియాణా స్టీలర్స్)లు పెద్ద మొత్తాలను దక్కించుకున్నారు. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (రూ. 1.29 కోట్లు), నీలేశ్ సాలుంకే (రూ. 56.8 లక్షలు), మోసీన్ జఫారి (రూ. 24.5 లక్షలు), రక్షిత్ (రూ. 6.60 లక్షలు), సోమ్‌బీర్ (రూ. 6.60 లక్షలు), విశాల్ భరద్వాజ్ (రూ. 6.60 లక్షలు), రజ్నీశ్ (రూ. 6.60 లక్షలు), అంకిత్ బెనివాల్ (రూ. 6.60 లక్షలు), కమల్ సింగ్ (రూ. 6.60 లక్షలు), అబోజర్ మోహజెర్మింగని (రూ. 76 లక్షలు), ఫర్హాద్ రహిమి మిలాగర్డన్ (రూ. 21.5 లక్షలు), సి. మనోజ్ కుమార్ (రూ. 8 లక్షలు), సంకేత్ చవాన్ (రూ. 8 లక్షలు), ఆర్మాన్ (రూ. 5 లక్షలు), అనూజ్ కుమార్ (రూ. 5 లక్షలు), దీపక్ (రూ. 5 లక్షలు), రాకేశ్ సింగ్ కుమార్ (రూ. 12 లక్షలు), మహేందర్ రెడ్డి (రూ. 8 లక్షలు).